కుర్రారం రామిరెడ్డి
కుర్రారం రామిరెడ్డి (పాశం రామిరెడ్డి), తెలంగాణ సాయుధపోరాట యోధుడు, గెరిల్లా నాయకుడు. భువనగిరి ప్రాంత దళ కమాండర్ గా పనిచేశాడు.[1]
కుర్రారం రామిరెడ్డి | |
---|---|
జననం | పాశం రామిరెడ్డి 1920 |
మరణం | 1948, సెప్టెంబరు 18 |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణ సాయుధ పోరాట యోధుడు |
జీవిత భాగస్వామి | అనసూయాదేవి |
పిల్లలు | ఒక కుమారుడు (అమరేందర్ రెడ్డి), ముగ్గురు కుమార్తెలు (సుజాత, భారతీదేవి, స్వరాజ్యలక్ష్మి) |
తల్లిదండ్రులు | పుల్లారెడ్డి - జానకమ్మ |
జననం, విద్య
మార్చురామిరెడ్డి 1920లో పుల్లారెడ్డి - జానకమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం, కుర్రారం గ్రామంలో జన్మించాడు. ముగ్గురు సంతానంలో చంద్రమ్మ, రాజిరెడ్డిల తరువాత రామిరెడ్డి మూడవవాడు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో బాల్యంలో అనేక కష్టాలను అనుభవించాడు. భువనగిరిలో ఏడవ తరగతి వరకు చదివిన రామిరెడ్డి, హైదరాబాదులో తొమ్మిదవ తరగతి వరకు చదివాడు. ఆ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం పిలుపు అందుకుని తన చదువుకు స్వస్తి చెప్పి ఉద్యమంలోకి వెళ్ళాడు.
వ్యక్తిగత జీవితం
మార్చురామిరెడ్డికి 1938లో అనసూయాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (అమరేందర్ రెడ్డి), ముగ్గురు కుమార్తెలు (సుజాత, భారతీదేవి, స్వరాజ్యలక్ష్మి) ఉన్నారు.
ఉద్యమ జీవితం
మార్చుఒకవైపు భారత స్వాతంత్ర్య పోరాటం, మరోవైపు తెలంగాణలో నిజాం నియంతృత్వంపై పోరాటం జరుగుతున్నాయి. మతమార్పిడి చర్యలు, వెట్టి చాకిరీ విధానం, శ్రమ దోపిడీ, హిందూ స్త్రీలపై లైంగిక హింసలు మొదలైనవి జరుగుతున్నాయి. దాంతో అంధ్రమహాసభ నిజాం పాలనను తీవ్రంగా వ్యతిరేకించి, వాటిని ఎదుర్కొనడానికి చురుకైన యువకుల తోడ్పాటును ఆశించి, రామిరెడ్డికి ఆహ్వానం పలికింది. 1946 డిసెంబరులో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యల నేతృత్వంలో తమ్మారెడ్డి సత్యనారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణలు సైనిక శిక్షకులుగా కృష్ణాజిల్లాలోని కొండపల్లి వద్ద జరిగిన సైనిక శిక్షణ కార్యక్రమంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, కోదండరామిరెడ్డి మొదలైనవారితోపాటు రామిరెడ్డి కూడా శిక్షణ పొందాడు.
రామిరెడ్డి గెరిళ్ళా దళాలను రూపొందించి స్వయంగా శిక్షణలు ఇచ్చాడు, నాటు తుపాకులు ఉపయోగించాడు. దళాలతో కలిసి తన పోరాట కాలంలో మొత్తం 21 (రాజాకార్ల స్థావరాల మీద 19 దాడులు) దాడులు నిర్వహించాడు. వాసాలమర్రి దగ్గర తహసీల్దార్ మీద దాడిచేసి 303 రైఫిల్ ను, వంగపల్లి రైల్వే పోలీసు స్టేషన్ మీద దాడిచేసి రెండు రైఫిళ్లు సంపాదించుకున్నాడు. తన వివిధ దాడుల్లో వందమంది రజాకార్లను చంపాడు.[1]
మరణం
మార్చు1948 సెప్టెంబరు 13న శబాషీపురం దగ్గర నాగపురిలోని రజాకర్ల స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించాడు. ఆ దాడిలో రామిరెడ్డి తొడల్లోకి పొత్తి కడుపులోకి తూటాలు దూసుకుపోయాయి. మొత్తానికి శతృవులకు దొరక్కుండా తనని తాను కాపాడుకొని కొడగండ్లలో ఉండిపోయాడు. మూడురోజులపాటు బయటికిరాకుండా అక్కడే ఉన్నాడు. అక్కడ సరైన చికిత్స దొరకలేదు, దొరికిన నాటు వైద్యం పనిచేయలేదు. ఆరోగ్యం విషమించింది. ఆ పరిస్థితుల్లో కూడా రజాకార్లను తప్పించుకొని గజ్వేల్ చేరుకొని, అక్కడినుండి కల్లు లారీ ఎక్కి హైదరాబాదుకు చేరుకున్నాడు. తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లోవున్న రామిరెడ్డి భారత యూనియన్ మిలటరీ సహాయంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. చికిత్సపొందుతూ 1948, సెప్టెంబరు 18న చనిపోయాడు.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 డా. కూరెళ్ల, విఠలాచార్య (2020). ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రజాకార్ల కొన్ని దురంతాలు. నల్లగొండ: శ్రీవిద్య ప్రచురణలు. p. 46.
- ↑ డా. కూరెళ్ల, విఠలాచార్య (2020). ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రజాకార్ల కొన్ని దురంతాలు. నల్లగొండ: శ్రీవిద్య ప్రచురణలు. p. 47.