ఈ చదువులు మాకొద్దు

ఈ చదువులు మాకొద్దు 1984లో విడుదలైన తెలుగు సినిమా.వేజళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో, సాయి చంద్, రాజేంద్ర ప్రసాద్,రంగనాథ్, అన్నపూర్ణ, అనూరాధ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.[1]

ఈ చదువులు మాకొద్దు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం సాయిచంద్,
రాజేంద్రప్రసాద్,
రంగనాథ్,
గుమ్మడి,
రమణారెడ్డి,
సుత్తివేలు,
మాస్టర్ అయ్యప్ప,
రమాప్రభ,
అన్నపూర్ణ,
అనూరాధ,
కె.విద్యాసాగర్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటదుర్గా ఇంటర్నేషనల్
భాష తెలుగు

కథాసంగ్రహం:

మార్చు

సీనియర్ ఇంటర్ పరీక్షాఫలితాలలో శివయ్యశాస్త్రి కుమారుడు చంద్ర - ఫస్ట్ క్లాస్‍లో పాసవుతాడు. శివయ్య పూర్తిగా పౌరోహిత్యాన్ని నమ్ముకున్న వ్యక్తి అయినా, ఆయన కుమారులైన అరవింద్‍, చంద్రలకు దేవుడిమీద నమ్మకం ఉండదు. మూడో కుమారుడు కాళిదాసుకు పౌరోహిత్యమే ఇష్టం. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‍ల ఆసరాతో తహసీల్దారు అయిన పాపన్నకు - నిమ్నకులాలలోనే తనకన్నా తక్కువ కులస్థుడైన రెవెన్యూఇనస్పెక్టర్ అంటే చాలా చిన్నచూపు. రెవెన్యూఇనస్పెక్టర్ ఆదెన్న కుమార్తె అరుంధతి అంటే ఇష్టపడుతుంటాడు - పాపన్న కుమారుడు పరమేశం. తమవద్ద కొంత డబ్బు ఎక్కువగా తీసుకుని, ముహూర్తాన్ని మార్చి ఇవ్వమని ఎవరో అడిగితే, ఆరోజుకు కూడా తిండికి గడవని స్థితిలో ఉన్న శివయ్య- ‘శాస్త్రం అంగీకరించదు’ అంటూ తిరస్కరిస్తాడు. వెంకటాద్రి కుమార్తె అరుణ - మంచి మార్కులతో పాసయినా, ఇంజనీరింగ్‍ చదువులకు స్థోమత ఉండదు. తనను పాలిటెక్నిక్‍లో చేర్చమని తండ్రిని కోరుతుంది. ఉద్యోగంకోసం వెళ్లిన ప్రతీచోటా చుక్కెదురు అవుతుండటంతో - అరవింద్‍లో నిరాశ అధికమవుతుంటుంది. కిషన్‍చెల్లెలు తిలకానికి - పెళ్లయిన మర్నాడే భర్త చనిపోవటంతో - పసుపుకుంకుమల సౌభాగ్యం ఉండదు. కొంత కట్నం అధికంగా ఇస్తామన్నా, ఆమె జాతకం బాగలేదంటూ, సంబంధాలు రావటం లేదని పెళ్లిళ్ల పేరయ్య చెప్తాడు. తనకు ఇకపై పునర్వివాహ ప్రయత్నాలు చెయ్యవద్దని తిలకం, తన అన్న కిషన్‍కు చెప్తుంది. గూడేనికి రేషన్‍షాపు కేటాయించి, దాని ప్రారంభానికి వెళ్లమని కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడంతో - అక్కడ తమవారితో దగ్గరగా ఉండాల్సివస్తుందన్న సంకోచంతో పాపన్న వెళ్లడానికి సంకోచిస్తాడు. చివరికి - భార్య భద్రం ఒత్తిడితో గూడేనికి వెళ్లినా, అక్కడివారికి దూరంగా ఉండే ప్రయత్నాలే చేస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండకపోవటంతో, చంద్రం - చివరికి చెప్పులషాపులో పనికి కుదురుతాడు. అరుణ అంటే, కిషన్‍కు ఇష్టం పెరుగుతుంది. కానీ, ఆఫీసర్ తిట్టాడన్న కోపంలో కిషన్‍, తన ఉద్యోగాన్ని వదులుకుంటాడు. తిలకం చెప్పిన మాటమీద - కిషన్‍, కిళ్లీకొట్టును పెడతాడు. చంద్రానికి - చెప్పులకొట్లో పనికి వచ్చిన డబ్బును ముట్టటానికి కూడా శివయ్య అంగీకరించడు. కానీ, ఇంట్లో గడవని స్థితిలో ఉన్న తల్లి - భవాని, ఆ డబ్బును తీసుకుంటుంది. తిలకానికి పసుపు, కుంకుమలు ఇచ్చిన చంద్రం - ఆమెలో, తన సౌభాగ్యం గురించిన కొత్త ఆలోచనలు కల్పిస్తాడు. ఉద్యోగానికి