కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించాడు. రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే మూడు మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.

కాళిదాసు
20వ శతాబ్దపు కళాకారుడి అభిప్రాయం కాళిదాసు 'మేఘదూత'ని కంపోజ్ చేయడం
వృత్తికవి, నాటక రచయిత
భాషసంస్కృతం, ప్రాకృతం
కాలంసుమారు 4th–5th century CE
రచనా రంగంసంస్కృత నాటకం, క్లాసికల్ సాహిత్యం
విషయంపురాణ కవిత్వం, పురాణాలు
గుర్తింపునిచ్చిన రచనలుకుమారసంభవమ్, అభిజ్ఞానశాకుంతలం, రఘువంశ, మేఘదూత, విక్రమోర్వశీయం

జీవితము సవరించు

కాలము సవరించు

కాళిదాసు యొక్క జీవితకాలముపై పరస్పర విరుద్ధమయిన అభిప్రాయములు చరిత్రకారులలో ఉన్నాయి. ఈ అభిప్రాయముల ప్రకారం కాళిదాసు అగ్నిమిత్రుడు, అశోకుడు రాజ్యపాలన గావించిన మధ్యకాలమందు యాదవ కులము లోజీవించినాడని వాదన. ఇది క్రీ.పూ.1వ శతాబ్దము, 5వ శతాబ్ద మధ్య కాలము.

కాళిదాసు విరచిత నాటకమగు మాళవికాగ్నిమిత్రములో కథానాయకుడు రెండవ శుంగ రాజయిన అగ్నిమిత్రుడు. ఈ రాజు క్రీ.పూ.170వ సంవత్సర ప్రాంతములో పరిపాలన గావించుటచే, ఆ కాలము కాళిదాసు జీవించిన కాలము అని ఒక వాదన. ఒక సంస్కృతకవి. కాళికాదేవిని కొలిచి ఆదేవి యొక్క వరప్రసాదమును పొందినందున ఇతనికి ఈ పేరు కలిగెను. ఇతఁడు మిక్కిలి ప్రసిద్ధుఁడు. కవిసమయము చక్కగా తెలిసినవాఁడు. ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటయందు మిక్కిలి సమర్ధుఁడు కాబట్టి ఇతఁడు చెప్పెడు ఉపమాలంకారము శ్లాఘింప దగినదిగా ఉండును. కనుకనే "ఉపమా కాళిదాసస్య" అను వచనము లోకమునందు ప్రసిద్ధముగా వాడబడుచున్నది. మఱియు ఈమహాకవి విక్రమార్కుని ఆస్థానము లోని కవులలో ఒకఁడై ఉండెను.

శ్లో|| ధన్వంతరి, క్షపణ కామరసింహ,శంకు, బేతాళ, భట్టి, ఘటఖర్ప, కాళిదాసాః|,
ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య||

అను ఈ శ్లోకమునందు చెప్పబడిన ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళుఁడు, భట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు అను కవులు తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని ప్రసిద్ధి చెంది ఉన్నారు. శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము అను నాటకములును, రఘువంశము, మేఘసందేశము, కుమారసంభవము అను కావ్యములును ఇతనిచే రచియింప బడెను.[1]

ఇదిగాక భోజప్రబంధమువలన భోజరాజు యొక్క సభలోను ఒక కాళిదాసుఁడు ఉన్నట్టు తెలియవచ్చుచున్నది. ఇతఁడు సకల విషయములందును మొదటియాతనిని పోలినవాఁడు. ఒకానొక కాలమున భోజుని సభయందలి కవులలో ఒకడు అగు దండి అనువానికిని ఇతనికిని వివాదము కలిగినప్పుడు, సరస్వతిని ఆరాధించి మాయిరువురిలో కవి ఎవఁడో తెలుపవలయును అని ప్రార్థింపఁగా, వారికి సరస్వతి ప్రత్యక్షమై "కవిర్దండీ కవిర్దండీ నసంశయః" అనఁగా కాళిదాసునికి కోపము వచ్చి "రండే అహం కః" అనఁగా "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః" అని సరస్వతి చెప్పినందున ఈ కాళిదాసుఁడు సరస్వతి అవతారము అని చెప్పుదురు. ఈయన నళోదయము, శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల, కవికంఠ పాశము, కర్పూరమంజరి, భోజచంపువు అనెడు గ్రంథములను, శ్యామలా దండకమును రచియించెను. ఇందు కడపట ఉదహరించిన దండకము తనకు కాళికాదేవి ప్రత్యక్షము అయినప్పుడు చెప్పినది. ఇంతటి కవులు లోకములో మఱియెవరును కానరారు. కనుకనే,

"పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠకాధిష్ఠితకాళిదాసా|, అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ|| " అని చెప్పఁబడి ఉంది. ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నాయి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుబట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉంది.

సా.శ.634వ శతాబ్దము నాటి అయిహోళీ ప్రశస్తిలో కాళిదాసు యొక్క చర్చ ఉంది. ఇది కాళిదాసుదిగా చెప్పబడిన కాలములలో అతి దగ్గరది. అంతేగాక, మరి కొందరు కాళిదాసును విక్రమాదిత్యుని ఆస్థానములో విద్వాంసునిగా చెప్పిరి.ఎక్కువ చరిత్రకారులు కాళిదాసుని గుప్త రాజులయిన చంద్రగుప్త విక్రమాదిత్యుడు, అతని కొడుకు అయిన కుమార గుప్తుని కాలమయిన సా.శ.4వ శతాబ్దము నాటి వానిగా పరిగణింతురు. రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యునిగా పేరునొంది, గుప్తుల స్వర్ణయుగములోని చివరి కాలములో రాజ్య పాలన చేసెను. అదే సమయములో గుర్తుంచుకోదగ్గ విషయమేమంటే, కాళిదాసు తన రచనలలో ఎక్కడా కూడా సుంగ వంశమును యాదవ కులములొ ఒక శాఖ తప్ప మరెవరి ప్రస్తావనా చేయలేదు. పురూరవుడు, ఊర్వశిలు నాయికానయకులుగా కాళిదాసు రచించిన విక్రమోర్వశీయములో, పురూరవుని పేరును నాటకములో విక్రమునిగా మార్చిన విధానము, కాళిదాసుకు తన రాజయిన విక్రమాదిత్యుని మీద గల అభిమానముగా భావింతురు. అదే విధముగా కుమార సంభవము రచన కూడా కుమారగుప్తుని కథగానే రాసాడని మరికొందరి అభిప్రాయము. అలాగే, రఘువంశములో హూణుల ప్రస్తావన కూడా స్కందగుప్తుడు హూణులపై సాధించిన విజయము తాలూకు ఆనవాళ్ళని మరో అభిప్రాయము. అదే కావ్యము లోని రఘు మహారాజు యొక్క జైత్రయాత్ర కూడా, చంద్రగుప్తుని తాలూకు జైత్రయాత్రా వర్ణనయే అని మరికొందరి అభిప్రాయము. కాళిదాసు మేఘసందేశమును ఈనాటి మహారాష్ట్ర లోని నాగపూర్ వద్ద గన రామ్టెక్ లేదా రామగిరి అన్న ప్రదేశములో రచన కావించాడని మరికొందరి అభిప్రాయము. రెండవ చంద్రగుప్తుని కుమార్తె అయిన ప్రభావతీగుప్తను ఇచ్చి వివాహము చేసిన వెంకట రాజు యొక్క రాజధాని రామగిరికి దగ్గరలోనే ఉండటము పైన చెప్పిన వానికి ఓ కారణము.

కానీ, చాలా మంది పండితులు ఈ క్రింది కారణాల వల్ల పైన ఉదహరించిన వానిపై అభ్యంతరములు వ్యక్తం చేసారు.

