ఆంధ్ర మహాసభ (తెలంగాణ)

ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

ఆంధ్ర మహాసభ (IAST: ''Andhra Mahasabha'') నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రాంతపు తెలుగువారు ప్రారంభించిన సంఘం. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజలు ఆంధ్రమహాసభను స్థాపించారు. 1920వ దశకం చివర్లో మాడపాటి హనుమంతరావు నేతృత్వములో తెలుగు ప్రజలు సంఘటితమై ఒక సంఘముగా ఏర్పడి 1930 నుండి 1945 వరకు 13 ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. తెలంగాణా ప్రాంతములో ఆంధ్ర మహాసభ యొక్క కార్యకలాపాలు నిజాం వ్యతిరేకముగా ప్రజలలో చైతన్యము సృష్టించి తెలంగాణా సాయుధ పోరాటానికి దారితీసాయి.

ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు: మాడపాటి హనుమంతరావు,‌ రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, దాశరథి కృష్ణమాచార్య, పులిజాల వెంకటరంగారావు, అళ్ళంపల్లి వెంకటరామారావు, కాళోజీ నారాయణరావు, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు, ఆరుట్ల రామచంద్రరెడ్డి, సర్వదేవాభట్ల రామనాధం, చీరావూరి లక్ష్మి నరసయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు.

నేపథ్యం

మార్చు

భారతదేశంలోని సంస్థానాలలో కెల్లా హైదరాబాదు సంస్థానం పెద్దది. జనాభా ఒక కోటి ఆరవై లక్షలు. సంస్థానం కింద తెలంగాణ, మరాఠ్వాడ (మహరాష్ట్ర), కర్ణాటకలలోని భాగాలు ఉండేవి. 88 శాతం హిందువులు. మిగిలిన వారిలో అధిక భాగం ముస్లింలు, క్రైస్తవులు. నిజాం పాలనలో మత స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఒకసారి దసరా పండుగ, మొహర్రం (పీర్ల పండుగ) ఒకేసారి వచ్చాయి. సర్కారు మాత్రం మొహర్రంని మాత్రమే అన్ని ప్రభుత్య కళాశాలలలో జరిపించింది. నవాబు యొక్క బ్రిటీషు ప్రభుత్వ రాజభక్తి వల్ల క్రైస్తవుల పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు.

ఆంధ్ర మహాసభ అవిర్భావం

మార్చు

1922లో హైదరాబాదులోని వివేకవర్ధిని థియేటరులో ఒక హిందూ సాంఘిక సభ జరిగింది. ఆ సభలో ప్రసంగాలన్నీ ఉర్దూ, మరాఠీ భాషలలోనే జరిగాయి. ఒకే ఒక వక్త అల్లంపాటి.వెంకట రామారావు- ఒక ప్లీడరు, తెలుగులో మాట్లాడబోగా సభ్యులంతా గేలి చేసి, గోల చేసి ఆతనిని మాట్లాడనివ్వలేదు. ఆ రోజుల్లో హైదరరాబాదు నగరంలో మహారాష్ట్రుల సంఖ్య తెలుగువారి కంటే చాల తక్కువ. అయినా అన్ని రంగాలలోను తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉండేవారు. తెలుగు భాషకు మర్యాద, మన్నన ఉండేవికావు. ఆనాటి దుస్థితిని గూర్చి మాడపాటి హనుమంతరావు తన ఆంధ్రమహాసభ చరిత్రలో వివరించాడు. ఆ సభలో తెలుగు భాషకు, తెలుగు వక్త జరిగిన అవమానాన్ని గమనించిన కొందరు యువకులు కలిసి, ఆంధ్రభాషకు, సంస్కృతికి నగరంలో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో "ఆంధ్రజన సంఘం"ను స్థాపించారు. నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమానికి అదే నాంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నిజాం రాష్ట్రంలోని అన్ని తెలుగు సంస్థలను కలిపి ఒక ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ సంఘం సమావేశాలు జరుగుతూ ఉండేవి. ఆంధ్రభాష, ఆంధ్ర సంస్కృతి అభివృద్ధికి తీసుకొనవలసిన చర్యల గూర్చి, సాధక బాధకాలు గురించి చర్చించేవారు. నిజాం రాష్ట్రంలోని ఏ తెలుగు సంస్థ ఆయినా సరే, తమ ప్రతినిధిని ఈ కేంద్ర సంఘానికి పంపవచ్చును. ఈ కేంద్ర సంఘానికి మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వుండేవాడు. రాష్ట్రంలోని తెలుగు సంస్థల అభివృద్ధికి కేంద్ర సంఘం ప్రచారకులను పంపించి తోడ్పడుతూ వుండేది. ఈ కాలంలో ఈ సంఘం "వెట్టిచాకిరి", "వర్తక సంఘం" అన్న రెండు ముఖ్యమైన కరపత్రాలను ప్రచురించింది.

