ఏకవీర (సినిమా)

తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది. విశ్వనాథ సత్యనారాయణకు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు కానీ, తరువాత విడుదలల్లో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కొంతవరకూ ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డిల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.

ఏకవీర
(1969 తెలుగు సినిమా)
TeluguFilm Ekaveera.jpg
దర్శకత్వం చిత్తజల్లు శ్రీనివాసరావు
నిర్మాణం బి.వి.సీతారాం,
డి.ఎల్.నారాయణ
రచన విశ్వనాథ సత్యనారాయణ
తారాగణం నందమూరి తారక రామారావు,
కె.ఆర్.విజయ,
కాంతారావు,
జమున
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి,
మల్లాది రామకృష్ణశాస్త్రి,
సి.నారాయణరెడ్డి
సంభాషణలు సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ పద్మ ఫిల్మ్స్
విడుదల తేదీ డిసెంబర్ 4, 1969
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శీర్షికసవరించు

సినిమాకు మూలమైన విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీర అన్న పేరే నిర్ధారించారు. ఏకవీర అన్న పేరును విశ్వనాథ సత్యనారాయణ ఎందుకు పెట్టారన్న విషయాన్ని సాహిత్య విమర్శకులు పరిశీలించారు. నవలలో ప్రధానమైన పాత్రలు ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతి. వీరిలో ప్రతిపాత్ర విశిష్టమైనవే, ఏ పాత్ర లేకున్నా కథాగమనం మారిపోతుంది. కానీ మీనాక్షి అనో, వీరభూపతి అనో, కుట్టాన్ అనో మరేదో పేరో కాకుండా ఏకవీర అనే పేరు పెట్టడం వెనుక విమర్శకులు కారణాన్ని విశ్లేషించారు. నవల ముగుస్తున్నప్పుడు సుందరేశ్వరుడు ఏకవీరను ఆవహించి ఆమెతో ఒక మహాత్కార్యం చేయించాడని, అందుకే వారి కన్నా ఆ పాత్ర కొంత మిన్నయైనదని భావించారు.[1]

నిర్మాణంసవరించు

మూలకథ నేపథ్యంసవరించు

ఈ సినిమాకు మూలకథ అందించిన ఏకవీర తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారం పొందిన రచయిత విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవల. నవల విశ్వనాథ సత్యనారాయణ రచనాజీవితంలోకెల్లా విశిష్టమైన రచనల్లో ఒకటిగా నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటుగా నవల విస్తృతంగా పాఠకాదరణ పొందింది. ఆయన రచించిన వందకు మించిన రచనల్లో విశ్వనాథ సత్యనారాయణే స్వయంగా నా ఏకవీర, వేయిపడగలు కళాత్మకమైనవి. సంపూర్ణమైన రచనలని నేను భావిస్తాను అన్నారు.[2] నవల పలుమార్లు పునర్ముద్రణలు చెందడంతోపాటుగా విద్యాప్రణాళికల్లో పాఠ్యాంశంగా కూడా నిర్దేశింపబడింది. దీన్ని మలయాళంలోకి అనువదించి ప్రచురించారు. ఈ నవల గురించి పలువురు సాహిత్యవేత్తలు అనేకవిధాలుగా మెచ్చుకున్నారు. పోరంకి దక్షిణామూర్తి ఈ నవలను రసవత్తరమైన కావ్యమని మెచ్చుకోగా, మధురాంతకం రాజారాం దీనిలోని కథాకథనకౌశలాన్నెంతగానో ప్రశంసించారు.[3][4] అటువంటి నవలను సినిమాకు మూలకథాంశంగా స్వీకరించారు.

స్క్రిప్ట్ అభివృద్ధిసవరించు

ఏకవీర నవలను సినిమా కథకు స్క్రీన్‌ప్లే పి.చెంగయ్య వ్రాశారు. సినిమాకు మాటలు, చాలా పాటలూ వ్రాసినది డా.సి.నారాయణరెడ్డి. ఈ సినిమా స్క్రిప్టులో నవలలో లేని అనేక చేర్పులు చేర్చడంతో పాటుగా నవలలోని అనేకమైన విషయాలు వదిలివేశారు. ఆ క్రమంలో నవలలోని పాత్రచిత్రణకూ, సినిమాలోని పాత్రచిత్రణకూ సినిమాలో క్లైమాక్సుకూ మొదలుకొని ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి. అటువంటి ప్రధానమైన మార్పుల్లో కొన్ని

