ఆపరేషన్ రాజీవ్
1987 జూన్‌లో సియాచిన్ గ్లేసియర్‌పై, వాస్తవ క్షేత్రస్థితి రేఖ (AGPL) వెంబడి ఎత్తైన ప్రదేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించి, భారత్ సైన్యం జరిపిన ఆపరేషనుకు ఆపరేషన్ రాజీవ్ అనేది సంకేతనామం. ఈ ఆపరేషనుకు ముందు, ఈ ప్రాంతం పాకిస్తాన్ దళాల నియంత్రణలో ఉండేది. వారు ఆ శిఖరంపై ఖైద్ పోస్ట్ (పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా పేరిట) అనే పేరుతో ఒక పోస్టును స్థాపించారు. భారతదేశం ఆ శిఖరాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్న తరువాత, ఈ ఆపరేషనుకు నాయకత్వం వహించిన కెప్టెన్ బాణా సింగ్ పేరిట ఆ పోస్టుకు బాణా టాప్ (బాణా పోస్ట్ అని పేరు మార్చారు. అప్పటి నుండీ, భారతదేశం నియంత్రణలో ఉన్న వ్యూహాత్మక బిలాఫాండ్ లా పర్వత మార్గానికి దక్షిణంగా ఉన్న ఈ పోస్టు భారతదేశం అధీనంలోనే ఉంది. [1] అధిక-ఎత్తులో ఉన్న ఇన్‌స్టాలేషన్‌లతో పాటు, భారతదేశం ఈ విభాగంలో తక్కువ ఎత్తులో ఉన్న వాలులపై అమర్, సోనమ్ అని పేర్లతో కూడా పోస్టులను ఏర్పాటు చేసింది. [1]
ఆపరేషన్ రాజీవ్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సియాచెన్ ఘర్షణలో భాగము | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
India | Pakistan | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
మేజర్ వరీందర్ సింగ్ | సుబేదార్ అతవుల్లా మొహమ్మద్ | ||||||||
పాల్గొన్న దళాలు | |||||||||
జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ 8 వ బెటాలియన్ | షహీన్ కంపెనీ, స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ 3 వ కమాండో బెటాలియన్ | ||||||||
బలం | |||||||||
62 | 7–17 | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
4 గురు మరణించారు | 6 గురు మరణించారు | ||||||||
అప్పటివరకు ఈ ప్రాంతాన్ని ఆధీనంలో ఉంచుకున్న పాకిస్థానీల నుండి ఎదురైన ప్రమాదం కారణంగా భారతదేశం ఈ ఆపరేషనును చేపట్టింది. ఈ శిఖరంపై పాకిస్తాన్ క్కైద్ పోస్టును ఏర్పాటు చేయడం వల్ల పశ్చిమ సియాచిన్ గ్లేసియర్‌పై భారత కదలికలకు ముప్పు ఏర్పడింది. మేజర్ వరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత టాస్క్ ఫోర్స్, పోస్టును స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో పోస్టులో ఉన్న పాకిస్తానీ దళాలపై పలుసార్లు దాడులు చేసింది. మూడు విఫల ప్రయత్నాల తర్వాత, నాయబ్ సుబేదార్ బాణా సింగ్ నేతృత్వంలోని బృందం ఈ శిఖరాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. దానిని స్వాధీనం చేసుకున్న సింగ్, ఈ ఆపరేషనులో చూపిన ధైర్యసాహసాలకు గాను, భారతదేశపు అత్యున్నత శౌర్య పురస్కారమైన పరమవీర చక్రను అందుకున్నాడు. ఈ ఆపరేషనుకు సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే పేరు పెట్టారు. అతను పాకిస్తాన్ నుండి శిఖరాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం చేసిన ప్రయత్నాలలో వీరమరణం పొందాడు.
