కొండపనేని రామలింగేశ్వరరావు
కొండపనేని రామలింగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కళాదర్శకుడు. ఈయన 35 సంవత్సరాలకు పైగా చిత్రపరిశ్రమలో పనిచేశారు. ఈయన పరిశ్రమలో ఆందరికీ రామలింగంగా సుపరిచితుడు.
కొండపనేని రామలింగేశ్వరరావు | |
---|---|
జననం | |
మరణం | 1995 జూలై 15 | (వయసు 50)
వృత్తి | సినిమా కళా దర్శకుడు |
జీవిత భాగస్వామి | సావిత్రి |
తల్లిదండ్రులు |
|
జీవిత విశేషాలు
మార్చుఈయన 1945, ఫిబ్రవరి 17వ తేదీన గుంటూరు జిల్లా, దుగ్గిరాల గ్రామంలో కొండపనేని చలమయ్య చౌదరి, సహదేవమ్మ దంపతులకు జన్మించారు .[1] ఈయన తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఈయన బాల్యం దుగ్గిరాల గ్రామంలో నడిచింది. తరువాత మెట్రిక్యులేషన్ చదవడానికి తెనాలి వెళ్ళి అక్కడ రామా ట్యుటోరియల్ కాలేజీలో చేరా రు. ఈయన తండ్రి ప్రజానాట్యమండలి కళాకారుడు కావడంతో వారికి ఆనాటి పేరుపొందిన నటులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. దానితో రామలింగేశ్వరరావు గారి కి సినిమా రంగం పట్ల ఇష్టం పెరిగి మెట్రిక్యులేషన్ పూర్తి కాగానే 1960లో మద్రాసుకు వెళ్ళిపోయారు.
సినిమా రంగం
మార్చుమద్రాసు చేరుకున్న రామలింగం గారు తన తండ్రికి స్నేహితుడైన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు వద్ద పబ్లిసిటీ డిజైనర్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. అక్కడ భార్యాభర్తలు, కలసి ఉంటే కలదు సుఖం మొదలైన సినిమాలకు పనిచేశారు. తరువాత కాట్రగడ్డ నరసయ్య, గుమ్మడి, జగ్గయ్యల సహకారంతో టి. వి. యస్. శర్మవద్ద అప్రెంటిస్‌గా చేరారు. కొంత కాలానికే ఈయనకి కృష్ణ పరిచయమయ్యాడు. రామలింగం పనితీరు పట్ల ఆకర్షితుడైన కృష్ణ ఈయనకి డిజైనింగ్ వృత్తి నుండి కళా దర్శకత్వంవైపు మళ్ళమని సలహా ఇచ్చాడు. ఈయన ఆ రంగంలో ప్రవేశించడానికి తీవ్రమైన కృషి చేసి చివరకు కుదరవల్లి నాగేశ్వరరావు వద్ద సహాయకుడిగా చేరి పేదరాసి పెద్దమ్మ కథ సినిమాకు పనిచేశారు. అక్కడ ఈయన కొన్ని మెలకువలు నేర్చుకున్నారు. 1962-64ల కాలంలో ఈయనకి గడ్డు పరిస్థితి ఏర్పడి గత్యంతరంలేక తిరిగి ఉత్త చేతులతో దుగ్గిరాలకు వెళ్ళిపోయారు.
కొన్ని సంవత్సరాలు గడిచాక అలపర్తి సురేంద్ర ఈయన గురించి తెలుసుకుని 1967లో తిరిగి మద్రాసుకు పిలిపించాడు. రామలింగం గారు కళాదర్శకత్వ శాఖలో నిలదొక్కుకోవడానికి సురేంద్ర సహకరించారు. తిరిగి ఈయన కుదరవల్లి నాగేశ్వరరావు వద్ద సహాయకుడిగా చేరారు. 1968లో దోనేపూడి కృష్ణమూర్తి, వీర్రాజులు నిర్మాతలుగా కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో కాంతారావు నటించిన రాజయోగం సినిమాతో ఈయన కళాదర్శకుడిగా మారారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఈయనకి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది. చారిత్రక, సోషియో ఫాంటసీ సినిమాల స్క్రిప్టుకు, పాత్రలకు తగినట్లుగా సెట్టింగులను సమకూర్చడంలో ఈయన పేరుగడించారు.
