భూమి పశ్చిమార్ధగోళంలోని ప్రాంతాన్ని, ప్రత్యేకించి ఉత్తర దక్షిణ అమెరికాలు (సమీప ద్వీపాలతో సహా), ఓశియానియానూ కలిపి కొత్త ప్రపంచం (న్యూ వరల్డ్) అని అంటారు. ఆఫ్రికా, ఐరోపా, ఆసియాలే ప్రపంచమని భావించిన పాత ప్రపంచపు జియోగ్రాఫర్ల సాంప్రదాయిక భౌగోళిక శాస్త్రవేత్తల పరిధిని విస్తరిస్తూ 16 వ శతాబ్దం ప్రారంభంలో కొత్త భూమిని కనుగొన్నారు. అప్పుడు దీన్ని కొత్త ప్రపంచం అని అన్నారు. తరువాత అమెరికా అని పిలిచారు. ఇటాలియన్ అన్వేషకుడు అమెరిగో వెస్పుచి ప్రచురించాడని భావిస్తున్న ముండస్ నోవస్ అనే కరపత్రం వెలువడిన తరువాత ఈ పదానికి ప్రాముఖ్యత లభించింది. [1] అమెరికాలను "ప్రపంచంలోని నాల్గవ భాగం" అని కూడా పిలుస్తారు. [2]

సెబాస్టియన్ మున్స్టర్ యొక్క న్యూ వరల్డ్ యొక్క మ్యాప్, మొదట 1540 లో ప్రచురించబడింది

వాడుక మార్చు

 
హిస్టరీ ఆఫ్ ది న్యూ వరల్డ్ "హిస్టోరియా యాంటిపోడమ్ ఓడర్ న్యూ వెల్ట్". మాథ్యూస్ మెరియన్, 1631.

"పాత ప్రపంచం" - "కొత్త ప్రపంచం" అనే పదాలు చారిత్రక సందర్భంలోను, ప్రపంచంలోని ప్రధాన పర్యావరణ మండలాలను వర్గీకరించేటపుడూ, ఈ మండలాల్లో ఉద్భవించిన వృక్ష, జంతు జాతులను వర్గీకరించే సందర్భం లోనూ అర్థవంతంగా ఉంటాయి.

"కొత్త ప్రపంచం" గురించి ఏదైనా చారిత్రక సందర్భంలో మాట్లాడవచ్చు. ఉదా., క్రిస్టోఫర్ కొలంబస్ చేసిన సముద్రయానాలు, స్పానిష్ వారు యుకాటాన్‌ను ఆక్రమించిన విషయం గురించి మాట్లాడేటపుడు, వలసరాజ్యాల కాలంలోని ఇతర సంఘటనల గురించి చర్చించేటప్పుడు ఈ పదాన్ని వాడవచ్చు. అమెరికాలు, సమీప ద్వీపాలైన బెర్ముడా, క్లిప్పర్టన్ ద్వీపం వంటివాటిని సమష్టిగా ఉదహరించేందుకు వేరే పదాలేమీ లేనందున కూడా ఈ పదం ఉపయోగపడుతుంది.

కొత్త ప్రపంచం అనే మాటను జీవశాస్త్ర సంబంధ చర్చల్లో విషయాలకూ వాడుతారు. పాత ప్రపంచానికి చెందిన జాతులను (పాలియార్కిటిక్, ఆఫ్రోట్రోపిక్ ), కొత్త ప్రపంచపు జాతులనూ (నియార్కిటిక్, నియోట్రోపిక్) ఉదహరిస్తారు. ప్రత్యేకించి అమెరికాలో మాత్రమే కనిపించే జీవజాతులను ఉదహరించేందుకు, వాటిని "పాత ప్రపంచం" లోని (ఐరోపా, ఆఫ్రికా, ఆసియా) లోని వాటి నుండి వేరు చేయడానికీ జీవ వర్గీకరణ శాస్త్రవేత్తలు ఈ పదాన్ని వాడుతారు. ఉదా: కొత్త ప్రపంచపు కోతులు, కొత్త ప్రపంచపు రాబందులు, కొత్త ప్రపంచపు వార్బ్‌లర్లు.

