కాంచనపల్లి చిన వెంకటరామారావు
కాంచనపల్లి చిన వెంకటరామారావు తెలంగాణా విముక్తి పోరాటయోధుడు, రచయిత, న్యాయవాది. రాజకీయంగా పలు ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉంటూనే రచనావ్యాసంగాన్నీ, న్యాయవాద వృత్తిని కొనసాగించాడు.
కాంచనపల్లి చిన వెంకటరామారావు | |
---|---|
జననం | కాంచనపల్లి చిన వెంకటరామారావు ఏప్రిల్ 10, 1921 రావిపాడు, నల్లగొండ జిల్లా |
మరణం | మార్చి 13, 1992 |
వృత్తి | న్యాయవాది |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణా పోరాట యోధుడు, రచయిత |
జీవిత భాగస్వామి | జానకమ్మ |
పిల్లలు | ఇందిర, అరుణ, విజయలక్ష్మి, ప్రభాకర్‌రావు |
తల్లిదండ్రులు |
|
బంధువులు | కాంచనపల్లి పెద్ద వెంకటరామారావు (సోదరుడు) |
వృత్తి-వ్యక్తిగత జీవితం
మార్చునల్లగొండ జిల్లా సూర్యాపేటకు దగ్గరలోని రావిపాడులో 1921 ఏప్రిల్ 10వ తేదీన తన అమ్మమ్మగారి ఇంట్లో కాంచనపల్లి చిన వెంకటరామారావు జన్మించాడు.[1] ఇతని స్వగ్రామం పానగల్లు. ఇతని తండ్రి పేరు రామచందర్‌రావు, తల్లి పేరు శేషమ్మ. ఇతడు నాలుగవ తరగతి వరకు పానగల్లులో చదివాడు. తరువాత నల్లగొండలో మెట్రిక్ వరకు చదువుకున్నాడు. విద్యార్థి దశలోనే ఇతనికి పత్రికలు చదవడం అలవాటయ్యింది. అప్పట్లో షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు సంపాదకత్వంలో వెలువడుతున్న నీలగిరి పత్రిక ఇతనిపై ప్రభావాన్ని చూపింది. సాహిత్యం పట్ల అభిరుచిని కలుగజేసింది. ఇతడి మేనమామ బోయినపల్లి విశ్వనాథం ద్వారా ఇతనికి సోషలిస్టు సాహిత్యం పరిచయమై తద్వారా ఆదర్శభావాలు మొలకెత్తాయి. మెట్రిక్ తరువాత అక్కినేపల్లి వెంకటరామారావు ప్రేరణతో హైదరాబాదులో లా కోర్సులో చేరాడు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ న్యాయవిద్య నేర్చుకున్నాడు. 1941లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు. మూడవ ఆంధ్రమహాసభ అధ్యక్షుడు, న్యాయవాది అయిన పులిజాల వెంకటరంగారావు వద్ద జూనియర్‌గా చేరాడు. సాయుధపోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన నల్లా నర్సింహులు, బాల నిందితుడిగా జైల్లో మగ్గిన ఎర్రబోతు రాంరెడ్డి తదితర ఉద్యమకారుల తరఫున కోర్టులో వాదించాడు. ఆ తరువాత 1960లో నల్లగొండ నాగార్జున కళాశాలలో బి.ఎ. చదివాడు. 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. పూర్తి చేశాడు. ఇతడు జీవితంలో ఎక్కువకాలంలో పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షత వహించాడు. న్యాయవాది వృత్తిని జీవిత చరమాంకం వరకూ కొనసాగించాడు. ఇతడు 1992, మార్చి 13వ తేదీన తన 70వ ఏట మరణించాడు.[2]
రాజకీయ రంగం
