ప్రబోధానంద యోగీశ్వరులు

(గుత్తా పెద్దన్న చౌదరి నుండి దారిమార్పు చెందింది)

ప్రబోధానంద యోగీశ్వరులు (1950 ఏప్రిల్ 5 - 2020 జూలై 9) వివాదాస్పద[1] ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంత కర్త, బహు గ్రంథకర్త. ఇతని అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి. [2] అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో ప్రబోధాశ్రమము, శ్రీకృష్ణమందిరము, ఇందూ జ్ఞాన వేదికను స్థాపించి తద్వారా తన రచనల్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తున్నారు. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో వున్న దైవజ్ఞానము ఒక్కటేనని త్రైత సిద్ధాంతం అన్నది చెప్తోంది. ప్రబోధానంద ఈ సిద్ధాంతకర్త. పలు అంశాలకు ఈ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తూ, తన ఆధ్యాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు. పెద్దన్న చౌదరి అన్న పూర్వనామం వదిలి ప్రబోధానందగా మారి త్రైత సిద్ధాంతాన్ని చెప్పడం 1978లో ప్రారంభమైంది. ప్రబోధానంద శిష్యులు 1978తో క్రీస్తుశకం ముగిసి త్రైత శకం ప్రారంభమైందని ప్రతీ సంవత్సరాన్ని ఈ త్రైత శకం లెక్కల్లో చెప్పుకుంటూంటారు..

ప్రబోధానంద యోగీశ్వరులు
ప్రబోధానంద
జననం
గుత్తా పెద్దన్న చౌదరి

1950 ఏప్రిల్ 5
మరణం2020 జూలై 9(2020-07-09) (వయసు 70)
వృత్తిఆధ్యాత్మికవేత్త, రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఇందు జ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు, త్రైత సిద్ధాంత కర్త.
బిరుదుతెలుగు బుక్ ఆఫ్ రికార్ద్స్-2021 లో నమోదు - ఆధ్యాత్మిక రంగంలో త్రైత సిద్ధాంతము ఆధారంగా వంద(100) గ్రంథములను రచించి-ప్రచురించిన ఏకైక రచయిత
వెబ్‌సైటుwww.thraithashakam.org

ఇతని వివాదాస్పద అభిప్రాయాలు, బోధనల కారణంగా ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ప్రజలతో వివాదాలు తలెత్తాయి.[3] పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర రెడ్డితో ఉన్న రాజకీయ విభేదాల కారణంగాను,[2] ఆశ్రమ వాసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణల కారణం గానూ 2018 సెప్టెంబరులో ఆశ్రమ ప్రాంతం ఉద్రిక్తతలకు లోనైంది. ఇతను 2020 జూలై 9న తన ఆశ్రమంలో అనారోగ్యంతో మరణించాడు.[4]

జీవిత చరిత్ర

తొలినాళ్ళ జీవితం

1950లో జన్మించిన ప్రబోధానంద అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి. స్వగ్రామం అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నెకొత్తపల్లి. మొదట్లో పెద్దన్న చౌదరి భారత సైన్యంలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేశాడు.[2] సమాజానికి దైవజ్ఞానము అందించాలి, అన్న అయన కోరిక మేరకు అధికారులు అతనిని సైన్యం నుంచి పంపించేశారు.[5] తాడిపత్రి ప్రాంతానికి తిరిగివచ్చి ఆర్.ఎం.పీ. వైద్యునిగా పనిచేశాడు. మొదటి పెళ్ళి భగ్నమై, తర్వాత మల్లిక అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు. క్రమేపీ ఆయుర్వేదం గురించి తెలుసుకుని, దానిపై పుస్తకాలు రాశాడు. ఆధ్యాత్మిక అంశాలపైనా గ్రంథ రచన కొనసాగించాడు.[2]