 1. నవలలో పాత్రలకూ, పాఠకులకు కూడా చివరి వరకూ రెండు ప్రేమజంటలూ వివాహం విషయంలో తారుమారైనట్టు తెలియదు. ఈ విషయంలో నవలా రచయిత చాలా జాగ్రత్త తీసుకున్నారు. సినిమా దృశ్యమాధ్యమం కనుక దీనిలో పాత్రలకు తెలియకపోయినా నాయకుల్లో ఒకరు తన ప్రేయసి చిత్రం చిత్రించగా దాన్ని ప్రేక్షకులకు చూపించేయడం మొదలుకొని సినిమా అంతటా ఒకరి ప్రేయసినొకరు పెళ్ళాడారన్న విషయం ప్రేక్షకులకు తెలిసిపోతూనేవుంటుంది. నాయికలను వెనుకనుంచి చూపడమో, మేలిముసుగు వేసి చూపడమో, లేదా నీడలను చూపడమో సినిమాలలో ప్రయత్నించకపోవడాన్ని బట్టి స్క్రిప్టు దశ నుంచే మూలరచయిత కట్టడిగా పాటించిన గూఢతను మార్చివేశారన్న విషయం తెలుస్తోంది.[5]
 2. నవలలో కుట్టాన్ సేతుపతి, వీరభూపతిల నడుమ స్నేహం వారి పూర్వప్రణయినులు తిరగబడి వివాహం చేసుకోవడం వంటి దురదృష్టకర విషయాలు విధివశాత్తు జరిగినా చెక్కుచెదరదు. కానీ సినిమాలో చివరి సన్నివేశాలలో వీరభూపతినీ, తన భార్యనీ ఒక ఉద్వేగ స్థితిలో చూసిన కుట్టాన్ సేతుపతి కత్తిదూసి యుద్ధం చేయబోతారు, ఆ తర్వాత వెంటనే కత్తి పారవేసినా దాన్ని తీసుకుని వీరభూపతి తనను తానే హతమార్చకుంటారు. నవలలోని ఆ సన్నివేశంలో కుట్టాన్ ఉండడమే జరగదు. పైగా చివర్లో వీరభూపతి సన్న్యసించడాన్ని చూసిన కుట్టాన్ తనకు, అతని భార్యకూ ఉన్న పూర్వప్రణయాన్ని బట్టి ఇంకా క్షమించలేదనుకుని స్థానాపతీ క్షమించలేకపోతివి అంటూ బాధపడతారు. ఆయా పాత్రల లక్షణాలను, వాటి మధ్య స్నేహాన్ని సినిమాలో మార్చారు.[5]
 3. నవలలోని కల్పనకు, నాయకరాజుల కాలం నాటి చారిత్రికాంశాలు ముడిపెట్టారు. నవలలో అత్యంత ముఖ్యమైన సన్నివేశం ఏకవీర, వీరభూపతి ఒక ఉద్వేగ స్థితిలో కౌగిలించుకున్నాకా ఏర్పడిన శూన్యంలో బజారువెంబడి ఏకవీర వెళ్తూంటే దైవీకశక్తి ఆవహించి రాబర్ట్ డి నోబిలీతో ఆమె హిందూమతాన్ని గురించి వాదించి గెలుస్తుంది. నవల ప్రకారం ఆ తర్వాత ఆమె భర్త కుట్టాన్ తిరిగిరావడమూ, ఆయన ఏకవీర విజయానికి సంతోషించి ఆమెను కౌగిలించుకోబోతే తనకు మాత్రమే ఉన్న విశిష్టమైన శరీరధర్మం వల్ల మరణించడమూ జరుగుతాయి. అయితే సినిమాలో రాబర్ట్ డి నోబిలీ ప్రస్తావన కూడా ఉండదు. మొత్తంగా ఆ సన్నివేశంతో పాటు నవలలో ఉన్న చారిత్రిక నేపథ్యమంతా దాదాపుగా విడిచిపెట్టారు. కుట్టాన్ నాయకరాజులకు ఎదురుతిరిగిన సైన్యాన్ని జయించిన విధానం నవలలో విపులంగా వ్రాయగా దాన్ని కూడా క్లుప్తంగా ముగించారు.[5]
 4. నవలలో పతాక సన్నివేశంలో వద్దు వద్దన్నా భర్త దరిజేరి కౌగిలించుకోవడంతో తన విశిష్టమైన స్పర్శాగుణం కారణంగా ఒకానొక అతీత స్థితికి చేరి ఏకవీర మరణిస్తుంది. నవలలోని మిగిలిన ముఖ్యపాత్రలలో ఒకరైన వీరభూపతి తాను తన్మయత్వంలో స్నేహితుని భార్యను కౌగిలించుకున్నందుకు సన్న్యసిస్తాడు. కుట్టాన్, వీరభూపతి,మీనాక్షి మరణించరు. సినిమాలో మాత్రం అందుకు విరుద్ధంగా నాలుగు పాత్రలూ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు చూపారు. మరణించడంలోనూ ఆత్మహత్య చేసుకోవడం కారణంగా ఆయా పాత్రల వ్యక్తిత్వాలు కూడా బలహీనమయ్యాయి.[5]

