తెలంగాణ విముక్తి పోరాట కథలు

తెలంగాణా విముక్తి పోరాట కథలు ప్రముఖ కథావిమర్శకుడు వాసిరెడ్డి నవీన్ సంపాదకత్వంలో ప్రచురితమైన కథాసంకలనం. 1940 దశకంలో నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా చెలరేగిన తెలంగాణా విముక్తి పోరాటం(దీనికి తెలంగాణా సాయుధ పోరాటం వంటి ఇతర పేర్లూ ఉన్నాయి) వస్తువుగా పలువురు రచయితలు రాసిన కథలను ఈ పుస్తకంగా సంకలనం చేశారు.

తెలంగాణా విముక్తి పోరాట కథలు
కృతికర్త: అడ్లూరి అయోధ్యరామకవి, వట్టికోట ఆళ్వారుస్వామి, వేనేపల్లి ఆంజనేయులు,
కిరణ్, సి.వి.కృష్ణారావు,నెల్లూరి కేశవస్వామి,
పి.కె.ఆర్.శాస్త్రి,కె.వి.రామారావు,పి.డి.ప్రసాదరావు,
పి.వి.నరసింహారావు,రాంషా,పొట్లపల్లి రామారావు,
బి.ఎన్.రెడ్డి,ఉప్పల లక్ష్మణరావు,లక్ష్మీకాంత మోహన్,
ఎం.వెంకటరావు,గంగినేని వెంకటేశ్వరరావు,పి.వెంకటేశ్వరరావు,
తుమ్మల వెంకటరామయ్య, శారద (ఎస్.నటరాజన్), తెన్నేటి సూరి
సంపాదకులు: వాసిరెడ్డి నవీన్
బొమ్మలు: చిత్తప్రసాద్, మోహన్, చంద్ర
ముఖచిత్ర కళాకారుడు: అన్వర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంకలనం
ప్రచురణ: డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్
విడుదల: సెప్టెంబరు, 2008
పేజీలు: 240
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-0-9766514-1-6

రచన నేపథ్యం

మార్చు

తెలంగాణా విముక్తి పోరాట కథలు సంకలనంలోని పలు కథలు 1945 నుంచి 1973 వరకూ ప్రచురితమైన తెలంగాణా సాయుధ పోరాటాన్ని వస్తువుగా స్వీకరించిన కథలు. ఈ సంకలనంలో చేరిన 32 కథలను 23మంది రచయితలు రాశారు. ప్రముఖ కథావిమర్శకుడు వాసిరెడ్డి నవీన్ వివిధ పత్రికల్లో, పలు సంకలనాల్లో ప్రచురింపబడిన ఈ కథలను ఏర్చికూర్చి 2008లో ప్రచురించారు. డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఈ పుస్తకానికి ప్రచురణకర్తగా వ్యవహరించింది. 1981లో ప్రజాసాహితి పత్రిక ప్రత్యేకసంచిక సంపాదకునిగా వ్యవహరించిన కాలంలో నవీన్ తెలంగాణా రైతాంగ సాయుధ ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో సేకరించిన పోరాట కథలను చారిత్రిక నేపథ్యంతో కలిపి తెలంగాణా పోరాట కథలు సంకలనంగా నవీన్ సంపాదకత్వంలో వెలువరించారు. అనంతర కాలంలో సేకరించిన మరిన్ని కథలతో ఇంకా సమగ్రంగా ఈ పుస్తకాన్ని వెలువరించారు.[1]

రూపకల్పన

మార్చు

తెలంగాణా విముక్తి పోరాట కథలు సంకలనాన్ని పోరాట కథలతో పాటు సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించిన ఆనాటి చిత్రాలు, ఛాయాచిత్రాలు జతచేశారు. తెలంగాణా సాయుధ పోరాటంతో అవినాభావ సంబంధాన్ని కలిగిన బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్ పోరాటాన్ని చిత్రీకరిస్తూ వేసిన చిత్రాలు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ సునీల్ జెనా ఆ సమయంలో నైజాంలో విస్తృతంగా తీసిన ఫోటోలు సంకలనంలో ఉపయోగించారు. తెలంగాణా పోరాటాన్ని నేపథ్యంగా స్వీకరించి తీసిన సినిమా మా భూమి స్టిల్స్‌ని, ప్రముఖ చిత్రకారులు చంద్ర, మోహన్‌లు వివిధ సందర్భాల్లో గీసిన బొమ్మలను కూడా వాడారు.

కథల వివరాలు

మార్చు

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రచురితమైన కథలు ఎక్కువ సంఖ్యలో, అనంతర కాలంలో ప్రచురితమైనవి కొద్ది సంఖ్యలో ఈ సంకలనంలో చేరాయి. 1945లో వెలువడ్డ వట్టికోట ఆళ్వారుస్వామి చిన్నప్పుడే, పొట్లపల్లి రామారావు న్యాయం కథలు, 1946లో ప్రచురితమైన కథల్లో వేనేపల్లి ఆంజనేయులు రచించిన పాడియావు, ఆవుల పిచ్చయ్య రాసిన ఊరేగింపులు, దౌరా, పి.వెంకటేశ్వరరావు రచన చేసిన రహీంభాయి, అదిపంట కాదా కథలు సంకలనంలో చేరాయి. 1947లో పర్చా దుర్గాప్రసాదరావు రచించిన పన్నులు ఇవ్వం, 1948లో ప్రచురితమైన ప్రయాగ కోదండరామశాస్త్రి రాసిన నవజాగృతి, పి.వి.నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ, అట్లూరి పిచ్చేశ్వరరావు విముక్తి, రాంషా మత్తానయ్య మరణం, లక్ష్మీకాంతమోహన్ మహాశక్తి, ఎం.వెంకటరావు జీవకార్యుణ్యచర్య, తుమ్మల వెంకటరామయ్య రాసిన మీరు గెలుస్తారు, పెళ్ళి చేశారు, శారద(ఎస్.నటరాజన్) రచించిన కొత్త వార్త, గెరిల్లా గోవిందు, తెన్నేటి సూరి సంధిలేదు కథలు ఈ సంపుటాల్లో ఉన్నాయి. 1949లో ప్రచురించిన కథల్లో ఎన్.వెంకటేశ్వర్లు రాసిన భూతాలు కథ, అనంతర కాలంలో ప్రచురితమైన నెల్లూరి కేశవస్వామి యుగాంతం(1982), బి.ఎన్.రెడ్డి రాసిన ఆయువుపట్టు, వుప్పల లక్ష్మణరావు రాసిన గెరిల్లా(1975) కథలు సంకలనంలో చోటుచేసుకున్నాయి.

మూలాలు

మార్చు
  1. తెలంగాణా విముక్తి పోరాట కథలు(పుస్తకం):సంపాదకుని ముందుమాట:వాసిరెడ్డి నవీన్:పే.5-7