హోల్గా (ఆంగ్లం: Holga) ఒక మీడియం ఫార్మాట్ 120 ఫిల్మ్ కెమెరా. హాంగ్ కాంగ్లో ఉత్పత్తి చేయబడే ఈ కెమెరా ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళకు పేరొందినది.

హోల్గా
హోల్గా 120 GCFN
ఉత్పాదకుడుపలు సంస్థలు
రకంపెట్టె కెమెరా
సెన్సార్ రకంఫిలిం
సెన్సార్ పరిమాణం56 ఎంఎం × 56 ఎంఎం
రికార్డింగ్ యానకం120 ఫిల్మ్, 135 ఫిల్మ్
షట్టర్ వడి1/100 లేదా 1/125
ఎఫ్ - సంఖ్యలుf/8.0, f/11.0

చవకగబారు నిర్మాణం, అతిసాధారణ కటకం ఉపయోగించటం వలన, ఈ కెమెరాతో తీయబడే ఛాయాచిత్రాలు, మూలలలో చీకటిమయమవటం, అస్పష్టంగా రావటం, కాంతి తప్పటం, ఇతర వక్రీకరణలకు గురికావటం జరుగుతుంది. ఈ కెమెరా యొక్క అవలక్షణాలు కొంత మంది ఫోటోగ్రఫర్లలో ఆసక్తిని నెలకొల్పాయి. దీనితో తీయబడ్డ కొన్ని ఛాయాచిత్రాలు ఈ అవలక్షణాల వలన ఏర్పడే కళాత్మక విలువలకు పలు ఫోటోగ్రఫీ పోటీలలలో బహుమానాలు గెలుచుకొన్నాయి.

చరిత్ర మార్చు

హోల్గా కెమెరా 1982 లో టీ. ఎం. లీ చే రూపొందించబడింది.[1] చైనాకు బయట మొట్టమొదటిసారిగా హాంగ్ కాంగ్లో 1982 లో ఇది కనబడింది. ఆ సమయంలో చైనాలో అత్యంత విరివిగా వాడబడేది బ్లాక్-అండ్-వైట్ 120 ఫిల్మ్. హోల్గా కెమెరా యొక్క ప్రధాన ఉద్దేశం దిగువ మధ్య తరగతి ఉద్యోగులు అధిక జనులకు పండుగ-పబ్బాలకు సకుటుంబసపరివార ఛాయాచిత్రాలను అతి చవకగా అందుబాటులోకి తేవటం. మొదట దీని పేరు ho gwong (చాలా ప్రకాశవంతమైంది అని అర్థం). కానీ తర్వాత ఐరోపావాసులు పలకటానికి సులభంగా దీనిని HOLGA గా మార్చారు. ఐతే విదేశాలనుండి దిగుమతి అవుతున్న పలు కెమెరాలు, ఫిలింల వలన చైనాలో 135 ఫిల్మ్కు ఆదరణ శరవేగంగా పెరిగింది. దీనితో హోల్గా వినియోగం తగ్గినది. కొత్త విపణులను వెదుక్కొంటూ హోల్గా చైనా సరిహద్దులను దాటినది.

విదేశీ విపణులకు హోల్గా పరిచయమైన కొన్ని సంవత్సరాలకే కొందరు ఛాయాచిత్రకారులు ప్రకృతి దృశ్యాలను, నిశ్చలన చిత్రాలను, రూప చిత్రాలను ప్రత్యేకించి వీధి ఛాయచిత్రకళను అవాస్తవికంగా, ఇంప్రెషనిజం కళాశైలిని స్ఫురింపజేసేలా చిత్రీకరించటం మొదలుపెట్టారు. కెమెరా సాంకేతికతలో నానాటికీ పెరిగిపోతున్న ఖరీదైన ఆధునిక సాంకేతికతో పోలిస్తే, హోల్గా కెమెరాలో కచ్చితత్వము లేకపోవటం, ఛాయాచిత్రాలు కాంతి తప్పటం, ఇటువంటి ఇతర చవక లక్షణాల వలన ఛాయాచిత్రకారుడు ఆవిష్కరణపై, సృజనాత్మకతలపై దృష్టి పెట్టవలసి రావటాన్ని ఈ అనుభవపూర్వక వాడుకరులు కొనియాడారు. ఈ అంశాలలో హోల్గా డయానా కెమెరాకు, అదివరకూ ఉపయోగంలో ఉన్న ఇతర టాయ్ కెమెరాలకు వారసురాలైనది.

ఇటీవలి కాలంలో టాయ్ కెమెరాలపై పెరుగుతున్న ఆదరణ వలన, ఆధునిక కెమెరాలలో సంక్లిష్టతల వలన హోల్గా కెమెరాకు చైనా బయట ఆదరణ విపరీతంగా పెరిగింది.

కటకము, సూక్ష్మరంధ్రములు మార్చు

చాలా హోల్గా కెమెరాలు 60 మి.మీ ల నాభ్యంతరం గల ప్లాస్టిక్ కటకం కలిగి ఉంటాయి. ఇతర ప్లాస్టిక్ కటకాల వలె హోల్గా కటకం కూడా మృదు దృష్టి, వర్ణపు ఉల్లంఘనం వంటి వాటిని ప్రదర్శిస్తుంది. ఈ ప్లాస్టిక్ కటకాలను జపాన్, చైనాలకు చెందిన వివిధ సంస్థలు రూపొందిస్తాయి. కొన్ని మోడళ్ళలో మాత్రం గాజు కటకం వాడబడుతుంది.

హోల్గా కెమెరాకు రెండు రకాల సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటి ఎఫ్ సంఖ్యలపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.

  • సన్నీ (f/11, f/19, f/20),
  • క్లౌడీ (f/8, f/13)

ఫిలిం ఫార్మాట్ మార్చు

ప్రాథమికంగా హోల్గా 120 ఫిల్ంను వాడిననూ, 35 ఎంఎం ఫిల్ంను కూడా వాడేట్లుగా మలచుకొనవచ్చును. 120 ఫిల్ంలో 6 X 4.5 ఫార్మాట్ అయితే 16 షాట్లను, 6 X 6 ఫార్మాట్ అయితే 12 షాట్లను తీయవచ్చును. అయితే 6 X 6 ఫార్మాట్ లో ఫిలిం అతిపెద్దగా బహిర్గతం అవుతుంది కావున దీనిపై విగ్నెటింగ్ (మూలలు చీకటిమయం అయ్యే) ప్రక్రియ ఎక్కువ ప్రభావవంతంగా కనబడుతుంది.

హోల్గా కెమెరాతో తీసిన కొన్ని ఛాయాచిత్రాలు మార్చు

హోల్గా వారం మార్చు

ప్రతి అక్టోబరులో మొదటి వారం, హోల్గా వారంగా జరుపబడుతుంది.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. లోమోగ్రఫీ వెబ్ సైటు పై హోల్గా చరిత్ర
  2. హోల్గా వీక్ వెబ్ సైటు
"https://te.wikipedia.org/w/index.php?title=హోల్గా&oldid=3850356" నుండి వెలికితీశారు