కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం

కాకతీయ పరిపాలనా కాలంలో వ్యవసాయ రంగ స్థితిగతులు
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సేనాధిపతి రుద్రుడు నిర్మించిన పాకాల చెరువు

కాకతీయుల కాలం (11వ శతాబ్ది - 13వ శతాబ్ది) లో ప్రజల ప్రధానవృత్తి యైన వ్యవసాయం వారి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించింది. గోధుమలు, వరి, కొర్రలు, జొన్నలు, చెరుకు వంటివి, తోటల వ్యవసాయంతో కొబ్బరి, జామ, మామిడి, అరటి వంటి పంటలు పండించేవారు. కొన్ని ఆహార పంటలు కాగా, మరికొన్ని పంటలు పంచదార, బెల్లం, నూనె, వస్త్ర పరిశ్రమలకు ఆధారంగా ఉండేవి. దానితో కాకతీయ చక్రవర్తులు వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక సంస్కరణలు చేపట్టారు. సాగునీటి వనరుల పెంపు కోసం చెరువులు, భారీ సరస్సుల నిర్మాణం, సాగులో లేని కొత్త భూములలో వ్యవసాయం చేపట్టడానికి ప్రత్యేక చర్యలు వంటివి కాకతీయుల వ్యవసాయ విధానంలో కీలకంగా ఉండేవి. 11వ శతాబ్ది అర్థభాగంలో కాకతీయులు స్వాతంత్ర్యం ప్రకటించుకోవడానికి కొన్నేళ్ళ ముందు నుంచీ వారు వ్యవసాయరంగంపై దృష్టిపెట్టడం, సంస్కరణలు చేపట్టడం ప్రారంభమవుతున్న ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కృషి కాకతీయ సామ్రాజ్య పతనం వరకూ కొనసాగాయి. ఈ చర్యల ద్వారా కాకతీయ సామ్రాజ్య వ్యాప్తంగా వందలాదిగా చెరువులు, సరస్సులు ఏర్పడ్డాయి. అడవులను కొట్టి శ్రీశైలం, పాకాల, మంథని, ఏటూరు నాగారం వంటి ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలను సాగుకు తెచ్చి, వందల గ్రామాలను ఏర్పరిచారు.

వ్యవసాయ స్థితిగతులుసవరించు

కాకతీయుల కాలంలో ప్రధానంగా గోధుమలు, వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు లాంటివి పండించేవారు. చెరువుల కింద కొబ్బరి, జామ, మామిడి, అరటి, ఆకుమడులు వంటి తోటలు ఉండేవి. చెరుకు, నూనెగింజలు వంటి పంటల మీద ఆధారపడి పంచదార, బెల్లం, నూనె పరిశ్రమలు గ్రామగ్రామాన ఏర్పరిచేవారు. ప్రత్తి పంట వస్త్రాల నేతకు ఉపకరించేది.

సంస్కరణలుసవరించు

సాగునీటి వనరుల పెంపుసవరించు

 
వరంగల్ కోటకు సమీపంలోని శివనగర్ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి ఒక బావి

ఆనాటి వ్యవసాయం వర్షాధారం కావడంతో వర్షపునీటిని సమర్థంగా వినియోగించుకోవడం లక్ష్యంగా కాకతీయులు భారీఎత్తున నిర్మాణాలు సాగించారు. కాకతీయ చక్రవర్తులు సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు అన్న నాలుగు రకాల నిర్మాణాలు చేపట్టేవారు. వాటిలోనూ చెరువులు, సరస్సుల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టారు. సరస్సులు పెద్ద విస్తీర్ణంలో ఉండేవి, వీటికి పలు చెరువులతో అనుసంధానం ఉండేది. చెరువులు ప్రతీ ఊళ్ళోనూ ఉండి వర్షపు నీరు ఒడిసిపట్టడానికి, సరస్సుల వంటి భారీ నీటివనరులకు అనుసంధానించడానికి పనికివచ్చేవి. ఊరికీ అనుబంధంగా ఆలయం, ఆలయానికి ఈశాన్యంలో చెరువు కట్టించేవారు. ఊరికి దిగువన చెరువు, చెరువుకు దిగువన వ్యవసాయ భూములు ఉండేలా జాగ్రత్తపడడంతో ఊరిలో కురిసిన వాననీరు చెరువు నింపేది కానీ వరదలు గ్రామాన్ని ముంచెత్తేవి కావు.