  • కాళిదాసు ఎక్కడా గుప్తులను పేర్కొనలేదు.
  • విక్రమాదిత్యులు చరిత్రలో చాలా మంది ఉన్నారు,1వ శతాబ్దికి చెందిన వారితో సహా.అంచేత కాళిదాసు వారిలో ఎవరి కాలమునకైననూ చెందియుండ వచ్చును.
  • రఘు మహారాజు జైత్రయాత్ర వర్ణన పూర్తిగా నిజమని నమ్మలేము. అది మహాభారత యుద్ధము వలె అనేకానేక మార్పుచేర్పులకు గురయినది.
  • కాళిదాసు శివభక్తుడు,అందుచేత శివుని కుమారుడైన కుమారునిపై కావ్యము రాయటములో ఆశ్చర్యము లేదు.అదే సమయములో కుమారగుప్తుడు అను రాజు ఉండటమన్నది పూర్తిగా కాకతాళీయమే.
  • అదే విధముగా అగ్నిమిత్రుని కాళిదాసు తన కృతులలో పేర్కొనుటలోనూ అర్థము లేదు.ఎందువల్లనంటే, అగ్నిమిత్రుడు కాళిదాసుకు చాలా పూర్వపు రాజు. గుప్త వంశములో ఒక రాజుగానే తప్ప,గొప్ప ప్రత్యేకతలేవీ లేనివాడు.కాళిదాసుకు అగ్నిమిత్రునికి సంబంధించి కొంత చారిత్రక పరిజ్ఞానము ఉన్నట్లు తెలియుచున్నది.

మొత్తమ్మీద, పైన చెప్పిన అభిప్రాయము గల పండితులు అందరూ, కాళిదాసుని సుంగ చక్రవర్తుల సమకాలీనునిగనూ,ముఖ్యముగా విక్రమాదిత్యుని కాలమైన క్రీ.పూ.100వ శతాబ్దికి చెందిన వానిగా పరిగణించుదురు.

చరిత్ర సవరించు

 
కాళిదాసు ఊహా చిత్రం.

కాళిదాసు క్రీ.పూ.1వ శతాబ్దిలో జన్మించాడు. మొదట్లో ఇతడు తన అందము, అమాయకత్వము వలన గుర్తింపు పొందాడు. విక్రమాదిత్యుని ఆస్థానములో ప్రసిద్ధి నొందిన నవరత్నములలో ఒకడిగా మన్ననలను పొందాడు. విద్వత్తులో తనను పరాజయించిన వానినే పరిణయమాడెదను అని ప్రతిజ్ఞ పూనిన విద్యోత్తమ అనబడే ఓ యువరాణి, విక్రమాదిత్యుని ఆస్థానములోని పండితులనందరినీ తన పాండిత్యముచే పరాజయము పాలుచేసింది. ఈ అవమానము సహించలేని ఆ పండితులు, ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని ఆమెను మోసగించి, వారిరువురికినీ పరిణయము గావించిరి. పెళ్ళి తరువాత కాళిదాసు నిజస్వరూపమును గ్రహించిన ఆమె తన అవివేకమునకు, తనకు జరిగిన అవమానమునకు క్రుంగిపోవును. ఇది గ్రహించిన కాళిదాసు జ్ఞాన సముపార్జనకునూ, విద్వత్తు గల భార్యకు తగు సమానునిగను ఉండవలెనన్న తలంపుతో, తన ఇష్టదైవమయిన కాళికాదేవిని ప్రసన్నము చేసుకొనుటకు ఇల్లు విడుచును. అతని ప్రార్థన ఆలకించిన మాత ప్రసన్నురాలై, కాళిదాసుకు గొప్ప విద్వత్తును, మాటనేర్పరి తనాన్ని అనుగ్రహించును. భార్యతో వివాహానికి పూర్వము జరిగిన విద్యా పాటవ ప్రదర్శనలో, విద్యోత్తమ తన మొదటి ప్రశ్నగా, అస్తి కశ్చిత్ వాగ్విశేషా:? (నీ భాషలో ఏమైనా ప్రత్యేకత యున్నదా?) అని అడుగుతుంది.దానికి ప్రతిగా కాళిదాసు తన మందబుద్ధితో అరకొరగా సమాధానము ఇస్తాడు. కానీ మాత అనుగ్రహముతో, గొప్ప జ్ఞానసముపార్జనతో ఇంటికి తిరిగి వచ్చిన కాళిదాసు భార్యతో, ఆమెను తన భార్యగా కన్నా, తనకు జ్ఞానమార్గోపదేశము చేసిన గురువుగా తలచి, ఆమె ప్రశ్నకు నివాళిగా, ఆమె గతములో సంధించిన ప్రశ్నలోని మూడు పదాలతో ప్రారంభింపబడిన తన మూడు కావ్యాలలోని మొట్ట మొదటి వాక్యాల ద్వారా తన సరికొత్త ఉనికిని తెలియచేస్తాడు. అవే అస్తితో మొదలయ్యే (అస్త్యుతారాస్యా దిశి) కుమారసంభవము, కశ్చిత్ తో మొదలయ్యే (కశ్చిత్ కాంతా) మేఘసందేశం, వాక్ తో మొదలయ్యే (వాగర్థావివ సంపృక్తౌ) రఘువంశము. కాళిదాసు జన్మస్థలము రకరకాలుగా చెప్పబడింది. అతడు తన కుమారసంభవము కావ్యములో హిమాలయములను వర్ణించిన తీరుని బట్టి కొందరు ఇతడు హిమాలయ పరిసర ప్రాంతవాసిగా అభిప్రాయపడ్డారు. కానీ, మేఘసందేశంలో ఉజ్జయిని నగరం తాలూకు వర్ణనలతో, ఇతడు ఉజ్జయిని నగరంనకు చెందిన వాడని మరికొందరి వాదన. కాళిదాసు నేటి శ్రీలంకలో కుమారదాస చక్రవర్తి కాలములో హత్య గావింపబడినాడని ఓ వాదన. కానీ, కుమారదాసుడు సా.శ.6వ శతాబ్దికి చెందిన వాడగుటవలన, ఆ వాదన వాదనగానే మిగిలిపోయింది.

సంస్కృతకవిగా సవరించు

ఒక సంస్కృతకవి. కాళికాదేవిని కొలిచి ఆదేవి యొక్క వరప్రసాదమును పొందినందున ఇతనికి ఈ పేరు కలిగెను. ఇతఁడు మిక్కిలి ప్రసిద్ధుఁడు. కవిసమయము చక్కగా తెలిసినవాఁడు. ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటయందు మిక్కిలి సమర్ధుఁడు కాబట్టి ఇతఁడు చెప్పెడు ఉపమాలంకారము శ్లాఘింపఁ దగినదిగా ఉండును. కనుకనే "ఉపమా కాళిదాసస్య" అను వచనము లోకమునందు ప్రసిద్ధముగా వాడఁబడుచున్నది. మఱియు ఈమహాకవి విక్రమార్కుని ఆస్థానము లోని కవులలో ఒకఁడై ఉండెను.

శ్లో|| ధన్వంతరి, క్షపణ, కామరసింహ,శంకు, బేతాళ, భట్టి, ఘట, ఖర్పర, కాళిదాసాః|
      ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య||

అను ఈ శ్లోకమునందు చెప్పఁబడిన చొప్పున ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళుఁడు, భట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు అను కవులు తొమ్మండు గురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని తెలియఁబడుచు ఉంది. శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము అను నాటకములును, రఘువంశము, మేఘసందేశము, కుమారసంభవము అను కావ్యములును ఇతనిచే రచియింపఁ బడెను.

ఇదిగాక భోజప్రబంధమువలన భోజరాజు యొక్క సభలోను ఒక కాళిదాసుఁడు ఉన్నట్టు తెలియవచ్చుచున్నది. ఇతఁడు సకల విషయములందును మొదటియాతనిని పోలినవాఁడు. ఒకానొక కాలమున భోజుని సభయందలి కవులలో ఒకఁడు అగు దండి అనువానికిని ఇతనికిని వివాదము కలిగి అప్పుడు కాళికాదేవిని ఆరాధించి మాలో కవి ఎవఁడో తెలుపవలయును అని ప్రార్థింపఁగా వారికి కాళికాదేవి ప్రత్యక్షమై "కవిర్దండిః, కవిర్దండిః, భవభూతిశ్చ మహాకవిః" అన్నదట. దానికి కాళిదాసునికి కోపము వచ్చి "కోహం రండే ?" ( ఓసి లంజా, నేను ఎవడిని?) అన్నాడుట. అప్పుడు కాళికాదేవి "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః" ( నువ్వే నేను, నువ్వే నేను, నువ్వేనేను. అందులో సందేహం లేదు ) అని చెప్పినదట. అందువలన, ఈ కాళిదాసుఁడు కాళికాదేవి అవతారము అని చెప్పుదురు. ఈయన నళోదయము, శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల, కవికంఠ పాశము, కర్పూరమంజరి, భోజచంపువు అనెడు గ్రంథములను, శ్యామలా దండకమును రచియించెను. ఇందు కడపట ఉదహరించిన దండకము తనకు కాళికాదేవి ప్రత్యక్షము అయినప్పుడు చెప్పినది. ఇంతటి కవులు లోకములో మఱియెవరును కారు. కనుకనే,