కృష్ణ తన సోదరులతో కలిసి పద్మాలయా స్టూడియోస్ ప్రారంభించాక ఈయని ఆ సంస్థలో ఆస్థాన కళాదర్శకుడిగా నియమించుకున్నాడు. అప్పటి నుండి 12 సంవత్సరాలు ఆ బ్యానర్‌కు కళాదర్శకునిగా పనిచేసి తన జీవితంలో మధురమైన అనుభూతులను సంపాదించుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం చింతపల్లిలో 5 ఎకరాల స్థలంలో ఇతడు డిజైన్ చేసిన సెట్టింగ్‌ను లక్ష రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారు. దీనిని పద్మాలయా కాలనీగా పిలుస్తున్నారు. మోసగాళ్ళకు మోసగాడు సినిమాకు ఈయన కళాదర్శకత్వంతో పాటు కాస్ట్యూములు కూడా డిజైన్ చేశారు. ఈ సినిమాలో కృష్ణకు ఈయన డిజైన్ చేసిన దుస్తులు బాగా పాపులర్ అయ్యి కృష్ణకు బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈనాడు సినిమా కోసం మద్రాసు అరుణాచలం స్టూడియో ప్రక్కన ఈయన నిర్మించిన సెట్టింగ్ కృష్ణా గార్డెన్స్ పేరుతో పద్మాలయా స్టూడియోస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. షోలే సినిమా సెట్టింగ్ తరువాత అంత వాస్తవిక సెట్టింగ్‌గా దీనిని పేర్కొంటారు. ఈ సెట్టింగ్ పలువురి ప్రశంసలను పొందింది.
ఈయన పద్మాలయా సినిమాలతో పాటుగా భార్గవ్ ఆర్ట్స్ మొదలైన బ్యానర్లకు కళాదర్శకుడిగా పనిచేశారు. కట్టా సుబ్బారావు, తాతినేని ప్రసాద్, వేజెళ్ల సత్యనారాయణ వంటి అనేక దర్శకుల సినిమాలకు కళా దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు కొన్ని ఇతర భాషా చిత్రాలకు పనిచేశారు. ఈయనకి కళా దర్శకత్వంతో పాటు నటనలో కూడా ఆసక్తి ఉంది. నా పెళ్ళాం నా ఇష్టం, పచ్చని సంసారం, మామా కోడళ్లు, అల్లరిపిల్ల వంటి కొన్ని సినిమాలలో నటించారు. [1]
ఈయన ప్రభుత్వాన్ని సినిమా నిర్మాణం కోసం ఓపెన్ స్టూడియోలు నిర్మించాల్సిందిగా అభ్యర్థించారు. మద్రాసు నుండి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలిరావడానికి కృషి చేశారు. ఈయన 250కు పైగా సినిమాలకు కళా దర్శకత్వం వహించారు. ఈయన సోదరుడు ఉమామహేశ్వరరావు సినీ జర్నలిస్టు. ఈయన వివాహం సావిత్రిగారి తో జరిగింది. ఈయన పెద్ద కుమారుడు కూడా కళా దర్శకునిగా పనిచేస్తున్నారు. రామలింగం గారు కాలేయ వ్యాధితో బాధపడుతూ తన 50వ యేట హైదరాబాదులో 1995, జూలై 15న మరణించారు.
