ఏటుకూరి బలరామమూర్తి
ఏటుకూరి బలరామమూర్తి మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత, జర్నలిస్టు. ఏటుకూరి బలరామమూర్తి (1918-1996) నిష్కళంక దేశభక్తుడు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుడు, మార్క్సిస్టు అధ్యయనవేత్త, విశాలాంధ్ర దినపత్రిక, కమ్యూనిజం మాసపత్రికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
బాల్యము విద్యాభ్యాసము
మార్చుఏటుకూరి బలరామమూర్తి 1918, సెప్టెంబర్ 3 న ఏటుకూరు (గుంటూరు జిల్లా) లో జన్మించారు. ఇతని తండ్రి ఏటుకూరి సీతారామయ్య బ్రహ్మ సమాజ అభిమాని కావడంతో ఆయన సంస్కరణాభిలాష, శాస్త్రీయ, చారిత్రిక దృష్టి బలరామమూర్తిని ప్రభావితం చేసాయి. 1937 లో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తికి మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ఏ.సి. కళాశాలలో బి.ఎ పూర్తి చేసిన తరువాత జర్నలిజం వృత్తిలో వుంటూనే ప్రైవేటుగా ఎం.ఎ సోషియాలజీ పూర్తిచేశారు.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాండ్రు వున్నారు.[1]
ఉద్యోగం
మార్చు1937లో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తి కమ్యూనిస్టు భావాలకు ప్రభావితమయ్యారు. తొలుత ఆర్.ఎం.ఎస్. (Railway Mail Service) లో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ రహస్య పత్రిక 'స్వతంత్ర భారత్' విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు అన్ని రైల్వేస్టేషన్‌లలో కమ్యూనిస్టు అభిమానులకు సురక్షితంగా అందచేస్తుండేవారు. ఈ విషయాన్ని పసికట్టిన బ్రిటిష్ ప్రభుత్వం శిక్షగా మద్రాసు ఆర్.ఎం.ఎస్. ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్ చేసి ఏ పని యివ్వకుండా జీతం ఇస్తూ ఖాళీగా కూచోబెట్టారు. దీనితో విసుగెత్తి 1940లో ఉద్యోగానికి స్వస్తిచెప్పి బలరామమూర్తి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు.[1]
రాజకీయ జీవితం
మార్చురాయలసీమలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పలువురికి మార్క్సిస్టు సిద్ధాంత శిక్షణ యిచ్చారు. రెండేళ్ళు పాటు (1940-42) గడిపిన అజ్ఞాతవాస జీవితంలో భాగంగా విశాఖ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజరుగా వ్యవహరించారు. 1948 నుండి 1952 వరకు తమిళనాడు లోని కడలూరు జైలులో డిటెన్యూగా ఉన్నారు. ఈ జైలు జీవితం ఆయనలోని తాత్విక జిజ్ఞాసను రేకెత్తించి, పుస్తక పఠనాసక్తిని పెంపొందించింది. విశాలాంధ్ర దినపత్రికలో మూడేళ్ళు ప్రధాన సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 1972 నుండి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులుగా, కమ్యూనిజం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా చివరివరకు పనిచేశారు. తరువాత సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, జాతీయ సమితి సభ్యులుగా కొనసాగారు.
పాత్రికేయ జీవితం
మార్చురచనలు
మార్చుకళాశాల కాలం నుండే చరిత్ర, తత్వశాస్త్రంల పట్ల ప్రత్యేక అభిమానం పెంచుకున్న ఏటుకూరి బలరామమూర్తి క్రమేపీ ఆ రంగాలలో విశేష కృషి చేశారు. చరిత్ర, తత్వశాస్త్రంలను జోడు గుర్రాలుగా అభిమానించిన ఏటుకూరి బలరామ మూర్తి 12 పుస్తకాలు, అనేక వందల వ్యాసాలు రచించారు. వీరి పుస్తకాలలో ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, భారతీయ తత్వశాస్త్రం, మన చరిత్ర, ఉపనిషత్ చింతన, భారతీయ సంస్కృతిలు ప్రముఖమైనవి. విశేష ప్రజాదరణను పొందాయి.
- ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర (1953)
- భారతీయ తత్వశాస్త్రం (1955)
- మన చరిత్ర (1972)
- ఆంధ్ర ప్రదేశ్ దర్శిని (1979) (వై.వి. కృష్ణారావు సహా సంపాదకత్వంలో)
- గాంధేయవాదం – తాత్వికత (1986)
- మార్క్సిజం + భగవద్గీత (1986) : (ఎస్.జి.సర్దేశాయి, దిలీప్ బోస్ తదితరులతో వ్యాస సంకలనం)
- బౌద్ధం - మార్క్సిస్టు దృక్పథం (1987) (ఎస్.జి.సర్దేశాయి, దిలీప్ బోస్ తదితరులతో వ్యాస సంకలనం)
- ఉపనిషత్ చింతన (1989)
- దళితుల ఆత్మాభిమానానికి ప్రతీక అంబేద్కర్ (1991)
- భారతీయ సంస్కృతి (1992)
- గతం, వర్తమానం, భవిష్యత్తు (1995)
- విశిష్ట విశ్లేషణ (1996)
కడలూరు జైలులో డిటెన్యూగా వున్న రోజులలో చరిత్ర, తత్వశాస్త్ర గ్రంథాలను నిర్విరామంగా అధ్యయనం చేశారు. జైలులో తోటి సహచారుల కోసం చరిత్ర, తత్వశాస్త్రాలపై శిక్షణా తరగతులు నడిపారు. ఎ.ఎల్. మార్టిన్ రచించిన 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్' చదవడం తటస్థించి అటువంటి ప్రజాచరిత్రను తెలుగుజాతి చరిత్రకు అందించాలనే సంకల్పంతో 1953 జూన్‌లో తన మొట్టమొదటి గ్రంథంగా “ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర”ను రచించారు. మార్క్సిస్టు దృక్పథంతో శాస్త్రీయ ప్రాతిపదికపై రచింపబడ్డ ఈ గ్రంథం ఇప్పటికే 11 సార్లుకు పైగా పునర్ముద్రణలతో ఆంధ్రుల చరిత్ర అంటే ఆసక్తి వున్న అందరి అభిమానాన్ని చూరగొంది. ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో బౌద్ధ స్థూపాలను హిందువులు ఎలా ఆక్రమించుకొన్నదీ సా.శ. 7వ శతాబ్దంలో అమరావతిని దర్శించిన సుప్రసిద్ద చైనా యాత్రికుడు “హుయాన్ త్సాంగ్” (యువాన్ చాంగ్- Xuanzang) మాటల్లో బలరామ మూర్తి వివరించిన అంశాలు చరిత్ర వక్రీకరణకు పాల్పడేవారికి కనువిప్పు కలిగించి చరిత్ర పట్ల సరైన వాస్తవ అవగాహన కలిగిస్తుంది. “ అమరావతి స్తూపం బౌద్ధ బిక్షువులు ఆధీనంలో ఉంది. బ్రాహ్మణులు ఈ స్తూపంపై పెత్తనం కావాలని తగాదా పెట్టారు. చివరకు బౌద్ధ బిక్షువులు తలుపులు తీసి బైటకు వచ్చి రాజు గారి మధ్యవర్తిత్వం నడుపుదామని ఆయన వద్దకు వెళ్ళారు. ఈ లోగా బ్రాహ్మణులు స్తూపాన్ని ఆక్రమించుకొన్నారు. రాజు బ్రాహ్మణుల తరపున తీర్పు చెప్పాడు. బౌద్ధ బిక్షువులు స్థాన భ్రష్టులై లేచిపోయారు. కొద్ది రోజుల తరువాత అమరావతీ స్తూపం అమరేశ్వరాలయంగా మారిపోయింది.” విశేష ఖ్యాతిని పొందిన ఈ చారిత్రిక గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది రష్యాలో స్థిరపడిన సుప్రసిద్ధ ఇంజనీరు కొలాచల సీతారామయ్యచే 1954 లో రష్యన్ భాష లోకి అనువదించబడింది.