నేపథ్యం
మార్చుభారతదేశం చేసిన ఆపరేషను మేఘదూత్, దానికి ప్రతిగా పాకిస్తాన్ చేసిన ఆపరేషనులు
మార్చుభారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య వివాదాస్పదంగా ఉన్న సియాచిన్ ప్రాంతం సముద్రమట్టం నుండి అత్యంత ఎత్తున ఉన్న యుద్ధభూమి. 1984లో, ఆపరేషను మేఘదూత్లో భారతదేశం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. 1986 ఏప్రిల్‌లో పాకిస్తానీలు ఈ ప్రాంతంలో ఒక సైనిక స్థావరాన్ని స్థాపించారు. దానికి ముందు, భారతీయులు ఈ శిఖరాన్ని బిలాఫోండ్ లా "ఎడమ భుజం" అని పిలిచేవారు. పాకిస్థానీలు తమ నాయకుడు క్కైద్-ఎ-ఆజం అనే బిరుదున్న మహమ్మద్ అలీ జిన్నా గౌరవార్థం ఈ శిఖరానికి "క్కైద్ పోస్ట్ " అని పేరు పెట్టారు. క్కైద్ పోస్టులో పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్‌లో భాగమైన షాహీన్ కంపెనీ (3వ కమాండో బెటాలియన్) సైనికులను నియమించారు. దీనికి సుబేదార్ అతావుల్లా మహమ్మద్ నాయకత్వం వహించాడు. [1]
క్కైద్, అమర్, సోనమ్ పోస్టులు
మార్చుక్కైద్ పోస్ట్ నుండి సాల్టోరో -సియాచిన్ ప్రాంతంలో భారత కదలికలు పాకిస్తాన్‌కు స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడికి దాదాపు 15 కి.మీ. దూరంలో ఉన్న సియాచిన్ హిమానీనదం ఈ శిఖరం నుండి ఉత్త కళ్ళకు కూడా కనిపిస్తుంది. బిలాఫోండ్ లా ప్రాంతంలోని అమర్ పోస్ట్, సోనమ్ పోస్ట్ వంటి భారతీయ పోస్టులకు వెళ్ళాలంటే కేవలం విమానంలో మాత్రమే సాధ్యం. అమర్, క్కైద్ పోస్టుకు దక్షిణంగా ఉండగా సోనమ్, ఉత్తరాన ఉంది. క్కైద్ పోస్టుపై పాకిస్తాన్ నియంత్రణ చేపట్టడంతో, ఈ పోస్టులపై ఆధిపత్యం చెలాయించడానికి, అక్కడికి చేరవేసే సరఫరాలను నిరోధించడానికీ వారికి వీలుకలిగింది. [1]
క్కైద్ పోస్టు సముద్ర మట్టం నుండి 20,500 అడుగులు (6,200 మీ.) ఎత్తున ఉంది. 457 మీటర్ల ఎత్తైన మంచు గోడలతో చుట్టుముట్టబడినందున దానిపై దాడి చేయడం చాలా కష్టం. [2] దీనికి మూడు వైపులా 80° నుండి 85° వాలు ఉంది, నాల్గవ వైపు వాలు, అంతకంటే తక్కువగా ఉంటుంది. పైభాగంలో ఉన్న పాక్ సైనికుల దృష్టిలో పడకుండా దాడి చేసి ఆ శిఖరాన్ని అధిరోహించడం చాలా కష్టం. ఆక్సిజన్ కొరత కారణాంగా ఎక్కువ దూరం నడవడం కష్టతరం అయ్యేది. సైనికులు శ్వాస తీసుకోవడానికి ప్రతి కొన్ని మీటర్లకు ఆగిపోవాల్సి వస్తుంది. తరచుగా మంచు తుఫానులు కూడా వచ్చేవి. చలి గాలి కారణంగా రాత్రి వేళల్లో ఉండే మసక వెలుతురును ఉపయోగించుకుని ముందుకు సాగడం కూడా వీలు కాదు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు −50°C కంటే తక్కువగా ఉండేవి.
