కె.వి. రామకృష్ణారెడ్డి
కె.వి.రామకృష్ణారెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1]
కె.వి.రామకృష్ణారెడ్డి | |||
పదవీ కాలం 1957 – 1967 | |||
ముందు | ఎవరూ లేరు | ||
---|---|---|---|
తరువాత | నీలం సంజీవరెడ్డి | ||
నియోజకవర్గం | హిందూపురం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1907 కడపలవారి పల్లె, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా | ||
జీవిత భాగస్వామి | రామరత్నం | ||
సంతానం | 4 కుమారులు, 4 కుమార్తెలు | ||
మతం | హిందూ మతం |
జీవిత విశేషాలు
మార్చుకె.వి.రామకృష్ణారెడ్డి 1907లో అనంతపురం జిల్లా, కదిరి తాలూకా, కడపలవారిపల్లెలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వన్నూరు రెడ్డి. ఇతని విద్యాభ్యాసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోను, కలకత్తా విశ్వవిద్యాలయంలోను గడిచింది. ఇతడు ఎం.ఎ., బి.ఎల్., పట్టాలు పొందాడు. 1937, జులై 2న ఇతనికి రమారత్నంతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 4గురు కుమారులు, 4గురు కుమార్తెలు కలిగారు. ఇతడు చెంగల్పట్టు జిల్లా విల్లివాకం పంచాయతీ బోర్డుకు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచాయతీ బోర్డుకు స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశాడు. 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరెస్టయి అల్లీపురం సెంట్రల్ జైలులో ఆరునెలలు కారాగార శిక్ష అనుభవించాడు. 1942లో జాతీయనాయకుల అరెస్టులను వ్యతిరేకించడంతో ఇతని న్యాయవాద వృత్తిని రద్దు చేశారు. ఆంధ్ర కిసాన్ కాంగ్రెస్సుకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఇతడు గిద్దలూరు, మదనపల్లె, హిందూపురం మొదలైన చోట్ల వయోజనులైన గ్రామీణుల కోసం రాజకీయ వేసవి పాఠశాలలను నిర్వహించాడు. రాయలసీమలో రైతు సంఘాలను, యువక సంఘాలను నెలకొల్పాడు. ఇతడు అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, ఆల్ ఇండియా రూరల్ పీపుల్స్ ఫెడరేషన్‌కు జాయింటు సెక్రెటరీగా, ఆంధ్ర ప్రొవెన్షియల్ కాంగ్రెస్ క్షామ నివారణ సంఘానికి జనరల్ సెక్రెటరీగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పలాసలో నడిపిన సేవాదళ్ క్యాంపు నిర్వాహకునిగా, రాయలసీమ యువసంఘానికి అధ్యక్షుడిగా పలు పదవులు చేపట్టాడు. కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ ఇతనికి ఆంధ్ర కిసాన్ కాంగ్రెస్, కృషిలోక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్ష సంస్థలతో మంచి సంబంధాలున్నాయి. ఇతడు 1957లో రెండవ లోక్‌సభకు, 1962లో మూడవ లోక్‌సభకు హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన ఎన్నికై పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. 1959-62లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రాంతపు విప్‌గా పనిచేశాడు.
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Third Lok Sabha Members Bioprofile". Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE. National Informatics Centre (NIC). Retrieved 10 May 2020.