గొట్టుముక్కుల రామకృష్ణశాస్త్రి
గొట్టుముక్కుల రామకృష్ణశాస్త్రి (Gottumukkula Ramakrishna Sastry) అష్టావధాని, ఆయుర్వేద వైద్యులు. ఈయన గొట్టుముక్కుల నరసింహం, రత్నమాంబ దంపతులకు 1911, నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా - కాకినాడ దగ్గరలో ఉన్న నడకుదురు గ్రామంలో జన్మించారు. తెలుగు, సంస్కృత భాషలలో పండితులు. వీరు 50కి పైగా అష్టావధానాలు తూర్పుగోదావరి జిల్లాల్లో చేశారు.[1].
గొట్టుముక్కుల రామకృష్ణశాస్త్రి | |
---|---|
జననం | 29-11-1911 |
మరణం | 21-1-1956 |
వృత్తి | ఆయుర్వేద వైద్యుడు |
గుర్తించదగిన సేవలు | కుంతి, శ్రావణము, గోమాత మొదలగు కావ్య రచనలు |
జీవిత భాగస్వామి | సుబ్బలక్ష్మి |
పిల్లలు | వేంకటనరసింహమూర్తి, రఘునాథశర్మ, శివశంకరశర్మ, అరుంధతి |
తల్లిదండ్రులు | నరసింహం, రత్నమాంబ |
పురస్కారాలు | ఆయుర్వేదాచార్య, అవధానిశేఖర |
విద్య, ఉద్యోగం
మార్చురామకృష్ణశాస్త్రి ప్రాధమికవిద్యను నడకుదురులో అభ్యసించారు. తరువాత తెలుగు కావ్యాలు, నాటకాలు, వ్యాకరణము, తర్కశాస్త్రం, సాంఖ్యం అధ్యయనంచేసి రాజమహేంద్రవరంలో పండితశిక్షణ పొందారు. వేళంగి, కాకినాడ హైస్కూళ్ళలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా పని చేసారు. మరికొన్నాళ్ళు పోస్టుమాష్టారుగా ఉద్యోగం చేశారు. ఆయుర్వేదంలో ప్రావీణ్యులై, సర్టిఫికెట్లు పొంది ఆయుర్వేదవైద్యులుగా ప్రజలకు వైద్యం చేశారు.
అష్టావధానం
మార్చురామకృష్ణశాస్త్రి కాకినాడ, వేళంగి, పిఠాపురం, కడియం, బిక్కవోలు, అనపర్తి, తుల్యారామేశ్వరం, సామర్లకోట, హనుమకొండ, ఇంజరం మున్నగు చోట్ల 50 వరకు అష్టావధానాలు చేసి ఖ్యాతి గడించారు. వారు అవధానాలలో తెలుగులోనూ, సంస్కృతంలోనూ పద్యాలు, శ్లోకాలు అలవోకగా చెప్పేవారు. ఈయన రచించిన కుంతి, శ్రావణము అను కావ్యములు పలు ప్రశంసలు అందుకున్నాయి. "కుంతి" ఖండకావ్యమును ఉత్కల్, బెంగాల్ యూనివర్శిటీలు, ఆంధ్రవిశ్వవిద్యాలయం బి.ఏ. డిగ్రీ విద్యార్ధులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు.[2]
1932లో ఏలూరు గోరక్షణ సమితి వారు నిర్వహించిన పోటీలలొ ఈయన రచించిన గోమాత అను కావ్యము బహుమతి పొందినది.
వారి అముద్రిత రచనలలొ మృచ్ఛకటికం, ఆంధ్రోద్యమం, అద్భుత దర్పణము అను నాటకాలున్నాయి. వీరు రచించిన శ్రీవేంకటాచల మహాత్మ్యం, నీలకంఠ విజయము అసంపూర్తిగా ఉండిపోయాయి. ఇవేకాక అనేక వ్యాసాలు, పద్యరచనలు చేసారు. ఈయన ఉత్తరాలు పద్యాలలో వ్రాసేవారు.
వీరికి ప్రముఖ కవిపండితులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారిలో కొందరు - శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం వేంకటశేషశాస్త్రి, దాశరథి, జాషువ, దేవులపల్లి, ముద్దుకృష్ణ మొదలైనవారు ఉన్నారు.
ప్రచురణ సంస్ఠ
మార్చుఈయన "అరుణాశ్రమము" అను ప్రచురణ సంస్ఠను నడకుదురులో నెలకొల్పి కుంతి, శ్రావణములను ప్రచురించారు.
సురభి నరసింహం రచించిన సింహగడము (చారిత్రక మహానాటకము), గుండు లక్ష్మణశాస్త్రి రచించిన ఆంధ్రానంద రామాయణం (అనువాదము) అరుణాశ్రమము ద్వారా ప్రచురితమయ్యాయి.
రచనలు
మార్చు- కుంతి
- శ్రావణము
- గోమాత
- శ్రీ ధన్వంతర్యష్టకమ్
బిరుదులు
మార్చు- ఆయుర్వేదాచార్య
- అవధానిశేఖర
కుటుంబం
మార్చురామకృష్ణశాస్త్రి భార్య పేరు సుబ్బలక్ష్మి. వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ "అరుణాశ్రమము". sites.google.com. Retrieved 2021-12-15.[permanent dead link]
- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు. అవధాన విద్యాసర్వస్వము. pp. 832–837.