మార్చుతెలంగాణా ప్రాంతంలో జరిగిన వివిధ ఉద్యమాలలో ఇతడు పాలుపంచుకున్నాడు. విద్యార్థి దశలోనే ఆంధ్ర మహాసభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఐదవ ఆంధ్రమహాసభ (1936), ఆరవ ఆంధ్రమహాసభ (1937)లకు మిత్రులతో కలిసి హాజరయ్యాడు. దేవులపల్లి రాఘవేంద్రరావుతో కలిసి బ్రిటిష్ పాలనలో ఉన్న ఆంధ్రప్రాంతాలలో పర్యటించాడు. నాగపూరు వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నాడు. భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన పదకొండవ ఆంధ్రమహాసభల నాటికి ఇతడు అతివాదులవైపు మొగ్గు చూపాడు. తరువాత ఇతడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. తెలంగాణా సాయుధ పోరాట ఉద్యమ కాలంలో ఇతడు కృష్ణా జిల్లా రామాపురం గ్రామంలో అరెస్ట్ అయ్యాడు. కడలూరు, రాయవెల్లూరు, వరంగల్లు జైళ్లలో ఒక ఏడాది శిక్షను అనుభవించాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో కూడా ఇతడు మరోసారి అరెస్టయి రాజమండ్రి, ముషీరాబాద్ జైళ్లలో కారాగారవాసం చేశాడు. ఇతడు 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో నల్లగొండ జిల్లా చినకొండూరు నియోజక వర్గం నుండి శాసనసభ సభ్యునిగా పి.డి.ఎఫ్ తరఫున ఎన్నికైనాడు. శాసనసభాపక్ష ఉపనాయకుడిగా పనిచేసినాడు. 1962లో నల్లగొండ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచాడు. జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడిగా, నల్లగొండ జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టరుగా కూడా ఇతడు తన సేవలను అందించాడు. పానగల్లు మ్యూజియం ఏర్పాటుకు కృషి చేశాడు.[1]
సాహిత్య సేవ
మార్చుసాహిత్యరంగంలో ఇతడు చేసిన సేవలు గుర్తించదగినది. విద్యార్థి దశలోనే ఇతడు తన స్వగ్రామమైన పానగల్లులో ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయంను స్థాపించాడు. ఆ రోజుల్లోనే ఒక లిఖిత మాసపత్రికను నడిపాడు. గోల్కొండ పత్రిక, ఆంధ్రవాణి తదితర పత్రికలలో వ్యాసాలు రచించాడు. ఇతడు వ్రాసిన కథలు, కవిత్వం కూడా ఈ పత్రికలలో అచ్చయ్యింది. తెలంగాణ విముక్తి పోరాటకాలంలో తాను ప్రత్యక్షంగా చూసిన వాతావరణాన్ని తన కథల ద్వారా అక్షరబద్ధం చేశాడు. 1952లో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షునిగా పనిచేశాడు. రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా తన సేవలను అందించాడు. 1967లో నల్లగొండలో ఏర్పాటయిన యువరచయితల సమితికి వెన్నుదన్నుగా నిలిచి ఎందరో యువరచయితలకు ప్రోత్సాహాన్ని అందించాడు. ఆ సంస్థ తరఫున మాలిక, దర్పణం, సమర్పణ అనే కథా సంకలనాలను, సంఘర్షణ అనే కవితా సంకలనాన్ని వెలువరించాడు. దర్పణం అనే త్రైమాసిక సాహిత్య పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. 1970, 1974, 1983లలో మూడు సార్లు నల్లగొండ జిల్లా రచయితల మహాసభలను నిర్వహించాడు. ఇతడు "మన ఊళ్ళో కూడానా.." అనే పేరుతో కథాసంపుటిని, "అరుణరేఖలు" అనే కవితా సంపుటిని ప్రచురించాడు. తన రష్యా పర్యటన అనుభవాలను "మధుర స్మృతులు" అనే పేరుతో గ్రంథస్తం చేశాడు. గొల్లసుద్దులు, బుర్రకథలు వంటి ప్రక్రియలలో కూడా కొన్ని రచనలు చేశాడు.[1]
కుటుంబం
మార్చుఇతడు జానకమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ప్రభాకరరావు అనే కుమారుడు, ఇందిర, అరుణ, విజయలక్ష్మి అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు. ప్రభాకరరావు వైద్యుడిగా పనిచేశాడు.[1]