అబ్బూరి ఛాయాదేవి
అబ్బూరి ఛాయాదేవి (అక్టోబరు 13, 1933 - జూన్ 28, 2019) తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత. ఈమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత.
అబ్బూరి ఛాయాదేవి | |
---|---|
జననం | అబ్బూరి ఛాయాదేవి 1933 అక్టోబరు 13 రాజమహేంద్రవరం |
మరణం | 2019 జూన్ 28[1] | (వయసు 85)
వృత్తి | న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | అబ్బూరి వరదరాజేశ్వరరావు |
తండ్రి | మద్దాలి వెంకట చలం |
తల్లి | వెంకట రమణమ్మ |
జీవిత విశేషాలు
మార్చుఛాయాదేవి రాజమహేంద్రవరంలో1933 అక్టోబరు 13 లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.
ఛాయాదేవి వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది.
మూలాలు
మార్చు- కథాకిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
- ↑ http://www.prajasakti.com/Article/TaajaVarthalu/2150931 (28 June 2019
బయటి లింకులు
మార్చు- ఛాయాదేవి రచనలు : వ్యాసచిత్రాలు, వరదస్మృతి, బొమ్మలు చేయడం, TheJourney[permanent dead link]