కలివికోడి
కలివికోడి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
ఆర్. బైటార్క్వేటస్
Binomial name
రైనాప్టిలస్ బైటార్క్వేటస్
కలివికోడి స్టాంపు

అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జీవుల జాబితా లోని పక్షి, కలివికోడి (Kalivikodi). 1848లో జెర్డాన్ ఈ పక్షిని కనుగొన్నాడు. ఇంగ్లీషులో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ అని అంటారు. దీని శాస్త్రీయ నామం - రినోప్టిలస్ బైటర్క్వేటస్ (Rhinoptilus bitorquatus). భారత ప్రభుత్వపు "అటవీ జంతు సంరక్షణ చట్టం 1972" కింద ఈ పక్షి సంరక్షించబడింది.

పేరు వెనక చరిత్ర మార్చు

కలివి పొదలు ముడ్లతో వుండే చిన్న చిన్న గుల్మాలు, వాటి మధ్యలో ఈ కోడి లాంటి పక్షి ఎక్కువగా కనిపిస్తుంది. పరిగెత్తడమే కానీ ఎగరటం సరిగా రాని ఈ కోడికి పొదల్లో తప్ప, విడిగా రక్షణ వుండదు. అందుకే కలివి పొదల్లో ఎక్కువగా చూడటంతో కలివి కోడి అనిపిలిచారట. దీనివల్ల ఐతన్నలాంటి వారికి ఉద్యోగం వచ్చింది. ప్రకటనల్లో దీన్ని పట్టుకుంటే నజరానాలు అనటంతో కలివిని కలిమి కోడి చేసుకుని పిలుచుకున్నారు

గోదావరి, పెన్నా నదీలోయలలో కనిపించే పక్షి ఇది. దీన్ని స్థానికంగా జత పట్టీల చిటానా అనికూడా పిలుస్తారు. 1900 నుంచి కనుమరుగైన ఈ నిశాచర (Nocturnal) పక్షి, 1986 జనవరి తొలి వారంలో మళ్ళీ కనిపించింది. దురదృష్టవశాత్తు ఈ పక్షి మృతి చెందిన కారణంగా బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ వారు తొలిసారిగా ఈ పక్షిని మ్యూజియంలో ఉంచారు. అప్పటినుండి, ఈ పక్షి వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో కనిపిస్తూనే ఉంది. ఈ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది.

తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో భాగంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జలాశయం నుండి తవ్వుతున్న ఉపకాలువలు, కలివికోడి నివాసప్రాంతాల గుండా పోతుండడంతో ఈ పక్షి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.

ఎవరు,ఎప్పుడు కనుక్కున్నారు? మార్చు

 
భూమిపై కలివికోడి జాతి అంతరించిపోయిందంటూ Bronx జంతుప్రదర్శనశాల వద్ద ఏర్పాటు చేసి కలివికోడి సమాధిచిహ్నం
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలలో కలివికోడి విస్తరణను సూచించే పటం
  • 1848 లో మొదటిసారి బ్రిటిష్ సైనిక వైద్యాధికారి థామస్ జి జెర్ధాన్ కలివికోడిని గుర్తించాడు. తరువాత 50 సంవత్సరాలు అడపా తడపా కనబడుతూ వచ్చింది. 1900లో హోవర్డ్ క్యాంబెల్ కంటపడింది. కాని మరి 85 సంవత్సరాలు తెరమరుగయిపోయింది. విలుప్తమయిందనే భావించారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి, అమెరికా స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ వారు వచ్చి ఈ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో పక్షి శాస్త్రవేత్తలు (ఆర్నితాలజిస్టులు) ఈ పక్షిని అంతరించిపోయిన జాబితాలోనే వేశారు.
  • జెర్డాన్ చేసిన ఈ విలువైన పనికి గుర్తింపుగా ఆయన పేరు మీదనే కలివికోడికి జెర్డాన్స్ కోర్సర్ అనే పేరు పెడుతున్నట్లు 1988 లో ప్రకటించారు.
  • 1932లో హైదరాబాదు ఆర్నిథాలజీ సర్వే సంస్థద్వారా ప్రపంచ ప్రఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ ఈ పక్షిని కనుక్కోవడం కోసం పరిశోధన చేసాడు. ఈ పక్షి నమూనా బొమ్మలను ఫారెస్టు అధికారులకే కాకుండా, అడవుల్లో వేటకు, కలపకోసం వెళ్లే వాళ్ళకు కూడా అందేలా చేసాడు. తను స్వయంగా చాలా చోట్ల పర్యటించి ఈ వివరాలను అర్ధం అయ్యేలా తెలియజేసే వాడు.
  • బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ (Bombay Natural History Society - BNHS) ఆధ్వర్యంలో భరత్ భూషణ్ అనే శాస్త్రవేత్త కూడా కలివి కోడి ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసాడు.
  • 1986 జనవరి 05 న కడపజిల్లా రెడ్డిపల్లి ‘ఐతన్న’ అనే సాధారణ గొర్రెల కాపరి ఈ పక్షుల జంటను గమనించానని సమాచారం ఇచ్చాడు. అందులో ఒక పక్షిని బంధించి తన ఇంటికి తీసుకుని వచ్చాడు. పోస్టర్లలో వున్న పక్షితో పూర్తి పోలికలు వున్నాయని గమనించాడు. ఈ విషయాన్ని భరత్ భూషణ్ నిర్ధారించుకుని బాంబేలోని సలీం అలీకి కూడా సమాచారమిచ్చాడు.
  • జనవరి 9 నాటికి సలీం అలీ అక్కడికి చేరుకున్నాడు. కానీ ఆ పక్షి నీరూ, ఆహారం ఎంతకీ ముట్టక ఆయన చేరుకునే సమయానికే ప్రాణాలు విడిచింది. ఆ పక్షిదేహాన్ని ఇప్పటికీ బాంబే మ్యూజియంలో భద్రపరచి వుంచారు.

కలివికోడి కోసం అభయారణ్యం మార్చు

  • కలివికోడి ఆవాస ప్రాంతంగా 464.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించారు. దాన్ని శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంగా ఏర్పాటు చేసారు. మరో 1,037 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో పెనుశిల నరశింహ వన్యప్రాణి అభయారణ్యం కూడా ఏర్పాటు చేసారు. ఈ పిట్టతో పాటు లెపార్డ్, సాంభర్ లేడి, చుక్కల హరిణం, బ్లాక్ బక్ (కృష్ణ హరిణం) వంటివి ఇక్కడ రక్షణ పొందుతున్నాయి.

వీటి పాదముద్రలు వగైరా ఆధారాల ద్వారా ఇప్పుడు వీటి సంఖ్య 25 నుంచి 200 మధ్య వుండొచ్చని అంచనాలు చెపుతున్నాయి.

ఆహారం విహారం మార్చు

వీటి పెరుగుదలకు అనువైనవి ముళ్ళ పొదలు గల అటవీ ప్రాంతాలు. ముళ్ళనుకలిగి, చిన్నగా వుండే కలివి పొదల్లో ఈ పక్షి ఎక్కువగా తిరుగుతుంది. ఈ పక్షి ప్రయాణం దాదాపు కాలినడకనే చేస్తుంది. అందుకే ముళ్ళులేని ప్రాంతాల్లో వీటికి రక్షణ కూడా కష్టం. చెద పురుగులే దీనికి ప్రధాన ఆహారం. చీమలు, ఉసుళ్ళ వంటి చిన్న చిన్న పురుగులను ఎన్నింటిని తిన్నా చెదలను ఎక్కువగా ఇష్టపడుతుంది. కలివిపొదల కొమ్మలు, రెమ్మలు నేలకు తాకుతూ ఉండడంతో వీటిని చెదలు ఎక్కువగా ఆశ్రయిస్తుంటాయి. పైన మట్టి పూత వేసి లోన ఎంత దాక్కున్నా అవి కలివికోడి దృష్టి నుంచి తప్పించుకోలేవు. రాత్రి మాత్రమే ఇది ఆహారం తీసుకొని పగలంతా విశ్రాంతిగా ఉంటుంది. కలివికోడి రెట్టను గుర్తించి పలుమార్లు పరిశోధకులు చేసిన పరీక్షల్లో ఈ విషయం బైటపడింది. కలివికోడి ‘విసర్జన’లో చెదలకు సంబంధించిన పెంకుల్లాంటి జీర్ణం కాని నోటి భాగాలు (మాండిబుల్స్‌) కనిపించాయి.