ప్రబోధానందగా మార్పు, ఆశ్రమం ఏర్పాటు

1978లో ప్రబోధానంద భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ గ్రంథాలు బోధిస్తున్నది ఒకటేనని అదే త్రైత సిద్ధాంతం అని తన ఆలోచనలకు సిద్ధాంత రూపం ఇచ్చాడు.[2] ప్రబోధానంద త్రైత సిద్ధాంతం గురించి రాయడం మొదలుపెట్టిన 1978 సంవత్సరం శకారంభమనీ, దాన్ని త్రైత శకమనీ అతని భక్తులు విశ్వసిస్తారు. 1980లో తన పేరును ప్రబోధానంద యోగీశ్వరులు అని మార్చుకుని, ప్రబోధానంద ఆశ్రమాన్ని స్థాపించాడు. ఈ సిద్ధాంతానికి పలు అంశాలు చేరుస్తూ రాముడు భగవంతుడు కాదనీ, కృష్ణుడు భగవంతుడనీ, రావణుడు ఆరాధనీయుడనీ, ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త బోధించినవీ, భగవద్గీత చెప్పినవీ ఒకటేనని పలు విషయాలపై తన సిద్ధాంతాలకు గ్రంథరూపం ఇచ్చాడు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వరుసగా అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రతిపాదించారనీ, వారి కోవలోనే తాను త్రైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధిస్తున్నాడని ప్రబోధానందను గురించి క్రమేపీ అతనికి ఏర్పడ్డ శిష్యులు, భక్తుల నమ్మిక. అలాగే ప్రముఖ తత్త్వయోగి, కవి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో చెప్పిన ప్రబోధానంద ఆశ్రమమం, దాని ఆనందగురువు తానేనని అతను, అతని శిష్యులు విశ్వసించసాగారు.[5]

రాజకీయ వివాదాలు, ఆశ్రమం తరలింపు

1990లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు సాగిన అల్లర్లలో తాడిపత్రిలోని బీజేపీ సానుభూతిపరులైనవారి దుకాణాలుపై దాడులు జరిగాయి. ఈ సమయంలో స్థానిక బీజేపీ నేత వేణుగోపాల్‌రెడ్డికీ, కాంగ్రెస్ నాయకులు జేసీ సోదరులకీ వివాదాలు జరిగాయి. వేణుగోపాల్‌రెడ్డికి ప్రబోధానంద రక్షణనిచ్చి, సహాయం చేశాడు. ఈ సందర్భంగా ప్రబోధానంద ఆశ్రమంపై దాడులు జరగడంతో అనంతపురానికి, ఆ తర్వాత బత్తలపల్లికి మార్చారు. ఓ దాడిలో ప్రబోధానంద ఆస్పత్రికి వచ్చిన మహిళ, అతని కుమారుడు చనిపోయారు. స్థితిగతులు ప్రతికూలంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ వదిలి కర్ణాటకలోని కంప్లి ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటుచేశాడు.[2]

ఇందూజ్ఞానవేదిక స్థాపన, చిన్నపొలమడలో ఆశ్రమం

దాదాపు 12 సంవత్సరాల పాటు అనంతపురం జిల్లా వదిలి కంప్లిలో జీవించిన ప్రబోధానంద తిరిగి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామ సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి ఆశ్రమాన్ని నిర్మించాడు. 2003లో త్రైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు ఇందూ జ్ఞాన వేదిక అన్న సంస్థను స్థాపించాడు. అదే సంవత్సరం ప్రబోధానంద రాజకీయ స్పర్థను ఎదుర్కొంటూ చిన్నపొలమడలోని ఆశ్రమాన్ని పూర్తిచేసి, స్థిరపడ్డాడు. ఆ తర్వాత జ్యోతిష్యం-వాస్తు, దేవతలు-దయ్యాలు, మతాలు-కులాలు - ఇలా పలు అంశాలపై సాధారణమైన అవగాహనకు భిన్నంగా తనదైన పద్ధతిలో వ్యాఖ్యానాలు చేస్తూ త్రైత సిద్ధాంతానికి అనుబంధంగా పలు పుస్తకాలు రాశాడు. చినపొలమడలో అత్యాధునికమైన ముద్రణ ప్రెస్ పెట్టి తాను రాసిన పుస్తకాలను తెలుగు, పలు ఇతరభాషల్లో అనువాదాలు ప్రచురిస్తూ, అమ్ముతూ ఉన్నారు. అలానే ఆశ్రమానికి విరాళాలూ స్వీకరిస్తూంటారు. ప్రబోధానంద భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. తాడిపత్రి మండలంలోనే 15 వేలమంది భక్తులు, అనంతపురం జిల్లా మొత్తంగా పాతిక వేలమంది భక్తులు ఉన్నారని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ, అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ కూడా అతని భక్తులు ఉన్నారు. 2016-18 కాలంలో ప్రబోధానంద ఎక్కడ నివసిస్తున్నదీ తెలియదు. అతని బోధనలను వీడియో రికార్డు చేసి ఆశ్రమం తెరలపై ప్రదర్శించడం, యూట్యూబులోకి ఎక్కించడం చేస్తున్నారు.[2]

