అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి

రచయిత, తత్వవేత్త
(శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నుండి దారిమార్పు చెందింది)

అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17, 1878 - జూలై 27, 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, ఆయుర్వేదములో అసమాన ప్రతిభ చూపినారు. వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము, అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని ‘కావ్యకంఠ’ బిరుదమును పొందిరి. వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.

అయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి
అయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి
జననంఅయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి
నవంబరు 17, 1878
విజయనగరం జిల్లా లోని కలవరాయి అగ్రహారం
మరణంజూలై 27, 1936
ఖర్గపూర్
వృత్తిరచయిత, జ్యోతిష పండితుడు
ప్రసిద్ధిఉభయ భాషా పండితులు
వసిష్ఠ గణపతి ముని అని ప్రసిద్ధులు
తండ్రినరసింహశాస్త్రి
తల్లినరసమాంబ
వెబ్‌సైటు
http://kavyakantha.arunachala.org

పుట్టు పూర్వోత్తరాలు

మార్చు

గణపతి శాస్త్రి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం విజయనగరం జిల్లా) లోని కలవరాయి అగ్రహారం లో నవాబు అయ్యల సోమయాజుల అనే ఇంటి పేరుగల బ్రాహ్మణుల కుటుంబంలో అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి, నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా జన్మించాడు. ఆయన అసలుపేరు సూర్య గణపతిశాస్త్రి. వారు ఋగ్వేదులు, , కౌండిన్యస గోత్రులు. సంస్కృతంలో జానకీ పరిణయం అనే కావ్యం రాసిన రామభద్ర దీక్షితులు ఈ వంశంలోని వాడే. ఈ వంశంలో పుట్టిన జగన్నాథ శాస్త్రికి మామ గారి ద్వారా గ్రామాధిపత్యము సంక్రమించింది. ఆయన కుమారుడు భీమశాస్త్రి. భీమశాస్త్రికి నరసింహశాస్త్రి, సర్వేశ్వర శాస్త్రి అనే ఇద్దరు కుమారులు కలిగారు. నరసింహశాస్త్రి గ్రామానికి ఆధిపత్యం వహిస్తూ, ఆయుర్వేద, జ్యోతిష, మంత్ర శాస్త్రాలనందు ప్రావీణ్యం గడించి చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించాడు. ఈ వంశంలో శ్రీవిద్యాదీక్షను పొందిన వారిలో ఆయన ఐదవవాడు. ఆయనకు డుంఠి గణపతి, భార్యయైన సరసమాంబకు సూర్యుడు ఇష్టదేవతలు. వీరిరువురికి గణపతి ముని వరప్రసాదంగా జన్మించాడు. ఆరోఏట నుండి ఆయనలో అసాధారణ లక్షణాలు కనిపించసాగాయి. పది సంవత్సరాలు వచ్చేసరికి జ్యోతిష, గణిత, మంత్రశాస్త్రాలపై పట్టు సాధించారు. పన్నెండేళ్ల వయసులో ఎనిమిదేళ్ల విశాలాక్షితో వివాహం జరిగింది. తండ్రి నుండి పంచాక్షరితో సహా పన్నెండు మహా మంత్రాల ఉపదేశం పొందారు. పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి సకల శాస్త్రపారంగతుడై తాను కూడా ఋషులలాగ తపస్సు చేసి శక్తులను పొంది లోకాన్ని ఉద్ధరించాలనుకున్నారు. వీరు ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.

తల్లిదండ్రులు వీరు గర్భంలో ఉండగానే కలిగిన కొన్ని దివ్య నిదర్శనాల వలన గణపతి దైవాంశ సంభూతునిగా భావించి వీరికి గణపతి అని నామకరణం చేశారు. పదేళ్ళ వయసులోనే మూడు కావ్యాలు రచించి కవిత్వం చెప్పేవారు. జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సంపాదించి పంచాంగ గణనలో ఒక నూతన పథకాన్ని కూడా రచించి గురువును మించిన శిష్యుడు అని పేరుపొందారు. వీరి పదవ ఏట తల్లి మరణించగా, పన్నెండవ ఏట వివాహమైనది. వీరు భార్యను ఉద్దేశించి భృంగ సందేశమ్ అనే సరస కావ్యాన్ని మందాక్రాంత వృత్తాలలో రచించారు. పదహారు సంవత్సరాలకు కావ్య శాస్త్రేతిహాస పారంగతుడును, ఉజ్జ్వల ఆశుకవి అయిన తండ్రి నుండి మహా మంత్ర దీక్షలచే తపస్సు చేయడానికి నాసిక్, భువనేశ్వర్ దివ్య క్షేత్రాలను వెళ్ళారు. ఇరవై సంవత్సరాలకు గణపతి శాస్త్రి కవిత్వ ప్రజ్ఞలో పూర్వ కవులకు గల ప్రాభవాన్ని గడించారు. 1900లో విజిగీషతో నవద్వీప విద్వత్పరీక్షలకు వెళ్ళగా, అక్కడ సభలోని పరీక్షక వర్గం వారు ఇతని కవిత్వ ప్రజ్ఞా ప్రదర్శనను చూసి కావ్యకంఠ అనే బిరుదుతో అభినందించారు. 1903లో మద్రాసులో నారాయణ సుదర్శనునితో పోటీలో ఆరు నిమిషాలలో కావ్యకంఠుడు ఇరవై శ్లోకాలను రచించి బంగారు కడియాన్ని బహుమానంగా పొందారు. 1902లో అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు వీరు శివుని సహస్ర శ్లోకాలతో స్తుతించి అక్కడ అధ్యాపకునిగా కొంతకాలం పనిచేసారు. తరువాత వేలూరులో తెలుగు పండితునిగా దాదాపు నాలుగు సంవత్సరాలు నిర్వర్తించారు.

