ఎం. ఎస్.ఆచార్య

(ఎం.ఎస్.ఆచార్య నుండి దారిమార్పు చెందింది)

ఎం.ఎస్.ఆచార్య (మాడభూషి శ్రీనివాసాచార్య) ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు.

జీవిత విశేషాలుసవరించు

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

ఇతడు 1924, అక్టోబర్ 3వ తేదీన అమ్మమ్మ గారి గ్రామం సూర్యాపేటలో జన్మించాడు[1]. ఇతని తండ్రి ప్రసన్న రాఘవాచార్య ఉభయ వేదాంత పండితుడు. అతడు నెల్లికుదురు గ్రామంలో వైద్యం చేసేవాడు. నెల్లికుదురులోని మదరసతహానియాలో నాలుగో తరగతి వరకు ఉర్దూమీడియంలో చదువుకున్న ఇతడు తన తండ్రి వద్దనే బాలరామాయణం, ధాతుమంజరి, రఘువంశం, కుమారసంభవం మొదలైనవి నేర్చుకున్నాడు[2].

ఉద్యోగంసవరించు

ఇతడి అన్న వెంకటనర్సింహాచార్యులు హిందూస్తానీ సంగీతం నేర్పిస్తూ ఆ డబ్బులతో కుటుంబాన్ని ఆదుకునేవాడు. ఇతడు కూడా చదువుకు స్వస్తిచెప్పి అప్పటి ప్రముఖ డాక్టర్ లక్ష్మణ్‌సా పవార్ వద్ద నెలకు రూ.12 వేతనానికి కాంపౌండర్‌గా ఉద్యోగంలో చేరాడు. అలాగే ఓ ముడిసిల్క్ వ్యాపారి వద్ద రూ.15 వేతనానికి పనిచేశాడు.

జర్నలిస్టుగాసవరించు

1942లో ఓసారి ఓ దుకాణం ముందు ఒక వ్యక్తి, మరో వ్యక్తిని చితకబాదడాన్ని చూసి చలించిపోయిన ఆచార్య ఆ సంఘటనను వార్తగా రాసి సికింద్రాబాద్ నుంచి వెలువడుతున్న తెలంగాణ పత్రికకు పంపాడు. తర్వాత 1947 జనవరి 1న ఆంధ్రపత్రిక ఏజెన్సీ తీసుకున్నాడు. 1948లో అదే పత్రికకు విలేకరిగా చేరి 32ఏళ్లపాటు పనిచేశాడు. తెలుగు మాట్లాడితే నేరంగా పరిణించే నిజాం పాలనలో తెలుగు పత్రికకు వార్తలు రాసే విలేకరిగా పనిచేసాడు. అప్పుడు ఆంధ్రపత్రికే ఉద్యమానికి ఊపిరి. ఉద్యమ వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టేవాడు. అదే ఆయన ఉద్యమం ఉద్యోగం కూడా. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. వావిలాల గోపాలకృష్ణయ్య తెనాలిలో స్వాతంత్ర్యానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణాశిబిరంలో పాల్గొని పాత్రికేయ వృత్తి మెలకువలు నేర్చుకున్నాడు. పి.వి. నరసింహారావు, పాములపర్తి సదాశివరావు తదితరులు ప్రారంభించిన కాకతీయ పత్రికతో పాటు చిత్రవిచిత్ర మాసపత్రిక, ప్రగతి పత్రికలకు కూడా ఇతడు వార్తలు వ్రాసేవాడు. 1958లో జనధర్మ వారపత్రికను స్థాపించాడు. 1971లో స్వంత ముద్రణాలయం బాలాజీ ప్రెస్‌ను నెలకొల్పాడు. 1988లో వరంగల్ వాణి అనే దినపత్రికను ప్రారంభించాడు. జనధర్మను 36 సంవత్సరాల పాటు, వరంగల్ వాణిని 13 సంవత్సరాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి నడిపాడు[3]. తెలంగాణ సాహిత్యానికి, సాంస్కతిక వారసత్వానికి సముచిత గౌరవ ప్రాభవాలను కల్పించడానికి ఈ పత్రికల ద్వారా వేదికను ఏర్పరచాడు. సామాజిక సమస్యలను చర్చించడానికి పరిశోధనాత్మక వార్తాంశాలను గుప్పించడానికి, సమకాలీన సంకర విలువలను ఎండగట్టడానికి ఈ పత్రికలు ఎంతో ఉపయోగపడినాయి. వ్యవస్థాగత సమస్యల వల్ల 1993లో వరంగల్‌వాణి దినపత్రికను అమ్మేశాడు.

కుటుంబంసవరించు

ఇతని భార్య రంగనాయకమ్మ. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పేరు ఎం.రామానుజాచార్య కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యుడిగా పనిచేసి పదవీవిరమణ చేశాడు. రెండవ కుమారుడు మాడభూషి శ్రీధర్ నల్సార్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషనర్‌గా ఉన్నాడు.

మరణంసవరించు

పత్రికా నిర్వహణలో స్ఫూర్తిప్రదాతగా చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్.ఆచార్య తన 71వ యేట జులై 12, 1994న మరణించాడు.

మూలాలుసవరించు