అళహ సింగరాచార్యులు

తెలంగాణకు చెందిన తెలుగు-సంస్కృత భాషా పండితుడు, విశ్రాంత అధ్యాపకుడు


డాక్టర్ కండ్లకుంట అళహ సింగరాచార్యులు (1930, జూన్ 8 - 2023, ఆగస్టు 13) తెలంగాణకు చెందిన తెలుగు-సంస్కృత భాషా పండితుడు, విశ్రాంత అధ్యాపకుడు.[1]

అళహ సింగరాచార్యులు
అళహ సింగరాచార్యులు
జననంసాలగ్రామ నరసింహులు
1930, జూన్ 8
భక్తలాపురం, పెన్‌పహాడ్‌ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
మరణం2023 ఆగస్టు 13(2023-08-13) (వయసు 93)
హైదరాబాద్, తెలంగాణ
విద్యఎం.ఏ., బీఈడీ, పి.హెచ్ డి.
వృత్తివిశ్రాంత అధ్యాపకుడు
ప్రసిద్ధితెలుగు-సంస్కృత భాషా పండితుడు
భార్య / భర్తరంగనాయకమ్మ
పిల్లలుఆరుగురు పిల్లలు (కేజేఎన్‌ చారి, కె. శ్రీనివాస్‌, రామ్మోహన్‌, వేణుగోపాల్‌, మాధవి, ఉదయ)
తండ్రిజ్వాలానరసింహాచార్యులు

జననం - విద్యాభ్యాసం

మార్చు

సింగరాచార్యులు 1930, జూన్ 8న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్‌ మండలం, భక్తలాపురం గ్రామంలోని శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి సాలగ్రామ నరసింహులు అని పేరు పెట్టినా, అళహ సింగరాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చి, రికార్డుల్లోనూ నమోదై, స్థిరపడిపోయింది. తండ్రి పేరు జ్వాలానరసింహాచార్యులు.

వీధి బడిలో తెలుగులో పెద్దబాలశిక్ష చదువుకొని, లెక్కలు, ఉర్దూ అభ్యసించాడు. ఆ తరువాత యాదగిరిగుట్ట దేవస్థాన సంస్కృత పాఠశాలలోనూ, హైదరాబాదు నగరంలోని సీతారాంబాగ్‌ వేదాంత వర్థిని సంస్కృత కళాశాలలో మహాభాష్యం వరకు సంస్కృతాధ్యయనం చేశాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి విద్యా ప్రవీణ, 1955లో ఉస్మానియా విశ్వవిద్యాయలం నుండి బీవోఎల్‌ (బాచెలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్) పూర్తిచేశాడు. ఆ రెండు పరీక్షలోనూ సింగరాచార్యులు ఒక్కడే ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో బీఏ ఇంగ్లిష్‌, ఎంఏ తెలుగు, బీఈడీ చదివాడు. 1978లో నలభైఎనిమిదేళ్ళ వయసులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు పి.హెచ్.డీ అభ్యర్థిగా చేరి, ‘ఆంధ్ర మహాభారతంలో కృతద్ధిత ప్రయోగాల విశ్లేషణ సిద్ధాంత గ్రంథాలు’ అనే అంశంపై పరిశోధన చేసి, 1985లో పీహెచ్‌డీ పట్టా పొందాడు.[2]

వృత్తిజీవితం

మార్చు

1968లో బందరు హిందూ కాళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరాడు. 13 ఏళ్ళపాటు సికింద్రాబాద్‌లోని ఆదయ్య మెమోరియల్‌ హైస్కూల్‌, ఖమ్మం జిల్లా వేంసూరు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అనంతరం మచిలీపట్నం, ఏలూరు, కొడంగల్‌ కళాశాలల్లో ఉపన్యాసకుడిగా, ప్రిన్సిపల్‌గా కొంతకాలం పనిచేశాడు. 1973-1990 మధ్య ఆంధ్ర సారస్వత పరిషత్‌ ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా, 1998 వరకు సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలోని తెలుగు పండితుల శిక్షణ కళాశాలకు ప్రిన్సిపల్‌గా వ్యవహరించాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

సింగరాచార్యులుకు 18 ఏళ్ళ వయసులో సముద్రాల వెంకట రామానుజాచార్యులు కుమార్తె 11 ఏళ్ళ రంగనాయకమ్మతో వివాహం జరిగింది. వారికి ఆరుగురు పిల్లలు (కేజేఎన్‌ చారి, కె. శ్రీనివాస్‌, రామ్మోహన్‌, వేణుగోపాల్‌, మాధవి, ఉదయ) ఉన్నారు.

రచనారంగం

మార్చు

విద్యార్థి దశలోనే అమరభారతి లిఖిత పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. శారద తదితర పత్రికల్లో సంస్కృతంపై వ్యాసాలు కూడా రాశాడు. 15 పైగా పుస్తకాలు రాసిన సింగరాచార్యులు తన జీవితానుభవాలను ‘అధ్యాపకుడి ఆత్మకథ’ పేరుతో పుస్తకం వెలువరించాడు.[4] ఆకాశవాణిలో చేసిన ప్రసంగాలతో ‘అమరవాణి’ సంస్కృత ప్రసంగ వ్యాసాలు అనే పుస్తకం ప్రచురించాడు. కాసుల పురుషోత్తమ కవి రాసిన ‘ఆంధ్రనాయక’ శతకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాశాడు.

  • రచనలు: ‘సంస్కృత క్రియలు’, ‘సంస్కృత పాఠవల్లరి’ (విశారద పరీక్షలు), ‘శుకనాసోపదేశము’ (ఎంఏ తెలుగు) వంటి పాఠ్య గ్రంథాలు
  • సంస్కృతానువాదాలు: కూర్మ మహా పురాణం, శుక్రనీతి సారము, భాసుని కర్ణాభారం, విదుర నీతి, స్వప్నవాసవ దత్త రూపకం

పురస్కారాలు

మార్చు
  1. ఉత్తమ అధ్యాపకుడు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 1991)
  2. ఉత్తమ సంస్కృత పండితుడు పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2007)

సింగరాచార్యులు అనారోగ్యంతో 2023, ఆగస్టు 13న రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లోని స్వగృహంలో మరణించాడు. సింగరాచార్యులు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించాడు.[5]

మూలాలు

మార్చు
  1. "సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయులు". EENADU. 2023-08-14. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
  2. "అధ్యాపకుడి ఆత్మకథ – పుస్తకం.నెట్". pustakam.net. 2012-09-26. Archived from the original on 2012-10-06. Retrieved 2023-08-14.
  3. ABN (2023-08-14). "Alaha Singaracharulu : అళహ సింగరాచార్యులు కన్నుమూత". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
  4. telugu, NT News (2023-08-14). "సాహితీవేత్త సింగరాచార్యులు కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
  5. telugu, NT News (2023-08-14). "CM KCR | సంస్కృత భాషా పండితులు కండ్ల‌కుంట సింగ‌రాచార్యుల మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం". www.ntnews.com. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.

బయటి లింకులు

మార్చు