కుటుంబ జీవితాన్ని గడుపుతూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సు చేసుకోవడం ద్వారా మోక్షప్రాప్తి సాధించవచ్చని ఋషులు చెప్పిన దానిని గట్టిగా విశ్వసించారు. భార్య అనుమతితో సంవత్సరంలో ఆరునెలల కాలం దేశంలోని వివిధ ఆలయాలలో ఏకాంత ప్రదేశంలో తపస్సు చేస్తుండేవారు. అరుణాచలంలో ఉన్న బ్రాహ్మణస్వామిని రమణమహర్షిగా మార్చారు.

చివరకు 1907లో దాస్య వృత్తిని వదలి అరుణాచలం వెళ్ళారు. అక్కడ అచంచల తపోదీక్షతో చిరకాలం ఉండి మునిగా రమణ మహర్షిని దర్శించి తపస్సు గురించి అతనికి అనుభవ పూర్వక వాక్యాలు ఉపదేశించారు. తరువాత ఈశ్వరుని స్తుతిస్తూ ఉమా సహస్రమనే గ్రంథాన్ని రచించారు. ఋగ్వేదం నుండి విదితమైన భారత చరిత్రాంశాలను నిరూపించు భారత విమర్శ అనే గ్రంథం ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు మించిన సత్యదర్శిని వంటిది. డెబ్బైఐదు వరకు ఉన్న వీరి గ్రంథాలలో కొన్ని మాత్రమే ముద్రించబడ్డాయి. వీరు 1924లో కాంగ్రెస్లో చేరి, తమిళనాడు కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులయ్యారు. సంఘ సంక్షేమం కోసం అస్పృశ్యతా నివారణను సమర్ధించి, దానిని శాస్త్రీయ దృష్టితో పోషించడానికి పంచ జన చర్చ అనే వ్యాసాన్ని రచించారు.

సామాజిక సేవ

మార్చు

1923 డిసెంబరులో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో స్త్రీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సభలో… పురుషులతో బాటు స్త్రీలకు సమానహక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించారు. 1924లో ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బెల్గాంసభలో … అస్పృశ్యత నివారణ శాస్త్రసమ్మతమని ప్రసంగించారు. హైదరాబాదులో ఆది హిందూసంఘం (హరిజనులు) వారు పల్లకిలో ఊరేగించి, సత్కరించి… ‘ముని’ బిరుదునిచ్చారు. ఒకపక్క తపస్సు ద్వారా అమ్మవారి దర్శనం, వివిధ రచనలు చేస్తూనే, మరోపక్క దేశోధ్ధరణకు పూనుకున్నారు.భారతీయుల పట్ల బ్రిటిష్‌వారి అమానుష ప్రవర్తనకు ఎంతో బాధపడిన నరసింహశాస్త్రి ప్రజలు ధర్మాలను ఆచరించకపోవడం వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని విచారించారు. సనాతన ధర్మాన్ని నెలకొల్పగల శక్తి సామర్థ్యాలుగల కుమారుడిని అనుగ్రహించమని తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థించారు. వీరు ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు అయినను ఇంకా సంతృప్తి పడక - ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి '....... తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను.... ' అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:

  1. "'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు.
  2. జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.

గణపతిముని వేంకటరామన్ అను నామమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక' అని పలికెను. 'సరే, నాయనా' యని రమణుడు దానిని స్వీకరించెను. అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి. తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి (1922 వేసవి).

