పుల్లెల శ్రీరామచంద్రుడు

పుల్లెల శ్రీరామచంద్రుడు (అక్టోబరు 24, 1927 - జూన్ 24, 2015), రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితుడు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు వంటివి తెలుగులోకి అనువదించి వ్యాఖ్యానించారు.[1]

పుల్లెల శ్రీరామచంద్రుడు
జననం
పుల్లెల శ్రీరామచంద్రుడు

(1927-10-24)1927 అక్టోబరు 24
మరణం2015 జూన్ 24(2015-06-24) (వయసు 87)
మరణ కారణంవార్ధక్యము
వృత్తిసంస్కృత ఆచార్యులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహామహోపాధ్యాయ
జీవిత భాగస్వామిసుబ్బలక్ష్మి
పిల్లలునిట్టల సత్యవతి, పుల్లెల సత్యనారాయణ శాస్త్రి
తల్లిదండ్రులు
 • పుల్లెల సత్యనారాయణ శాస్త్రి (తండ్రి)
 • సత్యవతి (తల్లి)

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

తూర్పుగోదావరి జిల్లా, ఐనవోలు మండలం ఇందుపల్లి గ్రామంలో 1927, అక్టోబరు 24 న నరకచతుర్దశి నాడు పుల్లెల సత్యనారాయణశాస్త్రి, సత్యవతి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఇందుపల్లికి సమీపంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో స్థిరపడ్డారు. తండ్రి వద్ద పంచకావ్యాలు, శ్రీహర్షుని నైషధం, మురారి అనర్ఘరాఘవం మొదలైన కావ్యాలను చదివారు. తండ్రివద్ద సిద్ధాంతకౌముది వ్యాకరణ గ్రంథాన్ని కూడా అధ్యయనం చేశారు. పిదప నరేంద్రపురం లోని సంస్కృతపాఠశాలలో చేరారు. అక్కడ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి శిష్యరికంలో కిరాతార్జునీయం వంటి ప్రౌఢకావ్యాలు, వ్యాకరణ గ్రంథాలు చదివారు. తరువాత మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో వేదాంత శిరోమణి చదివారు. ఆ సమయంలోనే వి. వెంకటాచలం అనే సహవిద్యార్థి వద్ద ఆంగ్ల భాష నేర్చుకున్నారు. హిందీ ప్రచారసభ వారి విశారద పరీక్ష పూర్తి చేశారు. 1950లో మలికిపురం హైస్కూలులో హిందీ పండితుడిగా ఉద్యోగం చేస్తూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1952లో తెలుగు విద్వాన్, 1953లో ఇంటర్మీడియట్,1955లో బి.ఎ., 1957లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి అలంకారశాస్త్రం ప్రధానాంశంగా ఎం.ఎ. చదివారు. అదే యూనివర్సిటీ నుండి ఆంగ్లంలో ఎం.ఎ. 1961లో ఉత్తీర్ణులయ్యారు. 1963లో హిందీలో అక్కడి నుండే ఎం.ఎ. పూర్తి చేశారు. 1966లో ఆర్యేంద్రశర్మ పర్యవేక్షణలో కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ పండితరాజ జగన్నాథ టు సాంస్క్రీట్ పొయటిక్స్ అనే అంశంపై సిద్ధాంతవ్యాసం సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు.

వివాహం మార్చు

వీరికి 14 ఏళ్ల వయసులో మంగిపూడి వెంకటశాస్త్రిగారి కుమార్తె సుబ్బలక్ష్మితో వివాహం జరిగింది. అప్పుడు ఆవిడ వయసు 8 సంవత్సరాలు.

ఉద్యోగ ప్రస్థానం మార్చు

వీరు 1948లో మలికిపురంలో ఒక హైస్కూలులో హిందీపండిట్‌గా తమ ఉద్యోగ పర్వాన్ని ప్రారంభించారు. 1951లో అమలాపురం కె.బి.ఆర్. కాలేజిలో సంస్కృత పండిట్‌గా చేరారు. 1957నుండి సంస్కృత లెక్చెరర్‌గా పదవిని నిర్వహించారు. 1960 నుండి 1965వరకు వరంగల్లు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 1965లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌కాలేజీకి బదిలీ అయ్యారు. 1976లో సుమారు నాలుగు నెలలపాటు తిరుపతిలోని ఎస్.వి.ఓరియంటల్ రిసెర్చి ఇన్స్‌టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. తరువాత తిరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీడర్‌గా కొనసాగారు. తర్వాత కొంతకాలానికి ప్రొఫెసర్‌గా పదోన్నతిపొంది సంస్కృత విభాగానికి అధిపతిగా ఉన్నారు. సంస్కృత అకాడెమీకి డైరెక్టర్‌గా 11 సంవత్సరాలు సేవలను అందించారు. సురభారతి సమితికి కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశారు.

