హరిత గ్రంధాలయాలు

ప్రపంచం అంతా పర్యావరణ కాలుష్య సమస్యలకు, ఖండాంతరాలలో  ప్రకృతి శీతోష్ణస్థితి మార్పులకు ప్రతిస్పందిస్తోంది. ఈ సందర్భములో అభివృద్ధి చెందిన, చెందుతున్న  దేశాలు తమ వస్తు, భవన నిర్మాణాల రూపకల్పనలో, నిర్వహణాలలో హరిత (గ్రీన్) భావనను అనుసరించుతున్నాయి. హరిత గ్రంధాలయాల (Green Libraries) రూపకల్పన కూడా పర్యావరణ దృక్కోణంలో ఉంటుంది. సమాజంలో నిరంతరం చొచ్చుకు వస్తున్న మార్పులకు,  భవిష్యత్ అవసరాలకు  అనుగుణంగా పరివర్తనం చెందుతూ ఉండే గ్రంధాలయాలు, పర్యావరణ పరిరక్షణకు, ప్రజా ఆరోగ్యానికి తమ భవనాలు, వస్తు సామగ్రిని, సమాచార వనరులను తదనుగుణంగా రూపొందిస్తూ తమ వినియోగదారులలో కూడా అవగాహన పెంపొందిస్తున్నాయి. హరిత గ్రంధాలయాలు సహజ వనరులతో పర్యావరణ హిత సౌకర్యాలు సమకూర్చుతున్నాయి. అనగా సూర్యకాంతి, పీల్చేగాలి ధారాళంగా వచ్చే విధంగా గ్రంధాలయ నిర్మాణానికి స్థలము, భవనము, వస్తుసామాగ్రి రూపకల్పన (design) చేస్థాయి. ప్రధానంగా ఇది జలము, విద్యుత్ శక్తి వినియోగం తగ్గించి సహజ వనరులు, పునరుత్పాదక వనరులు  (renewable resources) మరింతగా వినియోగంలోకి తెచ్చే విధంగా గ్రంధాలయ భవనాలను రూపకల్పన చేస్తారు. గ్రంధాలయ భవనాల లోపల సహజంగా పెరగగలిగే మొక్కలను పెంచుతూండటం వలన లభించే గాలి, వెలుతురూ ఉన్నత ప్రమాణాలు కలిగి గ్రంధాలయం సిబ్బంది, వినియోగదారుల ఆరోగ్యం పరిరక్షించే విధంగా ఉంటుంది[1]. హరిత గ్రంధాలయం తన భవన నిర్మాణాల ప్రతికూల ప్రభావం తగ్గించి, భవన అంతర్భాగ పర్యావరణ నాణ్యతను- స్థలం ఎంపిక, సహజ నిర్మాణ పదార్ధాలు, జీవవ్యర్ధాలను వినియోగం, నీరు, శక్తి, కాగితము వంటి వనరుల పరిరక్షణ, వ్యర్ధ పదార్ధాల తొలగించుట లేదా పునర్వినియోగం ద్వారా పెంచడం చేస్తుంది. హరిత గ్రంధాలయం, పర్యావరణ సుస్థిర గ్రంథాలయానికి పర్యాయ పదం[2].