మరణం

2020 జూలై 9న చిన్నపొలమడలోని స్వంత ఆశ్రమంలో బాధపడుతున్న ప్రబోధానందను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.[6] వైద్యులు పరీక్ష చేసి గుండెపోటుతో

మరణించినట్లు ధ్రువీకరించారు.

పురస్కారములు

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన శతాధిక, సంచలనాత్మక, ఆధ్యాత్మిక గ్రంథములను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పరిశీలించి ఆధ్యాత్మిక రంగంలో త్రైత సిద్ధాంతము ఆధారంగా వంద(100) గ్రంథములను రచించి-ప్రచురించిన ఏకైక రచయిత ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు[7] అని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్-2021 లో ధృవీకరించడమైనది.[8]

సిద్ధాంతాలు

ప్రబోధానంద బోధనలు అనుసరించే భక్తులు తమను తాము ఇందువులనీ, త్రైతులనీ పిలుచుకుంటారు. తాము హిందువులంకామనీ, ఇందువులమనీ వీరు చెప్పుకుంటూంటారు. నిజానికి హిందూమతానికి పూర్వం ఇందుమతం అన్న పేరే వ్యవహారంలో ఉండేదని వీరి విశ్వాసం. విశ్వవ్యాప్తంగా అన్ని మతాలలోనూ త్రైత సిద్ధాంతం ప్రవచించే ఇందూపథం అంతర్లీనంగా ఉందని వీరు చెప్తారు. సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఏ మతము, కులము లేదనీ వీరు చెప్తారు. ఇందు అన్నది ఒక పథము కానీ, మతము కాదని వీరి అభిప్రాయం. హిందు, ఇస్లాం, క్రైస్తవాల్లోని భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాత్రమే వీరు అంగీకరిస్తారు, వేదాలు, పురాణాలు, పాత నిబంధన, హదీసులు వంటివాటిని వీరు తిరస్కరిస్తారు. భగవద్గీత శ్లోకాలలో, 4 సువార్తల వచనాలలో, ఖురాన్ ఆయతులలో మాత్రమే ఆత్మజ్ఞానం ఉందని వీరు పేర్కొంటారు. వీరు శిలువను మాయగా, క్రీస్తును భగవంతునిగా చెప్తారు. వీరు హిందూ దేవతల్లో కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించి, రాముడు భగవంతుడు కాడని చెప్తూంటారు. మానవులకు బ్రహ్మవిద్య తెలిపేందుకు భగవంతుడే త్రేతాయుగంలో రావణుడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో ఏసుక్రీస్తు, వేమన యోగీశ్వరుల రూపాల్లో జన్మించాడని వీరి విశ్వాసం. వీరి సిద్ధాంతాల ప్రకారం మతానికి అతీతమైనది ఇందూ పథము. పూర్వం భారతదేశాన్నీ ఇందూదేశము అనేవారనీ కాలక్రమేణ అది వందల సంవత్సరాల క్రితం మాత్రమే, హిందూ దేశంగా మారినది అనీ వీరి వాదన. కుల, మత విశ్వాసాలకు అతీతమైనది వీరి ఇందూ పథం (మార్గం).