వ్యవసాయంలోనూ ఈ మాటను తరచుగా ఉపయోగిస్తారు. కొత్తరాతియుగ విప్లవం నుండి ఉత్పన్నమైన వ్యవసాయపు చరిత్ర ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో ఒకేలా ఉంటుంది. ఒకే పెంపుడు జంతువులు, మొక్కలూ వేల సంవత్సరాల క్రితం ఈ మూడు ఖండాల్లో వ్యాపించాయి. దీంతో వీటన్నిటినీ కలిపి "పాత ప్రపంచం"గా వర్గీకరించడానికి వీలుగా ఉంది. పాత ప్రపంచంలో సామాన్యంగా కనిపించే పంటలు (ఉదా., బార్లీ, కాయధాన్యాలు, ఓట్లు, బఠానీలు, రై, గోధుమలు), పెంపుడు జంతువులూ (ఉదా., పశువులు, కోళ్లు, మేకలు, గుర్రాలు, పందులు, గొర్రెలు), కొలంబస్ అమెరికాను కనిపెట్టిన తరువాత (కొలంబియన్ పరిచయం) ఐరోపా నుండి తీసుకువెళ్ళేంత వరకు అమెరికాలో లేవు. అలాగే, అమెరికాల్లో పెంచిన కొన్ని పంటలు కొలంబియన్ పరిచయం తరువాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. వాటిని కొత్త ప్రపంచపు పంటలు అని అంటారు; చిక్కుళ్ళు (ఫాసియోలస్), మొక్కజొన్న, స్క్వాష్ (ముగ్గురు సోదరీమణులు), అలాగే అవోకాడో, రామములగ, వివిధ రకాల కాప్సికమ్ (కూరమిరప, మిరపకాయ మొదలైనవి). టర్కీలను మధ్య అమెరికా లోని కొలంబియా ప్రజలు మొదట మచ్చిక చేసుకున్నారు. దక్షిణ అమెరికాలోని ఆండియన్ ప్రాంతంలోని వ్యవసాయదారులు కర్ర పెండలం, వేరుశెనగ, బంగాళాదుంప, క్వినోవా, అల్పాకా వంటి పంటలను గినియా పిగ్, లామా వంటి పెంపుడు జంతువులనూ సాకారు. ఇతర కొత్త ప్రపంచపు పంటల్లో జీడిపప్పు, కోకో, రబ్బరు, పొద్దుతిరుగుడు, పొగాకు, వనిల్లా, జామ, బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లూ ప్రసిద్ధమైనవి. రెండు ప్రపంచాల్లోనూ వేరువేరుగా పెంచిన పంటలు, జంతువులూ కూడా ఉన్నాయి. ఉదా: సొరకాయ, పత్తి, యామ్, కుక్క. బహుశా వీటిని పురాతన మానవులు గత గ్లేసియల్ కాలంలో ఆసియా నుండి వెళ్ళినపుడు తీసుకెళ్ళి ఉండవచ్చు.

వైన్ పరిభాషలో, "కొత్త ప్రపంచం"కు వేరే నిర్వచనం ఉంది. "కొత్త ప్రపంచపు ద్రాక్ష"ల్లో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ద్రాక్షలే మాత్రమే కాకుండా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాలే కాక, సాంప్రదాయికంగా ద్రాక్షను పెంచే ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, సమీప ప్రాచ్యాలు కాకుండా ఇతర ప్రదేశాలన్నీ కూడా ఉన్నాయి. [3]

పదం యొక్క మూలం మార్చు

 
కొత్త ప్రపంచం యొక్క అల్లెగోరీ: అమెరిగో వెస్పుచి నిద్రపోతున్న అమెరికాను మేల్కొల్పుతుంది

"కొత్త ప్రపంచం" ("ముండస్ నోవస్") అనే పదాన్ని మొట్టమొదట అమెరిగో వెస్పుచి అనే అన్వేషకుడు తన స్నేహితుడు, మాజీ పోషకుడూ అయిన లోరెంజో డి పియర్ ఫ్రాన్సిస్కో డి మెడిసికి 1503 వసంత ఋతువులో రాసిన లేఖలో వాడాడు. దీన్ని 1503–04లో ముండస్ నోవస్ పేరుతో ప్రచురించారు. (లాటిన్లో). క్రిస్టోఫర్ కొలంబస్ చెప్పినట్లు పశ్చిమాన యూరోపియన్ నావికులు కనుగొన్న భూములు ఆసియా అంచున లేవని, అవి పూర్తిగా భిన్నమైన ఖండమనీ, ఒక "కొత్త ప్రపంచ" మనీ స్ఫుటంగా వెల్లడించినది వెస్పూచి రాసిన లేఖయే. [2]

మూలాలు మార్చు

  1. Mundus Novus: Letter to Lorenzo Pietro Di Medici, by Amerigo Vespucci; translation by George Tyler Northrup, Princeton University Press; 1916.
  2. 2.0 2.1 M.H.Davidson (1997) Columbus Then and Now, a life re-examined. Norman: University of Oklahoma Press, p. 417)
  3. "Real Differences: New World vs Old World Wine". Wine Folly. 21 August 2012.