ప్రమాణాలు మార్చు

అంతర్జాతీయ ప్రమాణాలు మార్చు

  • అమెరికా హరిత భవనాల పరిషత్తు (USGBC -The United States Green Building Council), 2000లో 'లీడ్' సహజ శక్తి, పర్యావరణ రూపకల్పన (LEED - Leadership in Energy and Environmental Design) అను భవన నిర్మాణ తీరును ధ్రువీకరణించే ప్రమాణమును తయారు చేసింది. ఈ ప్రమాణము ధనము ఆదాతో పాటు పర్యావరణ సామర్ధ్యం, తక్కువ కర్బన ఉద్ఘారాలు, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు సూచికలు, కొలమానాలు నిర్ణయిస్తుంది. అనుసరించే ప్రతి 'లీడ్' ప్రోజక్ట్ - సుస్థిర స్థలాలు; జల సామర్ధ్యము; శక్తి, వాతావరణము; వస్తు సామాగ్రి, వనరులు; భవన అంతర్భాగ పర్యావరణ నాణ్యత; రూపకల్పనలో కొత్తదనం వంటి 6 మార్గదర్శకాలకు అనుగుణంగా పాయంట్లు ఇస్తుంది. ధ్రువీకరణ కొరకు 40-49 పాయంట్లు, రజతము కొరకు 50-59, స్వర్ణం కొరకు 60-79 పాయంట్లు రావాలి. 80+ పాయంట్లు వస్తే ప్లాటినం ధ్రువీకరణ పత్రం ఈయబడుతుంది.[3]
  • 'బ్రీం' (BREEAM - Building Research Establishment Environmental Assessment Method) వైజ్ఞానిక పద్ధతులననుసరించి సుస్థిర పర్యావరణ ఆధారిత భవనాలకు విలువను నిర్ధారించి ధ్రువీకరించు ప్రమాణము. 1921 నుంచి నిర్మాణాల పర్యావరణ అభివృద్ధి ప్రమాణాల కొరకు నిర్విరామముగా కృషి చేస్తున్న భవనాల పరిశోధనా సంస్థ (BRE), వ్యాపార లక్ష్యాలు, ప్రజల సంక్షేమం దృక్కోణంలో 1990వ సంవత్సరం నుండి సుస్థిర పర్యావరణ హిత ప్రయోజనాల కొరకు పని చేస్తోంది[4].

జాతీయ స్థాయి ప్రమాణాలు/ఆరంభకాలు మార్చు

జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం పర్యావరణ హిత నిర్మాణాల ధ్రువీకరణ కొరకు ఏర్పాటు చేసిన 'గృహ (GRIHA - Green Rating for Integrated Habitat Assessment) ' ప్రమాణాలను, 'భారతీయ హరిత భవన పరిషత్తు (IGBC - Indian Green building Council) ' నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తోంది[5].

  • 'భారతీయ హరిత భవన పరిషత్తు (IGBC Archived 2022-12-26 at the Wayback Machine) - 2001లో ఏర్పడింది. అందరికి సుస్థిర నిర్మాణ వాతావరణం అందించడము, 2025 వ సంవత్సరానికి ఈ విషయములో ప్రపంచదేశాలకు భారతదేశము మార్గదర్శకులులో ఒకరుగా తయారు చేయడమే లక్ష్యం. ఈ పరిషత్తు హరిత నిర్మాణ నిర్ధారణ కార్యక్రమాలు, ధ్రువీకరణ, శిక్షణ కార్యక్రమాలు వంటి సేవలు అందిస్తోంది. సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ పరిషత్తు ఇక్కడి నిర్మాణ పరిశ్రమ భాగస్వామ్యులు అయిన భవన నిర్మాణవేత్తలు, ప్రభుత్వం, విద్యావేత్తలు, వ్యాపార సంస్థలు ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రపంచ హరిత భవన పరిషత్తుతో అనుసంధానం అయి ఈదేశంలో హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది.
  • అమెరికా హరిత భవనాల పరిషత్తు తమ 'లీడ్' కేంద్రాన్ని భారతదేశములో కూడా ఆరంభించింది.
  • 'గృహ' (GRIHA) : అంటే సంస్కృతంలో అవాసము అని అర్ధం. ఈ సంస్థ నిర్మాణ వనరుల వినియోగాన్ని, వ్యర్ధ పదార్ధాల ఉత్పత్తిని తగ్గించి, పునరుత్పాదక వనరులు వినియోగం పెంచి మొత్తానికి పర్యావరణ హితమైన పరిధులను పరిమాణాత్మకముగా నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది. జాతీయ స్థాయిలో భవన నిర్మాణాల పర్యావరణ సామర్ధ్యాన్ని నిర్దేశింపబడిన కొలమానాల ఆధారంగా అంచనా వేయడానికి 'గృహ' ప్రమాణము సహాయకారిగా ఉంటుంది. జాతీయంగా అంతర్జాతీయంగా ఇంతవరకు అనుసరిస్తున్న పద్ధతులకు, ఉద్భవిస్తున్న కొత్త ఆలోచనలకు సమతుల్యత పాటిస్తూ శక్తి, పర్యావరణ సూత్రాల మీద ఆధారపడి ఈ నిర్దేశిక వ్యవస్థ పనిచేస్తుంది. ఈ కొలమానాల ఆధారంగా నిర్మాణ దశల క్రమాన్ని - నిర్మాణ పూర్వ దశ; భవన ప్రణాళిక, నిర్మాణ దశ; నిర్మాణానంతర దశ; నిర్వహణ దశగా వర్గీకరిస్తారు. స్థూలంగా ఈ వ్యవస్థ హరిత గృహ వాయువుల ఉద్గారం, శక్తి వినియోగం తగ్గించుట, సహజ వనరుల వినియోగం పెంచుట వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు దారి తీసి ప్రజలకు సహాయంగా ఉంటుంది.