తగిన అర్హతలు అన్నీ ఉన్నా, వయసు మించిపోయిందని ప్రభుత్వంనుంచి ఉత్తరం రావటంతో - ఆగ్రహంతో అరవింద్‍, రగిలిపోతాడు. ఇంట్లో తాతగారి ఆబ్దీకానికి సామాన్లకోసం - తన యూనివర్సిటీ గోల్డ్‌మెడల్‌ను ఇస్తాడు అరవింద్‍. తీరా చూస్తే, అది గిల్ట్ బంగారమని షావుకారు గుర్తించి, సామాన్లు వెనక్కు తీసుకుంటాడు. దానితో, తనకు ప్రభుత్వం ఇచ్చిన ఆ గిల్ట్ గోల్డ్‌మెడల్‌ను, పట్టాను వెనక్కు ఇచ్చి, తాను ఆ చదువులకు కట్టిన ఫీజులో పదోవంతైనా తిరిగి ఇవ్వమని కోరతాడు. విశ్వవిద్యాలయం వైస్‍ఛాన్సలర్, ఆ వితండవాదాన్ని  తిరస్కరించి, అరవింద్‍ను బయటకు తోయిస్తాడు. దానితో - అరవింద్‍కు మతిభ్రమిస్తుంది. తనకున్న వేదవిద్యతో - కనీసం పూజలు చేసేందుకైనా అవకాశం ఇవ్వమని కాళిదాసు, ప్రతీ షాపుకూ వెళ్లి బతిమాలుతాడు. కానీ, ఎక్కడా పని దొరకదు. పూట గడవకపోవటంతో - ఇంట్లోని ఇత్తడిబిందెను అమ్మవలసిందిగా అమ్మ భవాని, కాళిదాసును అడుగుతుంది. అది అమ్మడానికి వెళ్లిన కాళిదాసు, చివరికి కసాయిదుకాణం ఫారూక్‍వద్ద గల్లా ముందు పనికి చేరతాడు. కిళ్లీకొట్లో ఉన్న తిలకాన్ని వేటాడుతున్న రౌడీలను చంద్రం దండించి, తిలకాన్ని తాను వివాహమాడతానని చెప్తాడు. ఫారూక్‍ మాంసందుకాణంలో కుమారుడు కాళిదాసును చూసిన శివయ్య, కొడుకును కొడతాడు. ఎక్కడా తన చదువుకు తగిన విలువ లేకపోవటంతో - చంద్రం, చివరికి ఐటిఐలో చేరతాడు. సంప్రదాయ విద్యలవల్ల విద్యార్థులకు తగిన ఉపాధి, రవ్వంత జీవిక లభించటం లేదంటూ, సాంకేతిక వృత్తి విద్యలను ప్రవేశపెట్టాలని నిరుద్యోగులు - ఆందోళన ఆరంభిస్తారు. విశ్వవిద్యాలయాల గుమ్మాలనుకూడా తొక్కని మీరు, మా చదువుల్నీ, భవితవ్యాన్నీ నిర్దేశించటం ఏమిటని - నిరుద్యోగుల తరఫున అరవింద్‍, రాజకీయవాదులను ప్రశ్నిస్తాడు. ఈ అలజడిని కట్టడి చేయలేని రాజకీయవాదులు, పోలీసుల్ని రప్పించి, టియర్ గ్యాస్ తర్వాత ఫైరింగ్‍ చేయిస్తారు. ఆ సమయంలో పోలీసుల తుపాకీగుండు తగిలి - అరవింద్‍ కన్నుమూస్తాడు. అతని శవయాత్ర ఆరంభంతో - చిత్రం ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం,కథ, చిత్రానువాదం - వేజెళ్ళ సత్యనారాయణ
  • మాటలు - డా.నెల్లుట్ల
  • గీతాలు - వేటూరి, డా.నెల్లుట్ల
  • సంగీతం - చక్రవర్తి
  • ఛాయాగ్రహణం - ఆర్.కె.రాజు
  • శిల్పం - కొండపనేని రామలింగేశ్వరరావు
  • నృత్యాలు - ఎస్.ఆర్.ఆర్.రాజు
  • సహ దర్శకులు - ఎం.డి.ఎస్.రెడ్డి, నాయని చంద్రమోహన్
  • నిర్మాత - అట్లూరి వెంకటేశ్వరరావు
  • నిర్వహణ - అట్లూరి రామారావు
  • నిర్మాణత - ధనేకుల ప్రసాదరావు
  • సమర్పణ - అట్లూరి దుర్గాప్రసాద్

పాటల జాబితా

మార్చు
  • ఆపేయండి సీట్ల అమ్మకం నిలిపేయండి, గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఆలారి ఆలారి ఉప్పలకిడి వేసుకో , గానం: ఎస్ పి. శైలజ, జి.ఆనంద్ , ఎం.రమేష్ బృందం
  • ఓక వసంతం ప్రకృతికి నిత్య వసంతం పార్వతికి , గానం : జయచంద్రన్, పి. సుశీల
  • తెలుసుకో తెలుసుకో దేశమా , గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  • వేడి చూడు నాడి చూడు వేగలేని ఈడు చూడు, గానం: పి. సుశీల, మాధవపెద్ది రమేష్

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్