మహాసభలు

మార్చు
మొదటి ఆంధ్రమహాసభ
 
ఎం.జయంత్ చిత్రించిన ప్రథమ ఆంధ్ర మహాసభ దృశ్యం

ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగు భాష, సంస్కృతుల పునరుజ్జీవనం కోసం, ఫ్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్నీ చేరిన మహానది అయినట్లుగా మహోద్యమ స్థాయికి చేరాయి. 1930లో జోగిపేటలోప్రథమాంధ్ర మహాసభ జరిగింది. ఆ మహాసభకు రాష్ట్రంలోని తెలుగు ఉద్యమాలన్నీ వచ్చి కలిశాయి. రూపాయి రుసుము చెల్లించిన ప్రతివారు ఆ మహాసభకు ప్రతినిధే. అప్పటికి ఒక నిర్ధిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు. దానికి సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా, సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి. బాల్యవివాహాలు, వితంతు వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది. ఈ సభలో మరాఠీ నాయకుడైన వామన్ నాయక్ ప్రధాన పాత్ర వహించాడు. ఆనాటికింకా ప్రజల్లో తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక సంఘటన చెపితే చాలును. భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు. అతను ఒక సమస్యపైన మాట్లాడబోయే సరికి సవర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఈప్రథమాంద్ర మహాసభలో ఛాందసులదే పైచేయ మహిళా ఆంద్ర సభకు నడింపల్లి సుందరమ్మ అద్యక్షురాలు

రెండవ ఆంధ్రమహాసభ

నిజాం రాష్ట్ర రెండవ ఆంధ్రమహాసభ దేవరకొండలో 1931లో జరిగింది. అప్పటికే గాంధీ ఇర్విన్ ఒడంబడిక కుదిరింది. ఈ సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షుడు. ఈ మహాసభలో కూడా సాంఘిక సమస్యలే ప్రముఖ స్థానం వహించాయి. మొదటి మహాసభలో ప్రధానపాత్ర వహించిన వామన్ నాయక్‌కు ప్రత్యర్థిగా రెండవ సభలో మరో మరాఠీ నాయకుడు కేశవరావు కూడా వచ్చాడు. సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. కేశవరావు సంస్కరణవాది. యువకుల కృషితో ఈ మహాసభలో ఛాంధసులు ఓడిపోయారు. చర్చలలో మరాఠీ నాయకులు ప్రధానపాత్ర వహించినప్పటికీ చర్చలన్నీ తెలుగులోనే జరిగాయి. తీర్మానాలు మాత్రంప్రథమ మహాసభలాగే ఈ మహాసభలో కూడా ప్రభుత్వాన్ని ప్రార్థించి, ప్రాధేయపడే రీతిగానే ఉన్నాయి.

మూడవ ఆంధ్రమహాసభ

రెండవ ఆంధ్రమహాసభ జరిగిన తర్వాత ప్రభుత్వ దృష్టి పూర్తిగా యిటు పడింది. ఆంధ్రమహాసభల నిర్వహణకు అనుమతి దొరకడం కష్టమైంది. ఎట్టకేలకు అనుమతి సంపాదించేసరికి మూడేళ్ళు పట్టింది. అందుకనే తృతీయ ఆంధ్రమహాసభను 1934లో జరపవలసి వచ్చింది. ఇది ఖమ్మంలో జరిగింది. ఆనాడు ఖమ్మం, వరంగల్లు జిల్లాలో ఉండేది. ఖమ్మం ఆంధ్ర మహాసభకు పులిజాల వెంకటరంగారావు అధ్యక్షత వహించారు. ప్రతి ఆంధ్రమహాసభ సందర్భంలోనూ మహిళాసభ కూడా జరగడం రివాజు. ఈ మహాసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని ప్రభుత్వం నిషేధించిన తీర్మానాలను మహిళా మహాసభలో ప్రవేశపెట్టారు.

