షేక్ మసూద్ బాబా శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు.[1] అతను ప్రజా ఉద్యమాల పట్ల గొప్ప ప్రేమతో ఆశతో ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడానికి తపన పడిన వారిలో ఒకడు. అతని జీవితం గొప్ప నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు ప్రతీక. అతను ‘బాబా’గా సుపరిచితుడు.[2]

జీవిత విశేషాలు

మార్చు

మసూద్ బాబా 1946లో అమీనాబీ, మస్తాన్ దంపతులకు గుంటూరు జిల్లాలోని రొంపిచర్ల గ్రామంలో జన్మించాడు. తన చిన్నతనంలో అతని తల్లిదండ్రులు జీననోపాధి వెదుక్కుంటూ విజయవాడలో స్థిరపడ్డారు. అయిదో తగగతి వరకూ చదువుకున్న అతను చిన్నతనం నుంచే మార్క్సిజం పట్ల అభిమానాన్ని పెంచుకున్నాడు.అతని చిన్నతనంలో విజయవాడ సూర్యారావు పేటలోని బెల్లం శోభనాద్రి గ్రంధాలయంలో సోవియట్ పుస్తకాల్లోని బొమ్మలు చూడ్డానికి వెళ్ళేవాడు. ఆవిధంగా క్రమంగా అతను కమ్యూనిస్ట్ సాహిత్యం చదవడానికి అలవాటు పడ్డాడు. అతను మొదట వివాహం చేసుకోవాలని అనుకోకపోయినా తర్వాత ఉద్యమంలో నష్టపోయిన కుటుంబానికి, బోయ కులానికి చెందిన ‘శీలం సౌదమణి’ని వివాహం చేసుకున్నాడు. వారి పెళ్ళికి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కొల్లా వెంకయ్య పెద్దగా వ్యవహరించాడు.[2]

అతను టాక్సీ డ్రైవరుగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక సంఘాలలో క్రియాశీలకంగా వుండేవాడు. ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిన తరువాత ఏర్పడిన సిపిఐ (ఎంఎల్‌) లో కె.జి.సత్యమూర్తి (శివసాగర్), కొండపల్లి సీతారామయ్య, రవూఫ్, నాగభూషణం పట్నాయక్, ముక్కు సుబ్బారెడ్డి, అప్పలసూరి, చౌదరి తేజేశ్వరరావు మొదలైన ప్రముఖ నాయకులతో కలిసి పనిచేశాడు. శ్రీకాకుళ ఉద్యమంలోకి వెళ్లేటప్పటికి అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే. పార్వతీపురం కుట్ర కేసులో, వల్లూరు పూర్ణచంద్రరావు హత్య కేసులో 77వ నిందితుడిగా అరెస్టు కాబడి విశాఖపట్నం, కోరాపుట్, జయపూర్, మల్కన్ గిరి, విజయవాడ, బందరు మొదలైన జైళ్ళలో ఎనిమిది సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించాడు. ఆ తరువాత సుమారు ఇరవై సంవత్సరాలు రహస్య జీవితం గడిపాడు. విశాఖ జైలులో వున్నప్పుడు సత్యమూర్తితో ఆతనికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. అతని సాహచర్యంలో మసూద్ బాబా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేశాడు. ఇతర మిత్రులతో కలిసి జైలు సంస్కరణల కోసం ఉద్యమం చేశాడు.[2] ఆయనకి చాలా కాలం వరకు వర్గ స్పృహ తప్ప కుల నిర్మూలనా స్పృహ వుండేది కాదు. ఎప్పుడూ తనని తాను ఒక కార్మిక వర్గపు ఉద్యమకారుడిగానే భావించే బాబా ముస్లింగా పిల్లలకు ఉర్దూ భాష నేర్పలేదు. ఏ రకమైన సామాజిక అస్తిత్వాన్ని చాటుకోలేదు. అయితే సత్యమూర్తి దళిత ఉద్యమం వైపు వచ్చాక బాబా క్రమంగా కొంత అస్తిత్వ స్పృహ వచ్చినదని చెప్పవచ్చు. ఇంతకాలం అంబేద్కర్ని తెలుసుకోలేకపోవడం వలన సైద్ధాంతికంగా చాలా నష్టపోయామని ఆయన అంటుండేవాడు. ఒక ముస్లింగా అతనిలో మైనారిటీ స్పృహతో పాటు వర్గ స్పృహ, కులనిర్మూలనా స్పృహ పెరిగాయి.

