జంఝావతి ప్రాజెక్టు

జంఝావతి ప్రాజెక్టు విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామంవద్ద నాగావళి నదిపై నిర్మించబడింది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బరు డ్యాంగా ప్రసిద్ధి చెందింది. విజయనగరం జిల్లాలో సుమారు 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి 4 టి.ఎం.సి ల సామర్థ్యంతో నిర్మించబడింది. దీనిని 2006 జనవరి 1న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జాతికి అంకితం చేసాడు. కొమరాడ, పార్వతీపురం సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ మండలాల్లో పంటభూములకు సాగునీరు అందించేందుకు వీలుగా కాలువ తవ్వకం, నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.[1]

జంఝావతి ప్రాజెక్టు
దేశంభారత దేశము
ప్రదేశంకొమరాడ విజయనగరం జిల్లా
ప్రారంభ తేదీ2006 జనవరి 1
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంరబ్బరు డ్యాం
నిర్మించిన జలవనరునాగావళి నది

ప్రణాళిక

మార్చు

పనులు ప్రారంభించే ముందు ఇరు రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికను ఆమోదించాయి. ఈ మేరకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నీటిపారుదల, అటవీశాఖ, రెవెన్యూశాఖలు సంయుక్త సర్వే నిర్వహించి రిజర్వాయరు నిర్మాణంలో ముంపునకు గురయ్యే గ్రామాల భూములను గుర్తించాయి. వీటిలో కోరాపుట్ జిల్లా సరిహద్దులోని బందుగాం బ్లాక్‌కు చెందిన కప్పలాడ, అలమండ పంచాయతీల గ్రామాలు, పంట భూములు, బంజరు ఉంది. అలాగే వేపవలస, ఎగువ బోతరపల్లి, దిగువ బోతరపల్లి, జైకోట, మెల్లికవలస, బంగారివలస, గడబవలస, బంకిడి, టికరపాడుకు గూడేలు ఉన్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల వరకు ఒడిశా భూభాగం ఉంది. సంయుక్త సర్వే అనంతరం ఆయా ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు.[2]

విశేషాలు

మార్చు

విజయనగరం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద నాగావళి నదికి ఉపనదిగా ఉన్న జంఝావతి ద్వారా 24,640 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 1976లో రూ. 13.50 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయరు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తికావాలంటే ఒడిసా రాష్ట్రంతో ఉన్న సమస్య పరిష్కారం కావాలి. ఈ రిజర్వాయరు నిర్మాణం వల్ల ఒడిసాలో 1175 ఎకరాలు ముంపునకు గురవ్వడంతోపాటు సుమారు 250 కుటుంబాలు నిర్వాసితులవుతాయి. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వ సహకారం ఎండమావిగా మారింది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు 40 సంవత్సరాల్లో ఎన్నోమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. తాము అంగుళం మేర భూమిని కూడా వదులుకునేది లేదని ఒడిసా ప్రభుత్వం తేల్చిచెప్పడంతో సమస్యకు పరిష్కారం లేకుండాపోయింది. ఈ క్రమంలో ప్రాజెక్టు అంచనా వ్యయం మాత్రం పదిరెట్లు పెరిగింది.

2005లో తాత్కాలికంగా సాగునీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం రబ్బరుడ్యాంను నిర్మించి 2006 జనవరి 1 నుంచి కొంతమేర నీరందించే ఏర్పాట్లు చేసింది. అయితే పూర్తిస్థాయిలో నీరందించేందుకు ప్రాజెక్టు పనులు జరుగలేదు.[3]

అసంపూర్తిగా నిలిచిన జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, ఎమ్మెల్యే చిరంజీవులు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఇంజినీరింగ్‌ అధికారులతో కూడిన బృందం 2015 అక్టోబరు 9న భువనేశ్వర్‌లో ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమయింది. ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులవుతున్న ఆ రాష్ట్ర ప్రజలకు అందివ్వనున్న ప్యాకేజీ తదితర వివరాలను ఆయన ముందుంచింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ జంఝావతి ప్రాజెక్టుకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.[4]

జంఝావతి ప్రాజెక్టు పనులు చేసేందుకు ప్రభుత్వం రూ.39 కోట్లు నిధులు విడుదల చేస్తూ 2016 జూన్ 29న ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేసింది. నిధులు మంజూరు కావడంతో ప్రాజెక్టు పనులు చురుగ్గా జరిగే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కరరావు తెలిపాడు. ఇంకా 23 కిలోమీటర్ల కాలువల పనులు చేపట్టాల్సి ఉందని అతను చెప్పాడు.[5]

జంఝావతి కాలువ నిర్మాణ నిమిత్తం భూములను ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో సి.పి.ఎం. ఆధ్వర్యంలో తులసిరామినాయుడువలస, గొల్లవానివలస గ్రామాల రైతులు 2017 జూన్ 6న కాలువ పనులను అడ్డుకున్నారు. ఈమేరకు కాలువ నిర్మాణానికి భూములకు చెందిన రైతులకు పరిహారం చెల్లించేంతవరకు పనులను జరగనివ్వబోమని స్పష్టం చేశారు. తక్షణమే పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.[6]

మూలాలు

మార్చు
  1. "జంఝావతి నీరు ప్రశ్నార్థకమే!".[permanent dead link]
  2. "జంఝావతిపై ఒడిశా పేచీ". Archived from the original on 2017-03-02. Retrieved 2018-05-31.
  3. "'జంఝావతి' ప్రాజెక్టుకు మంచి రోజులు!".[permanent dead link]
  4. "జంఝావతి సమస్యపై సహకరిస్తాం".[permanent dead link]
  5. "జంఝావతి ప్రాజెక్టుకు రూ.39 కోట్లు".[permanent dead link]
  6. "జంఝావతి కాలువ పనులు నిలుపుదల". Archived from the original on 2017-07-15. Retrieved 2018-05-31.

ఇతర లింకులు

మార్చు