ఫిల్మోగ్రఫీ
మార్చుఈయన కళా దర్శకుడిగా పనిచేసిన సినిమాల పాక్షిక జాబితా:
- రాజయోగం (1968)
- రాజసింహ (1969)
- మోసగాళ్ళకు మోసగాడు (1971)
- భలే మోసగాడు (1972)
- దేవుడు చేసిన మనుషులు (1973)
- మంచివాళ్ళకు మంచివాడు (1973)
- అల్లూరి సీతారామరాజు (1974)
- పాడిపంటలు (1976)
- రామరాజ్యంలో రక్తపాతం (1976)
- మనుషులు చేసిన దొంగలు (1977)
- ఇంద్రధనుస్సు (1978)
- చల్ మోహన రంగా (1978)
- దొంగల దోపిడీ (1978)
- పట్నవాసం (1978)
- ఆడదంటే అలుసా (1979)
- అల్లరి వయసు (1979)
- ఎవడబ్బ సొమ్ము (1979)
- సమాజానికి సవాల్ (1979)
- హేమా హేమీలు (1979)
- బంగారు బావ (1980)
- సంసార బంధం (1980)
- మంగళ గౌరి (1980)
- మంచిని పెంచాలి (1980)
- రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
- సంఘం చెక్కిన శిల్పాలు (1980)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- దేవుడు మామయ్య (1981)
- ప్రేమ నాటకం (1981)
- ఈనాడు (1982)
- కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి (1982)
- మరో మలుపు (1982)
- ప్రేమ నక్షత్రం (1982)
- టింగు రంగడు (1982)
- రాధ మై డార్లింగ్ (1982)
- బంగారు భూమి (1982 సినిమా) (1982)
- ఇదికాదు ముగింపు (1983)
- ఆడవాళ్లే అలిగితే (1983)
- ఈ పిల్లకు పెళ్ళవుతుందా (1983)
- మనిషికో చరిత్ర (1983)
- ముక్కుపుడక (1983)
- శుభముహూర్తం (1983)
- ఈ చదువులు మాకొద్దు (1984)
- ఆడదాని సవాల్ (1984)
- నాగు (1984)
- ఆడపులి (1984)
- డిస్కో కింగ్ (1984)
- ఈ తీర్పు ఇల్లాలిది (1984)
- రామాయణంలో భాగవతం (1984)
- రౌడీ (1984 సినిమా) (1984)
- రోజులు మారాయి (1984)
- ఇల్లాలి ప్రతిజ్ఞ (1985)
- మా పల్లెలో గోపాలుడు (1985)
- ఇల్లాలికో పరీక్ష (1985)
- రక్త సింధూరం (1985)
- ఆక్రందన (1986)
- ప్రళయం (1986)
- ముద్దుల కృష్ణయ్య (1986)
- మన్నెంలో మొనగాడు (1986)
- కిరాయి మొగుడు (1986)
- మువ్వగోపాలుడు (1987)
- డామిట్ కథ అడ్డం తిరిగింది (1987)
- సర్దార్ ధర్మన్న (1987)
- మురళీకృష్ణుడు (1988)
- ప్రేమ కిరీటం (1988)
- సంసారం (1988 సినిమా) (1988)
- అన్నపూర్ణమ్మగారి అల్లుడు (1988)
- బావా మరుదుల సవాల్ (1988)
- ముద్దుల మావయ్య (1989)
- లైలా (తెలుగు సినిమా) (1989)
- మంచి కుటుంబం (1989 సినిమా) (1989)
- ఉద్యమం (1990)
- మధురానగరిలో (1991)
- ప్రార్థన (సినిమా) (1991)
- శశిరేఖ శపథం (1991)
- పెళ్ళి పుస్తకం (1991)
- రగులుతున్న భారతం (1992)
- వదినగారి గాజులు (1992)
- రక్తతర్పణం (1992)
- అల్లరిపిల్ల (1992)
- మామా కోడలు (1993)
- వాస్తవం (1993 సినిమా) (1993)
- నా మొగుడు నా ఇష్టం (1993)
- ఇన్స్పెక్టర్ ఝాన్సీ (1993)
- అన్నా చెల్లెలు (1993)
- పచ్చని సంసారం (1993)
- వింతమొగుడు (1994)
- శ్రీదేవి నర్సింగ్ హోం (1994)
- పోలీస్ అల్లుడు (1994)
- పచ్చతోరణం (సినిమా) (1994)
- రైతుభారతం (1994)
- మధ్యతరగతి మహాభారతం (1995)
- రియల్ హీరో (1995)
- సూపర్ మొగుడు (1995)
- అక్కుమ్ బక్కుమ్ (1996)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 వెబ్ మాస్టర్. "Kondapaneni Ramalingeswara Rao (Art Director)". indiancine.ma. Retrieved 19 January 2022.
బయటి లింకులు
మార్చు[[వర్గం:తెలుగు సినిమా కళా దర్శకులు]]