సత్యమూర్తి విప్లవోద్యమం నుంచి బయటకొచ్చాక మొదట కలుసుకున్నది బాబానే. ఆయన బతుకుదెరువుకోసం పాత అంబాసిడర్ కారు కొనుక్కుని దాని బాడుగతోనే జీవితాన్ని వెళ్ళదీశాడు. సత్యమూర్తిని బాబా తన కారులో రాష్ట్రమంతా తిప్పాడు. రహస్య జీవితం నుంచి బయటకొచ్చాక కూడా మసూద్ బాబా ఒకరకంగా వుద్యమ జీవితాన్నే గడిపినట్టు భావించాలి. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్ అంటే ఉద్యకారుల షెల్టర్ జోన్ అని అనుకునే పరిస్థితి వుండేది. అందులో బాబా ఇల్లు ఉద్యమకారులకు నెలవు అని భావించేవారు. సమకాలీన రాజకీయాల పట్ల, ఉద్యమాలపట్ల మసూద్ బాబాకి స్పష్టమైన అవగాహన, నిశితమైన పరిశీలనా దృష్టి ఉండేవి. ఆయన అన్ని సామాజిక, ప్రజాస్వామిక ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ యువకులలో చైతన్యాన్ని నింపేవాడు. సత్యమూర్తి ఉద్యమ వారసులతో ఏర్పడిన సంస్థ ‘సామాజిక విప్లవ వేదిక’కు ఆయన ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించడం ఆయన నిత్య పోరాట పటిమకు తార్కాణం. ఆస్తులు పోగుచేసుకునే అవకాశం వొచ్చినా చాలీచాలని ఇంట్లో అరకొర సౌకర్యాలతో నిజాయితీగా బతికారు. పేదరికం లోనూ ఆయన తాను ఎన్నుకున్న మార్గాన్ని వీడలేదు. దుర్భర దారిద్ర్యం వొకవైపు, వెంటాడే అనారోగ్యం వొకవైపు బాబాని వేధించినా ఎప్పుడూ చెక్కుచెదరని నిబ్బరంతో, ఆత్మగౌరవంతో బతికాడు.[3]

అంబేద్కర్ సూర్యుడు

మార్చు

బాబాతో చర్చించి సత్యమూర్తి ‘అంబేద్కర్ సూర్యుడు’ పుస్తకం రాయడం విశేషం. ఆ పుస్తకాన్ని సత్యమూర్తి తనకెంతో ప్రియమైన మిత్రుడు బాబాతో ఆవిష్కరింప చెయ్యడం బాబా పట్ల శివసాగర్ కి వున్న గౌరవానికీ, ప్రేమకూ గుర్తు.

షేక్ మసూద్ బాబా 2018 ఆగస్టు 5న విజయవాడలో మృతి చెందారు.

మూలాలు

మార్చు
  1. "శ్రీకాకుళ పోరాట యోధుడు ఇక లేరు". Archived from the original on 2021-04-23. Retrieved 2018-08-21.
  2. 2.0 2.1 2.2 "శివసాగరుని చెలికాడు". 17 August 2018.[permanent dead link]
  3. "విప్లవ చరిత్రలో విస్థాపితుడు". Andhra Jyothi. 18 August 2018. Archived from the original on 21 ఆగస్టు 2018. Retrieved 21 ఆగస్టు 2018.

బయటి లంకెలు

మార్చు