ఇటువంటి కీలకమైన మార్పులే కాక అనేకమైన ఇతర మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.

తారాగణం ఎంపికసవరించు

చిత్రీకరణసవరించు

చిత్రకథసవరించు

తమిళనాడులోని మదురై నేపథ్యంగా కథ సాగుతుంది. కథాకాలం నాయకరాజుల పరిపాలనా కాలం. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. కుట్టాన్ సేతుపతి రాచకుటుంబీకుడు కాగా వీరభూపతి సామాన్యమైన మధ్యతరగతి రైతుబిడ్డ. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.

తారాగణంసవరించు

నటి / నటుడు పాత్ర
నందమూరి తారక రామారావు కుట్టాన్ సేతుపతి
తాడేపల్లి కాంతారావు వీరభూపతి
కె.ఆర్. విజయ ఏకవీర
జమున మీనాక్షి
ముక్కామల కృష్ణమూర్తి పుట్టన దేశ మహారాజు
కైకాల సత్యనారాయణ యువరాజు తిరుమల నాయుడు
ధూళిపాళ వీరభూపతి తండ్రి
నిర్మలమ్మ ఏకవీర తల్లి
శాంతకుమారి
శ్రీరంజని మీనాక్షి తల్లి
రాజబాబు భట్టు
వంగర వెంకట సుబ్బయ్య
రాజసులోచన నర్తకి

పాటలుసవరించు

పాట గీతరచన నేపథ్యగానము
నీ పేరు తలచినా చాలు సి.నారాయణరెడ్డి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలసింది సి.నారాయణరెడ్డి ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
తోటలో నారాజు తొంగి చూచెను నాడు సి.నారాయణరెడ్డి ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
ఎంత దూరం అది ఎంత దూరం సి.నారాయణరెడ్డి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ఔనే చెలియా సరి సరి పి.సుశీల
ఏ పారిజాతములనీయగలనో సఖీ (పద్యము) సి.నారాయణరెడ్డి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
కలువ పూల చెంత చేరి సి. నారాయణరెడ్డి ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం
వందనము జననీ! భవానీ (పద్యము) సి.నారాయణరెడ్డి ఘంటసాల
కనుదమ్ములను మూసి, కలగంటి నొకనాడు సి.నారాయణరెడ్డి ఘంటసాల
పూత వయసు పిలిచిందొయ్ సిరి సిరి మువ్వా సి.నారాయణ రెడ్డి ఎస్.పి. బాల సుబ్రమణ్యం, వసంత

సన్నివేశాలుసవరించు

 
ఏకవీర - సినిమా సన్నివేశాలు

మూలాలుసవరించు

 1. కామేశ్వరరావు, టే (మార్చి 1934). "ఏకవీర విమర్శ". గృహలక్ష్మి. 7. Retrieved 6 March 2015.
 2. పురాణం, సుబ్రహ్మణ్యశర్మ (2005). విశ్వనాథ ఒక కల్పవృక్షం (1 ed.). హైదరాబాద్: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. pp. 235, 236.
 3. పోరంకి, దక్షిణామూర్తి (1975). తెలుగు నవల (1 ed.). ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. 19.
 4. మధురాంతకం, రాజారాం (2002). విశ్వనాథభారతి. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 154.
 5. 5.0 5.1 5.2 5.3 డా. వై., కామేశ్వరి (అక్టోబర్, 2010). ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం (1 ed.). హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. {{cite book}}: Check date values in: |date= (help)
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులుసవరించు