చెప్యాల రామకృష్ణారావు

చెప్యాల రామకృష్ణారావు తెలంగాణా ప్రాంతానికి చెందిన సంప్రదాయ కవి.

జీవిత విశేషాలు

మార్చు

చెప్యాల రామకృష్ణారావు సత్యమ్మ, నరహరిరావు దంపతులకు కరీంనగర్ జిల్లా, మేడిపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతడు సంస్కృతాంధ్ర కావ్యాలను, నాటకాలను వానమామలై లక్ష్మణాచార్యుల వద్ద క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ధర్మపురి తిరుమల నరసింహాచార్యుల వద్ద ఆధ్యాత్మిక విద్యాభ్యాసం చేశాడు. 3వ తరగతి వరకు ఉర్దూ మాధ్యమంలోను, పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోను చదువుకున్నాడు. ఇతడు తన 14వ యేటనే పద్యరచనలు చేయడం ప్రారంభించాడు. ఇతడు పద్యఖండికలు, గేయాలు, కథలు, నాటకాలు ఎన్నో రచించాడు. ఇతని రచనలు భారతి, సారస్వత జ్యోతి, స్రవంతి, చక్రం, స్వతంత్ర, కృష్ణా పత్రిక మొదలైన పత్రికలలో వెలుగు చూశాయి. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల మొదలైన ప్రాంతాలలో జరిగిన కవిసమ్మేళనాలలో పాల్గొన్నాడు. ఇతని రచనలు వానమామలై వరదాచార్యులు, దూపాటి వెంకట రమణాచార్యులు, సి.నారాయణరెడ్డి, దాశరథి, బిరుదురాజు రామరాజు, ఖండవల్లి లక్ష్మీరంజనం, నోరి నరసింహశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, కపిల కాశీపతి, జువ్వాడి గౌతమరావు, మగ్దూం మొహియుద్దీన్,అందె వేంకటరాజము మొదలైనవారి మెప్పును పొందాయి. ఇతని రచనలపై హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పర్యవేక్షణలో యస్.శ్రీలత ఎం.ఫిల్ స్థాయిలో పరిశోధన చేసింది.

రచనలు

మార్చు

ఇతడి రచనలు చాలా అముద్రితంగా ఉన్నాయి. ముద్రితమైన రచనలు కొన్ని:

  1. శ్రీ రామకృష్ణస్తవము
  2. గురుశిష్యులు
  3. శ్రీకృష్ణ విరహగీతి
  4. దేవీస్తుతి
  5. శ్రీ యాదగిరి లక్ష్మీనారసింహప్రభూ! శతకము
  6. శ్రీ భద్రశైలాధిప శతకము
  7. శ్రీ రామగుండేశ్వర శతకము
  8. శ్రీకృష్ణ శతకము
  9. శ్రీ వేంకటేశ్వర శతకము
  10. భర్తృహరి వైరాగ్య శతి (అనువాదం)

రచనల నుండి ఉదాహరణలు

మార్చు

నిధి కలదంచు త్రవ్వితిని నేలను, గైరిక ధాతుజాలమ
వ్విధి తపియింపజేసితిని, వీక తరించితి సాగరమ్ము, ధా
త్రి ధవుల తోషపెట్టితిని, ప్రేతభువిన్ నిశలన్ వ్యయించితిన్,
పృథివిని గ్రుడ్డిగవ్వయు లభించెనె తృష్ణ! ఫలించు నీరతుల్

ఖలజనభాషణంబు లతికష్టము తోడ సహించియుంటి లో
పలనె యిముడ్చుకొంటి నటు బాష్పజలంబుల శుష్కహాసముం
జలిపితి ద్రవ్యవాంఛమెయి జచ్చినబుద్ ధినొనర్చి తంజలిన్
ఫలవతి కాని యాశ! యిటుపై నను నెట్లు నటింప జేసెదో

ముడుత లివి యాక్రమించెను మొగమునిండ
శిరము పలితకేశంబుల చెన్నుబాసె
సంగములు కడు శిథిలంబు లైన వైన
తృష్ణ మాత్రము తారుణ్యదీప్తి చెందు

(భర్తృహరి వైరాగ్యశతి నుండి)

మూలాలు

మార్చు
  • భర్తృహరి వైరాగ్యశతి (ము.2014) : అవతారిక - ఆశావాది ప్రకాశరావు, పేజీలు IV - VII
  • భర్తృహరి వైరాగ్యశతి (ము.2014) : రామకృష్ణప్రకాశం - కళ్లెపు సాగరరావు, పేజీలు IX - XVIII