1986 డిసెంబరులో క్కైద్ పోస్టుపై ఘోరమైన మంచు తుఫాను వచ్చింది. ఒక ఆర్టిలరీ అధికారి లెఫ్టినెంట్ జాఫర్ అబ్బాసీ తప్ప మిగిలిన పాకిస్తానీ సైనికులంతా అందులో మరణించారు. అతను మంచు కొరుకుడు కారణంగా తన రెండు కాళ్లు, చేతులను కోల్పోయాడు. తరువాత, అతను లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకునే వరకు కృత్రిమ కాళ్ళు, చేతులతో తన సేవలను కొనసాగించాడు. అతని ధైర్యసాహసాలకు పాకిస్తాన్‌లో ప్రసిద్ధి చెందాడు. కెప్టెన్ అక్మల్ ఖాన్‌తో సహా స్పెషల్ సర్వీసెస్ గ్రూప్‌లోని ఇతర సైనికులు ఉష్ణోగ్రత −40°C కి చేరుకోవడంతో అక్కడికక్కడే మరణించారు.
పాకిస్తాన్ క్కైద్ పోస్ట్ నుండి భారతీయ అమర్, సోనమ్ పోస్టులపై దాడి
మార్చు1987 ఏప్రిల్ 18 న, క్కైద్ పోస్ట్ నుండి పాకిస్తాన్ సైనికులు సోనమ్ (6,400 మీ) వద్ద ఉన్న భారత సైనికులపై కాల్పులు జరిపారు. వారిలో ఇద్దరు మరణించారు. క్కైద్ పోస్ట్ నుండి పాకిస్థానీలను తరిమికొట్టడానికి భారత సైన్యం ఒక ప్రణాళికను ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ (8వ JAK LI) కి చెందిన 8వ బెటాలియన్‌కు క్కైద్ పోస్టును స్వాధీనం చేసుకునే పనిని అప్పగించారు. ఆ పోస్టుకు వెళ్ళగలిగే ఉత్తమమైన అప్రోచ్ మార్గాన్ని గుర్తించి, దానిని తాళ్లతో గుర్తించాలని మే 29న, సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన JAK LI బృందాన్ని ఆదేశించారు. ఈ బృందం క్కైద్ పోస్టుకు దారితీసే మంచు గోడను ఎక్కడం ప్రారంభించింది. కానీ అది పై నుండి 30 మీటర్ల దూరానికి చేరినపుడు వారిని పాకిస్తాన్ సైనికులు గుర్తించారు. పాకిస్థానీలు భారీ మెషిన్ గన్‌తో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండేతో సహా పది మంది భారతీయ సైనికులు మరణించారు. [3] దానికి ముందు, భారత సైనికులు పిక్ గొడ్డలితో నిలువు మంచు గోడపై అనేక పాదాలను ఏర్పాటు చేసి, పైభాగానికి ఒక తాడును వేశారు. [4]
భారత ఆపరేషను
మార్చుఈ ఆపరేషనుకు భారతదేశపు రెండవ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే పేరు పెట్టారు. అతను శిఖరాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో వీరమత్రణం పొందాడు.
ఏర్పాట్లు - టాస్క్‌ఫోర్స్‌ను సమీకరించడం
మార్చుతరువాతి కొద్ది రోజులలో, క్కైద్ పోస్టును స్వాధీనం చేసుకోవడానికి JAK LI మేజర్ వరీందర్ సింగ్ నేతృత్వంలో కొత్త టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కెప్టెన్ అనిల్ శర్మను సింగ్‌కు డిప్యూటీగా నియమించారు. టాస్క్‌ఫోర్స్‌లో ఇద్దరు అధికారులు, 3 జేసీఓలు, 57 మంది సైనికులతో సహా 62 మంది ఉన్నారు. సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం 1987 జూన్ 23 న మొదలుపెట్టిన ఈ ఆపరేషనుకు ఆపరేషను రాజీవ్ అనే పేరు పెట్టారు. [5]
బిలాఫాండ్ లా ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. 8వ JAK LI అంతకు నెల క్రితమే 5వ బీహార్ నుండి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. దాని సైనికులు ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని తెలుసుకునే ప్రక్రియలోనే ఉన్నారు. తరచుగా మంచు తుఫానులు, HAL చీతా హెలికాప్టర్ల పరిమిత సామర్థ్యం కారణంగా, దాడి బృందం [1] బిలఫోండ్ లా వద్ద సమీకృతం కావడానికి 20 రోజులు పట్టింది, 200 హెలికాప్టర్ ప్రయాణాలు అవసరమయ్యాయి. ఇద్దరు సైనికులను, వారి సామానునూ చేరవేయడానికి 2-4 హెలికాప్టరు ట్రిప్పులు అవసరమయ్యేవి. ఒక్కో హెలికాప్టర్ ప్రయాణానికి ₹ 35,000 ఖర్చు అయింది.
