కోతి కొమ్మచ్చి (పుస్తకం)

కోతి కొమ్మచ్చి ప్రముఖ రచయిత, సినీ నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ రాసిన ఆత్మకథలో మొదటిభాగం. కోతికొమ్మచ్చిలో ముళ్ళపూడి వెంకటరమణ తన చిన్నతనం నుంచి ఆంధ్రపత్రికలో ఉపసంపాదకునిగా ఉద్యోగాన్ని వదిలివేయడం వరకూ రచనచేశారు. రచయిత తన జీవితంలో అనుభవించిన దారిద్ర్యాన్ని, విషాదాన్ని హాస్యంగా చెప్పడమనే విశిష్టమైన కృషిచేశారు.

కోతి కొమ్మచ్చి
కృతికర్త: ముళ్ళపూడి వెంకటరమణ
బొమ్మలు: బాపు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
సీరీస్: కోతి కొమ్మచ్చి
ప్రక్రియ: ఆత్మకథ
విభాగం (కళా ప్రక్రియ): హాస్యం
ప్రచురణ: హాసం ప్రచురణలు
విడుదల: 2009
పేజీలు: 220
దీని తరువాత: ఇంకోతి కొమ్మచ్చి

రచన నేపథ్యం

మార్చు

ముళ్ళపూడి వెంకటరమణ ఆయన ఆత్మకథని రచించి స్వాతి వారపత్రికలో ధారావాహికగా ప్రచురించారు. రమణ తన ఆప్తమిత్రుడు బాపుతో కలిసి పెనవేసుకున్న జీవితాన్ని గురించి పేర్కొంటూ ఇది బాపు-రమణల ఆత్మకథ అని పేర్కొన్నారు. ఆత్మకథలో అనువైన చోట్ల బాపు బొమ్మలు కలిపి ప్రచురణ చేశారు. హాసం ప్రచురణలు సంస్థ ప్రచురణకర్తగా కోతి కొమ్మచ్చి ముద్రితమైంది.

విషయం

మార్చు

కోతి కొమ్మచ్చి పుస్తకంలో ముళ్ళపూడి వెంకటరమణ తన జీవితంలోని తొలిరోజులను అక్షరబద్ధం చేశారు. ధవళేశ్వరంలో జన్మించిన ముళ్ళపూడి వెంకట్రావు (రమణ అసలుపేరు) చిన్నతనంలో వైభవంగా జీవించారు. ఆయన తల్లిదండ్రులు ఆధ్యాత్మికత, బంధుప్రీతి కలవారు కావడంతో రమణ ఇంట్లో ఎప్పుడూ దగ్గర బంధువులు, దూరపు బంధువులు, బాబాలు, స్వాములు, తెలిసినవారు, తెలియనివారితో కళకళలాడేది. ఆస్తి అంతా అటువంటివారిని పోషించడంతో కరిగిపోవడం, రమణ తండ్రి హఠాన్మరణం చెందడం వంటివాటితో కుంగిపోయిన కుటుంబం మద్రాసు తరలిపోయింది. పేదరికం వల్ల రమణ, ఆయన తల్లి, తమ్ముడు, అమ్మమ్మ ఓ ఇరుకు ఇంటిలో సర్దుకోవాల్సి రావడం మొదలుకొని ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించారు. రమణ తల్లి హిందీ ప్రచార సభలో టీచరుగా పనిచేయడమే కాక, రెండో ప్రపంచయుద్ధ కాలంలో సైనిక దుస్తులకు కాజాలు కుట్టడం, కుట్టుడాకులు కుట్టి అమ్మడం, కాగితం తయారీ కుటీరపరిశ్రమ పెట్టడం వంటి ఎన్నో పనులు చేశారు. రమణ చదువులో రాణిస్తూనే తల్లికి ఈ పనులన్నిటిలో సాయం చేసేవారు. ఈ స్థితి నుంచి మొదలుకొని ఆయనను విశాఖపట్నం హార్బరులో పనిచేయించడం, అక్కడ నుంచి పారిపోయి ఏలూరు మీదుగా మద్రాసు చేరుకోవడం, అక్కడ ఆంధ్రపత్రికలో చేరడం వంటివీ, మరోవైపు బాపు, అజంతా వంటివారితో స్నేహం ఏర్పడడం వంటివన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఇలా సాగుతున్న జీవితంలో రమణ ఆత్మగౌరవానికి భంగం కలగడంతో ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటరుగా స్థిరమైన వృత్తిని మానుకోవడంతో ఈ పుస్తకం ముగుస్తుంది. కాలక్రమాన్ని ఒక పక్క అనుసరిస్తూనే ప్రస్తావన వచ్చినప్పుడు వేర్వేరు సందర్భాల్లో జరిగిన సంగతులు కూడా ఎన్నిటినో ప్రస్తావించారు రమణ.[1]

శైలి-శిల్పం

మార్చు

కన్నీరు, కష్టాలు హాస్యంగా చెప్పడంతో ఒక విశిష్టమైన శైలిని సాధించారు ముళ్లపూడి వెంకటరమణ. చిన్నతనంలోనూ, యౌవనంలోనూ అనుభవించిన దుర్భర దారిద్ర్యాన్ని సహజమైన హాస్యంతో మిళితం చేసి విలక్షణమైన రచనగా కోతి కొమ్మచ్చిని నిలబెట్టారు. సంఘటనలను కాలక్రమంలో వివరిస్తూనే ప్రస్తావనలు వచ్చినచోట ఆసక్తికరమైన వేరే విషయాలు, వేరే సంఘటనలు చెప్తూ పోయారు. ఇలా చెప్పే రచనా శిల్పానికే కోతి కొమ్మచ్చి అనే పేరు పెట్టారు. పుస్తకంలో కూడా పలుమార్లు అలా వేరే విషయంలోకి వెళ్ళినప్పుడు కోతి కొమ్మచ్చికి సంకేతంగా కో.కొ. అని రాశారు.

ప్రాచుర్యం

మార్చు

కోతి కొమ్మచ్చి స్వాతి వారపత్రికలో ధారావాహికలో ప్రచురితమవుతున్నపుడే విశేషమైన స్పందన లభించింది. కోతి కొమ్మచ్చి విడుదల సభ టీవీ ఛానళ్ళలో ప్రత్యక్ష ప్రసారమైంది. విడుదల అయిన వారంలోనే ప్రచురితమైన పుస్తకాలన్నీ అమ్ముడైపోయాయి. అనంతర కాలంలో పలుమార్లు పునర్ముద్రణ పొందింది. కోతికొమ్మచ్చి పుస్తకాన్ని ఆడియోబుక్‌గా విడుదల చేశారు. ఆడియో బుక్‌లో పలు అధ్యాయాలు చదివి వినిపించిన వారి జాబితా:[2]

మూలాలు

మార్చు
  1. కోతి కొమ్మచ్చి:ముళ్ళపూడి వెంకటరమణ:హాసం ప్రచురణలు
  2. వినగ వినగ... ఒక కోతి కొమ్మచ్చి