ఆపరేషన్ మేఘదూత్

సియాచెన్ హిమానీనదాన్ని ఆక్రమించేందుకు భారత్ చేసిన ఆపరేషను

సియాచెన్ హిమానీనదం ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1984 ఏప్రిల్ 13 న భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్‌ను ఆపరేషన్ మేఘదూత్ అంటారు. ఈ ఆపరేషను, సియాచెన్ ఘర్షణల్లో భాగం. ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధరంగంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ హిమానీనదం ప్రాంతం మొత్తంపై నియంత్రణ చేకూరింది.

ఆపరేషన్ మేఘదూత్
సియాచెన్ ఘర్షణలో భాగము
తేదీ1984 ఏప్రిల్ 13
ప్రదేశంకాశ్మీరు లోని వివాదాస్పద సియాచెన్ హిమానీనదం
ఫలితంభారత్ విజయం
రాజ్యసంబంధమైన
మార్పులు
సియాచెన్ హిమానీనదం, దాని ఉపనదులతో సహా, భారత్ స్వంతం.
ప్రత్యర్థులు
 India Pakistan
సేనాపతులు, నాయకులు
లెఫ్టినెంట్. జన. ప్రేంనాథ్ హూన్
లెఫ్టినెంట్. కల్నల్. డి. కె. ఖన్నా
లెఫ్టినెంట్. జన. జహీద్ ఆలీ అక్బర్
బ్రిగేడియర్ జన. పర్వేజ్ ముషార్రఫ్
బలం
3,000+ [1]3,000[1]
ప్రాణ నష్టం, నష్టాలు
36[2]200+[2]

6,400 మీ పైచిలుకు ఎత్తులో ఉన్న సియాచెన్‌లో భారత పాకిస్తాన్‌లు చెరి 10 పదాతి దళ బెటాలియన్లను మోహరించి ఉన్నాయి. ప్రపంచంలో, 5,000 మీటర్లకు మించిన ఎత్తులో ట్యాంకులు, ఇతర భారీ ఆయుధాలను మోహరించిన ఏకైక సైన్యం భారత సైన్యం.

కారణాలు మార్చు

1949 నాటి కరాచీ ఒడంబడికలో సియాచెన్‌ హిమానీనదం ఎవరికి చెందుతుందో స్పష్టంగా పేర్కొనకపోవడంతో ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది. సిమ్లా ఒడంబడిక ప్రకారం పాకిస్తానీ భూభాగం NJ9842 నుండి ఉత్తరానికి ఉందని భారత్ భావించగా అది ఈశాన్యంగా, కారకోరం కనుమ వైపు సాగిందని పాకిస్తాన్  భావించింది. దీంతో సియాచెన్ హిమానీనదం మాదంటే మాదేనని ఇరుపక్షాలూ భావించాయి. 1970ల్లోను, 1980 తొలినాళ్ళలోనూ పాకిస్తాన్ తమ వైపునుండి అనేక పర్వత యాత్రలను అనుమతించింది. ఈ ప్రాంతం తమకు చెందినదే అని అన్యాపదేశంగా ప్రకటించుకునేందుకు ఈ అనుమతులు ఇచ్చి ఉండవచ్చు. కొన్నిసార్లు ఈ పర్వతారోహక బృందాలకు తోడుగా ఒక పాకిస్తాన్ సైనికాధికారి కూడా వెళ్ళేవాడు. 1978 లో, భారత సైన్యం కూడా తమ వైపు నుండి పర్వతారోహకులను అనుమతించింది. వీటిలో అత్యంత ముఖ్యమైనది కల్నల్ నరేంద్ర కుమార్ కెప్టెన్ ఎ.వి.ఎస్. గుప్తాతో కలిసి తేరం కాంగ్రీకి చేసిన యాత్ర. వీరికి భారత వైమానిక దళం సాయపడింది. హిమానీ నదంపై మొదటి ల్యాండింగు 1978 అక్టోబరు 6 న జరిగింది. ఇద్దరు సైనికుల పార్థివదేహాలను తరలించేందుకు చేతక్ హెలికాప్టరును స్క్వా.లీ.మోంగా, ఫ్లైట్ ఆఫీ. మన్మోహన్ బహదూర్ అక్కడ దించారు.[3] ఈ యాత్రలతో సియాచెన్‌పై ఇరు పక్షాలు తమతమ ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేసాయి.

ఆపరేషన్ మార్చు

 
ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్

పాకిస్తాన్ ప్రణాళికల గురించిన వేగువార్తలు అందుకున్న భారత్, సియాచెన్‌పై తమకు ఆధిపత్యాన్ని ఉన్నట్లు ప్రకటించుకునే అవకాశం పాకిస్తాన్‌కు లేకుండా చెయ్యాలని నిశ్చయించింది. తదనుగుణంగా, భారత్ కొన్ని దళాలను అక్కడికి పంపాలని నిర్ణయించింది.ఈ దళాలు 1982 లో జరిపిన అంటార్కిటికా యాత్రతో అతిశీతల వాతావరణానికి అలవాటు పడ్డాయి.

సియాచెన్ గ్లేసియరును నియంత్రించేందుకు 1984 ఏప్రిల్ 13 న ఆపరేషన్ మొదలుపెట్టాలని భారత సైన్యం తలపెట్టింది. ఏప్రిల్ 17 న ఆపరేషన్ మొదలుపెట్టాలన్న పాకిస్తాన్ ఆలోచన పసిగట్టిన భారత్, దానికంటే 4 రోజుల ముందే తమ ఆపరేషన్ మొదలుపెట్టాలని ఆలోచించింది. కాళిదాసు రచించిన మేఘదూతం సంస్కృత నాటకం పేరిట తమ ఆపరేషన్‌కు పేరు పెట్టారు. లెఫ్టి. జన. ప్రేంనాథ్ హూన్ ఈ ఆపరేషన్‌కు సారథ్యం వహించాడు.

భారత వైమానిక దళం తమ విమానాల ద్వారా భారత సైనికులను సియాచెన్‌లో దించడంతో ఆపరేషను మొదలైంది. Il-76, An-12, An-32 విమానాల ద్వారా సైనికులను, సరుకులనూ అత్యంత ఎత్తున ఉన్న తమ విమానాశ్రయాలకు చేరవేయగా, అక్కడి నుండి Mi-17, Mi-8, చేతక్ హెలికాప్టర్లు, అవి మున్నెన్నడూ చేరని ఎత్తైన ప్రదేశాలకు వారిని చేర్చాయి.

1984 మార్చిలో గ్లేసియరుకు తూర్పున ఉన్న స్థావరానికి నడవడం మొదలుపెట్టడంతో ఆపరేషన్ మొదటి దశ మొదలైంది. కుమావోన్ రెజిమెంటుకు చెందిన ఒక బెటాలియను, లడఖ్ స్కౌట్సుకు చెందిన యూనిట్లు పూర్తి యుద్ధ సామాగ్రితో రోజుల తరబడి జోజి లా కనుమగుండా నడిచాయి.[4] లెఫ్టి డి.కె.ఖన్నా సారథ్యంలోని దళాలు, పాకిస్తాన్ రాడార్లను తప్పించుకునేందుకు నడిచి వెళ్ళాయి.

మేజర్ ఆర్.ఎస్.సాంధు నేతృత్వంలోని దళం, గ్లేసియరులో తొలి పాగా వేసింది. తరువాత కెప్టెన్ సంజయ్ కులకర్ణి నేతృత్వం లోని దళం, బిలఫోండ్ లాను స్వాధీనం చేసుకుంది. మిగిలిన దళాలు కెప్టెన్ పి.వి యాదవ్ నాయకత్వంలో నాలుగు రోజులు నడిచి, సాల్టోరో రిడ్జిలోని మిగతా శిఖరాలను చేజిక్కించుకున్నాయి.[4] ఏప్రిల్ 13 నాటికి, దాదాపు 300 మంది భారత సైనికులు గ్లేసియరులోని కీలక ప్రదేశాలను హస్తగతం చేసుకున్నారు. పాకిస్తాన్ దళాలు గ్లేసియరును చేరుకునేసరికి అక్కడి మూడు ప్రధాన కనుమలైన సియా లా, బిలఫోండ్ లా, గ్యోంగ్ లా లనూ, గ్లేసియరుకు పశ్చిమాన ఉన్న సాల్టోరో రిడ్జి వద్ద ఉన్న శిఖరాలు దాదాపుగా అన్నిటినీ భారత్ వశపరచుకుంది.[5][6][7] ఆ ప్రాంతానికి భూమార్గాలు పాకిస్తాన్ అధీనంలో ఎక్కువగా ఉన్నప్పటికీ, సమాయాభావం వలన, ఎత్తైన ప్రదేశాల వలనా సాల్టోరో రిడ్జి యొక్క పశ్చిమ వాలులను మాత్రమే పాకిస్తాన్ నియంత్రణ లోకి తెచ్చుకోగలిగింది.[5]

పాకిస్తాన్ 2,300 చ.కి.మీ. భూభాగాన్ని కోల్పోయిందని మాజీ పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తన జ్ఞాపకాలలో రాసాడు.[8] టైం పత్రిక ప్రకారం, పాకిస్తాన్ 2,600 చ.కి.మీ. భూమిని కోల్పోయింది.[9] ఇరుదేశాలూ తమ తాత్కాలిక శిబిరాలను శాశ్వత స్థావరాలుగా మార్చుకున్నాయి.

ప్రాణనష్టం మార్చు

విశ్వసనీయమైన డేటా అందుబాటులో లేదు. అయితే, ఇరువైపులా జరిగిన మరణాలకు ప్రధానమైన కారణం వాతావరణం, భౌగోళిక పరిస్థితులూను. ఇరుపక్షాలకు చెందిన అనేకమంది సైనికులు ఫ్రాస్ట్‌బైట్, ఎత్తుప్రదేశాల జబ్బుకు లోనయ్యారు. కొందరు గస్తీ తిరుగుతూండగా మంచుతుఫానుల్లో చిక్కుకోవడం వలన, లోయల్లో పడిపోయీ మరణించారు. ఆపరేషన్ మేఘదూత్‌లో 1984 నుండి 2016 నవంబరు 18 వరకు 35 మంది అధికారులు, 887 సైనికులూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి డా. సుభాష్ భాంబ్రే రాజ్యసభలో చెప్పాడు.[10]

పర్యవసానాలు మార్చు

70 కి.మీ. పొడవైన సియాచెన్ హిమానీనదం, దాని ఉపనదాలతో సహా భారత్ నియంత్రణలోకి వచ్చింది. వీటితో పాటు సాల్టోరో రిడ్జికి పశ్చిమంగా ఉన్న మూడు కనుమలు - సియా లా, బిలాఫోండ్ లా, గ్యోంగ్ లా - కూడా భారత్ నియంత్రణలోకి వచ్చాయి.[11] వ్యూహాత్మకంగా ఈ ఆపరేషను ఎంత విలువైనది అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. వ్యూహాత్మకంగా ఏ విలువా లేని భూభాగం కోసం చేసిన నిష్ఫలమైన యుద్ధం అనేది ఒక దృష్టికోణం కాగా, ఇదొక గొప్ప విజయం గాను, సోల్టోరో రిడ్జివద్ద వ్యూహాత్మకంగా పైచేయి సాధించామనీ కొందరు భావించారు. 

ఈ ఆపరేషనుతో పాటు, ఈ ప్రాంతంలో సైనిక శిబిరాల నిర్వహణకు, ఇక్కడికి అవసరమైన సరఫరాలు చేసేందుకూ భారత పాకిస్తాన్ సైన్యాలు రెండూ నిరంతరం పెద్దయెత్తున ఖర్చు చేస్తున్నాయి. భారతదేశం ఆధీనంలో ఉన్న శిఖరాలు, కనుమలను స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ 1987 లోను, మళ్లీ 1989 లోనూ దాడులు చేసింది. మొదటి దాడికి అప్పటి-బ్రిగేడియర్-జనరల్ పర్వేజ్ ముషారఫ్ (తరువాతి కాలంలో పాకిస్తాన్ అధ్యక్షుడు) నాయకత్వం వహించాడు. తొలుత కొన్ని శిఖరాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, తరువాత భారత్ చేతిలో ఎదురుదెబ్బ తిన్నారు. అదే సంవత్సరంలో "క్వైడ్" అనే పేరున్న పాకిస్తానీ స్థావరాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ రాజీవ్ అనే సంకేతనామం ఉన్న ఆ దాడిలో 1,500 అడుగుల (460) ఎత్తుకు అధిరోహించి సాహసోపేతమైన దాడి చేసిన బాణా సింగ్‌కు గుర్తింపుగా, ఆ పోస్టుకు "బాణా పోస్ట్‌" అని భారత్ పేరు మార్చింది. బాణా సింగ్‌కు పరమవీర చక్ర (PVC) లభించింది. బాణా పోస్ట్ సముద్ర మట్టానికి 22,143 అడుగుల (6,749 మీ) ఎత్తున ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి ఇది.[12][13]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "War at the Top of the World". Time.com. November 7, 2005. Archived from the original on 2012-04-12. Retrieved 2017-12-17.
  2. 2.0 2.1 The Illustrated Weekly of India - Volume 110, Issues 14-26. Times of India. Pakistani troops were forced out with over 200 casualties as against 36 Indian fatalities
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-14. Retrieved 2017-12-17.
  4. 4.0 4.1 "Operation Meghdoot". Indian Army.
  5. 5.0 5.1 "War at the Top of the World". Time Magazine. 4 July 2005. Archived from the original on 20 December 2014. Retrieved 2011-12-30.
  6. Baghel, Ravi; Nusser, Marcus (2015-06-17). "Securing the heights; The vertical dimension of the Siachen conflict between India and Pakistan in the Eastern Karakoram". Political Geography. Elsevier. 48: 24–36. doi:10.1016/j.polgeo.2015.05.001.
  7. Wirsing, Robert (1991). Pakistan's security under Zia, 1977-1988: the policy imperatives of a peripheral Asian state. Palgrave Macmillan, 1991. ISBN 978-0-312-06067-1.
  8. Pervez Musharraf (2006). In the Line of Fire: A Memoir. Free Press. ISBN 0-7432-8344-9.(pp. 68-69)
  9. The Himalayas War at the Top Of the World Archived 2009-01-14 at the Wayback Machine 31 July 1989 - TIME
  10. Parminder, Kaur (29 October 2016). "Siachen Glacier Operation Meghdoot Takes 922 Lives". ABC Live. ABC Live. Retrieved 30 November 2016.
  11. NOORANI, A.G. (Mar 10, 2006). "For the first time, the leaders of India and Pakistan seem close to finding a solution to the Kashmir problem". for a detailed, current map. Retrieved April 29, 2012.
  12. "Project Hope". Rediff. 2001-01-25. Retrieved 2011-12-30.
  13. "Confrontation at Siachen, 26 June 1987". Bharat Rakshak. Archived from the original on 24 ఫిబ్రవరి 2014. Retrieved 2011-12-30.

బయటి లింకులు మార్చు