11వ శతాబ్ది రెండో అర్థభాగంలో కాకతీయ పాలకుడైన ప్రోలయరాజు చాళుక్యుల సామంతునిగానే ఉండేవాడు. ఆ దశలోనే రాజ్యవిస్తరణతో పాటుగా రాజ్యంలో జలవనరుల పెంపుకు చెరువుల నిర్మాణం కూడా చేశాడు. ప్రోలయరాజు నిర్మించిన కేసీయ సముద్రం అన్న సరస్సుతో కాకతీయుల సరస్సులు-చెరువుల నిర్మాణం ప్రారంభమైంది. రెండవ బేతరాజు అనుమకొండలో సరస్సు నిర్మించాడు. గణపతిదేవుని కాలంలో ఈ చెరువులు, సరస్సుల నిర్మాణం మరింత ఊపందుకుంది.[1] కాకతీయుల ప్రభుత్వంలో ప్రత్యేకించి సాగునీటి కోసం ఒక శాఖ ఉండేది కాదు. అయితే దేవాలయాలు, భవనాల నిర్మాణంలాగానే చెరువుల నిర్మాణం కూడా మంత్రి, సామంత, మండలాధీశుల పర్యవేక్షణలో నిర్మాణాలు సాగేవి.[2] కాకతీయ చక్రవర్తులను సరస్సుల నిర్మాణం విషయంలో వారి సామంతులు, అధికారులు, రాజ్యంలోని సంపన్నులు, వ్యాపారులు అనుసరించారు. ధర్మశాస్త్రాలు తటాకాలను సప్త సంతానంలో[నోట్స్ 1] ఒకటిగా పేర్కొనడంతో చెరువులు, సరస్సులు నిర్మించడం ధర్మకార్యంగా భావించేవారు.[2] పాకాల చెరువు సహా పలు సరస్సులు, చెరువులు ఈక్రమంలోనే కాకతీయ సేనానులు, అధికారులు, ఇతర సంపన్నులు కట్టించారు.[నోట్స్ 2][3]

ఊరి అంచులో ప్రవహించే నదులు, వాగుల నుంచి కాలువలు తవ్వి భూములకు నీటిని మళ్ళించి సేద్యం చేసేవారు. మూసీ నది నుంచి మూసేటి కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండకాలువ, ఉటుం కాలువ, చింతకాలువ, దుందుభి నదీ తీరాన ఉన్న గండకాలువ వంటివి కాకతీయుల కాలంలో ఉండేవని శాసనాధారాలు ఉన్నాయి. చెరువులు, కాలువల నిర్వహణకు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించి, పోషణకు భూములు, పుట్టికి కుంచం చొప్పున వారికి జీతమిచ్చే ఏర్పాట్లు ఉండేవి.[2]

సాగుభూముల విస్తరణసవరించు

వ్యవసాయ దిగుబడి పెంచేందుకు సాగు భూములను విస్తరించడాన్ని వ్యవసాయ సంస్కరణల్లో మరో ప్రధానమైన విధానంగా స్వీకరించారు కాకతీయులు. దీన్ని సాధించేందుకు సాగులో లేని బీడుభూములను సాగులోకి తీసుకురావడం, అడవులను కొట్టి కొత్త ప్రాంతాల్లో వ్యవసాయం జనావాసాలు ఏర్పాటుచేయడం అనే పద్ధతులు అనుసరించారు.

అడవులు కొట్టి సాగులోకి

అటవీ భూములను సాగులోకి తీసుకురావడానికి గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో భారీఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ప్రతాపరుద్ర చక్రవర్తి స్వయంగా కర్నూలు ప్రాంతానికి వెళ్లి, విడిసి కర్నూలు ప్రాంతంలో పది పదిహేను మైళ్ళ విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాన్ని నరికించి సాగులోకి తీసుకురావడం, గ్రామాల ఏర్పాటు స్వయంగా పర్యవేక్షించడం కాకతీయులు వ్యవసాయ విస్తరణపై చూపిన ప్రాధాన్యాన్ని వివరిస్తోంది.[4] కాకతీయులు అడవులు కొట్టి చెన్నూరు, పాలంపేట, పాకాల, మంథని, ఏటూరు నాగారం, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి తెచ్చారు, ఈ ప్రాంతాల్లో వందలాది గ్రామాలు ఏర్పడ్డాయి.[1]

బీడు భూముల సాగు

సాగులో లేని బీడు భూములు సాగులోకి తీసుకురావడానికి కాకతీయ చక్రవర్తులు పలు చర్యలు చేపట్టారు.[1]

  • వ్యవసాయం సాగని బీడు భూములను సాగులోకి తీసుకువచ్చినవారికి, వ్యవసాయ ఆదాయంపై పన్నులను రాయితీ ఇచ్చారు.
  • గ్రామాలకు దూరంగా ఉండడంతో సాగులో లేని భూములను బ్రాహ్మణులు, అధికారులు, ఆలయాలు, తదితరులకు దానాలు ఇవ్వడంతో వాటిని సాగులోకి తీసుకువచ్చారు.