రిహార్సల్స్ సమయంలో, ఎత్తుల్లో వచ్చే అనారోగ్యం కారణంగా కొంతమంది ఫిరంగి పరిశీలకులను ఖాళీ చేయవలసి వచ్చింది. సోనమ్ పోస్టులో కెప్టెన్ రామ్ ప్రకాష్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందాన్ని ఉంచారు. అతను సోనమ్ తరువాత ఒక అబ్జర్వేషన్ పోస్టును స్థాపించాడు.
తొలి భారతీయ దాడి
మార్చుజూన్ 23 సాయంత్రం, రాజీవ్ పాండే బిగించిన తాడును కనుగొనడానికి వరీందర్ సింగ్ నేతృత్వంలోని ఒక ప్లాటూన్ బయలుదేరింది. ప్రతికూల వాతావరణం వలన వీరి పురోగమనం మందగించింది: నడుము లోతు మంచులో నాలుగు గంటల్లో ఇది 1 కి.మీ. మాత్రమే ముందుకు పోగలిగింది. భారీ హిమపాతం కారణంగా, జట్టు ఆ తాడును కనుగొనలేక, స్థావరానికి వెనుదిరిగింది. [1]
హర్నామ్ సింగ్ బృందం
మార్చుజూన్ 24 రాత్రి, సుబేదార్ హర్నామ్ సింగ్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందాన్ని పంపారు. దూరంలో సుబేదార్ సన్సార్ చంద్ నేతృత్వంలోని మరో బృందం దానిని అనుసరించింది. శత్రువుల కాల్పుల కారణంగా మొదటి దాడి బృందం నిలిచిపోయినట్లయితే, నాయబ్ సుబేదార్ బాణా సింగ్ నేతృత్వంలోని మూడవ బృందం రిజర్వ్ ఫోర్స్‌గా ఉంచారు. హర్నామ్ సింగ్ బృందం పాండే తగిలించిన తాడును, వారి మృతదేహాలనూ కనుగొనగలిగారు. భారత సైనికులు మంచు గోడ ఎక్కడం ప్రారంభించారు. వారు కేవలం 50 మీటర్ల దూరాన్ని అధిగమించారు, వారి స్కౌట్ గా ఉన్న నాయక్ తారా చంద్, ముందు భాగంలో కొంత కదలికలను గమనించాడు. తారా చంద్ హెచ్చరికతో భారత సైనికులు కిందికి దిగారు. కానీ వారు కాల్పులు చేపట్టే లోపే, పాకిస్థానీలు మీడియం మెషిన్ గన్‌లతో కాల్పులు జరిపారు. తారా చంద్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారి ఆయుధాలు −25°C ఉష్ణోగ్రతలో జామ్ కావడంతో వారిని అనుసరించే దళాలు ఎదురు కాల్పులు జరపలేకపోయాయి. పాకిస్థానీలు కిరోసిన్ స్టవ్‌తో తమ ఆయుధాలను వేడి చేసుకుంటున్నారని భారతీయులు కనుగొన్నారు. హర్నామ్ సింగ్ మనుషులు మొదట ఐసికిల్స్ వెనుక ఆశ్రయం పొందారు, ఆపై మంచులో లోతులేని కందకాలు తవ్వారు. వారిని కాపాడేందుకు నియమించబడిన భారతీయ సైనికులను పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోయారు. చివరకు దాడిని విరమించుకోవాల్సి వచ్చింది.
