చిర్రావూరి లక్ష్మీనరసయ్య

చిర్రావూరి లక్ష్మీనరసయ్య తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, ఖమ్మం పట్టణానికి పర్యాయపదమైన పాలనాదక్షుడు.[1].

చిర్రావూరి లక్ష్మీనరసయ్య

జననంసవరించు

ఖమ్మం జిల్లా, కైకొండాయిగూడెం గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో 1915 మార్చి 20 న జన్మించారు.

ఉద్యమ జీవితంసవరించు

1931 మార్చిలో భగత్‌సింగ్‌ ప్రభృతులను బ్రిటీష్‌ పాలకులు ఉరితీసిన సందర్భంలో విజయవాడలో చదువుతున్న చిర్రావూరి అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు లాఠీదెబ్బలు రుచి చూశారు. ఆ తరువాత పరీక్షలు పూర్తవడం, పాసై ఖమ్మం చేరడం జరిగింది.

ఖమ్మంలో కూడా విద్యార్థిగా ఉద్యమాల నేపథ్యంలోనే స్కూల్‌ నుంచి ఒక సంవత్సరం పాటు డిబార్‌కు గురయ్యారు. జాతీయనాయకుల, విప్లవకారుల చరిత్రల అధ్యయనంవల్ల, రెండేళ్ళు లైబ్రేరియన్‌గా పనిచేయడం వల్ల ఆంధ్రమహాసభ చురుకైన కార్యకర్తగా మారారు.

1945లో ఖమ్మంలో జరిగిన ఆంధ్రమహాసభలో సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కీలక బాధ్యతలు నిర్వహించారు.

వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్ని దశల్లోనూ అగ్రభాగాన ఉండి, ఒక ద్రోహి కారణంగా పోరాట విరమణ దశలో 1950లో అరెస్టయ్యారు. జైలుగదిలో మండ్రగబ్బల మధ్య నిలువెల్లా సంకేళ్ళతో బంధించి ఉంచారు. పార్టీ నాయకత్వానికి కొందరు ద్రోహులు తప్పుడు సమాచారం ఇచ్చి లేనిపోని ఆరోపణలు ప్రచారంలోపెట్టారు.

అంతేకాకుండా చిర్రావూరి జీవిత భాగస్వామి వెంకటలక్ష్మమ్మను, తల్లిని కూడా జైళ్ళపాలు చేశారు. ఆయన పిల్లలు కూడా జైళ్ళచుట్టూ, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగవలసి వచ్చింది. ఖమ్మంలోని ఆయన ఇంటిని, కైకొండాయిగూడెంలోని భూములను జప్తు కూడా చేశారు.

1952లో జైలులో ఉండి ఖమ్మం మున్సిపల్‌ వార్డు మెంబర్‌గా నామినేషన్‌వేసి గెలిచిన నాటి నుంచి 1981 వరకు అన్ని పరోక్ష ఎన్నికలలో వార్డుమెంబర్‌గా గెలిచి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికవుతూ వచ్చారు.

జైలులో ఉన్నంతకాలం మినహా 1987లో చైర్మన్‌ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా గెలిచి 1992 వరకు కొనసాగారు. 1974లో అధిక ధరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చిర్రావూరి, మంచికంటి రాంకిషన్‌ రావును అరెస్ట్‌ చేసి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆదేశాలతో ఇద్దరికీ చేతులకు బేడీలువేసి ఖమ్మం నడివీధుల్లో తిప్పారు.

ఈయన ఆదర్శప్రాయుడైన చైర్మన్‌ అవడంతో మారుమూల ప్రాంతాల్లోనూ పేదలు నివసించే చోట్ల కూడా నీరు, విద్యుత్‌ సౌకర్యం లభించింది.

ఖమ్మం జిల్లాలో 1962లో చైనా సరిహద్దు వివాదంకాలంలో అరెస్టుల అనంతరం జైలు నుంచి బయటకురాగానే సిపిఐ (ఎం) నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టింది అప్పటి నాయకత్వం. గిరిప్రసాద్‌ 1964 ఏప్రిల్‌లో తనికెళ్ళలో జరిగిన జిల్లా పార్టీ మహాసభ, అనంతరం కొక్కిరేణి మహాసభలో సిపిఐ విధానంతో మరింత బాహాటంగా ముందుకొచ్చారు. చివరకు మైనార్టీలోపడి ఆయన నాయకత్వం నుంచి వైదొలిగారు. ఆ కీలకమైన సమయంలో పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన చిర్రావూరి 18 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా ఆ బాధ్యతలు నిర్వహించారు. చిర్రావూరి నాయకత్వంలో పోరాట యోధులైన మంచికంటి రాంకిషన్‌ రావు, పర్సా సత్యనారాయణ, బోడేపూడి వెంకటేశ్వరరావు, రావెళ్ళ సత్యనారాయణ, బోజడ్ల వెంకటనారాయణ, చింతలపూడి జగ్గయ్య, కె.ఎల్.నరసింహారావు, రాయల వీరయ్య, ఏలూరి లక్ష్మీనారాయణ, టివిఆర్‌ చంద్రం, బండారు చంద్రరావు తదితరులు జిల్లాలో ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోవడంలో అద్వితీయ పాత్ర నిర్వహించారు.

సిపిఐ (ఎం) జిల్లా కమిటీ 25 మందితో ఏర్పడింది. 1964లో ఖమ్మం జిల్లాలో మెజారిటీ పార్టీ సిపిఐ (ఎం) వైపే నిలబడింది. కార్యక్రమాలలోనూ, ఎన్నికల్లోనూ సిపిఐ (ఎం) ఆధిక్యత స్పష్టంగా వెల్లడైంది. తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదం, 70వ దశకంలో రజబ్‌అలీ విచ్ఛిన్నం, అనంతరం ఎమర్జెన్సీ నిర్బంధం, నక్సలైట్ల నరమేధం, వీటన్నిటినీ ఖమ్మం జిల్లా ఉద్యమం ఎదుర్కొన్నది. తమ్మినేని సుబ్బయ్యపై తీవ్రదాడి జరిగినపుడు దానికి వ్యతిరేకంగా ఖమ్మంలో నిరసన ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. అలాంటి సమయంలో రజబ్‌అలీ దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను జిల్లా కార్యదర్శి బాధ్యతల్లో చిర్రావూరి ఎదుర్కొన్నారు.

మూలాలుసవరించు

  1. ప్రజాశక్తి: http://epaper.prajasakti.in/460080/Prajasakti-Telangana/TG-Main-Edition#page/4/2/ Archived 2016-03-05 at the Wayback Machine 17.03.2015 నాటి ప్రజాశక్తిలో బండారు రవికుమార్ వ్యాసం