కొల్లా వెంకయ్య (1910 - 1997) స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంట్ సభ్యునిగా,శాసన సభ్యునిగాపనిచేసిన ప్రముఖ కమ్యునిస్ట్ నాయకుడు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు.

కొల్లా వెంకయ్య
జననం1910
గుంటూరు జిల్లా పెదనందిపాడు
మరణం1997
ప్రసిద్ధిస్వాతంత్ర సమర యోధుడు తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం
రాజకీయ పార్టీCPI (ML)
భార్య / భర్తశ్రీమతి వీరమ్మ
పిల్లలుముగ్గురు కుమారులు,కుమార్తె
తండ్రికృష్ణయ్య
తల్లిరత్తమ్మ

వ్యక్తిగత జీవితం

మార్చు

వెంకయ్య 1910 జూలై 14 న గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామములో కొల్లా కృష్ణయ్య, రత్తమ్మ లకు జన్మించాడు[1]. ఊరిలోని పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించి, బాపట్లలో ఉన్నత విద్య చేసాడు. ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూనే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఏ చేశాడు. 1936 లో వీరమ్మతో ఇతని వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. తాను నమ్మిన సమసమాజ స్థాపనకు, కార్మికులు, రైతులు, అణగారిన ప్రజల శ్రేయస్సుకై నిరంతరం పాటుబడి 1998 సెప్టెంబరు 17న కన్నుమూసాడు.

స్వాతంత్ర పోరాటంలో

మార్చు

మహాత్మా గాంధీ 1929 లో పెదనందిపాడు వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఉపన్యాసం విని ఉత్తేజితుడై జాతీయోద్యమానికి అంకితమయ్యాడు.

1929 డిసెంబరులో తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన హిందూస్థాన్ సేవాదళంలో స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేశాడు. 1933లో గాంధీ కావూరు వినయాశ్రమం సందర్శించినపుడు కలిశాడు. 1934లో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా వెళ్ళాడు.

గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణ, మాకినేని బసవపున్నయ్య మున్నగు వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. 1937 మేలో కొత్తపట్నంలో జరిగిన రాజకీయ పాఠశాలకు వెళ్ళాడు. 1940లో తన వాటాగా వచ్చిన భూమిని అమ్మి పార్టీకి విరాళమిచ్చాడు. గుంటూరు జిల్లాలో రైతు సంఘ నిర్మాణం, రైతుకూలీ సంఘం, ఉద్యమ సమస్యలు, భూసంస్కరణలు, బంజరు భూముల పంపకం, ఆందోళనలు మున్నగు విషయాలలో ముందుండేవాడు.

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం

మార్చు

హైదరాబాద్ రాజ్యంలో అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు ఈ పోరాటానికి దారి తీసాయి. 1946 -51 లో జరిగిన ఈ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో వెంకయ్య గారు మైదాన ప్రాంతీయ సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. ఆ కాలమంతా వెంకయ్య రహస్య జీవనం గడిపాడు. అష్టకష్టాలు పడ్డాడు. ఓర్పు, నేర్పుతో రహస్య జీవితం గడిపారు.

రాజకీయ జీవితం

మార్చు

1952 లో జరిగిన మద్రాసు ప్రావిన్సులో పొన్నూరు నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1953 లో ఆంధ్ర రాష్ట్ర తొలి శాసన సభలో సభ్యుడిగా కొనసాగాడు.

1955లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో పర్చూరు నుండి భారతీయ కమ్యునిస్ట్ అభ్యర్థిగా శాసన సభకు పోటిచేసి కొల్లా రామయ్య పై పరాజయం చెందాడు. ఆ తరువాత 1957 లో జరిగిన స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసన మండలి సభ్యునిగా (MLC) ఏన్నికయ్యాడు.

1962 లో తెనాలి నియోజకవర్గం నుండి ఆచార్య ఎన్.జి. రంగా గారిపై విజయం సాధించి పార్లమెంటు సభ్యునిగా ఏన్నికయ్యారు

కమ్యూనిస్ట్ కార్యకర్తగా, జిల్లా, రాష్ట్ర నాయకుడిగా అనేక సంవత్సరాలు కొనసాగాడు. సి.పి.యం పార్టీనుండి విడిపోయిన అనంతరం కొంతకాలం విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేశాడు. తదుపరి మార్క్సిస్ట్ - లెనినిస్ట్ కమిటీ పేరుతో విప్లవ గ్రూపుల ఐక్యతకై కృషి చేశాడు.

గుంటూరు జిల్లాలో నల్లమడ వాగు వరద ముంపు బాధిత రైతాంగ పక్షాన 1980 లో ఉద్యమాన్ని నడిపి దాని నివారణకు కృషి చేశాడు.

  • 1936- కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం
  • 1948-1951- తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, రహస్య జీవనం
  • 1962- చైనాతో యుద్ధ సందర్భమున కారాగారవాసం
  • 1970-శ్రీకాకుళం రైతాంగ ఉద్యమ సందర్భమున కారాగారవాసం
  • 1975-1977- అత్యవసర పరిస్థితి కాలంలో కారాగారవాసం
  • మొత్తం పది సంవత్సరాల కారాగారవాసం.


మూలాలు

మార్చు
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 135