కదిరి

ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా, కదిరి మండలం లోని పట్టణం

కదిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం, అదే జిల్లాకు చెందిన ఒక మండలం.[1] పిన్ కోడ్ నం. 515591. యస్. టీ. డీ. కోడ్ నం.08494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకాల వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద తాలూకాగా ఉండేది. కదిరి మల్లెపూలకు, కనకాంబరాలు (కుంకుమ పూలు) కు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర, కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము.

కదిరి శ్రీలక్షీనరసింహాస్వామి దేవాలయంసవరించు

లక్షీనరసింహాస్వామి దేవాలయం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి విశిష్టత ఏమిటంటే మరే నారసింహ క్షేత్రములో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతముగా దర్శనము ఇస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా జరుగుతాయి. ప్రధానముగా బ్రహ్మగరుడ సేవ, అత్యంత ప్రధానముగా జరిగే బ్రహ్మ రథోత్సవము (తేరు) అతి వైభవముగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. తేరు రోజున కదిరి జనసంద్రమును తలపిస్తుంది. దేవస్థానముకు సంబంధించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థము (కోనేరు), ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలగునవి.

కదిరి నరసింహాలయం, అనంతపురం జిల్లా:సవరించు

 
దేవస్థానం ప్రధాన గోపురం
చారిత్రకత

ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్న ఈ కదిరి నరసింహాలయం: 13 వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్తంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు. " బేట్రాయి సామి దేవుడా..నన్నేలినోడా...... బేట్రాయి సామి దేవుడా కదిరి నరసింహుడా.......... కాటమరాయడా......... ఇలా భక్తుల చే కొనియాడబడే ఈ నరసింహ స్వామి విశిష్టత చాల గొప్పది. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో ఖదిర చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చింది. ఖదిరి చెట్టు అనగా చండ్ర చెట్టు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది.

ఉత్సవాలు

ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాస ముంటారు. ఏటా ఈ అలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.

ఆలయ విశిష్టత

ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే........ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటే, కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా స్థానం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లెలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

ఎక్కడుంది ఈ క్షేత్రం ?

అనంతపురం జిల్లాలో ఉన్న కదిరి లోఈ ఆలయం ఉంది. ఇది పాకాల—ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది. కదిరిలో స్టేషను కూడా ఉంది. అదే విధంగా బస్సు సౌకర్యంకూడ బాగా ఉంది. ఇది పాకాల - ధర్మవరం మార్గములో ఉంది. (మూలం: ఈనాడు ఆదివారం: 2003 మార్చి 9)

మిగతా దేవాలయాలుసవరించు

 • కదిరిలో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సందర్భంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.
 • శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం:- శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్తాధి దేవత. సకల సౌభాగ్యాలకూ అధిస్టానదేవత అయిన ఆతల్లి శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి స్వహస్తాలచే ప్రతిష్ఠాపితమైన ఈ ఆలయం ఇక్కడ అలరారుతోంది. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అతి సమీపంలో శ్రీ మరకతమహాలక్స్మి మాత కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తోంది. ( మూలం:- ఈనాడు జిల్లా ఎడిషన్, 2013 అక్టోబరు 11. 10వ పేజీ.)

గణాంకాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 1,08,222 - పురుషులు 54,943 - స్త్రీలు 53,279