ప్రబోధానంద ప్రకారం వాస్తుకు శాస్త్ర ప్రామాణికత లేదు. యజ్ఞయాగాలు, వ్రతాలు, వేదాధ్యయనాలు దైవసమ్మతం కాదని వీరి సిద్ధాంతం. వీరి సిద్ధాంతంలో చెప్పబడే ఇంద్రియాతీత ఆత్మ జ్ఞానానికి మంత్ర, జప, ఉపవాస, ధ్యానాదులు అవసరం లేదని భావిస్తారు. ఆచారాలు, సంప్రదాయాలకు ఈ సిద్ధాంతంలో అంతరార్థాలు, ఆత్మజ్ఞాన బద్ధంగా చెప్తారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లకు భాష్యం చెప్తూ, వాటిని ఆయా మతాల ప్రధాన స్రవంతి సిద్ధాంతాల్లోనూ, మతాచార్యులూ వ్యాఖ్యానించే తీరుకు భిన్నంగా వ్యాఖ్యానిస్తారు. ఇందూపద్ధతిని ప్రచారం చేసి ప్రపంచం అంతా దాని కిందికి తీసుకురావడం ద్వారా వసుధైక కుటుంబం సాధించవచ్చని వీరి భాష్యం. మంత్రాలు-మహత్యాలు, దయ్యాలు-భూతాలు, దేవుడు-దేవతలు-భగవంతుడు, జననము-మరణము, పునర్జన్మ-మోక్షం నమ్మకాలు-మూఢనమ్మకాలు ఇత్యాది విషయాలపై వీరికి తమవైన వ్యాఖ్యానాలు ఉన్నాయి.

తెలుగు భాష వల్లనే ఆత్మజ్ఞానం చెప్పేందుకు, తెలుసుకునేందుకు వీలుందని, తెలుగు దైవభాష అనీ ఈ సిద్ధాంతకర్త ప్రబోధానంద చెప్తాడు. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి రానున్న భవిష్యత్తులో అందరూ తెలుగు నేర్చుకుంటారని అతని సిద్ధాంతం. ఇలా నిత్యజీవితానికి సంబంధించిన మరెన్నో విషయాలపై, ఆధ్యాత్మికాంశాలపై తమదైన వ్యాఖ్యానం వీరు చేస్తారు. ఈ సిద్ధాంతాలు ప్రధానంగా ప్రబోధానంద ప్రతిపాదించి పలు పుస్తకాల్లో రాస్తూ, ప్రసంగాల ద్వారా ప్రచారం చేశాడు.

ప్రబోధాశ్రమం

ప్రబోధాశ్రమము (శ్రీ కృష్ణ మందిరము) అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొడమల గ్రామంలో ఉంది. ఈ ఆశ్రమాన్ని ప్రబోధానంద ప్రారంభించాడు. ఈ ఆశ్రమం ద్వారానే అతని త్రైతసిద్ధాంతము ప్రాచుర్యం చెందింది.

వివాదాలు

ఖురాన్ పై చేసిన వ్యాఖ్యలు

ప్రబోధానంద తన దేవుని ముద్ర అనే పుస్తకంలో ఖురాన్ పై చేసిన వ్యాఖ్యలపై ముస్లిముల నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు. 2017 మే 19న తాడిపత్రి పట్టణంలో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ‘‘ప్రబోధానంద స్వామి రాసిన పుస్తకంలో ఖురాన్, మహమ్మద్‌ ప్రవక్త గురించి, ఇస్లాం ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని నిలిపివేయాలి. భవిష్యత్తులో ఇస్లాం గురించి అవగాహనాలేమితో పుస్తకాలు రాయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ముస్లిములు కోరారు.[9] ప్రబోధానంద రచించిన "దేవునిముద్ర" అనే గ్రంథంలోని సమాచారం కొందరు అపార్థం చేసుకొన్నారంటూ వారి విమర్శను ఖండిస్తూ, మే 20న ప్రబోధాశ్రమము వారు తాడిపత్రి పట్టణ పోలీసులకు ఒక వినతిపత్రం అందచేసారు. "ఖురాన్ సర్వ మానవాళికీ అందించబడ్డ దైవ గ్రంథమనీ తెలియచేసారే తప్ప ఆయన ఏ మతం పైనా, ఏ ప్రవక్త పైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు" అని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

