చర్ల గణపతిశాస్త్రి
చర్ల గణపతిశాస్త్రి (జనవరి 1, 1909[1] - ఆగష్టు 16, 1996) వేద పండితుడు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకుడు.
చర్ల గణపతిశాస్త్రి | |
---|---|
జననం | జనవరి 1, 1909 పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు |
మరణం | ఆగష్టు 16, 1996 |
ప్రసిద్ధి | వేద పండితుడు, గాంధేయవాది , ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. |
తండ్రి | చర్ల నారాయణ శాస్త్రి |
తల్లి | వెంకమ్మ |
ఈయన జనవరి 1, 1909 సంవత్సరంలో చర్ల నారాయణ శాస్త్రి, వెంకమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు.
ఈయన తొలి అనువాద కావ్యం మేఘ సందేశం (సంస్కృతం) 1927లో పూర్తయింది. తరువాతి కాలంలో ఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఈయన రచనలలో ముఖ్యమైనవి గణపతి రామాయణ సుధ, స్వతంత్రదీక్ష, బిల్హణ చరిత్ర, రఘువంశము,సాహిత్య సౌందర్య దర్శనం, వర్ధమాన మహావీరుడు,నారాయణీయ వ్యాఖ్యానము, భగవద్గీత, చీకటి జ్యోతి[2]. 1961లో హైదరాబాదులో లలితా ప్రెస్ ప్రారంభించాడు. లియోటాల్ స్టాయ్ ఆంగ్లంలో రచించిన నవలను చీకటిలో జ్యోతి పేరుతో తెలుగులోనికి గణపతిశాస్త్రి అనువదించారు.[3]
ఈయన జీవిత కాలమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను కళా ప్రపూర్ణతో గౌరవించింది. భారత ప్రభుత్వం ఈయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
గణపతి రామాయణసుధ
మార్చుఆదికావ్యమైన వాల్మీకి రామాయణానికి తెలుగులో వచ్చిన పద్య రచనలు ఎన్నో ఉన్నాయి.వాటిలో ప్రసిద్ధమైనవి ప్రాచీనాలైన భాస్కర, రంగనాధ రామాయణాలూ, నవీనాలైన గోపీనాథ రామాయణం, వావిలికొలనువారి రామాయణం, రామాయణ కల్పవృక్షం మున్నగునవి.అలాంటి రచనలలో ఈ గణపతి రామాయణసుధ ఒకటి.233 పుటలు గల కధాభాగం బాలకాండంమాత్రమే. మొత్తంరామాయణం పలు భాగాలలో రచించినారు శాస్త్రిగారు.దీనిని రచించడానికి ముందు గణపతి శాస్త్రిగారు వాల్మీకి మహర్షి మూలాన్ని, భాస్కర రామాయణాన్నీ, రంగనాథ రామాయణాన్ని, జనమంచి శేషాద్రి శర్మ గారి రామాయణాన్ని, తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారి రామయణకధామృతాన్ని, గోపీనాథ రామాయణాన్ని, బులుసు వేంకటేశ్వర్లుగారి శ్రీమద్రామాయణాన్ని బాగా పరిశీలించినట్లు వీరి ఈ రచనా పీఠికలో తెలిపినారు. అంతేకాక రామాయణ కథ వున్న పద్మ పురాణం మొదలైన వాటిని కూడా శోధించినారు.చర్చనీయాంశమైన మానిషాద శ్లోకార్ధం, శాంత వృత్తాంతం, పాయస ప్రదానం, సీతా,రాముల వయో నిర్ణయం, రాముని మానవత్వం, సేతుబంధం, ఇంద్రజిత్తుని కధ, సీత పూర్వజన్మవృత్తాంతం, శంబూక వధ మున్నగు విషయాల వివరణ కలదు. గణపతి శాస్త్రిగారు ఇతర కవుల రామాయణాలకూ, తన రచనకు గల వ్యత్యాసాన్ని పెక్కు ఉదాహరణలతో వివరించారు.కధాప్రారంభశ్లోకమైన "తప: స్వాధ్యాయ నిరతం" అనే శ్లోకంతోనే తులనాత్మక విమర్స ప్రారంభం చేసారు.దీనిని బట్టి వీరి నిశిత దృష్టి స్పష్టంగా కనబడుతుంది.ఇందులో అయోధ్య నుండి లంకవరకూ గల మార్గాన్ని తెలిపే దేశపటం చేర్చబడినది.ఇది పాఠకులను ఎంతో ఆకర్షిస్తుంది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారి కొంత ఆర్ధికసహాయం చేసినారు.
పద్య కావ్యాలలో అక్కడక్కడ సుదీర్ఘాలైన గద్యలు ఉండటం పరిపాటి.ఆ గద్యలు పద్యాలకంటే కఠినతర శైలిలో ఉండి పాఠకులకూ, శ్రోతలకు విసుగును కలిగిస్తాయి.ఈ పద్య కృతిలో ఎక్కడ అతి దీర్ఘాలైన వచనలు ఉండవు. అవి సులభశైలిలో ఉండటం ఇందులో ప్రత్యేకత. శాస్త్రిగారు గట్టి పండితులైన, ఇందలి పద్యాలు చాలా సులభశైలిలో ఉండి పాఠకులు సులభంగా అర్ధం చేసుకొనే రీతిలో ఉంటాయి. ఉదాహరణ పద్యాలు:
సీ. క్ష్మామండలంబునఁ గలనైనదొరకక
దొరికిన యమృతంపు దొన్నెవోలె,
నీళ్ళైనా లేనట్టి నిండుటెడారిలోఁ
బూర్తిగ గురియు వానపోతవోలె,
సంతానమేలేని జనునికిఁ దనభార్య
లకుఁ గల్గిన సుపుత్ర లబ్దివోలె
ధనముపోయి మిగుల వనటులఁగుందెడి
నరునికిఁ బెన్నిధి దరియు వగిది,
గొప్పయుదయము హర్షముఁగూరినటుల
నీదురాక నాకు ముదంబు నింపివైచె,
అనఘః యోమునిః నీకిదే స్వాగతంబు
హృష్టుఁడనగు నేనిడుదు నీకేమికోర్కె?
శ్రమపోగొట్టెడి యాశ్రమంబిదియ పూర్వం బందు నిందే త్రివి
క్రముఁ డుండెంజుమి; మేము వామనునికై రాజిల్లు భక్తిన్ వసిం
తుమిటన్, రాక్షసు లిష్ట విఘ్నముల నెందున్ వచ్చి గావింతు రా
శ్రమమందే యిట రాక్షసాళిని వడిన్ జంపందగున్ రాఘవా!
మూలాలు
మార్చు- ↑ సాహిత్య డైరీ, మువ్వల సుబ్బరామయ్య, జయంతి పబ్లికేషన్, విజయవాడ, పుట. 5.
- ↑ Kartik, Chandra Dutt (1999). Who's who of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 368. ISBN 81-260-0873-3. Retrieved 1 January 2015.
- ↑ గణపతిశాస్త్రి, చర్ల. చీకటిలో జ్యోతి.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- చర్ల గణపతి శాస్త్రి రచనలు తెలుగుపరిశోధన లో
- చర్ల గణపతి శాస్త్రి రచనలు ఆర్కైవ్.ఆర్గ్ లో