శ్లో|| పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః |
      అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ||

అని చెప్పఁబడి ఉంది.ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నాయి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉంది.


రచనలు సవరించు

కాళిదాసు రచనలలో మూడు నాటకాలు, మూడు కావ్యాలు ప్రసిద్ధము.

నాటకాలు సవరించు

కాళిదాసు రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు మాళవికాగ్నిమిత్రము (మాళవిక, అగ్నిమిత్రుని కథ), విక్రమోర్వశీయము (విక్రముడు, ఊర్వశి కథ), అభిజ్ఞాన శాకుంతలము (శకుంతలను గుర్తించుట). అభిజ్ఞాన శాకుంతలము అత్యంత ప్రాచుర్యము పొందిన నాటకము. అంతేగాక, ఆంగ్లములో, జర్మనులో అనువదింపబడిన మొదటి కాళిదాసు రచన ఇది.

మాళవికాగ్నిమిత్రము

కాళిదాసు ప్రథమ కృతి అయిన మాళవికాగ్నిమిత్రము అగ్నిమిత్రుని యొక్క ప్రేమ గాథ. అగ్నిమిత్రుడు బహిష్కృతురాలయిన మాళవిక అను ఒక సేవిక యొక్క ఛాయాచిత్రమును చూసి ఆమెను ప్రేమించును. ఈ విషయము తెలిసిన రాణి, మాళవికను కారాగృహమున బంధించును. కానీ, విధి యొక్క లీలావిలాసము వల్ల చివరికి మాళవిక ఒక రాకుమార్తె అని తెలిసి వారిరువురి బంధానికి గల అడ్డంకులన్నీ తొలగిపోవును.

అభిజ్ఞాన శాకుంతలము

అభిజ్ఞాన శాకుంతలము[2] దుష్యంత మహారాజు గూర్చిన కథ. వేటకై వెళ్ళిన దుష్యంతునకు మహర్షి కణ్వునిచే పెంచబడిన శకుంతల కనపడుతుంది. ఆ కలయిక ప్రేమగా మారి శకుంతలను వివాహమాడేలా చేస్తుంది. అంతలోనే దుష్యంతుడు కొన్ని పరిస్థితులలో శకుంతలను అక్కడే విడచి రాజ్యానికి తిరిగి వెళ్ళవలసివస్తుంది. ఇక్కడ గర్భవతురాలయిన శకుంతల ఒక పొరపాటుతో ముని కోపానికి గురయి, దుష్యంతుడు గురుతుగా ఇచ్చిన ఉంగరమును అతడు మరల చూడనంతవరకు భర్తచే మరుపుకు గురయ్యే శాపము పొందుతుంది. పుత్రుడు జన్మించిన పిదప దుష్యంతుని కలుసుకొనుటకు చేయు ప్రయాణములో దుష్యంతుడిచ్చిన ఉంగరమును పోగొట్టుకొని, ముని శాప ప్రభావము వలన దుష్యంతునిచే గుర్తింపబడక తిరస్కారమునొందును. పోగొట్టుకోబడిన ఆ ఉంగరము ఒక జాలరికి దొరికి ఆతని ద్వారా దుష్యంతునికి చేరును. అది చూసినంతనే దుష్యంతునకు తాను శకుంతల పట్ల చేసిన తప్పిదము గుర్తుకు వచ్చి ఆమెను కనుగొని క్షమాపణలతో తిరిగి ఒకటవుదురు.