గ్రామ ప్రజలకు, ప్రబోధానంద ఆశ్రమ వాసులకు మధ్య జరిగిన ఘర్షణ

2018 సెప్టెంబరు 15న ఆశ్రమంలో అన్ని రాష్ట్రాల భక్తుల సమావేశం, శ్రీకృష్ణాష్టమి వేడుకల సమీక్ష జరుగుతుండగా[ఆధారం చూపాలి], వినాయక నిమజ్జనం కోసం పెద్ద పొడమల గ్రామస్థులు ఊరేగింపుగా వినాయక విగ్రహాన్ని తీసుకుని ప్రబోధానంద ఆశ్రమం మీదుగా వెళ్తున్న సమయంలో వివాదం తలెత్తి ఘర్షణగా మారింది. వినాయకచవితి పండుగ తమ ఆచారాలకు విరుద్ధమంటూ భక్తులు దాడి ప్రారంభించారు అని ఒక వర్గం పేర్కొనగా,[10] రాజకీయ కక్షతో వినాయక నిమజ్జనం పేరుతో ఆస్రమంపై దాడులు జరిపారంటూ ఇంకో వర్గం పేర్కోన్నారు.[11] ఆ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇందుకు నిరసనగా అనంతపురం పార్లమెంటు సభ్యుడు [[జె. సి. దివాకర్ రెడ్డి|జేసీ దివాకరరెడ్డి]] సెప్టెంబరు 16 న సంఘటనా స్థలం వద్ద నిరసన తెలిపాడు. పెద్దపొలమడ గ్రామస్తులు పెద్దఎత్తున ఆశ్రమాన్ని చుట్టుముట్టి రాళ్లు విసిరారు.అక్కడే వున్న ఆశ్రమ వాహనాలపై దాడి చేసారు. ఆశ్రమ నిర్వాహకుల తీరును నిరసిస్తూ గ్రామానికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంలో ఆశ్రమంలోపలి ప్రబోధానంద శిష్యులు ఒక్కసారిగా బయటకు వచ్చి, గ్రామస్తులపై కర్రలు, రాడ్‌లతో ప్రతిదాడిచేశారు. అక్కడివారిని కొట్టుకుంటూ పోగా వారి ధాటికి పోలీసులు కూడా ఆగలేకపోయారు. స్థానికులు తమ వాహనాలు అక్కడే వదిలి పారిపోగా, ఆ వాహనాలకు భక్తులు నిప్పు పెట్టారు.[12] ఈ ఘర్షణలో ఎంపీకి కూడా రాయి తగిలింది, ఎంపీ వాహనం పాక్షికంగా దెబ్బతింది. ద్విచక్ర వాహనాలు, ఒక జీపు అగ్నికి ఆహుతయ్యాయి.[10] [13] పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జేసీ దివాకరరెడ్డిని అక్కడ నుంచి మద్దతుదారులు పంపించగా అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి బైఠాయించాడు.[10]

సెప్టెంబరు 16 న తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఎనిమిది మంది గ్రామస్తులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తీసుకెళ్లారు. పెద్దపొలమడకు చెందిన ఫకీరప్ప (వెంకట్రాముడు[14]) అనంతపురంలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆశ్రమాన్ని మూసెయ్యాలని దివాకరరెడ్డి డిమాండు చేసాడు.[13][15] మరోవైపు 16 తేదీన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఆశ్రమం సమీపంలో ఆక్టోపస్ దళాలు సహా భారీ బలగాలు మోహరించారు.[16] లా అండ్ ఆర్డర్, కర్నూలు ఐజీలు, ఆక్టోపస్ విభాగం, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల ఎస్పీలు, జిల్లా కలెక్టర్ ఆశ్రమం సమీపానికి చేరుకుని ఆశ్రమవాసులతో సంప్రదింపులు ప్రారంభించారు.[10] ఆశ్రమానికి ఏ హానీ జరగదని పోలీసులు హామీ ఇచ్చాకా, అంతవరకూ కదలకుండా భీష్మించిన 600 మంది స్థానికేతర భక్తులను ఇతర ప్రాంతాలకు వెళ్ళడంతో వివాదం సద్దుమణిగింది.[17]