రచనలు మార్చు

వీరు తమ పదునాలుగవయేట నుండి రచనలు చేయడం ప్రారంభించారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో 200లకు పైగా పుస్తకాలను వెలువరించారు.

తెలుగు మార్చు

 1. హిందీ తెలుగు వ్యాకరణము
 2. రాఘవ శతకము
 3. కుమతీ శతకము (సుమతీ శతకానికి పేరడీ)
 4. తెనాలి రామలింగని కథలు
 5. మనమతాలూ - సంప్రదాయాలు
 6. కాళిదాస కవితా వైభవము
 7. ధమ్మపదం (అనువాదం)
 8. వాక్యపదీయము (వ్యాఖ్య)
 9. వివేకచూడామణి (అనువాదం)
 10. బౌద్ధమతానికి ఆంధ్రులసేవ (అనువాదం)
 11. రత్నావళి (అనువాదం)
 12. భామహుని కావ్యాలంకారము (వ్యాఖ్య)
 13. బాణభట్టు (అనువాదం)
 14. కావ్యమీమాంస (వ్యాఖ్య)
 15. కావ్యాలంకార సూత్రవృత్తి (వ్యాఖ్య)
 16. కావ్యాదర్శం (వ్యాఖ్య)
 17. నీతిద్విషష్టిక (వ్యాఖ్య)
 18. కలివిడంబనము (వ్యాఖ్య)
 19. వైరాగ్య శతకము (వ్యాఖ్య)
 20. సభారంజన శతకము (వ్యాఖ్య)
 21. ఔచిత్య విచార చర్చ (వ్యాఖ్య)
 22. సువృత్త తిలకం (వ్యాఖ్య)
 23. కవికంఠాభరణం (వ్యాఖ్య)
 24. సేవ్యసేవకోపదేశః (వ్యాఖ్య)
 25. భారతీయ విజ్ఞానవేత్తలు
 26. తైత్తరేయోపనిషద్ (వ్యాఖ్య)
 27. కేనోపనిషద్ (వ్యాఖ్య)
 28. ప్రశ్నోపనిషద్ (వ్యాఖ్య)
 29. ముండకోపనిషద్ (వ్యాఖ్య)
 30. మాండూక్యోపనిషద్ (వ్యాఖ్య)
 31. నాగార్జున (అనువాదం)
 32. వ్యాసమహర్షి
 33. భవభూతి (అనువాదం)
 34. శ్రీ వాల్మీకి రామాయణము (అనువాదం - 10 సంపుటాలు)
 35. మహాకవి కాళిదాసు
 36. అగ్నిపురాణమ్‌ (అనువాదం - 2 సంపుటాలు)
 37. భాసుడు (అనువాదం)
 38. పాతంజల యోగదర్శనమ్‌ (వ్యాఖ్య)
 39. సంస్కృత సూక్తిరత్నకోశః (అనువాదం - 2 సంపుటాలు)
 40. జీవన్ముక్తి వివేకః (వ్యాఖ్య)
 41. చాణక్య నీతిసూత్రాణి (అనువాదం)
 42. సంస్కృత వ్యాఖ్యాన విమర్శ సంప్రదాయం
 43. నీతివాక్యామృతమ్‌ (అనువాదం)
 44. నాగానందము (అనువాదం)
 45. కావ్యప్రకాశ (వ్యాఖ్య)
 46. శ్యామలాదండకము (వ్యాఖ్య)
 47. న్యాయశాస్త్రవేత్తలలో రాజనీతి విశారదుడు (అనువాదం)
 48. ధ్వన్యాలోకః (వ్యాఖ్య)
 49. ధ్వన్యాలోకలోచనం (వ్యాఖ్య)
 50. కౌటిలీయమ్‌ అర్థశాస్త్రమ్‌ (వ్యాఖ్య)
 51. అలంకారశాస్త్రము - ఆధునిక సాహిత్యము
 52. జగద్ వంద్యులైన జగద్గురువు
 53. బ్రహ్మసూత్ర శాంకర భాష్యం (వ్యాఖ్య)
 54. ఆధ్యాత్మ రామాయణము (పెన్నా మధుసూధన్‌తో కలిసి)
 55. శ్రీమద్భగవద్గీతా శాంకరభాష్యం
 56. శంభోర్మూర్తిః (అనువాదం)
 57. అలంకార శాస్త్ర చరిత్ర
 58. ప్రాకృత భాషావాజ్మయ చరిత్ర
 59. శాస్త్ర సిద్ధాంతలేశ సంగ్రహః (వ్యాఖ్య)
 60. యాజ్ఞవల్క్య స్మృతిః (వ్యాఖ్య)
 61. సీతారావణ సంవాదఝరి (రెండు భాగాలు)
 62. మహిషశతకం
 63. భాసుడు (మోనోగ్రాఫ్)
 64. కాళిదాసు (మోనోగ్రాఫ్)
 65. శూద్రకుడు (మోనోగ్రాఫ్)
 66. పండితరాజ జగన్నాథుడు (మోనోగ్రాఫ్)
 67. ఆంధ్రదేశ మతములూ - సంప్రదాయాలూ (మోనోగ్రాఫ్)
 68. కౌండిన్య స్మృతి
 69. దక్షిణామూర్తి స్తోత్రము
 70. శ్రీ భగవద్గీత (అనువాదం)
 71. ఆదిత్య స్తోత్రరత్నమ్‌ (అనువాదం)
 72. హిందూమతము కొన్ని ఇతర మతాలు
 73. మానవతాజన్మప్రదాత మాన్యగురువరుడు
 74. శ్రీమద్రామాయణామృత తరంగిణిలో మనోభావలహరీ విలాసాలు
 75. శ్రీ శివదృష్టిః (వ్యాఖ్యానం)
 76. శ్రీ పుల్లెలవారి ప్రస్తావనలు
 77. విశ్వమానవహిత భగవద్గీత
 78. సర్వదర్శన సంగ్రహః (వ్యాఖ్య)
 79. మహాభారత సార సంగ్రహము
 80. శ్రీమద్రామాయణంలోని ఉపమాలంకారాల నిరుపమాన సౌందర్యం
 81. వాల్మీకి రామాయణం - మూలానుసారి అనువాదము
 82. నరజన్మ ప్రశస్తి - నరుని కర్తవ్యము
 83. లఘు సిద్ధాన్త కౌముది