తెలుగుగంగ ప్రాజెక్టు నే దారిమళ్ళించిన కలివికోడి మార్చు

పిడికెడు దాటని ఈ పిట్ట వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ ప్రాజెక్టును దారి మళ్ళించింది. తెలుగుగంగ కాలువ దారి మళ్లించుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. తన ఆవాసంలో తిప్పిన కాల్వను మళ్లీ పూడ్చి వేసేదాకా వదలలేదు. అందుకు బాధ్యులైన వారిని కోర్టుకీడ్చి దోషులుగా నిలబెట్టింది. తెలుగుగంగ పథకం కింద శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరు దిగువన తెలుగుగంగ కుడి ప్రధాన కాల్వ 30 కిమీ నుంచి 40 కిమీ వరకు కలివికోడి ఆవాసమైన అభయారణ్యంలో తవ్వకాలు జరిపేందుకు తెలుగుగంగ అధికారులు సిద్ధమయ్యారు.

ప్రొక్లైన్లతో 400 మీటర్ల కాలువ తవ్వకం పూర్తియన తర్వాత. అభయారణ్యంలోకి అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించి తవ్వకాలు జరిపినట్లు గుర్తించిన కడప అటవీశాఖాధికారులు 2005 నవంబరు 23న ఈ విషయమై కేసు నమోదు చేశారు. ఐవిఆర్‌సిఎల్‌ కంపెనీకి చెందిన ప్రొక్లైన్‌, జీపు సీజ్‌ చేశారు. సెక్షన్‌ 27-1, 29 ఐపిసి 141,149, వన్యప్రాణి‌ ప్రొటెక్షన్‌ యాక్టు 1972ల కింద గంగ పనులు చేస్తున్న ఐవి ఆర్‌సి ఎల్‌ కంపెనీ అధికారులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. అరుదైన కలివికోడి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చింది.

2006 మార్చిలో సుప్రీంకోర్టు, సమస్య పరిష్కారం కోసం సాధికారిక కమిటిని వేసింది. బిఎన్‌హెచ్‌ఎస్‌ డైరెక్టర్‌, ప్రభుత్వ కార్యదర్శి, నీటిపారుదల చీఫ్‌ ఇంజనీరులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పరచింది. దానితో పాటు ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుతం ఉన్న కాలువ తవ్వకం అలైన్‌మెంట్‌ను మార్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం తెలుగుగంగ కాలువ దారి మళ్ళించింది. అంతేకాకుండా దీని ఫోటో తీసినందుకు ఆనందమోహన్ అనే ఉన్నత అటవీశాఖాధికారికి కేంద్ర ప్రభుత్వం నుండి అభినందనలు కూడా అందాయి. ఇక చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అడవిలో 4, 5 సార్లు దానిని చూశారు. దాని సంతతి క్రమంగా అధికమవుతోందని తెలుస్తోంది.

నీటి పారుదల శాఖ వారు లంక మల్లేశ్వర అభయారణ్యం గుండా కాలువ తవ్వటానికి అనుమతించినప్పుడు గుత్తేదారు భారీగా యంత్ర సామగ్రిని అడవికి తరలించిన సమయంలో బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన భరత్ భూషణ్ వాటిని కనుగొని సకాలంలో అటవీ శాఖ అధికారులను హెచ్చరించటంతో వారు ఆ సామగ్రిని స్వాధీనం చేసుకొని కాంట్రాక్టర్ పై కేసు పెట్టడం జరిగింది. దరిమిలా BNHS దైరెక్తరు అసద్ రహ్మాని, W.W.F. బర్డ్స వాచర్సు సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి కాలువ దారి మళ్ళింపు యొక్క ఆవశ్యకత గురించి చెప్పి వారిని ఒప్పించటంలో కృతకృత్యులయ్యారు.

కలివికోడి కూత మార్చు

కలివికోడి కూతను రికార్డు చేసేందుకు వాడిన ఎలక్ట్రానిక్ ప్లేయర్
కలివికోడి కూత

బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన సీనియర్ పరిశోధకులు ప్రకాశన్ జగన్నాధన్ ఈ పక్షి అరుపును కూడా రికార్డు చేసారు. ‘‘ ట్విక్-టూ ట్విక్-టూ ’’ అంటూ అరుస్తుంది.కోయిలను మించి పోయి అరగంటైనా నిరంతరంగా కూత పెట్టే ఈ పక్షి నవంబరు నుంచి మార్చి మధ్య ఎక్కువగా కూత పెడుతూ ఉంటుంది. ఈ కూతను చిన్న బాక్సుల్లో రీ రికార్డు చేసి ప్రజలకు వినిపిస్తూ ఈ పక్షి ఆవాసం గుర్తించేందుకు ప్రకటనలు, బోర్డుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. పక్కనున్న చిత్రంలోని ప్లే బటన్ ప్రెస్ చేయటం ద్వారా మీరు పక్షికూతను వినవచ్చు