గాయపడిన సైనికులను తరువాత స్థావరానికి తీసుకువచ్చి, వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించారు. వారి స్థానంలో కొత్తవారిని వెంటనే పంపించారు. పాక్ వైపు హెలికాప్టర్లు తరచూ ప్రయాణాలు చేస్తున్న ధ్వనులను భారతీయులు విన్నారు. చనిపోయిన ఇద్దరు సహోద్యోగుల మృతదేహాలను స్థావరానికి తీసుకువచ్చే సమయంలో భారత సైనికులు, రాజీవ్ పాండే నాయబ్ సుబేదార్ హేమ్ రాజ్ మృతదేహాలను కూడా కనుగొన్నారు. నెల రోజుల క్రితమే ఇద్దరు మరణించినప్పటికీ, వారి మృతదేహాలు మంచులో జాగ్రత్తగా ఉన్నాయి.
సన్సార్ చంద్ బృందం
మార్చుజూన్ 25-26 రాత్రి, సుబేదార్ సన్సార్ చంద్ బృందం క్కైద్ పోస్టుపై దాడికి నాయకత్వం వహించింది. మిగిలిన దళం కొంత దూరంలో ఉంది. గార్డెన్ పోస్ట్ నుండి మీడియం మెషిన్ గన్ ఫైర్, సోనమ్ పోస్ట్ కు ముందు రామ్ ప్రకాష్ ఏర్పాటు చేసిన పోస్ట్ నుండి రాకెట్ లాంచర్ ఫైర్‌ల ఆసరాతో ఈ బృందం పోస్ట్ వైపు ముందుకు సాగింది. సన్సార్ చంద్ మనుష్యుల పురోగతిని సులభతరం చేయడానికి తేలికపాటి మెషిన్ గన్‌లతో ఇతర సహాయక బృందాలను కూడా మోహరించారు. అయితే, చల్లని వాతావరణం కారణంగా ఈ తుపాకులు జామ్ అయ్యాయి. పాకిస్తానీ పక్షం కూడా భారత పురోగతిని ఆపడానికి మెషిన్ గన్, రాకెట్ కాల్పులను నిరంతరం ఉపయోగించింది.
సన్సార్ చంద్ క్కైద్ పోస్ట్ పైభాగానికి చేరుకున్నాడు. వెంటనే అదనపు దళాలను రమ్మని కోరాడు. అయితే, అతని రేడియో సెట్ లోని బ్యాటరీ అయిపోవడంతో అతను, తన వెనుక కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న తన కమాండర్‌తో కమ్యూనికేట్ చేయలేకపోయాడు. ఆ తర్వాత అతను హవల్దార్ రామ్ దత్‌ని క్రిందికి వెళ్లి భారత జట్టులోని మిగిలిన వారిని చేరుకోవాలని కోరాడు. అయితే, రామ్ దత్ కిందికి కదులుతున్నప్పుడు పాకిస్థానీ కాల్పులకు గురై దాదాపు 500 అడుగుల ఎత్తులో పడిపోయి చనిపోయాడు. అతని మృతదేహం కనిపించలేదు. మరోసారి, అదనపు సైనికుల మద్దతు లేకపోవడంతో దాడిని ఆపవలసి వచ్చింది.
చివరి భారతీయ దాడి - బాణా సింగ్ బృందం
మార్చుజూన్ 26 ఉదయం నాటికి, భారత, పాకిస్తాన్ - రెండు పక్షాల సైనికులూ దాదాపు మూడు రాత్రులు అత్యంత శీతల వాతావరణంలో గడిపిన కారణంగా దాదాపు సరఫరా లన్నీ అయిపోయాయి. ఆ సమయంలో క్కైద్ పోస్టులో 7 నుండి 17 మంది పాకిస్తాన్ సైనికులు కాపలా ఉన్నారు. [1] పాకిస్తాన్ దళాల వద్ద మందుగుండు సామాగ్రి అయిపోవచ్చినట్లు అనిపించింది - ఎందుకంటే వారి వైపు నుండి కాల్పులు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ సమయానికి, వాతావరణం కూడా మెరుగుపడింది. ఉష్ణోగ్రతలు 0 °C కంటే కొద్దిగానే తక్కువగా ఉండడంతో, భారతీయుల ఆయుధాలు పని చేయడం ప్రారంభించాయి.