విక్రమోర్వశీయము

కావ్యాలు సవరించు

కవి నిర్లిప్తత సవరించు

కాళిదాదు కవితలో స్ఫురించే ఇంకొక విషయం ముఖ్యంగా పేర్కొనవలసినది ఎక్కడా కవి తన కావ్యాల్లో తననుగూర్చి ప్రస్తావించుకోలేదనీ, దీనివల్ల పరిశోధకులకు తన కాలనిర్ణయం దుష్కరం అయిపోయినమాట అటువుంచితే ఆయన నిర్లిప్తత ఇతని జీవన ధృక్పధం అని ఊహించుకోవచ్చును. రఘువంశ ప్రారంభంలో ఈకవి తాను ముందుడనీ, కవియశస్సు ప్రార్థించే తాను పొడగరులు అందుకోగలిగిన ఫలం ఆశించిన వామనుని వలె అపహాస్యపాత్రుడను కాగలననీ వ్రాశాడు.తిరిగి మాళవికాగ్నిమిత్రంలో ప్రాచీనమైనదల్లా యోగ్యమైనది కాజాలదనీ, నవ్యకావ్యమైనంత మాత్రంచేత అది నింద్యం కాజాలదనీ సహృదయులు ఈరెంటినీ అతిక్రమిచినవారనీ సూత్రధారుని ముఖతః పలికించాడు. ఇంతకంటే ఈకవి ఆత్మగతాభిప్రాయాలు ఇతని కావ్యాల్లో ఇంకెక్కడా లభించలేదు.ఈకవి వ్యక్తిచరిత్ర విషయంలో అవలంబించిన మౌనాన్ని బట్టికూడా నిర్లిప్తమైన ఈతని జీవనశైలిని తెలియపరుస్తున్నది.అసలు ప్రాచీన కవితా సంప్రదాయాలలో కవికి నేటి కాలంలో బయలు దేరిన "స్వాతంత్ర్యం, అస్వాతంత్ర్యం" వంటి సమస్యలు బయలుదేరనేలేదు అనుకోవచ్చును. ఆకాలంలో భారతీయకవులు భారతీయమైన ఆధ్యాత్మిక సంప్రదాయం సహజంగా ఆకళించుకొన్నారు. అప్పుడు వ్యక్తి స్వాతంత్ర్యం సాంప్రదాయకమైన సాంఘికథర్మం అతిక్రమించి పైడదారులు తొక్కలేదు లేక యాంత్రికమైన ఒక్క శుష్కసంఘ శాసనానికి కట్టుబడనూలేదు. ఆధార్మిక ధృక్పధంలో సంఘవ్యక్తులకు పరస్పరాశ్రితమైన సహకారం సహజంగా పెంపొందింది. కనుకనే ఆరోజులలో కవులెవ్వరూ వ్యక్తి చరిత్రలు తమ కావ్యాల్లో వ్రాసుకోలేదని తోస్తుంది. అదీగాక భారతీయాధ్యాత్మిక సంప్రదాయాన్ని సంపూర్ణంగా ఆకళించుకొన్న కాళిదాసుకవి తన వ్యక్తిత్వం విషయంలో గంభీరమైన ఓదాసీన్య వైఖరి అవలింబించి ఉంటాడు. కనుకనే ఈతని చరిత్ర నేటి పరిశోధకులకు ఇంత గడ్డు సమస్యగా పరిణమించింది. కాని ఆమహాకవి భౌతికవ్యక్తి జీవితం కాలగర్భంలో, మరుగుబడిపోయినా మనోహరమైన ఆతని ఆధ్యాత్మికత, ధార్మికత ఈ రెండిటినీ మించిన జీవితసౌందర్యార్చన ఆతని కావ్యాల్లో త్రిపధములై ఆతని కవితకు మందాకినీ గౌరవం కలిగించాయి.

ఇతరములు సవరించు

వ్యాఖ్యానములు సవరించు

ఆధునిక సంస్కృతిలో కాళిదాసు సవరించు

ఇతిహాసము సవరించు

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. లక్ష్మీనరసింహం, చిలకమర్తి (1956). కాళిదాస చరిత్ర (PDF). రాజమండ్రి. p. 1.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. కాళిదాసు. అభిజ్ఞాన శాకుంతలం.

బయటి లింకులు సవరించు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కాళిదాసు&oldid=3904515" నుండి వెలికితీశారు