ఈ వివాదానికి నేపథ్యంగా జేసీ దివాకరరెడ్డి, ప్రభాకరరెడ్డి సోదరులకు, ప్రబోధానంద, కుమారుడు యోగానంద, ఇతర అనుచరులకు మధ్య రాజకీయ ఘర్షణ ఉంది. గతంలో ప్రబోధాశ్రమం నిర్మాణ కార్యకలాపాల విషయమై ఈ వివాదం రాజుకుంది. జేసీ ప్రభాకరరెడ్డి ఆశ్రమానికి చెందిన డ్రైవర్‌ని కులం పేరిట దూషించాడన్న ఆరోపణపై కేసు నమోదుచేశారు. 2017 సెప్టెంబరులో జరిగిన ఘర్షణలో ఆశ్రమానికి చెందిన ఒక ట్యాంకర్‌ను పెద్దపొలమడ గ్రామస్తులు నిప్పుపెట్టారు. ఆశ్రమ నిర్వాహకులు, జేసీ సోదరులు గతంలో ఒకరిపై ఒకరు క్రిమినల్ ఫిర్యాదులు చేసుకున్నారు.[11] 2017లో ప్రబోధానంద కుమారులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ పరిణామాల అనంతరం తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని ప్రబోధానంద పేర్కొన్నాడు.[18] రాజకీయ, ఆర్థిక కారణాల వల్లనే జేసీ ప్రోద్బలంతో ఒక పోలీసు అధికారి ప్రజలను రెచ్చగొట్టి ఈ ఘర్షణ ప్రారంభించాడని ప్రబోధానంద ఆరోపించాడు.[19]

మరోవైపు ఊరేగింపులో ఆశ్రమ మహిళల పట్ల గ్రామస్తులు అసభ్యంగా ప్రవర్తించారనీ, రంగులు చల్లుతూ దాడికి ప్రయత్నించారనీ, ఆత్మరక్షణకే తాము ఎదురుదాడి చేశామనీ భక్తులు చెప్తున్నారు.[10] ఆశ్రమం ముందునుంచి వెళ్తున్న వినాయక విగ్రహం ఉన్న వాహనంతో పాటు వెనుక రెండు ట్రాక్టర్లలో రాళ్ళు నింపుకుని వచ్చారనీ, పక్కా పథకంతో రెచ్చగొట్టి రాళ్ళు విసిరి గొడవ ప్రారంభించారని ప్రబోధానంద వర్గీయుల వాదన. ఆదివారం జేసీ దివాకరరెడ్డి, తన అనుచరులతో ఆశ్రమం మీదికి దాడికి వచ్చాడనీ, రాడ్‌లతో దాడి చేశాడనీ, తిప్పికొట్టేందుకే భక్తులు ఎదురుదాడి చేశారనీ చెప్తున్నారు.[11] గాయపడ్డ ఆశ్రమవాసులకు ఆహారం, చికిత్స వంటివి అత్యవసరాలు అందనివ్వలేదనీ, పోలీసులు ఈ వివాదం దృశ్యాలు చిత్రించే సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారనీ ప్రబోధానంద వర్గీయులు వాదిస్తున్నారు. పోలీసులు వివాదం ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఆశ్రమంలోకి వైద్యుల్ని పంపి ఈ ఘర్షణల్లో గాయపడ్డ ప్రబోధానంద అనుచరులకు వైద్యం చేయించారు.[16] ప్రబోధానంద కుమారులు రాజకీయ రంగప్రవేశం చేయడం వల్లనే ఈ వివాదం చెలరేగిందనీ ప్రబోధానంద అనుచరులు పేర్కొంటున్నారు. దీన్ని అధికార దుర్వినియోగంగా పేర్కొంటూ పలు ప్రాంతాల్లో ప్రబోధానంద అనుచరులు, భక్తులు పలు నిరసన ప్రదర్శనలు చేసి, ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు.

ప్రబోధానంద రచనలు

  1. త్రైత సిద్ధాంత భగవద్గీత
  2. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు
  3. ధర్మము-అధర్మము
  4. ఇందుత్వమును కాపాడుదాం
  5. యజ్ఞములు (త్రైత సిద్ధాంతము)|యజ్ఞములు (నిజమా-అబద్ధమా)
  6. దయ్యాలు - భూతాల యదార్థసంఘటనలు
  7. సత్యాన్వేషి కథ
  8. మంత్రము-మహిమ (నిజమా-అబద్ధమా)
  9. శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా
  10. గీతా పరిచయము
  11. కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు)
  12. జనన మరణ సిద్ధాంతము
  13. మరణ రహస్యము
  14. పునర్జన్మ రహస్యము
  15. త్రైతాకార రహస్యము (త్రైతాకార బెర్ముడా)
  16. జ్యోతిష్య శాస్త్రము (గ్రంథం)
  17. కథల జ్ఞానము
  18. సామెతల జ్ఞానము
  19. పొడుపు కథల జ్ఞానము
  20. తత్వముల జ్ఞానము
  21. తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము
  22. గీతం - గీత
  23. దేవాలయ రహస్యములు
  24. ఇందూ సాంప్రదాయములు
  25. మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?)
  26. తల్లి - తండ్రి
  27. గురు ప్రార్ధనా మంజరి
  28. త్రైతారాధన
  29. సమాధి (త్రైత సిద్ధాంతం)
  30. ప్రబోధ
  31. సుబోధ
  32. సిలువ దేవుడా ?
  33. మతాతీత దేవుని మార్గము
  34. దేవుని గుర్తు 963 - మాయ గుర్తు 666
  35. మతము-పథము
  36. ప్రబోధానందం నాటికలు
  37. ఇందువు క్రైస్తవుడా ? (ఇది మత మార్పిడి మీద బ్రహ్మాస్త్రం)
  38. నిగూఢ తత్వార్ధ బోధిని
  39. ఆత్మ లింగార్థము
  40. నాస్తికులు -ఆస్తికులు
  41. హేతువాదము-ప్రతివాదము
  42. గుత్తా (త్రైత సిద్ధాంతము)
  43. ప్రబోధ తరంగాలు
  44. త్రైత సిద్ధాంతము
  45. ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత
  46. అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యములు
  47. ద్రావిడ బ్రాహ్మణ
  48. తీర్పు (త్రైత సిద్ధాంతము)
  49. కర్మ పత్రము
  50. ప్రవక్తలు ఎవరు ?
  51. ధర్మశాస్త్రము ఏది?
  52. మతమార్పిడి దైవ ద్రోహము-మహా పాపము
  53. త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు
  54. స్వర్గము ఇంద్రలోకమా! నరకము యమరాజ్యమా!!
  55. జీహాద్ అంటే యుద్ధమా?
  56. మూడు గ్రంథములు ఇద్దరు గురువులు ఒక బోధకుడు
  57. దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది
  58. అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు
  59. వార్తకుడు-వర్తకుడు
  60. దేవుని చిహ్నము
  61. ఏది నిజమైన జ్ఞానము?
  62. ప్రతిమ ✖ విగ్రహ; దైవము ✖ దయ్యము)
  63. మరణము తర్వాత జీవితము
  64. ఏ మతములో ఎంత మతద్వేషము?
  65. హిందూ మతములో సిద్ధాంత కర్తలు
  66. నీకు నా లేఖ
  67. ఒక మాట మూడు గ్రంథములు
  68. లు అంటే ఏమిటి ?
  69. ఆదిత్య (త్రైత సిద్ధాంతము)
  70. చెట్టు ముందా! విత్తు ముందా?
  71. ఒక్కడే ఇద్దరు
  72. ఏసు చనిపోయాడా? చంపబడ్డాడా?
  73. సాయిబాబా దేవుడా! కాదా?
  74. దేవుని రాకకు ఇది సమయము కాదా?
  75. విశ్వ విద్యాలయము
  76. కృష్ణ మూస
  77. గీటు రాయి
  78. మూడు దైవ గ్రంథములు మూడు ప్రథమ వాక్యములు
  79. హేతువాద ప్రశ్నలు - సత్యవాద జవాబులు
  80. భావము - భాష
  81. దైవ గ్రంథములో సత్యాసత్య విచక్షణ
  82. ప్రసిద్ధి బోధ
  83. నాది లోచన - నీది ఆలోచన
  84. దేవుని ముద్ర
  85. ధర్మచక్రము (త్రైత సిద్ధాంతము)|ధర్మచక్రము
  86. హిందూ మతములో కుల వివక్ష
  87. ధ్యానము ప్రార్థన నమాజ్
  88. ప్రాథమిక జ్ఞానము (హిందూ మతములో ఆధిపత్య క్రియ)
  89. అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు
  90. ఏది సత్యము - ఏది అసత్యము
  91. ఒక వ్యక్తి రెండు కోణములు
  92. బ్రహ్మ - రావణబ్రహ్మ - భగవాన్ రావణబ్రహ్మ
  93. ద్వితీయ దైవ గ్రంథములో రత్న వాక్యములు
  94. హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా?
  95. వేదములు మనిషికి అవసరమా?
  96. ఉపనిషత్తులలో లోపాలు
  97. ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము
  98. సుప్రసిద్ధి బోధ
  99. భక్తిలో మీరు సంసారులా?వ్యభిచారులా?
  100. శతము