"నాయన" అనే కావ్యకంఠ జీవితచరిత్రను గుంటూరు లక్ష్మీకాంతం గారు రచించినారు. గణపతి మునిగారి చివరి రెండు సంవత్సరాల కాలం ఖరగపూర్లో ఉన్నారని, లక్ష్మీకాంతం దంపతుల వారి పరిచర్యలు చేసినట్లు వ్రాసినారు. నాయన ఖరగపూరులోనే శరీరం విడచిపెట్టినారు.

రచనలు

మార్చు

గణపతిముని ఉమా సహస్రము, శ్రీ రమణ గీత, శ్రీ రమణ చత్వరిమ్సత్, ఇంద్రాణి సప్తశతీ, మహా విద్యాది సూత్రావళి, గీతమాల, విశ్వమీమాంస, మొదలగు అనేక గ్రంథములను రచించెను. భగవాన్ శ్రీ రమణ మహర్షి సంస్కృతములో రచించిన ‘ఉపదేశసారము’ నకు వ్యాఖ్యానము రచించిరి. వీరి రచనలన్నీ కలిపి కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ వాసిష్ఠ కావ్యకంఠ గణపతి ముని అను పేరిట రమణాశ్రమము వారు పన్నెండు సంపుటాలుగా ప్రచురించారు.[1] వీరి రచనలు -

  1. శ్రీగురుస్తుతిః
  2. హేరంబోపస్థానము
  3. ఉమాత్రిశతీ
  4. ఉమాశతకం
  5. ఉమాక్షరమాలా
  6. ఉమాసహస్రమ్
  7. దేవీ స్తోత్రమంజరీ
  8. శ్రీ త్రిపురసుందరీ గీతం
  9. అమృతాంబా పంచరత్నం
  10. సౌందర్యాంబా నిర్వాణషట్కం
  11. రేణుకాష్టకం
  12. రేణుకాసప్తకం
  13. ఇంద్రాణీ సప్తశతీ
  14. ప్రచండ చండీ త్రిశతీ
  15. మంగళగౌరీ స్తోత్రం
  16. శ్రీరమణచత్వారింశత్
  17. శివ శతకం
  18. శివస్తవరాజ
  19. శివసప్తతి
  20. ఇంద్ర సహస్రనామము
  21. ఇంద్రసహస్రే ప్రథమం శతకం
  22. కటాక్షస్తబకం
  23. ఇంద్రవింశతి
  24. ఇంద్ర సప్తకం
  25. శ్రీపవనాష్టకం
  26. నృసింహ పంచరత్నం
  27. యోగాంజనేయ పంచరత్నం
  28. తారకరామనామస్తుతి
  29. కృష్ణాక్షరమాలికా
  30. రామగీతా
  31. గీతామాలా
  32. శివగీతం
  33. రమణగీతం
  34. సదాచారబోధినీ
  35. తత్త్వఘంటా శతకం
  36. తంత్రహృదయం
  37. అక్షరావళిః
  38. శ్రీ రమణ గీతా
  39. సద్దర్శనం
  40. విశ్వమీమాంసా
  41. ధర్మానుశాసనం
  42. మహావిద్యా సూత్రం
  43. రాజయోగసార సూత్రం
  44. ఇంద్రేశ్వరాభేద సూత్రం
  45. చతుర్వ్యూహ సూత్రం
  46. రుద్రకుటుంబ సూత్రం
  47. సృష్టి సూత్రం
  48. ఈశ్వర మీమాంసా
  49. క్రియాశక్తి మీమాంసా
  50. సిద్ధాంతసార సూత్రం
  51. మనీషా సంగ్రహః
  52. అథ శాంతితపోబోధానాం ఫలనిరూపణం
  53. గాయత్రీ వ్యాఖానం
  54. యోగ వ్యాఖ్యానం
  55. సీతా వ్యాఖ్యానం
  56. కృష్ణ వ్యాఖ్యానం
  57. తత్త్వసామాన్య మీమాంసా
  58. తత్త్వ మీమాంసా
  59. ప్రమాణపరీక్షా
  60. సమవాయపరీక్షా
  61. అభావపరీక్షా
  62. పంచజనచర్చా
  63. గోత్రప్రవర నిర్ణయః
  64. వివాహధర్మసూత్రం
  65. శబ్దప్రమాణచర్చా
  66. జైమినీయతర్కవార్తికం
  67. పంచమమీమాంసా
  68. దర్శనమాలా
  69. గణపతిదర్శనం
  70. శక్తిదర్శనం
  71. సామ్రాజ్యనిబంధనం
  72. తత్త్వానుశాసన సూత్రాణి
  73. దేవతామీమాంసా
  74. వాసిష్ఠదర్శనం
  75. సర్వార్థదర్శనం
  76. ఆదిశాస్త్రార్థసూత్రం
  77. మహావార్తికం
  78. వాసిష్ఠకామసూత్రాణి
  79. ఋగ్వేద భాష్యం
  80. ఆదివేదమీమాంసా
  81. ఋగ్వేదవిమర్శినీ
  82. ఋగ్వేదమంత్రభాష్యం
  83. ఇంద్రనామనిర్వచనం
  84. ఐంద్రసహస్రనామ భాష్యం
  85. జైమినీయసూత్ర భాష్యం
  86. ఈశోపనిషద్భాష్యం
  87. ఉపదేశసార భాష్యం
  88. గురుమంత్ర భాష్యం
  89. అగ్నే చతస్రో విభూతయః
  90. దైవరాతదర్శనం
  91. మాతృతత్త్వప్రకాశికా
  92. శారీరకమీమాంసా టిప్పణీ
  93. వైదికపదానాం అర్థాః
  94. చికిత్సానుశాసనం
  95. ప్రాణతోషణం
  96. హోరానిర్ణయసంగ్రహః
  97. షోడశశ్లోకీ
  98. త్రిభావఫలచంద్రికా
  99. గణకకంఠాభరణం
  100. భారతచరిత్రమీమాంసా
  101. పూర్ణా (నవల)
  102. సుకన్యాదస్రసంవాదః
  103. పాండవధార్తరాష్ట్రసంభవః
  104. భృగువంశేతిహాస
  105. లాలిభాషోపదేశః

