కప్పగంతుల లక్ష్మణశాస్త్రి
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అష్టభాషాకోవిదుడు. ఉద్దండ పండితుడు.[1] సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో మాతృభాష అయిన తెలుగుకు సమానమైన పాండిత్యం, అధికారం కల్గినవాడు. చమత్కారంగా మాట్లాడటంలో, గంగాప్రవాహ సమానమైన ఉపన్యాసంలో సాటిలేనివాడు.[2]
మహామహోపాధ్యాయ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి | |
---|---|
జననం | |
మరణం | 1980 జనవరి 10 | (వయసు 68)
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పండితుడు, సంపాదకుడు |
తల్లిదండ్రులు | శ్రీనివాస శాస్త్రి, పద్మావతి |
జీవితవిశేషాలు
మార్చుకప్పగంతుల లక్ష్మణశాస్త్రి వనపర్తి జిల్లా, వనపర్తిలో 1911, జూలై 2 వ తేదీన శ్రీనివాస శాస్త్రి, పద్మావతి దంపతులకు జన్మించాడు. ఇతడు వనపర్తిలో ప్రాథమిక విద్యను ప్రారంభించి తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చేరి పది సంవత్సరములపాటు అలంకరణ, వ్యాకరణ శాస్త్రాలు చదువుకొని ‘సాహిత్య శిరోమణి’ అయినాడు. తరువాత మద్రాసు మైలాపూరు సంస్కృత కళాశాలలో అద్వైత విద్యలో ఆరితేరాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో వ్యాకరణ శాస్త్రం లోతుపాతులను తెలుసుకున్నాడు. పులిసి కృష్ణమాచార్యులు, లక్ష్మీనరసింహశాస్త్రి, చక్రాల నరసింహాచారి, కరుంగళం కృష్ణశాస్త్రి, సేతు మాధవరావు మొదలైన పండితులు ఇతని గురువులు. వనపర్తి ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించాడు. తర్వాత హైదరాబాదులోని వివేకవర్ధని ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[2] రాజా రామేశ్వరరావు కాలంలో వనపర్తి సంస్థాన ఆస్థానకవిగా నియమించబడ్డాడు. ఇతని పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాదు రాష్ట్రముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఇతడిని హైదరాబాదులోని సిటీ కాలేజి లో ఉపన్యాసకుడిగా నియమించాడు. తర్వాత హైదరాబాదు ప్రభుత్వ సమాచారశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. పిమ్మట ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు. హైదరాబాదు టుడే, ఆంధ్ర ప్రదేశ్ మొదలైన ప్రభుత్వ పత్రికలకు సంపాదకుడుగా ఉన్నాడు. ఇతని శిష్యులలో పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, రవ్వా శ్రీహరి మొదలైనవారున్నారు. ఇతడు తర్క, మీమాంస శాస్త్రాలలో అగ్రగణ్యుడు. ఇతడు విజ్ఞాన వర్ధినీ పరిషత్తు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు.[3] ఇతడు 1981 జనవరి 10 వ తేదీన మరణించాడు.
రచనలు
మార్చుఇతడు అనేక స్వతంత్ర రచనలు, అనువాదాలతో పాటు పత్రికలకు, రేడియోకు అనేక వ్యాసాలు రాశాడు. వివిధ సభలలో ఇతడు చేసిన ఉపన్యాసాలు ఇతని పాండిత్యానికి నిదర్శనాలు. ఇతని పాండిత్యాన్ని బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు ప్రశంసించారు. ఇతడు మాదిరాజు విశ్వనాథరావుతో కలిసి రచనలు చేసి ఇరువురూ జంటకవులుగా పేరు పొందారు. ఇతని రచనలలో కొన్ని:
- ఆంధ్ర వ్యాకరణ వివరణము
- సంస్కృత పాఠమాల
- మణిమంజూష కథలు
- కర్ణసుందరి (అనువాదం)
- బదరీశతకానువాదం
- బౌద్ధ దర్శనం (అనువాదం)
- శాస్త్రీయ విజ్ఞానం (సంపాదకత్వం)
- భారతీయ సదాచార్ వ్యవహార్ (అనువాదం)
- స్తోత్ర లహరి
- మహాభారతము (అనువాదం)
- సూర్యోపరాగ దర్పణం
- విక్రమాంకదేవ చరితము
- తెలుగు లిపి సంస్కరణ
- లక్ష్మణరేఖలు
- ఆంధ్ర సంస్కృతకోశము (పుల్లెల శ్రీరామచంద్రుడుతో కలిసి)
బిరుదములు
మార్చు- మహామహోపాధ్యాయ
- ఆంధ్రబిల్హణ
- సుధీంద్రమౌళి
- బ్రాహ్మీభూషణ
పదవులు, సత్కారాలు
మార్చు- కాశీ సంస్కృత విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యుడుగా సేవలందించాడు.
- సురభారతి వ్యవస్థాపక అధ్యక్షుడు .
- ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపక సభ్యుడు.
- తిరువాన్కూర్, గ్వాలియర్ జగద్గురు శంకరాచార్యుల వారి చేత ఘనంగా సత్కరింప బడ్డాడు.
- విద్యామంత్రి మండలి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్వహణలో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలో ఇతడు ప్రత్యేకంగా సన్మానం అందుకొన్నాడు.
- సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయము నకు అధ్యక్షుడుగా వ్యవహరించాడు.
- కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ఎమిరిటస్ ప్రొఫెసర్ గా (సమ్మాన్య ప్రాచ్యాచార్యులు) గా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ గోలకొండ కవులసంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుటలు ౧౨౩, ౩౬౭
- ↑ 2.0 2.1 నంబరాజు రవిప్రకాష్ (5 August 2019). "మహామహోపాధ్యాయ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి". తెలంగాణ: 42. Archived from the original on 12 ఆగస్టు 2019. Retrieved 30 March 2020.
{{cite journal}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ కోట్ల వెంకటేశ్వరరెడ్డి (2019). వనపర్తి జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ. p. 30. Archived from the original on 28 మే 2020.