కాలరేఖలు

సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు రచన

కాలరేఖలు ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ వ్రాసిన నవల. ముఖ్యంగా 1944లో భువనగిరిలో జరిగిన పదకొండో ఆంధ్ర మహాసభ నుంచి నేటివరకు తెలంగాణ సామాజిక చిత్రాన్ని విశ్లేషిస్తూ ఆయన ఈ నవలలు రాశారు.[1] నవీన్ రాసిన కాలరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[2]

కాలరేఖలు
"కాలరేఖలు" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: అంపశయ్య నవీన్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పదకొండో ఆంధ్ర మహాసభ నుంచి నేటివరకు తెలంగాణ సామాజిక చిత్రం
ప్రచురణ: వరంగల్ ప్రత్యూష ప్రచురణలు
విడుదల: 2002
పేజీలు: 584
సోల్ డిస్ట్రిబ్యూటర్స్: నవోదయ బుక్ హౌస్

నేపథ్యం

మార్చు
 
అంపశయ్య నవీన్

బాల్యంలో పిల్లవాడిగా నవీన్ వరంగల్లో జరిగిన 11వ ఆంధ్రమహాసభను చూశాడు. ఆ సభ ప్రారంభోత్సవంలో వేడుకగా అలంకరించిన బండిని 11 జతల ఎద్దులతో నడిపిస్తూ వీధుల వెంట ఉత్సవంగా ఊరేగించి అందులో సభాప్రముఖులను ప్రాంగణానికి చేరవేసిన సన్నివేశం నవీన్ పై చెరగని ముద్రవేసింది. యువకునిగా సాహిత్వంతో పరిచయమేర్పడినప్పుడు, ఈ ఊరేగింపు సన్నివేశం ప్రారంభ సన్నివేశంగా ఒక్క పెద్ద నవలను వ్రాయలని అనుకున్నాడు. అదే కాలరేఖలు నవలకు బీజం వేసింది [3] 1996 లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీవిరమణ చేశాక నవీన్ ఈ నవలను రాయడం మొదలు పెట్టాడు. కాలరేఖలు 1944 నుండి 1995 వరకు తెలంగాణా ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దంపడుతుంది. 1600 కు పైగా పేజీలున్న ఈ గ్రంథాన్ని పాఠకుల సౌలభ్యం కోసం “కాలరేఖలు”, “చెదిరిన స్వప్నాలు”, “బాంధవ్యాలు” అనే నవలాత్రయంగా విడుదల చేశారు.[4] 2004లో కాలరేఖలు రచనకు, అంపశయ్య నవీన్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు.[5]

సమీక్ష

మార్చు

‘కాలరేఖలు’ నవల విస్తృతమైన తెలంగాణ చరిత్రను పొదివికొని ఉంది. ఆంధ్రమహాసభ దగ్గర మొదలై ఆంధ్రప్రదేశ్ అవతరణలో ముగుస్తుంది. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం, విశాలాంధ్ర భావన, భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు, ముల్కీ ఉద్యమం, దొరలు మళ్లీ గడీలకు రావడం, వినోభాబావే భూదానోద్యమ విషయాలు, కమ్యూనిస్టు, కాంగ్రెస్ రాజకీయాలు, ప్రజాపోరాటాలు, రజాకార్ల ఉద్ధేశాలు, సంగం కార్యకలాపాలు, పోలీస్ చర్య, 1952 నాటి జనరల్ ఎలక్షన్లు, తెలంగాణ గ్రామీణ జీవితానికి చెందిన సాంస్కృతికాంశాలు, మొదలగు విషయాలు నవలలో కనపడతాయి. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక రాజకీయ చరిత్రకు ఈ నవల దర్పణంగా నిలుస్తుంది.[6]