భారత ప్రభుత్వ అనేక మంత్రిత్వ శాఖలు ఈ హరిత భారతానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ సందర్భంలో పర్యావరణం, అడవులు, శీతోష్ణస్థితి మార్పుల మంత్రిత్వ శాఖ (Ministry of Environment, Forest and Climatic Changes, Government of India) కొన్ని ఈ హరిత ఆధారిత పధకాలను ఆరంభించింది. ప్రభుత్వేతర రంగ సంస్థలు అనేకం 'టెరి' (TERI -The Energy and resource institute), ఇన్ఫోసిస్, ఐకియా, ఎడోబ్, మైక్రోసాఫ్ట్, టాటా మోటార్స్, ఫిలిప్స్, గూగుల్ వంటి సంస్థలు ఈ పర్యావరణ హిత హరిత నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి[5].

హరిత గ్రంధాలయాలు మార్చు

హరిత గ్రంధాలయ ఉద్యమం 1990వ దశకం మొదలులో ఆవిర్భవించింది, క్రమంగా గ్రంధాలయ సమాచార వృత్తిలో ఆదరణ, గుర్తింపు పొందుతోంది. ఈ హరిత నిర్మాణాల సూత్రాలు పూర్తిగా అనుసరించక పోయినా వివిధ గ్రంధాలయాలు సుస్థిర పర్యావరణ స్థితి సాధించడముకోసం పర్యావరణ హితంగా తమ భవన నిర్మాణ రూపకల్పన, నిర్మాణం, పునరుద్ధరణ, వనరుల పునర్వ్యవస్థీకరణ సామర్ధ్యంతో కృషి చేస్తున్నాయి. ఈ కృషి హరిత భవనాల ఉద్యమంతో సంబంధించినప్పటికీ, ఈ గ్రంధాలయాలు ఉన్న విశేష అవసరాలకు ప్రతిగా కొన్ని సమస్యలు సవాళ్లు కూడా ఉన్నాయి. పుస్తకాలు మొదలైన వనరులను చాలావరకు సూర్యకాంతి, తేమ, ఉష్ణోగ్రత మార్పులకు, అతినీలలోహిత కిరణాలకు దూరంగా ఉంచి పరిరక్షించవలసి ఉంటుంది. బరువైన పుస్తకాలను భవనం పై అంతస్తులలో ఉంచకుండా వివిధ ప్రదేశాలలో నిర్వహించడం, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా భవనాలను 50 నుంచి 100 సంవత్సరాలకు విస్తరించడానికి వీలుగా నిర్మించాలి.[1]