నాల్గవ ఆంధ్రమహాసభ

నాల్గవ ఆంధ్రమహాసభ 1935 డిసెంబరులో సిరిసిల్లలో జరిగింది. దీనికి మాడపాటి హనుమంతరావు అధ్యక్షుడు. వివిధ విషయాలపై అనేక తీర్మానాలు ఆమోదించాల్సిన మహాసభ గతానుగతంగానే నడిచింది. ఆంధ్రోద్యమానికి వ్యవస్థాపకుడు ఆయిన మాడపాటి హనుమంతురావు మహాసభకు, ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా మహాసభకు ఆధ్యక్షత వహించటం ఈ మహాసభ ప్రత్యేకత. మారాఠీ నాయకుల ప్రాబల్యంతో ప్రారంభం ఆయిన ఆంధ్రమహాసభలో దేవరకొండ సభ నాటికే అందరూ తెలుగులోనే మాట్లాడటం మొదలు పెట్టేరు. ఆరోగ్యకరంగా సాగుతున్న ఈ పరిణామాలు సిరిసిల్ల మహాసభలో తీవ్రతరమయ్యాయి. ఆంధ్రమహాసభ వ్యవహరాలన్నీ తెలుగులోనే జరగాలనీ, తీర్మానాలు, ప్రసంగాలు అన్నీ తెలుగులోనే ఉండాలని భాషావాదులు మహాసభ నిబంధనావళిలో పెట్టేరు. నిజాం సంస్ధానంలో తెలుగు భాషకు, సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని ఎదుర్కొనడం కోసం ఉద్రిక్తులైన కొందరు యువకులు ఆలాంటి క్లాజును చేర్పించారు. అందుకని వారి సదుద్దేశాన్ని ఎవరూ శంకించవలసిన పనిలేదు. అయితే రావి నారాయణరెడ్డి ఈ క్లాజును సమర్థించలేదు.

ఐదవ ఆంధ్రమహాసభ

1936లో షాద్ నగర్‌లో జరిగిన ఐదవ ఆంధ్రమహాసభకు కొండా వెంకటరంగారెడ్డి ఆధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో చేసిన తీర్మానాల్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. కానీ అన్ని సభలకు వచ్చినట్లే ఈ సభకు కూడా కన్నడ, మరాఠా నాయకులు వచ్చి మహాసభ వేదికనలంకరించారు. ఆయితే నాల్గవ మహాసభలో భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు మూలంగా వారు నోరు మెదపటానికి కూడా వీలులేకపోయింది. చివరకు వారు తమ సందేశాన్ని కూడా ఇవ్వకుండా తిరిగి వెళ్ళవలసివచ్చింది.

ఆరవ ఆంధ్రమహాసభ

ఆరవ ఆంధ్రమహాసభ 1937లో నిజామాబాదులో జరిగింది. దీనికి మందుముల నరసింగరావు ఆధ్యక్షత వహించాడు. భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు వలన ఎదురైన దుష్ఫలితాలు ఈ మహాసభలో మరీ స్పష్టంగా బయటపడ్డాయి అని రావి నారాయణరెడ్డి అన్నాడు. మరాఠా నాయకుడైన కాశీనాథరావు ముఖ్ పాల్కర్, మౌల్వి గులాం భషానీ, వీరిద్దరూ ఆహ్వాన సంఘం సభ్యులు. మహాసభ నియమావళి మేరకు వీరిద్దరూ కూడా విషయ నిర్ణయసభకు ఎన్నికైనారు. ఈ సభలో వీరు ఆంధ్రేతర భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నించారు. అందుకు భాషావాదుల క్లాజు అడ్డం వచ్చింది. నియమావళిలోని 31వ క్లాజు ప్రకారం ఆంధ్రేతర భాషలో ఎవరూ ప్రసంగించడానికి వీల్లేదని నందగిరి వెంకటరావు నాయకత్వాన భాషావాదులు అభ్యంతరం లేవదీశారు. దీనిపైన విషయ నిర్ణయసభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరికి రావి నారాయణరెడ్డి జోక్యంతో వారికి మాట్లాడే ఆవకాశం లభించింది. రాజకీయ హక్కులు ఏ కోశానాలేని ఆ రోజుల్లో మహాసభ నాయకులు తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకున్నా అప్పటికున్న చట్టాలకు లోబడి అతికష్టం మీద సభను నిర్వహిస్తూ వున్నా ఆసలు ఆంధ్రోద్యమం పుట్టుకలోనే గల రాజకీయ ప్రాముఖ్యాన్ని విస్మరించరాదు. ఆనాడు రాష్ట్రం నలుచెరగులా అంధకారం వ్యాపించి ఉంది. ఆలాంటి రోజుల్లో ఆంధ్రోద్యమం ఒక చిన్న దీపంలాగా వెలిగేది. ప్రజలకు మార్గం చూపించేది.