దీని అనంతరం 1955 లో “భారతీయ తత్వశాస్త్రం” వెలువరించారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక దోరిణిల వరకు 20 అధ్యాయాలతో భారతీయ తత్వశాస్త్ర వికాసాన్ని శాస్రీయ దృష్టితో సమగ్రంగా విశ్లేషిస్తూ సులభ శైలిలో ఆసక్తికరంగా వివరించబడిన ఈ గ్రంథం వీరి పుస్తకాలలో అత్యంత పేరిన్నిక గన్నది. ఈ పుస్తకం నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు దేశంలోని అనేకమంది ఆలోచనాపరులను ప్రభావితం చేసింది. రచయితగా ఏటుకూరి బలరామమూర్తి పేరును చిరస్థాయిగా నిలబెట్టిన మేటి రచన ఇది.
1972 వ సంవత్సరంలో విహంగ దృష్టితో 'మన చరిత్ర' పేరుతొ భారత దేశ సంక్షిప్త చరిత్రను రచించారు. ఆయన చూసిన చారిత్రక ప్రదేశాలపై విశాలాంధ్రలో ధారావాహికంగా ప్రచురింపబడిన అనేకనేక వ్యాసాల కూర్పు ఇది. “విరుద్ద శక్తుల పరస్పర సమ్మేళనం అనే వాస్తవం ఒకటి మానవ చరిత్రలో అనాదిగా కనిపిస్తూంది” అని తెలియచేస్తూ చారిత్రిక సంయమన దృష్టితో ఆర్య, అనార్య దృష్టిని విడనాడి పరిశీలించి రెండు నాగరికతల (ఆర్య, హరప్పా) ఘర్షణ, ఇక్యతల ద్వారా వినూత్నమైన భారతీయ నాగరికత ఆవిర్భవించిందని ఈ గ్రంథంలో తెలియచేసారు.
1989 వ సంవత్సరంలో చారిత్రిక, తులనాత్మక దృష్టితో ఉపనిషత్తుల తాత్విక దృక్పధాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ “ఉపనిషత్ చింతన” రచించారు. శంకరాచార్యుడు వ్యాఖ్యానించిన దశోపనిషత్తులను ప్రమాణంగా తీసుకొని శాస్త్రీయంగా పరిశోధించి సమగ్రంగా వెలువరించిన లోతైన తాత్విక రచన ఇది. ఈ రచనకు తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది.
1992 లో భారతీయ సంస్కృతీ పరిణామక్రమంలో సంభవించిన వివిధ ఘట్టాలను, సంఘర్షణలను, సమన్వయాలను, వ్యత్యాసాలను వివరిస్తూ ”భారతీయ సంస్కృతి“ పుస్తకాన్ని రచించారు. శాస్త్రీయ దృష్టితో భారతీయ సంస్కృతీ పరిణామాన్ని వేదకాలం నుండి ఆధునిక పునర్జీవనోద్యమాల వరకు పరామార్శిస్తూ వెలువడిన ఈ పుస్తకానికి కూడా 1995లో తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం లభించింది.
ప్రముఖ చరిత్రకారుడు ఆచార్య కీ.శే. బి.ఎస్.ఎల్. హనుమంతరావు పరిశోధనలను విశ్లేషిస్తూ 'విశిష్ట విశ్లేషణ' అనే గ్రంథాన్ని 1996లో వెలువరించారు. ఇది వారి ఆఖరి ముద్రిత రచన.
విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సాహిత్య, చారిత్రక, తాత్విక సమస్యలకు సంబంధించి పెక్కు వ్యాసాలను రాశారు. బౌద్ధంలో గతితర్కంపై వీరు ఇంగ్లీషులో రాసిన వ్యాసం పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన 'బుద్ధిజం'లో భాగం అయింది. లెనిన్‌పై వ్రాసిన గ్రంథం సోవియట్ ల్యాండ్ ప్రచురణగా వచ్చింది. అనేక మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
మరణం
మార్చు78 సంవత్సరాల ముదిమి వయస్సులో కూడా తనకు అత్యంత అభిమానమైన బౌద్ధం గురించి "బౌద్ధం-పుట్టుక-పరిణామం" పేరిట ఒక చారిత్రిక గ్రంథాన్ని రాయ సంకల్పించి రెండు అధ్యాయాలను రాస్తూ విజయవాడలో 1996 ఏప్రిల్ 3 న అకస్మాత్తుగా మరణించారు.[1]
పురస్కారాలు
మార్చువీరి ప్రథమ రచన ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఉపనిషత్ చింతన, భారతీయ సంస్కృతి గ్రంథ రచనలకుగాను తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారాలు లభించాయి. జాషువా ఫౌండేషన్ వారి అవార్డు లభించింది. 1988లో అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[2] లభించింది.
రచనా విశిష్టతలు
మార్చు- చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృతి విషయాలను మార్క్సిస్టు దృక్కోణం నుండి అధ్యయనం చేయడం ఏటుకూరి బలరామ మూర్తి విశిష్టత. చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృతి వివిధ పరిణామ దశలలో ప్రజల పాత్ర, ఆనాటి ఆర్థిక, సాంఘిక నేపథ్యం వీరి రచనా విధానంలో ప్రతిబింబించడం వీరి గ్రంథాలకు ఈ విశిష్టతను చేకూర్చాయి. అందుకే అవి బహు జనాదరణ పొందాయి.
- చరిత్ర, తత్వశాస్త్రంలపై ఏటుకూరి రచనలు ప్రామాణిక గ్రంథాలైనప్పటికి అతని రచనా శైలి అత్యంత సులభంగాను, సంగ్రహంగాను వుండి చదువరులకు ఆద్యంతం ఆసక్తికరంగా వుంటాయి.
- ఏటుకూరి రచనలలో చక్కని సంయమన దృష్టి కనిపిస్తుంది. ఇతర మార్క్సిస్టు రచయితలలో సర్వ సాధారణంగా కనిపించే మార్క్సిస్టు పడికట్టు పదజాల ఆర్భాటం ఆయన రచనల్లో ఎక్కడా కనిపించదు. గతి తార్కిక భౌతికవాద ప్రభావంతో ఒక ఘట్టాన్ని, ఒక సంస్కృతిని, ఒక దర్శనాన్ని ఆర్థిక-సామాజిక నేపథ్యంలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాని మార్క్సిస్టు పడికట్టు పదజాల ధ్వనులుతో చదువరులపై ఆధిక్యం చూపించాలని యత్నించరు. అందువల్లే మార్క్సిస్టేతర పాఠకులను కూడా వీరి రచనలు ఆకట్టుకొని గాఢంగా ప్రభావితం చేసాయి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "ఏటుకూరి బలరామమూర్తికి విప్లవాంజలి". visalaandhra.com. Retrieved 2015-10-31.[permanent dead link]
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
- విశాలాంధ్ర డైలీ 02.04.2010 ( http://www.visalaandhra.com/essay/article-9513[permanent dead link])
- మిసిమి మాస పత్రిక 1996 మే లోని ఏటుకూరి బలరామ మూర్తి పై సంస్మరణ వ్యాసం- శ్రీ T.రవిచంద్ ( https://misimi1990.files.wordpress.com/2013/06/misimi_1996_05.pdf#page=5)