ఇఫ్లా' (IFLA) మార్గదర్శకాలు మార్చు

'ఇఫ్లా' (IFLA)- గ్రంధాలయ సంఘాలు, సంస్థల అంతర్జాతీయ సమాఖ్య (The International Federation of Library Associations and Institutions) హరిత గ్రంథాలయాలను పర్యావరణ, ఆర్ధిక, సామాజిక సుస్థిరతకు ప్రాధాన్యత ఇచ్చేవిగా  పేర్కొనింది. ఈ సమాఖ్యకు సంబంధించి ఉన్న పర్యావరణ, సుస్థిర గ్రంధాలయాల విభాగం (ENSULIB - Environment, Sustainability and Libraries Section) ఉద్దేశ్యము- గ్రంధాలయాధికారులను, వారి సంఘాలను కూడా గ్రంధాలయాల పర్యావరణ సుస్థిరత కొరకు ప్రోత్సహించడం, పధకాలు (ప్రాజెక్టులు), సదస్సులు, చర్చా వేదికలు  నిర్వహించడం, వారికి కావలసిన వస్తువులు అందచేయడము.  గ్రంధాలయాల పరిమాణం, రకము  ఏది అయినా వాటికి స్పష్టమైన  కార్యాచరణ విధానము ఉండాలని ఈ విభాగం నిర్దేశించింది.

  • హరిత భవనాలు, పరికరాలు: కర్బన సంబంధిత ఉద్గారాలు, ముద్రలు చాలావరకు ఉండవు.
  • హరిత కార్యాలయ సూత్రాలు: రోజువారీ కార్యక్రమాలు, ప్రక్రియలు కూడా పర్యావరణ సుస్థిరతకు అనుకూలంగా ఉండాలి.
  • సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ: ఆర్థిక వినియోగం నియంత్రించాలి. సంబంధిత కార్యాచరణలు విస్తారంగా ప్రసారం చేసి సంఘ సభ్యులకు అందుబాటులో ఉంచాలి.
  • సుస్థిరమైన గ్రంధాలయ సేవలు: వినియోగదారులకు కావలసిన తాజా సమాచారం, స్థలాన్ని, ఉపకరణాలను, పర్యావరణ శిక్షణను, సమర్ధవంతమైన కార్యాచరణ కూడా గ్రంధాలయాలు అందించాలి.
  • సామాజిక సుస్థిరత: సరైన విద్య, సాక్షరత, సంఘ ఒడంబడిక,  మిశ్రమ సంస్కృతుల వైవిధ్యము, విభిన్న సామాజిక వర్గాల కలయక, ఇంకా ఈ కార్యక్రమాలలో పాల్గొనడము మొదలైనవి ప్రధానంగా పరిగణిస్తారు. గ్రంధాలయము అసమానతలను తగ్గించడానికి చురుకుగా పని చేయాలి.       
  • పర్యావరణ నిర్వహణ: పర్యావరణ లక్ష్యాలు నిర్దుష్టంగా, కొలబద్ధంగా, సాధించబడేవిగా, వాస్తవికంగా, నిర్ణీత కాలానికి తగినట్టుగా ఉండి, గ్రంధాలయం పర్యావరణానికి సానుకూలంగా కృషి చేయాలి. గ్రంధాలయ పర్యావరణ విధానం, ఆచరణ, కృషి,  ఫలితాలు విస్తృతంగా అందరికి చేరేవిధంగా చూడాలి.
  • పర్యావరణ సాధారణ లక్ష్యాలు, కార్యక్రమాల పట్ల నిబద్ధత: పర్యావరణ లక్ష్యాలు, నిబద్ధత సుస్థిర పురోగతికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు, పారిస్ శీతోష్ణస్థితి ఒడంబడిక, ఇంకా సంబంధిత పర్యావరణ ధ్రువీకరణ అంశాలు, కార్యక్రమాలను అనుసరించి ఉంటోంది.[6]

అంతర్జాతీయ హరిత గ్రంధాలయాలు మార్చు

1920 వ సంవత్సరం నుంచి అమెరికాలో ఉన్నత స్థాయి గ్రంధాలయాలు ఏర్పడ్డాయి. అవి [5]-

ఇంకా అమెరికా, కెనడా దేశాలలో పెరుగుతున్న 37 హరిత గ్రంథాలయాల వివిరాలు వేరుగా ఒక అంతర్జాల వేదికలో పొందుపరుస్తున్నారు.[7]