తమ దగ్గర ఉన్న సామాగ్రి రాత్రి వరకు సరిపోదని గ్రహించిన వరీందర్, పగటిపూటనే రెండు వైపుల నుండి నిర్ణయాత్మకమైన దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. [5] మొదటి జట్టులోని 8 మంది సైనికులకు వరీందర్ సింగ్ నాయకత్వం వహించాడు. రెండవ జట్టులోని 5 గురు సైనికులకు నాయబ్ సుబేదార్ బాణా సింగ్ నాయకత్వం వహించాడు. [4] బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ చందన్ నుగ్యాల్ రేడియో ద్వారా వరీందర్‌ను సంప్రదించి, ఆ పరిధిలో ఉన్న భారతీయ ఫిరంగి తుపాకీలన్నీ సహాయంగా ఉంచుతానని అతనికి హామీ ఇచ్చాడు. భారీ ఫిరంగి కాల్పుల తర్వాత, వరీందర్ బృందం క్కైద్‌ను దిగువ నుండి అధిరోహించింది. [1]
బాణా సింగ్ నేతృత్వంలోని బృందం 1987 జూన్ 26 న 13:30 గంటలకు తుది దాడిని ప్రారంభించింది. [6] బాణా సింగ్‌తో పాటు, రైఫిల్‌మెన్ చునీ లాల్, లక్ష్మణ్ దాస్, ఓం రాజ్, కాశ్మీర్ చంద్ ఈ బృందంలో ఉన్నారు.[7] ఈ బృందం సుదీర్ఘమైన, కష్టతరమైన పద్ధతిలో ఊహించని దిశ నుండి క్కైద్ పోస్టుకు చేరుకుంది. అప్పుడే మంచు తుఫాను సంభవించి, ఏమీ కనిపించకుండా పోయింది. ఇది భారత సైనికులకు రక్షణ కల్పించింది. బాణా సింగ్ బృందం శిఖరంపైకి చేరుకుంది. అక్కడ ఒకటే పాకిస్తానీ బంకర్ ఉందని గమనించారు. వారు వెనుక నుండి బంకర్ వద్దకు చేరుకున్నారు గానీ తమ రైఫిల్స్ జామ్ అయ్యాయని గ్రహించారు. బాణా సింగ్, బంకర్‌లోకి గ్రెనేడ్‌ని విసిరి తలుపులు మూసి లోపల ఉన్నవారిని చంపేశాడు. ఇరు పక్షాలు చేతులతో కూడా పోరాడాయి. భారత సైనికులు, బంకర్ వెలుపల కొంతమంది పాకిస్తానీ సైనికులను బాయొనెట్లతో పొడిచి చంపారు. కొందరు పాకిస్తాన్ సైనికులు శిఖరంపై నుంచి కిందికి దూకేసారు. ఆ తరువాత ఆరుగురు పాక్ సైనికుల మృతదేహాలను భారతీయులు గుర్తించారు. [8]
ఎట్టకేలకు భారత సైన్యం ఈ పోస్టుపై పట్టు సాధించింది. పోస్టును స్వాధీనం చేసుకున్న తర్వాత ఫిరంగి షెల్ దాడిలో వరీందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.
మైరా మెక్‌డొనాల్డ్ తన పుస్తకం, డిఫీట్ ఈజ్ ఎన్ ఆర్ఫన్: హౌ పాకిస్తాన్ లాస్ట్ ది గ్రేట్ సౌత్ ఏషియన్ వార్ లో ఇలా రాసింది:
అన్ని ప్రతికూలతలను అధిగమిస్తూ, 20,500 అడుగుల ఎత్తులో చాటుమాటుగా మంచు గోడలను ఎక్కి, గ్రెనేడ్‌లు, బాయోనెట్‌లు, చేతులతో పోరాడి, చేసిన ఆపరేషను తర్వాత భారతదేశం ఆ పోస్టును స్వాధీనం చేసుకుంది. 1984లో సియాచిన్‌లో చేసిన ఒరిజినల్ ఆక్రమణకు పైయెత్తున, 1987లో పాకిస్తాన్ తన పోస్టును కోల్పోవడం పాక్ సైన్యం పొందిన అవమానానికి ఆజ్యం పోసింది. మానసికంగా దానికి లోతైన గాయం చేసింది. ఆ తరువాత, ఆ సంవత్సరం ఇతర భారతీయ పోస్టులపై పాకిస్తాన్ చేసిన ఎదురుదాడులు చాలా వరకు విఫలమయ్యాయి. [9]
అనంతర పరిణామాలు
మార్చుపాకిస్థానీ మృతదేహాల అప్పగింత
మార్చుకార్గిల్లో జరిగిన ఫ్లాగ్ మీట్ సందర్భంగా భారత సైన్యం పాక్ సైనికుల మృతదేహాలను పాక్ అధికారులకు అప్పగించింది. [3]
సాహస పురస్కారాలు
మార్చు1988లో ఆపరేషను సమయంలో బాణా సింగ్ చూపిన ధైర్యసాహసాలకు గాను అతనికి పరమవీర చక్ర పురస్కారం లభించింది. [10] చివరి దాడి సమయంలో అతనితో పాటు పోరాడిన రైఫిల్‌మ్యాన్ చునీ లాల్, రైఫిల్‌మ్యాన్ ఓం రాజ్‌లకు సేనా పతకం లభించింది. హర్నామ్ సింగ్, సన్సార్ చంద్‌లకు మహావీర చక్ర పురస్కారం లభించింది. మేజర్ వరీందర్ సింగ్, 2వ లెఫ్టినెంట్ రాజీవ్ పాండేతో సహా మరో 7 మందికి వీర చక్ర పురస్కారం లభించింది.
క్కైద్ పోస్ట్ పేరును బాణా టాప్‌గా మార్చడం
మార్చుసియాచిన్ ప్రాంతంలోని ఎత్తైన శిఖరాన్ని పాకిస్తాన్ నుండి స్వాధీనం చేసుకోవడంలో బాణా సింగ్ చూపిన ధైర్య సాహసాలను గౌరవిస్తూ భారతదేశం, క్కైద్ పోస్టు పేరును బాణా టాప్‌గా మార్చింది. [11]
ఇవి కూడా చూడండి
మార్చు- NJ9842 (పీక్)
- ఇందిరా కల్
- భారత సాయుధ దళాల పురస్కారాలు పతకాలు
- భారత-చైనా సరిహద్దు రోడ్లు
- భారతదేశ కొన బిందువుల జాబితా
- ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌ను చైనాకు బదిలీ చేయడానికి చేసుకున్న చైనా-పాకిస్తాన్ ఒప్పందం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Ajai Shukla (30 May 2011). "Army watches as Siachen dialogue resumes". Business Standard.
- ↑ "Naib Subedar Bana Singh". Bharat Rakshak. Archived from the original on 5 March 2015. Retrieved 27 June 2014.
- ↑ 3.0 3.1 Claude Arpi. "Interview with Captain Bana Singh" (PDF). Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 27 June 2014.
- ↑ 4.0 4.1 L.N. Subramanian. "Confrontation at Siachen, 26 June 1987". Bharat Rakshak. Archived from the original on 24 February 2014. Retrieved 27 June 2014.
- ↑ 5.0 5.1 Col J Francis (30 August 2013). Short Stories from the History of the Indian Army Since August 1947. Vij Books India Pvt Ltd. pp. 100–102. ISBN 978-93-82652-17-5.
- ↑ L.N. Subramanian. "Confrontation at Siachen, 26 June 1987". Bharat Rakshak. Archived from the original on 24 February 2014. Retrieved 27 June 2014.
- ↑ Col J Francis (30 August 2013). Short Stories from the History of the Indian Army Since August 1947. Vij Books India Pvt Ltd. pp. 100–102. ISBN 978-93-82652-17-5.
- ↑ Col J Francis (30 August 2013). Short Stories from the History of the Indian Army Since August 1947. Vij Books India Pvt Ltd. pp. 100–102. ISBN 978-93-82652-17-5.
- ↑ MacDonald, Myra (2017). Defeat is an Orphan: How Pakistan Lost the Great South Asian War. Oxford University Press. p. 51. ISBN 9781849048590.
- ↑ Josy Joseph (25 January 2001). "Project Hope". rediff.com.
- ↑ Samir Bhattacharya (January 2014). Nothing But!. Partridge Publishing (Authorsolutions). pp. 146–. ISBN 978-1-4828-1732-4.