కల్లోల కాలానికి చిత్రికపట్టడం ఎంత ముఖ్యమో ప్రశాంత సమయంలోనూ ప్రజల బతుకులు ఎంత కల్లోలంగా ఉంటాయో చిత్రించడం అంతే ముఖ్యం. ఈ రెండు కీలకమైన అంశాలు శ్రీ అంపశయ్య నవీన్ గారు రాసిన కాలరేఖలు నవలలో మనకు కనిపిస్తాయి. కేవలం పోరాటాలు, ఉద్యమాలు, ఉద్రేకపరిచే సన్నివేశాలే కాక, బతుకు పోరాటం కోసం సామాన్య ప్రజలు పడే ఆరాటం కూడా సాహిత్యంలో రికార్డు కావలసిన అవసరం ఎంతో ఉంది. జమిలిగా ఈ రెండు అంశాలు కలిసిన నవల ఇది. అందుకే ఈ నవలకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ పల్లెలోని అమాయక జీవితాన్ని కల్లాకపటం ఎరుగని మనసులను, నిర్మల హృదయులైన వారి మానసిక స్పందనలను తెలుసుకోవడానికి, బొమ్మకు బొరుసున్నట్లుగా ఆ మనస్తత్వానికి వ్యతిరేకులైనవారు ఉండటం సహజం. అలాంటి వారి గురించి కూడా పాఠకుడు తెలుసుకునేందుకు ఈ నవలలో అనేక అంశాలున్నాయి. కల్లాకపటం ఎరుగని ఓ బాలుని దృక్కోణం నుంచి కథను నడపడంతో ఇందులో మరింత స్వచ్ఛత, పరిశీలన, కుతూహలం, తెలుసుకోవాలన్న జిజ్ఞాసా ధోరణి కనిపిస్తుంది. పాఠకుడు ఆ ధార వెంట ముందుకుపోతూ ఉంటాడు. కథనంలో ఎక్కడా శ్రీ నవీన్ రచయితగా తన అభిప్రాయాలను ఉటంకించలేదు. పాత్రలు ఆయా సన్నివేశాలలో, ఆయా విషయాల గురించి ఘర్షిస్తాయే కాని, ఎక్కడా లాలూచీ పడవు.

చరిత్రలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా సామాన్య జన నిజజీవితాన్ని అత్యంత వాస్తవికతతో పాఠకుని ముందుంచే క్రమంలో రచయిత చూపిన సంయమనం ఎంతోమెచ్చుకోదగింది. "శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదనే" మహాకవి మాటను నిజం చేస్తూ ఈ నవల రూపొందింది. రజాకార్లు అనేది ఉరూపదం. రజాకార్లు అంటే అసలు అర్థం వాలంటీర్లు. కాని రజాకార్ల దుర్మార్గ కార్యక్రమాలను ప్రజలు అసహ్యించుకోవడంతో రజాకార్లు అంటే దుర్మార్గులు అనే అర్థం ప్రజలలో ప్రబలింది. ఈ నవలలో రజాకార్ల వ్యవవాహర సరళిని రచయిత వివరించారు. కాలరేఖలు' ఒక నవలకాదు. ఇది సాంఘికాచారాలకు దర్పణం, చారిత్రక సంఘటనల కాసారం. నాటి నిజాం నవాబు రాచరిక వ్యవస్థకు సజీవసాక్ష్యం.[7]

మూలాలు

మార్చు
  1. "సాహితీ లోకంలో నిత్యాన్వేషి..అంపశయ్య నవీన్‌". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-23. Archived from the original on 2021-12-24. Retrieved 2021-12-26.
  2. సామాజిక దర్పణం ఏ వెలుగులకీ ప్రస్థానం 8/3/2015[permanent dead link]
  3. "No life without literature, says `Ampasayya' Naveen". The Hindu. 2006. Archived from the original on 2007-11-11. Retrieved 2016-02-08.
  4. నేనూ నా రచనలు - అంపశయ్య నవీన్ Archived 2010-11-02 at the Wayback Machine ఈమాట జనవరి 2007 సంచిక
  5. "Kalarekhalu a portrayal of Telangana's socio-political scene". Gollapudi Srinivasa Rao. The Hindu. 25 December 2004. Retrieved 8 February 2016.
  6. నవలల్లో తెలంగాణ చరిత్ర - బి.వి.ఎన్.స్వామి 02/12/2012[permanent dead link]
  7. కాలరేఖలు పుస్తక పరిచయం

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాలరేఖలు&oldid=4351070" నుండి వెలికితీశారు