ప్రముఖులుసవరించు

చంద్రవదన మొహియార్ సమాధిసవరించు

చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యథార్థ సంఘటన, సుమారు 500-600 సంవత్సరాలకు పూర్వం చంద్రవదన రాజకుమారి కదిరికి రాగా, మొహియార్ ఆమెను ప్రేమించాడు. వీరి ప్రేమకున్న అన్నిరకాల అడ్డంకులనూ, మత కట్టుబాట్లనూ అధిగమించి వివాహ బంధనముతో ఒకటైనారు. వేర్వేరు మతాలకు చెందిన వీరి ప్రేమ గాథ కదిరిలో మతసామరస్యనికి ప్రతీక. వీరిని గుర్తుచేసుకుంటూ కదిరి పురపాలక సంఘం ఒక ప్రాథమిక పాఠశాలను నెలకొల్పినది.15వ శతాబ్దం విజయనగర సామంత రాజు శ్రీరంగరాయులు ఏకైక పుత్రిక చంద్రవదన కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళుతూ పర్షియా వజ్రాల వ్యాపారి అయిన మొహియార్‌ దుకాణం ముందునుంచే వెళ్లింది.ఆమె దృష్టి వజ్రాలకన్నా వాటిని విక్రయిస్తున్న మొహియార్‌పైన పడింది.అతని ఠీవి, దర్పాన్ని చూస్తూ, ఆమె పులకితురాలైంది. అతను కూడా చంద్రవదన అందాన్ని చూసి, గుండెల్లో ముద్రవేసుకున్నాడు.పరస్పర ఆకర్షణల మధ్య మధుర ప్రేమలు పంచుకున్నారు.ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చి తనస్థితి, స్థాయినీ గుర్తుతెచ్చుకుని వేగంగా కదిలి తన నివాసమందిరానికి వెళ్లింది. కాని మనసు మొహియార్‌ చుట్టూ తిరుగుతూనే ఉంది. కొన్ని నిముషాలు మెరుపులా మెరిసి తనమదిలో ముద్రపడిన చంద్రవదనని మొహియార్‌ మరవలేక పోయాడు. ఆ తరువాత రోజులన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చాయి. ప్రతీక్షణం చంద్రవదనే మదిలో తలపురేపుతూ. నిద్రాహారాలను దూరం చేసింది. అంతఃపురంలో చంద్రవదన పరిస్థితీ అలానే ఉంది. కానీ తన స్థాయి వేరు మతం వేరు. తన ప్రేమకు అర్థం లేదని భావించింది. ప్రేమను మరిచిపోవడానికి మనసురాక విలవిలలాడింది.ఒకరోజు మొహియార్‌ చంద్రవదనని ఎలాగైనా చూడాలని గాఢమైన కోరికతో ఆమె అంతఃపుర భవనం ముందుకు వచ్చాడు. అక్కడ రాజభటులు అతన్ని అడ్డగించారు. అతను చంద్రవదన ప్రేమతో పిచ్చివాడిగా మారి ఆమెనే కలవరిస్తుండటంతో రాజభటులు అతని మాటలు విని పిచ్చివాడిగా భావించి బలవంతంగా అతన్ని తోసేస్తారు. అతను ప్రక్కనవున్న గోడకు తలపగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. గొడవంతా తెలిసిన శ్రీరంగనాయకులు స్వయంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. చనిపోయిన వ్యకి ఫలానా అని తెలిసిన చంద్రవదన కూడా అక్కడికి వచ్చి అతని స్థితిని చూసి చలించిపోయి. ఆమె కూడా అమాంతంగా మొహియార్‌ శరీరంపై పడిపోయి ప్రాణాలు విడిచింది. ఇదంతా చూసిన శ్రీరంగనాయకులు మొదట వారిద్దరి మధ్య జరిగిన స్పందన, ప్రేమలను అర్థం చేసుకుని తన కొలువులోని గురువులు, పెద్దలను సంప్రదించి అందరి ఆమోదంతో చంద్రవదన, మొహియార్‌ల శవాలను ఒకే ప్రదేశంలో ఖననం చేయించదలచి ముస్లింల సమైక్యతను చాటుతూ వారి సమాధులను అటు హిందూ, ఇటు ముస్లిం సంప్రదాయ ప్రకారం నిర్మించాడు.ఆనాటి పాతర్లపట్నమే నేటి 'పట్నం' నేటి కదిరిని అప్పుడు ఖాద్రి అనేవారు. 13వ శతాబ్దంలో శ్రీరంగరాయల పూర్వీకుడు రంగనాతిప్పానాయుడు శ్రీఖాద్రి అనే పేరుతో పట్టణం నిర్మించాడని చెపుతారు. శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం అభివృద్ధి అప్పటినుంచి జరుగుతూ వస్తోంది. సుమారు 10 ఎకరాలాలో పెద్ద ఆలయంగా ఈ ఆలయం కనిపిస్తుంది. గుడి ప్రాంగణంలో నాలుగు మండపాలు, చిన్న చిన్న ఆలయాలున్నాయి. నలువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఒక గోపురాన్ని టిప్పుసుల్తాన్‌ కాలంలో ముస్లిం పాలకులు నిర్మించారు.చంద్రవదన మొహియార్‌ల సమాధి మందిరాన్ని అటు ముస్లింలు ఇటు హిందువులు, అనేక మంది సందర్శించి తమ ప్రేమలు ఫలించాలని మొక్కుకుంటారు.[2] మొహియార్ శవాన్ని అంత్యక్రియలకోసం తీసుకెళదామని ఎంతమంది వచ్చి కదిపినా అది కదలలేదనీ చివరికి ఘోర దుఖంలోఉన్న చంద్రవదన వచ్చి ఆతని శవాన్ని తాకినమీదటనే దానిని లేపగలిగారనీ, చంద్రవదనకూడా మొహియార్ తో ఎడబాటును సహించలేక అతనితోపాటు సజీవసమాధి అయ్యిందనీ, వారిది దైవికమైన అమరప్రేమగా అక్కడి ప్రజలు భావించారనీ మరో కథ ప్రచారంలో ఉంది.[3] వీరి సమాధి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోని ముస్లిముల శ్మశానస్థలంలో ఉంది.తాము ఆజన్మాంతమూ విడిపోకూడదనుకునే ప్రేమికులూ దంపతులు కూడా ఈ సమాధిపై ఉంచిన కుంకుమను నేటికీ భక్తిశ్రద్ధలతో తీసుకెళుతుంటారు.[4]

కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా కేంద్రముసవరించు

 
కదిరి 3 వేరుశనగ రకము

కదిరి-3 వేరుశనగ వంగడము ఇక్కడే అభివృద్ధిచేయబడింది. కదిరి-3 వంగడము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పండించు రకము. కదిరి-2, కదిరి- 71-1 రకములు కుడా విరివిగా పండించ బడుతాయి.

కదిరికి అత్యంత సమీపంలో చూడదగ్గ ప్రాంతాలుసవరించు

 1. యోగి వేమన సమాధి : 12 కి.మీ దూరంలో కటారుపల్లిలో ఉంది.
 2. తిమ్మమ్మ మర్రిమాను : ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రి చెట్టు, 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన చెట్టు. కదిరికి 20 మైళ్ళ దూరంలో ఉంది.
 3. యొగి వేమన జలాశయము :ముదిగుబ్బ దగ్గర ఉంది.
 4. సి.జి. ప్రాజెక్టు :సుమారు 22 మైళ్ళ దూరంలో ఉంది.
 5. బట్రెపల్లి జలపాతం: సుమారు 10 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో ఉంది.
 6. నామాల గుండు జలపాతం: సుమారు 18 కి.మీ దూరంలో పులివెందుల రహదారిలో ఉంది.

కదిరి తాలుకా లోని మండలాలు, పెద్ద గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-04.
 2. http://www.prabhanews.com/life/article-11750 Archived 2013-01-31 at Archive.today ఆంధ్రప్రభ 6.7.2009
 3. https://groups.google.com/forum/#!msg/telugu-unicode/ojbc5JB6weg/iCKXXouSKGQJ
 4. http://www.nethelper.com.au/article/Kadiri[permanent dead link]

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కదిరి&oldid=3255118" నుండి వెలికితీశారు