ఉత్తరదాయిత్వంసవరించు

కాకతీయుల కాలంలో వ్యవసాయంపై వారి ప్రత్యేక దృష్టి కారణంగా ఏర్పడిన చెరువులు, సరస్సులు, గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు తరతరాలుగా తెలుగువారికి వారసత్వంగా ఉండిపోయాయి. ఒక అంచనా ప్రకారం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే చాలావరకూ కాకతీయుల పరిపాలనలో నిర్మితమైన 5 వేల 8 వందల పైచిలుకు చిన్న తరహా చెరువులు, కుంటల కింద, 3 లక్షల 55 వేల ఎకరాల వరకూ భూమి సాగవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 42 వేల ఎకరాల భూమిని సాగుచేస్తున్న 4 మధ్య తరహా ప్రాజెక్టులైన - లక్నవరం, రామప్ప, పాకాల, మల్లూరువాగు ప్రాజెక్టుల్లో మల్లూరువాగు మినహా మిగిలిన మూడు కాకతీయులు నిర్మించిన భారీ సరస్సులే.[5] మిగిలిన ప్రాంతాలన్నిటినీ కలుపుకుంటూ మరెన్నో వేల ఎకరాల సాగుభూమి కాకతీయుల కాలం నాటి సాగునీటి వనరుల నిర్మాణాల నుంచి సాగునీరు పొందుతున్నాయి.
తెలంగాణ ప్రాంతంలో పూడుకుపోయిన వేలాది చెరువులను బాగుచేసి సాగునీటి పరిస్థితులు మెరుగుపరచాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2016లో ప్రారంభించిన పథకానికి మిషన్ కాకతీయ అన్న పేరుపెట్టారు. చిన్న నీటి వనరులను పునరుత్తేజితం చేయాలన్న లక్ష్యంతో ఏర్పరిచిన ఈ పథకం కాకతీయుల దర్శనం (విజన్ ఆఫ్ కాకతీయాస్) అని పేర్కొంటూ వారి పేరిట పథకానికి మిషన్ కాకతీయ అన్న పేరును పెట్టారు.[6]

నోట్స్సవరించు

  1. పుత్రుడు, దేవాలయం, తోట, చెరువు, అగ్రహారం, కావ్యం, నిధి అన్నవి సప్త సంతానాలు.
  2. పాకాల చెరువును గణపతిదేవుని సేనాని రుద్రుడు, కాట చమూపతి కాటసముద్రం, చౌడచమూపతి చౌడ సముద్రం, నామిరెడ్డి సబ్బిసముద్రం, గౌరసముద్రం, కోమటి చెరువు, ఎర్రక్క సానమ్మలు ఎరుక సముద్రం కట్టించారు. జగత్కేసరి సముద్రం, చింతల సముద్రం, నామా సముద్రం, విశ్వనాథ సముద్రం మొదలైన చెరువులు ఇలానే కాకతీయ అధికారులు, పౌరులు కట్టించారు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 కట్టా, శ్రీనివాసరావు (2015). "  గంగాదేవి చెరువు".   కూసుమంచి గణపేశ్వరాలయం. లోచన అధ్యయన వేదిక. వికీసోర్స్. 
  2. 2.0 2.1 2.2 తెలంగాణ మాసపత్రిక, ప్రతినిధి (27 February 2017). "కాకతీయ సామ్రాజ్యంలో కళకళలాడిన జలాశయాలు". తెలంగాణ మాసపత్రిక. Retrieved 13 April 2018.
  3. సురవరం, ప్రతాపరెడ్డి (1950). "  2 వ ప్రకరణము".   ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సాహిత్య వైజయంతి ప్రచురణ. వికీసోర్స్. 
  4. సురవరం, ప్రతాపరెడ్డి (1950). "  3 వ ప్రకరణము".   ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సాహిత్య వైజయంతి ప్రచురణ. వికీసోర్స్. 
  5. తుమ్మల, కృష్ణారెడ్డి (6 June 2016). "చెరువుల చైన్….. కాకతీయుల తటాక తోరణం". మన తెలంగాణ. Retrieved 13 April 2018.
  6. https://web.archive.org/web/20180413130121/http://missionkakatiya.cgg.gov.in/homemission మిషన్ కాకతీయ వెబ్సైట్లో మిషన్ స్టేట్మెంట్