సంస్కృతం మార్చు

 1. గీతాంజలి (టాగూర్ రచనకు అనువాదం)
 2. సుసంహత భారతం (6 అంకాల నాటకం)
 3. తెలుగు - సంస్కృత నిఘంటువు
 4. ధమ్మపదం (అనువాదం)
 5. రాగరోచి (అనువాదం)
 6. నిబంధ భాస్కరః
 7. పారశీక లోకోక్తయః (అనువాదం)
 8. రూపక పరిచయః
 9. శ్రీ రామ సహస్రనామ స్తోత్రమ్‌
 10. శ్రీ త్యాగరాజ సహస్రనామ స్తోత్రమ్‌
 11. మయూర విరచిత సూర్యదండకం (వ్యాఖ్య)
 12. శ్రీ రామచంద్ర లఘుకావ్యసంగ్రహః
 13. స్తుతిమంజరి
 14. వైజ్ఞానిక షాణ్ముఖం
 15. కో వై రసః
 16. ఆదిత్య సుప్రభాత స్తోత్రమ్‌
 17. పాశ్చాత్య తత్త్వశాస్త్రేతిహాసః
 18. సమసామయికమ్‌
 19. శ్రీ సత్యశివసుందరేశ్వరసుప్రభాతమ్‌

ఇంగ్లీషు మార్చు

 1. ధమ్మపదం (అనువాదం)
 2. The Contribution of Panditaraja Jagannatha to Sanskrit Poetics (రెండు భాగాలు)
 3. Panditaraja Jagannatha (మోనోగ్రాఫు)
 4. Some unexplored aspects of the Rasa theory (అనువాదం)
 5. Egalitarian and Peace seeking trait of the Indian Mind
 6. The Upanishadic Phylosophy
 7. Influence of Sanskrit on Telugu Language and Literature
 8. Sanskrit Idioms and Phrases
 9. Bhatti (మోనోగ్రాఫ్)
 10. Magha Mahakavi (అనువాదం)
 11. The Nectar Drops of Fine Statements in Patanjali's "Mahabhashya"
 12. Kaundinya Smriti

రచనల నుండి ఉదాహరణలు మార్చు

విద్యల కెవ్విధంబునను విల్వయెగానగరాదు చూడగన్
హృద్యములైన యాకళలు హేయములయ్యెను, విశ్వధారణా
భ్యుద్యత ధర్మమున్ నిరుపయుక్త విమూఢవిలాసయ్యెన్
చోద్యమదేమొకాని యిల సొమ్ములొకటే పరమాత్మ రాఘవా!