కెమెరా ట్రాప్ మార్చు

తీతువుపిట్ట, పూరేలు, కంజులను పోలి ఉండే ఈ కలివికోడి కాళ్ల వేళ్లను కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. తొలిసారి ఇండియాలో ఈ కెమెరాట్రాప్‌ను కలివికోడి కోసం కడప జిల్లాలో ఉపయోగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలివికోడి ఆచూకీ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. అట్లూరు మండలంలోని అట్లూరు కొండూరు, ఎస్.వెంకటాపురం, గుజ్జలవారిపల్లె, తంబళ్లగొంది, ఎర్రబల్లి, బద్వేలు మండలంలోని రాజుపాలెం, తిప్పనపల్లె తదితర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి కలివికోడి సంరక్షణ అభయారణ్యంలో కలిపింది. అందుకోసం రైతుల భూములకు పరిహారంగా రూ.28 కోట్లు చెల్లించారు. ఇతర అన్ని అవసరాలకు మరో రూ.22 కోట్లకు పైగా ఖర్చుచేశారు. సిద్దవటం-బద్వేలు రోడ్డును ఇప్పుడు కూడా అభయారణ్యం పరిధిలో ఇబ్బంది కలుగుతుందని రాత్రిపూట వాహనాలను నిలిపివేస్తున్నారు. అనేకరకాల చిత్ర విచిత్రమైన జంతువులు అడవిలో అమర్చిన కెమెరాల్లో కనిపిస్తున్నా...కలివికోడి మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికి స్థానిక అధికారులు వెతుకులాట కొనసాగిస్తునే ఉన్నారు. ఆరుగురు ప్రత్యేక ప్రొటెక్షన్ సిబ్బందితోపాటు సుమారు 144 కెమెరాలను త్వరలోనే అమర్చేందుకు అటవీశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నెలకు కెమెరా బ్యాటరీలకు, సిబ్బంది జీతాలకుగాను దాదాపు రూ.45 వేలు ఖర్చు వస్తోంది. లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉన్న వేలాది హెక్టార్లలో ఈ కెమెరాలను అమర్చనున్నారు.

ఇన్‌ఫ్రారెడ్‌ ఫోకస్‌ లైన్‌కు అంతరాయం కలగగానే ఫ్లాష్‌ వెలిగే ఈ కెమెరాలను ఇక్కడ ఎనిమిదింటిని ఏర్పాటు చేశారు. కలివికోడి తిరుగాడే ఆవాసాలను గుర్తించి మెత్తటి ఇసుక మట్టిని పట్టిలుగా నేలపై పోసి కాలి వేళ్లను గమనిస్తున్నారు. ట్రాకింగ్‌ స్ట్రిప్‌లపై పడ్డ పాదం గుర్తులను ఒకే స్థలంలో నెలరోజులు పరిశీలన చేసి ట్రైల్‌ మాస్టర్‌ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.

చిత్రమాలిక మార్చు

వార్తలలో కలివికోడి మార్చు

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలంలోని కన్నంపల్లె గ్రామ సమీపంలో 15-04-2016 శుక్రవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అరుదైన కలివికోడి కనిపించింది. రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షులు అంబకపల్లె నారాయణ స్వామి, రాజారెడ్డి కాలనీకి చెందిన రాజులుతోట దగ్గరకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో కలివికోడిని పట్టుకున్నారు. 16-04-2016 శనివారం అటవీ శాఖ అధికారి రజనీ కుమార్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుదైన కలివికోడి ఆకారంలో పక్షి ఉందన్నారు. ఏ పక్షని నిర్ధారించడానికి జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్తామన్నారు. 1948-1986 సంవత్సరంలో ఈ కలివికోడి కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లోని అట్లూరు మండలంలో కనిపించినట్లు అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. .2008లో బద్వేలు అటవీ ప్రాంతంలో కనిపించిందన్నారు. ఈ పక్షి జాతి అంతరించి పోకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ28 కోట్ల ఖర్చు చేసిందని చెప్పారు. ఆప్రాంతంలో భూములు కోనుగోలు చేసి 177 సిసి కెమెరాలు అమర్చిందన్నారు. ప్రపంచంలోనే అరుదైన పక్షిగా కలివికోడికి పేరుందని పేర్కొన్నారు. అరుదైన పక్షిని కలివికోడా లేక ఇతర జాతులకు చేందిన పక్షా అని గుర్తించాలని అధికారులు తెలియజేశామని చెప్పారు.

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు మార్చు

  1. BirdLife International (2013). "Rhinoptilus bitorquatus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.