నాయన కలకత్తాకి 24-11-34 న వచ్చి శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారి ఇంట్లో బస చేసితిరి. వీరి ఆదరాభిమానములకు సంతసించి, నాయన సుమారు ఒకటిన్నర సంవత్సరములు కలకత్తాలో వీరి దగ్గర వుండిరి. ఆ సమయములో ప్రతిరోజూ నాయన వీరికి అనేక ముఖ్య విషయములను బోధించెడివారు.. ముఖ్యముగా లక్ష్మికాంతము గారి కోరిక మేర నాయన గారు స్వయముగా తమ జీవిత చరిత్ర, ఉమా సహస్రము నకు అర్ధము, వ్యాఖ్యానము, ఇంద్రాణి సప్తశతీ యొక్క అర్ధము, వ్యాఖ్యానము, విశ్వమీమాంస వివరణము, మొదలగు విషయములు బోధించిరి. గణపతి ముని గారు (వీరనారి సత్యప్రభ అను కథను) ‘పూర్ణ’ అని సంస్కృత భాష యందు వ్రాసి, ‘పూర్ణ’ అని తెలుగులో వ్రాసిరి. (ఈ కథను భారతి పత్రికలో అచ్చు వేసిరి).

వీరి గురించి వెలువడిన పుస్తకాలు

మార్చు
  • నాయన ( కావ్య కంఠ శ్రీ గణపతి ముని జీవిత చరిత్ర) : రచయిత : గుంటూరు లక్ష్మీకాంతం.
  • వాసిష్ట వైభవమ్ ( సంస్క్రుత గ్రంధం) : రచయిత  : కపాలి శాస్త్రి
  • మహా తపస్వి : రచయిత : రావినూతల శ్రీరాములు
  • నాయన ( గణపతి ముని చరిత్ర) : రచయిత : పోలూరి హనుమజ్జానకీ రామశర్మ
  • వాసిష్ఠ కావ్య కంఠ గణపతి ముని : గ్రంథమాలా: సంపాదకులు : కె. నటేశన్ (సంస్క్రతమ్) ( 12 సంపుటాలు)
  • NAYANA : G. KRISHNA
  • JAYANTI : Kavyakantha Ganapati Muni Centenary Commemoration Volume (1978)

నిర్యాణము

మార్చు

'నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని జూలై 27, 1936లో మరణించారు. ఈ దివ్యపురుషుని భౌతిక దేహమంతరించినను, తన గ్రంథములందు బోధరూపమున ప్రకాశించుచున్నారు.

గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. ఈ జీవిత చరిత్ర మొదట 1958 లో ప్రచురింపబడింది.

మూలాలు

మార్చు
  1. "Collected Works Of Vasishtha Kavyakantha Ganapati Muni". Sri Ramana Maharshi (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • Kavyakantha Ganapati Shastri (1878 - 1936) : Luminaries of Andhra Pradesh, Dr. S.Shridevi, World Telugu Conference Publication of Andhra Pradesh Sahitya Akademi, Hyderabad, 1976.
  • గణపతి ముని చరిత్ర - పోలూరి జానకీ రామ శర్మ - 1992

బయటి లింకులు

మార్చు