ఏడవ ఆంధ్రమహాసభ

సప్తమాంధ్ర మహాసభ హైదరాబాద్ జిల్లా (ప్రసుత రంగారెడ్డి జిల్లా) మల్కాపురంలో 1940లో జరిగింది. దీనికి మందుముల రామచంద్రరావు ఆధ్యక్షత వహించాడు. 1938 నుంచి స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహోద్యమం ఆరంభం అయింది. ఆంధ్ర మహాసభ కార్యకర్తలైన యువకులు ఈ సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. అందువల్ల ఈ మహాసభ జరగటంలో ఆలస్యం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయ్యంగార్ కమిటీ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. ఈ ఏడవ మహాసభలో చర్చకు వచ్చిన ప్రధాన తీర్మానం రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించింది. మహాసభలో ఈ తీర్మానంమీద జరిగిన చర్చల గురించి మాడపాటి హనుమంతరావు తన "ఆంధ్రోద్యమం" అన్న గ్రంథంలో ఈ విధంగా రాసాడు: "19 జూలై 1939 నాడు ప్రభుత్వంవారి వలన ప్రకటింపబడిన రాజ్యాంగ సంస్కరణములు తీవ్రముగా విమర్శించి ఖండింపబడుటయేగాక అట్టి నిరుపయోగములును, ఆభివృద్ధి నిరోధకములును అగు సంస్కరణములను బహిష్కరించవలయునను తీర్మానము ప్రతిపాదింపబడెను. దీనిలోని 'బహిష్కరించవలయును' అను భాగమును తొలగించవలయునని మితవాద నాయకులు ప్రవేశ పెట్టిరి. ఉభయ పక్షముల వాదములు సయుక్తికముగా జరిపిన మీదట తీర్మానమును ఓటుకు పెట్టగా సవరణ వీగిపోయి తీర్మానము అత్యంత బహుళ సంఖ్యామోదము పొంది అంగీకరింపబడెను".

ఎనిమిదవ ఆంధ్రమహాసభ
తొమ్మిదవ ఆంధ్రమహాసభ
పదవ ఆంధ్రమహాసభ
పదకొండొవ ఆంధ్రమహాసభ

పదకొండవ ఆంధ్రమహాసభ 1944లో భువనగిరిలో జరిగింది. రావి నారాయణరెడ్డి ఆ సభకు అధ్యక్షత వహించాడు. ప్రసిద్ధ కవి సుద్దాల హనుమంతు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు నల్లా నరసింహులు తదితరులు స్వచ్ఛంద సేవకులుగా ఈ సభల్లో పనిచేసారు. భువనగిరి సభలో సైద్ధాంతిక విభేదాల వల్ల ఆంధ్ర మహాసభలో చీలిక యేర్పడింది. చీలిక వర్గమైన మితవాద సభ్యులు ఆంధ్ర మహాసభ నుండి నిష్క్రమించి వేరే సదస్సును జరుపుకున్నారు. ఈ మిగిలిన ప్రధాన వర్గమే తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకత్వ పాత్ర పోషించింది.[1]

పన్నెండవ ఆంధ్రమహాసభ

పన్నెండవది చివరిదైన ఆంధ్రమహాసభ 1945లో ఖమ్మంలో జరిగింది. ఈ సభలో ప్రజల కోర్కెల సాధనకై చురుకుగా పోరాడాలని పిలిపునిచ్చారు.

మూలాలు

మార్చు
  • Heroic Telengana: Reminiscences & Experiences By Rāvi Nārāyaṇareḍḍi పేజీ.11-24 (1973) Communist Party of India
  1. Telangana People's Armed Struggle, 1946-1951. Part One: Historical Setting By P. Sundarayya Social Scientist, Vol. 1, No. 7. (Feb., 1973), pp. 3-19.[1]