శృంగోత్తుంగ నగాటవీ నగరవిస్తీర్ణావనిన్ దిర్గుచోన్
త్వంగ త్తుంగ తరంగ భీకరమహావారాంనిధిన్ గాంచుచోన్
స్వాంగ ప్రేంఖరుడు గ్రహాకులనిరంతానంతమున్ జూడనే
ర్వంగా రాదె నరాణువెంత దురహంభావాధ్యమో రాఘవా!!

ఇల నిలువెత్తు నాణెములనిచ్చిన లొంగనివారలుందురా
నలిన భవుండు చెప్పినను నచ్చని వారలుకూడ నుంద్రు భా
మలు బ్రతిమాలినన్ మనసు మారని వారలునుంద్రుకాని యీ
ఖలుల పొగడ్త మాటలకు కాదనువారలు లేరు రాఘవా.

(రాఘవ శతకము (లోకాలోకనము) నుండి)

పురస్కారాలు మార్చు

 • 1962,1964లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే నగదు పురస్కారాలు
 • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీవారిచే అలంకారశాస్త్రంలో ఉత్తమ పండితునిగా సత్కారం
 • తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం.
 • 1994లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే విశ్వభారతి పురస్కారం.
 • 1996లో కేంద్రసాహిత్య అకాడెమీ వారి ఉత్తమ అనువాద పురస్కారం.
 • గుప్త ఫౌండేషన్‌, ఏలూరు వారిచే 1997లో శ్రీ కృష్ణమూర్తి సాహిత్యపురస్కారం.
 • 2000లో సనాతనధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి Eminent Citizen అవార్డు.
 • 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి "తెలుగు ఆత్మగౌరవ" పురస్కారం
 • 2002లో కేంధ్రసాహిత్య అకాడెమీ వారి ఉత్తమ సాహితీవిమర్శ పురస్కారం.
 • 2004లో బిర్లా ఫౌండేషన్ వారి వాచస్పతి పురస్కారం.
 • 2006లో కాళిదాస జ్ఞానరత్న పురస్కారం.
 • కాళిదాసు సంస్కృత విశ్వవిద్యాలయం, రాంటెక్ వారి రాష్ట్రీయ పురస్కారం.
 • 2007లో అజోవిభో కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవిత కళాసాధన పురస్కారం.
 • 2008లో బి.ఎన్.రెడ్డి సాహితీ పురస్కారం.
 • 2011లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం.
 • శిష్యబృందంచే కనకాభిషేకం.
 • మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కారం.
 • తెలుగుభాషా పురస్కారం 2011లో సి.పి.బ్రౌన్‌ అకాడమీ వారిచే.
 • రాష్టపతి పురస్కారం.
 • 2011లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (సాహిత్య రంగం).
 • 2012లో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం.
 • 2012లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం.
 • 2013లో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వారిచే గౌరవ డి.లిట్ పట్టా.

బిరుదులు మార్చు

 1. వేదాంతవిశారద
 2. వేదాంతవారధి
 3. మహామహోపాధ్యాయ
 4. పద్మశ్రీ
 5. శాస్త్రకళానిధి

పదవులు మార్చు

 • అధిపతి - సంస్కృత విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం
 • కార్యదర్శి - సురభారతి
 • సంచాలకుడు - సంస్కృత అకాడెమీ
 • కులపతి - సంస్కృత భాషా ప్రచారక్ సమితి

మరణం మార్చు

ఆయన కొద్దికాలం అనారోగ్యంతో బాధపడి, బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2015, జూన్ 24 బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

మూలాలు మార్చు

 1. "ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) | Free Gurukul Education Foundation (Values,Skills Based Education)". www.freegurukul.org. Retrieved 2020-04-07.
 • పద్మశ్రీ పురస్కృత పుల్లెల శ్రీరామచంద్రుడు (పుస్తకం) - డా.అరుణావ్యాస్ - 2013 - హైదరాబాద్