హేమలతా లవణం

సామాజిక సేవకురాలు

హేమలతా లవణం (ఫిబ్రవరి 26, 1932 - మార్చి 20, 2008) సమాజ సేవకురాలు. తెలుగు కవి గుర్రం జాషువా కుమార్తె.

హేమలతా లవణం
హేమలతా లవణం
జననంహేమలతా లవణం
ఫిబ్రవరి 26, 1932
గుంటూరు జిల్లా వినుకొండ
మరణంమార్చి 20, 2008
మరణ కారణంఅండాశయపు క్యాన్సర్‌ వ్యాధి
ఇతర పేర్లుహేమలతా లవణం
ప్రసిద్ధిసామజిక సేవికురాలు
భార్య / భర్తగోపరాజు లవణం
తండ్రిగుర్రం జాషువా
తల్లిమరియమ్మ

జీవిత విశేషాలు మార్చు

హేమలత గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా , మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26 న ఆఖరి సంతానంగా జన్మించింది. ఈమె ప్రాథమిక, మాధ్యమిక విద్య గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బి.ఏ చదివి బంగారు పతకాన్ని పొందింది. నాస్తికత్వం, ప్రజాస్వామ్య విలువలు, గాంధేయ వాదం - ఈ మూడు విలువలకు కట్టుబడిన గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమె వివాహం జరిగింది. వర్ణభేదాలను అతిక్రమించి జరిగిన ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. వినోబా భావే భూదాన యాత్రలో ఆయనతోపాటు చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు ఆమె కృషిచేసింది. 1961లో వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి సమత, మమతల కోసం పాటుపడింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో "ఆర్థిక సమతా మండలి " అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడినవారిలో, నిమ్నకులాల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981లో కావలిలో 'నవవికాస్' అనే సంస్థను స్థాపించి దాని ద్వారా అణగారినవర్గాలను ఆదుకొన్నది.

జోగినులను, వారి పిల్లలను ఆదుకోవడానికి 'సంస్కార్' చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పరచింది. అంధవిశ్వాసాలు 'బాణామతి' మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వైనాన్ని గుర్తించి వాటిని ఆరోగ్య సమస్యగా గుర్తింపచేయడానికి కృషిసల్పింది. రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమేకాక ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించింది. జోగినులకు వివాహాలు జరిపించింది. సంస్కార్ సంస్థను స్థాపించి, నిజామాబాదు జిల్లాలో జోగినీ వ్యవస్థ నిర్మూలనకు ఈమె చేసిన కృషి ఫలితంగా ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలణ చట్టాన్ని తెచ్చింది. వర్ణాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా, గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ (సి.ఎ.ఆర్) పేరుతో దొంగలు, తాగుబోతులు, వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది.

జాషువా కావ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న దృఢసంకల్పంతో వాటన్నిట్నీ ముద్రించింది. హేమలతాలవణం స్వయంగా పలు ప్రక్రియల్లో రచనలు చేసింది. అహింసా మూర్తులు - అమర గాథలు, నేరస్థుల సంస్కరణం, జీవన ప్రభాతం, జాషువా కలం చెప్పిన కథ, మా నాన్నగారు, జీవనసాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, తాయెత్తు - గమ్మత్తు, మృత్యోర్మా అమృతంగమయ వంటి పలురచనలు చేసిన ఆమె 'జీవన ప్రభాతం' నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం పొందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆత్మగౌరవ పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచి దేశస్నేహి పురస్కారం, అమెరికా నుంచి ఎథీయిస్ట్ ఎచీవ్‌మెంట్ అవార్డు, 2003 సంవత్సరానికి రెడ్ అండ్ వైట్ బ్రేవరి అవార్డు, సావిత్రి పూలే అవార్డు వంటివి ఎన్నో పొందింది. ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాల సిండికేట్ మెంబరుగా పనిచేసింది. స్టూవర్టుపురం దొంగల పునరావాసం - సంస్కరణ[1], జోగినీ దురాచారంపై హేమలతా లవణం విశేషంగా కృషి చేసింది. 1977 దివిసీమ ఉప్పెనలో బాధితులకు పునరావాస సేవలందించింది. 1979లో ప్రకాశం, నెల్లూరు, 1996 తూర్పుగోదావరి జిల్లా తుపాను విపత్తు సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది.ఆమె సంఘసేవికగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌, తానా ఎచ్చీవ్‌మెంట్‌, వరల్డ్‌ ఎచ్చీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్నది.[2] మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, చంద్రబాబు నుంచి తెలుగు ఆత్మగౌరవ అవార్డులు తీసుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి నుంచి ఉగాది పురస్కారాన్ని, అంబేద్కర్‌ శతజయంతి సందర్భంగా భీమరత్న అవార్డును పొందిన ఏకైక మహిళ హేమలత. గుఱ్ఱం జాషువా ఫౌండేషన్‌ స్థాపించి దేశంలో తొమ్మిది మంది కవులకు పురస్కారాలు అందజేసింది. అండాశయపు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని నాస్తిక కేంద్రంలో మార్చి 20, 2008 న కన్నుమూసింది.[3]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-07. Retrieved 2009-10-18.
  2. http://www.atheistcentre.in/HemalataLavanampassedaway.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-24. Retrieved 2010-08-08.

ఇతర లింకులు మార్చు