బయటి లంకెలు

మూలాలు

  1. "ప్రబోధానంద స్వామి అరెస్టు విషయంలో అలసత్వం తగదు |". www.prajasakti.com. Retrieved 2019-09-17.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "ప్రబోధానంద ఆశ్రమం అసలు కథ". సాక్షి. Archived from the original on 2018-09-26.
  3. "ప్రబోధానంద ఆశ్రమ వివాదం: తనిఖీల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి!!". www.andhrajyothy.com. 2018-09-21. Retrieved 2019-09-17.[permanent dead link]
  4. "అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత". ఈనాడు. 2020-07-09. Archived from the original on 2020-07-09.
  5. 5.0 5.1 ప్రబోధానంద యోగీశ్వరులు (2012). "  ఆత్మకథ విషయపేజీలు". గుత్తా. ఇందూ జ్ఞాన వేదిక. వికీసోర్స్. 
  6. "ప్రబోధానంద కన్నుమూత". ఆంధ్రజ్యోతి. 9 July 2020.
  7. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పురస్కారము http://www.telugubookofrecords.com/home/most-number-of-spiritual-books-written-by-sri-sri-sri-acharya-prabodhananda-yogeeshwarulu/
  8. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పురస్కార వీడియో https://www.youtube.com/watch?v=Z6CymhiPwUI
  9. "'దేవుని ముద్ర'తో ఉద్రిక్తం!". ఆంధ్రజ్యోతి. 2017-05-20. Archived from the original on 2017-06-01.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 "తాడిపత్రి: ప్రబోధానంద భక్తులకు, స్థానిక ప్రజలకు మధ్య హింసాత్మక ఘర్షణ,". బీబీసీ తెలుగు. Archived from the original on 2018-09-26.
  11. 11.0 11.1 11.2 "కక్షగట్టి.. చిచ్చు రగిల్చి." సాక్షి. 2018-09-17. Archived from the original on 2018-09-20. Retrieved 2018-09-18.
  12. "బీబీసీ తెలుగు ప్రెస్ రివ్యూ". బీబీసి. 2018-09-17.
  13. 13.0 13.1 "అట్టుడికిన తాడిపత్రి గ్రామాలు; ప్రబోధానంద శిష్యుల దాడిలో వ్యక్తి మృతి". 17 September 2018. Archived from the original on 17 సెప్టెంబరు 2018. Retrieved 17 సెప్టెంబరు 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "ప్రబోధానంద ఆశ్రమం వద్ద ఉద్రిక్తత ఒకరి మృతి". 17 September 2018. Archived from the original on 17 సెప్టెంబరు 2018. Retrieved 17 సెప్టెంబరు 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  15. "One dead as violence erupts in Tadipatri again" (in ఇంగ్లీషు). The Hindu. 17 September 2018. Archived from the original on 2018-09-18.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  16. 16.0 16.1 "చల్లబడిన తాడిపత్రి,". ఆంధ్రజ్యోతి. 2018-09-18. Archived from the original on 2018-09-26.
  17. "సద్దుమణిగిన వివాదం". ఈనాడు. 18 September 2018. Archived from the original on 2018-09-18. Retrieved 2018-09-18.
  18. "నేను దేవుడిని కాను: ప్రబోధానంద". సాక్షి. Archived from the original on 2018-09-30.
  19. ""డబ్బులివ్వలేదనే ఆశ్రమంపై కక్ష -ప్రబోధానంద". సాక్షి. Archived from the original on 2018-09-30.