తిరుమలలో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.

ఏడుకొండలు - రాత్రి వేళలో తిరుపతి నుండి
కపిలతీర్థం వద్ద తిరుమల కొండలు
శ్రీ వెంకటేశ్వర జాతీయవనం, తిరుమల కొండలు

చరిత్ర

మార్చు

1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలావుండేదో వ్రాశారు. గాలిగోపురం వరకూ ఎక్కడం, దిగడం బహు ప్రయాస అని వ్రాసుకున్నారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్ళీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామవిగ్రహాన్ని పూజిస్తూ, యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని వ్రాశారు.[1]

ఉపోద్ఘాతము

మార్చు

భగవంతుడు పంచాత్మ స్వరూపుడని తైత్తరీయ ఉపనిషత్తు పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలలో చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది. ఇక సామాన్యులకు లభించేది అర్చావతారమే! ఈ అర్చావతారం మనకు 108 దివ్యదేశాలలో కానవస్తుంది. ఈ 108 దివ్యదేశాల గురించి శ్రీ వేంకటేశ్వరుని భక్తాగ్రేసరులైన ఆళ్వార్లు తమ నాలాయీర దివ్యప్రబంధాలలో ప్రస్తుతించారు.

ఈ నూటెనిమిది దివ్యదేశాలూ శ్రీవైష్ణవమత సంప్రదీకులకు పరమ పవిత్రస్థలాలు. ఇవి భారతదేశమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిలో 106 క్షేత్రాలు భూలోకంలో ఉండగా, రెండు పరలోకంలో (వైకుంఠం, క్షీరాబ్ది) ఉన్నాయని భావన. ఈ 106 దివ్యక్షేత్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి రెండే రెండు. అవి... తిరుమల (తిరుపతి), అహోబిలం.

శేషాద్రి

మార్చు

సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

నీలాద్రి

మార్చు

స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి 'నీలాద్రి'గా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమెపేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.

గరుడాద్రి

మార్చు

దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

అంజనాద్రి

మార్చు

వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

వృషభాద్రి

మార్చు

కృతయుగంలో తిరుమలలోని తుంబురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాథ.

నారాయణాద్రి

మార్చు

విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణమహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

వేంకటాద్రి

మార్చు

కలియుగదైవం వెలసిన తిరుమల గిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. 'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని 'వేంకటాద్రి' అంటారని ప్రతీతి. దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారా దంపతులు. మాధవుడు మాత్రం చెడుసావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితోపాటు స్వామిదర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలూ నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్‌చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం.

ఏడు కొండలు

మార్చు

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వ్రుషబాధ్రి వ్రుషాద్రి ముఖ్యాం ఆఖ్యం త్వదీయవసతే రనిశంవదంతి శ్రీ వేంకటాచలపతే తమ సుప్రభాత ०

ఏడుకొండల సమాహారమే తిరుమల క్షేత్రం।

లక్ష్మీ దేవికి ఆవసమైనందున శ్రీశైలం.

ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలం లేదా శేషాచలం .

గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున గరుడాద్రి.

వేం= సమస్త పాపాలను, కట=దహించునది కావున కావున వేంకటాద్రి. వేం= అమృతత్వాన్ని, కట= ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వేంకటాద్రి.

నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణు వు కోసం తపస్సు చేసిన స్థలం, తన పేరుతో ప్రసిద్ధి పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి.

వృషభుడనే శెవభక్తుడు కోరి, శబర వేషం లోవున్న శ్రీనివాసునితో యుద్ధం చేసి మరణిస్తూ తనముక్తికి గుర్తుగా ఆపర్వ తానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాధ, అదే వృషబాధ్రి .

వృషమనగా ధర్మము ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున వృషాద్రి అని పేరు కలిగింది.

పై ఏడు పేర్లతో ఈ యుగంలో ప్రసిద్ధి పొందినా, గడచిన యుగాలలో చింతా మణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి .....ఇలా అనేక నామాలను కలిగివుంది.

మూలాలు

మార్చు
  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.