అక్కిరాజు వాసుదేవరావు

అక్కిరాజు వాసుదేవరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వాసుదేవరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహా రావుల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు.[1]

అక్కిరాజు వాసుదేవరావు

పదవీ కాలం
1978-1983
తరువాత వి.లక్ష్మీనారాయణ రాజు
నియోజకవర్గం కోదాడ శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
1962-1972
నియోజకవర్గం హుజూర్‌నగర్‌ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1926-07-10) 1926 జూలై 10 (వయసు 97)
వెంకట్రాపపురం, మేళ్లచెర్వు, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
మతం భారతీయుడు

జననం, విద్య మార్చు

వాసుదేవరావు 1926, జూలై 10న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేళ్లచెర్వు శివారు వెంకట్రాపపురం గ్రామంలోని భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లాలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదవి అంగ్లంలో మంచి పట్టు సాధించాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాసుదేవరావు కీలకనేతగా ఎదిగాడు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుండి పోటిచేసి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి దొడ్డా నర్సయ్య పై 2,833 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశాడు. హైద్రాబాద్‌లో అన్నపూర్ణ, రామకృష్ణ స్టూడియోలకు అనుమతులిచ్చాడు.1967లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుండి రెండోసారి పోటిచేసి దొడ్డ నర్సయ్యపై 2,888 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు.[3] 1972లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కీసర జితేందర్‌రెడ్డి చేతిలో 14,308 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో చేరాడు.

1977లో కోదాడ శాసనసభ నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ఐ అభ్యర్థి కె. లక్ష్మణ్‌రాజుపై 3,695 ఓట్ల మజారిటీతో గెలుపొందాడు.[4] ఆ సమయంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లాడు. 1983 తరువాత స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అయుతే, కాంగ్రెస్‌పార్టీ నుండి టికెట్‌ ఇచ్చినప్పటికీ దానిని తన శిష్యుడైన చింతా చంద్రారెడ్డికి ఇప్పించాడు. ఆ సమయంలో కోదాడ ఎన్నికల బహిరంగ సభకు వచ్చిన మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ బహిరంగ వేదిక పైనుంచే వాసుదేవరావు నిర్ణయాన్ని అభినందించింది. తరువాత ఆప్కాబ్‌ చైర్మన్, ఖాధీ భాగ్యనగర సమితి చైర్మన్‌ పనిచేశాడు.

ఆంగ్లంలో మంచి పట్టున్న వాసుదేవరావుకు జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినపుడు వారి ప్రసంగాలను తర్జుమా చేసేవాడు. 

సేవలు మార్చు

కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్ట్స్అండ్‌ సైన్స్‌ విభాగంతో డిగ్రీ కళాశాలను ప్రారంభించి, తన బంధువులైన కొండపల్లి రాఘవమ్మ రంగారవు నుంచి 60ఎకరాల భూమిని విరాళంగా సేకరించి 1970లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాడు. నియోజకవర్గ పరిధిలో వంద గ్రామాలకు ఒకేసారి విద్యుత్‌ సౌకర్యం కల్పించాడు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ద్వారా హుజూర్‌నగర్, కోదాడ రెండు నియోజక వర్గాలకు సంబంధించిన అనేక గ్రామాలను కలుపుతూ రోడ్లు వేయించాడు, వైద్య సదుపాయాలు కల్పించాడు. పీవీ నర్సింహారావు మంత్రి వర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాలకు సాగర్‌నీటిని తీసుకొచ్చేందుకు చేసిన కృషిచేశాడు.

మూలాలు మార్చు

  1. ఆంధ్రభూమి, తెలంగాణ (13 November 2018). "మంత్రుల నగరి.. హుజూర్‌నగర్". www.andhrabhoomi.net. Archived from the original on 12 జూలై 2021. Retrieved 24 September 2021.
  2. సాక్షి, తెలంగాణ (15 November 2018). "రాజకీయాలకే వన్నెతెచ్చిన అక్కిరాజు వాసుదేవరావు". Sakshi. Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  3. "Telangana elections: Can TRS debutant take on the mighty Congress captain in his stronghold?". The New Indian Express. Retrieved 2021-09-24.
  4. "State Elections 2004 - Partywise Comparision for 285-Kodad Constituency of ANDHRA PRADESH". affidavitarchive.nic.in. Retrieved 2021-09-24.