  • ఆమ్ స్టర్ డాం పౌర గ్రంధాలయం (2007), నెదర్లాండ్ (Amsterdam Public Library) : ఆమ్ స్టర్ డాంలో 'బ్రీం' ప్రమాణాలను అనుసరించి ధ్రువీకరణ పొందింది.
  • బ్రైటన్స్ జూబ్లీ లైబ్రరీ (2005), యూకే (Brighton’s Jubilee Library, UK) : పర్యావరణ హిత గ్రంధాలయంగా అనేక ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. 'బ్రీం' ప్రమాణాలను అనుసరించి ఉత్తమ గ్రంధాలయంగా ధ్రువీకరణ పొందింది
  • బీటౌస్ గ్రీన్ లైబ్రరీ (2006), తైవాన్ (Beitou’s green library) : తూర్పు ఆసియాలో ఉత్తమ పర్యావరణ హిత గ్రంధాలయం.

భారత దేశం లో హరిత గ్రంధాలయాలు మార్చు

భారతదేశము లీడ్' ధ్రువీకరణను అనుసరించుతోంది. హరిత భవనాలు రూపొందించడంలో అమెరికా తరువాత, కెనడా, చైనా ఇంకా భారతదేశము 3వ స్థానంలో ఉంది. 2017 నాటికి భారతదేశములో 2,230 భవనాలు అంటే వాటిలో వ్యాపార సంస్థల, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు, కర్మాగారాలు, భోజన శాలలు, విమానాశ్రయాలు, ఐటి పార్కులు, ఆర్థిక సంస్థలు, ఇన్ఫోసిస్, ఐటీసీ వంటి సంస్థలు హరిత నిర్మాణాలు చేపట్టాయి. భవన నిర్మాణ ప్రరిశ్రమ, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు మొదలగునవి ఈ 'లీడ్' నిర్దేశిస్తున్న కీలక విషయాల మీద దృష్టి సారించి తమ అన్ని రకాల నిర్మాణాలు, పధకాలు, ప్రాజెక్టులకు అన్వయించడము వారికి వృత్తిపరంగా సహాయకారిగా ఉన్నాయి. అది సుస్థిర పర్యావరణ వ్యవస్థ, జల వినియోగం, శక్తి, వాతావరణం, వస్తు సామాగ్రి, వనరులు, భవన అంతర్భాగ పర్యావరణ నాణ్యత, నెలవు, రవాణా వంటి విషయాలతో అనుసంధానమైన వ్యవస్థ.[8]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Green library". New World Encyclopedia. 16 December 2022. Retrieved 16 December 2022.
  2. "Sustainable library". ODLIS: Online Dictionary of Library and Information Science. Retrieved 27 December 2022.
  3. "LEED rating system, The most widely used green building rating system". U.S. Green Building Council. Retrieved 22 December 2022.
  4. "BRE - About us". BRE. Retrieved 26 December 2022.
  5. 5.0 5.1 5.2 VASANTHI, R. (2019). "GREEN LIBRARY TRENDS AND DEVELOPMENT IN INDIA: A STUDY" (PDF). International Journal of Advance Research and Innovative Ideas in Education. 5 (5): 475–479. Retrieved 26 December 2022.
  6. "What is a Green Library?". IFLA - The International Federation of Library Associations and Institutions. 16 December 2022. Retrieved 16 December 2022.
  7. "Green Libraries". Green Libraries, A Website for Information about Green and Sustainable Libraries. 17 December 2022.
  8. "LEED IN MOTION: India" (PDF). U.S. Green Building Council: Transforming buildings and communities through LEED. 21 December 2022. Retrieved 21 December 2022.
  9. Meher, Puspanjali (April–June 2017). "GREEN LIBRARY: AN OVERVIEW, ISSUES WITH SPECIAL REFERENCE TO INDIAN LIBRARIES". International Journal of Digital Library Services. 7 (2): 62–69 – via Researchgate.{{cite journal}}: CS1 maint: date format (link)

ఇతర లంకెలు మార్చు