సౌమ్యనాథస్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్, కడపజిల్లా, నందలూరులోని 11వ శతాబ్దపు పురాతన వైష్ణవాలయం.మ

సౌమ్యనాథస్వామి దేవాలయం అన్నమయ్య జిల్లా, నందలూరు గ్రామంలో ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన దేవాలయం 10 ఎకరాల విస్తీర్ణం కలిగి 108 స్తంభాలతో నిర్మించబడింది. ఈ ఆలయం కడప నుండి 45 కి.మీల దూరంలో, రాజంపేట నుండి 10 కి.మీల దూరంలో వెలసింది[1].

సౌమ్యనాథస్వామి దేవాలయం
పేరు
ప్రధాన పేరు :సౌమ్యనాథస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:అన్నమయ్య జిల్లా
ప్రదేశం:నందలూరు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వేంకటేశ్వరస్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ

చరిత్ర

మార్చు

11వ శతాబ్దంలో చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాలలో ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కట్టించి, నందలూరు, అడపూరు,మన్నూరు, మందరం, హస్తవరం అనే అయిదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి. 16వ శతాబ్దంలో ఇక్కడికి 5 మైళ్ల దూరంలో ఉన్న పొత్తపిని రాజధానిగా చేసుకుని ఏలిన తిరువెంగనాథుని పట్టపురాణి చెన్నమణి సౌమ్యనాథస్వామి ఆలయానికి శంఖచక్రాలను, రత్న కిరీటాన్ని జక్కల తిమ్మసాని రత్నాల పరాశరం, జువ్వల కమ్మలు ఇతర స్వర్ణాభరణాలను బహూకరించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ ఆలయం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది.[1]

స్థలపురాణం

మార్చు

ఐతిహ్యం ప్రకారము ఒకసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ చెయ్యేరు (బాహుదానది) పరిసరాలకు వచ్చి అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైనాడట. నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను, సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోవుమని ప్రార్థించినాడట. నారద మహర్షి కోరిక మేరకు బాహుదా నదీతీరంలో సౌమ్యనాథస్వామి పేరుతో శిలారూపము ధరించినాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. కొందరు నారద మహర్షే ఈ సౌమ్యనాథస్వామిని స్వయంగా ప్రతిష్ఠించినాడని చెబుతారు [2].

విశేషాలు

మార్చు
 
సౌమ్యనాథ స్వామి అలయం లోపల
  • సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఒక అద్భుతం
  • ఆలయం చుట్టూ ప్రహారీ తూర్పువైపున ఆలయ ప్రవేశద్వారంపై ఐదు అంతస్తుల రాజగోపురం, ఉత్తర దిశలో 3 అంతస్తుల గోపురం ఉంది. దక్షిణం వైపు ఉన్న గోపురం పాక్షికంగా శిథిలమై పోయింది. రాజగోపురం దాటి ఆలయంలో ప్రవేశించగానే ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిలా దీపస్తంభం ఉంది. దానికి ముందు ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ మంటపాలు ఉన్నాయి. గరుడ మండపంలోని గరుడాళ్వార్ స్వామిని ముకుళిత హస్తాలతో సేవిస్తూ ఉన్నాడు
  • ఆలయ ప్రవేశ ద్వారం పైన మూడు అంతస్తుల గోపురం ఉంది. ప్రధాన ఆలయం మహామండపం, ఆస్థాన మండపం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయాల సముదాయం.
  • గర్భగుడిలో దాదాపు 7 అడుగుల ఎత్తుగల సౌమ్యనాథస్వామి పద్మపీఠంపై ఉన్నాడు. స్వామి చతుర్భుజుడు. రెండు చేతులలో శంఖు చక్రాలు, కింది కుడి చేయి అభయ ముద్ర, ఎడమ చేయి వరద ముద్రలలో ఉన్నాయి. స్వామి వెనుకవైపు లోహపు మకరతోరణం వుంది
  • గర్భగుడి ప్రధాన ద్వారానికి 100 గజాల దూరంలో ఉంది. ఈ ద్వారం నుండి మూలవిరాట్టును దర్శిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
  • సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యోదయంలో తొలి కిరణాలు స్వామి వారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు ఆలయాన్ని మలచారు.
  • ఈ ఆలయ నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించారు.
  • ఈ ఆలయంలో తమిళ శాసనాలు ఎక్కువగా, తెలుగు శాసనాలు తక్కువగా ఉన్నాయి.
  • కొన్ని శాసనాలపై సూర్య చంద్ర చిహ్నాలు ఉన్నాయి.ఆలయ కుడ్యాలపై మత్స్య, సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి.
  • ఆలయ గర్భగుడి ముందున్న కల్యాణమంటపం క్రింది భాగాన సింహపు తలలను చెక్కినారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా సింహాల తలలను ఆలయం పైభాగంలో ఉంటాయి. కానీ ఈ ఆలయంలో క్రింది భాగంలో ఉండటం వల్ల ఈ ఆలయానికి క్రింది భాగంలో మరో ఆలయం ఉన్నట్లు చరిత్రకారులు నమ్ముతున్నారు.
  • ఈ ఆలయ ప్రాంగణంలో విశాలమైన యజ్ఞశాల ఉంది. నరసింహస్వామి, గణపతి, ఆంజనేయస్వామిలకు చెందిన చిన్న గుళ్లు ఉన్నాయి.
  • ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు, బయట మరో పెద్ద కోనేరు ఉన్నాయి.
  • ఈ ఆలయంలో ప్రతియేటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్థానికులే కాక జిల్లాలోని ప్రజలందరూ హాజరై స్వామి వారిని దర్శిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వెలుపల ఉన్న కోనేటిలో తెప్పోత్సవాలు కూడా నిర్వహిస్తారు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 కె.నాగేశ్వరరెడ్డి (4 November 2001). "అన్నమాచార్యుడు దర్శించిన సౌమ్యనాథుని ఆలయం". వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం.
  2. పి.కృష్ణమూర్తి (1 January 2010). "శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం" (PDF). సప్తగిరి. 40 (8): 45–47. Retrieved 10 July 2018.