జె.బి.కృపలానీ

భారత రాజకీయ నాయకుడు
(జె.బి.కృపాలినీ నుండి దారిమార్పు చెందింది)

ఆచార్య జె. బి. కృపలానీ (1888-1982) సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షునిగా ఉన్నాడు. కృపలానీ గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణవేత్త, స్వాతంత్ర్యసమరయోధుడు. మహాత్మా గాంధీకి దగ్గరగా వుంటూ అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరుగాంచాడు. 1920లలో సహాయనిరాకరణోద్యమం నుంచి 1970లలో ఇండియన్ ఎమర్జెన్సీ దాకా చురుగ్గా పాల్గొంటూ ప్రముఖునిగా ప్రసిద్ధి చెందాడు.

జె. బి. కృపలానీ
1942లో గాంధీజీ, మౌలానా ఆజాద్ తో ఆచార్య కృపాలనీ
జననం1888
హైదరాబాదు (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)
మరణం1982
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, పర్యావరణవేత్త

తొలి జీవితం

మార్చు
 
వార్ధాలో పటేల్, అబుల్ కలాం ఆజాద్, జీవత్‌రాం కృపలానీ తదితర కాంగ్రేసు పార్టీ సభ్యులు

కృపలానీ నాటి సింధు (నేటి పాకిస్తాన్) ప్రాంతంలోని హైదరాబాదులో 1888లో జన్మించాడు. అతని పూర్వీకులు గుజరాతీ, సింధీ సంతతులకు చెందినవారు. కరాచి డి.జె.సైన్సు కళాశాలలో, అతనిని రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కళాశాల నుంచి బహిష్కరించారు. తరువాత ముంబయి ఫెర్గూసన్ కళాశాలలో విద్యనభ్యసించి తరువాత ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన తరువాత స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడు.

కృపలానీ 1920వ దశకపు తొలినాళ్ళలో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. గుజరాత్ మరియి మహారాష్ట్రలోని గాంధీ ఆశ్రమాలలో సంఘ సంస్కరణ, విద్యా సంబంధ విషయాలపై కృషిచేశాడు. ఆ తరువాత ఉత్తర భారతదేశములోని బీహార్, సంయుక్త రాష్ట్రాలలో అదే తరహా ఆశ్రమాలు స్థాపించి బోధించడానికి వెళ్ళాడు. పౌరనిరసనోద్యమంలోనూ, ఇతర అనేక చిన్న సందర్భాలలోనూ బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించినందుకూ, ఉద్రేకపూరిత సాహిత్యాన్ని ప్రచురించినందుకూ అనేక సందర్భాలలో కృపలానీ జైలుకు వెళ్ళాడు.

కాంగ్రేసు నాయకునిగా

మార్చు

కృపలానీ అఖిల భారత కాంగ్రేసు కమిటీలో చేరి 1928-29లో దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఒక దశాబ్దము పైగా కాంగ్రేసు పార్టీ అత్యున్నత స్థాయి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నిర్వహణలో ప్రధానపాత్ర పోషించాడు. కృపలానీ ఆపద్ధర్మ భారత ప్రభుత్వము (1946-1947) లోనూ, భారత రాజ్యాంగ సభలోనూ పనిచేశాడు.

కాంగ్రేసు అధ్యక్షునిగా 1950 ఎన్నికల సమయంలో

మార్చు

సైద్ధాంతికంగా అటు కుడిపక్షమైన వల్లభ్ భాయి పటేల్‌తోనూ, వామపక్షమైన జవహర్ లాల్ నెహ్రూతోనూ విరుద్ధముగా ఉన్నప్పటికీ, కృపలానీ 1947లో భారత స్వాతంత్ర్యానికి అటునిటు క్లిష్టమైన సంవత్సరాలలో కాంగ్రేసు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1948 జనవరిలో గాంధీ హత్య తర్వాత, అన్ని ప్రభుత్వ నిర్ణయాలలో పార్టీ యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కృపలానీ కోరికను నెహ్రూ తోసిరాజన్నాడు. నెహ్రూ, పటేల్ మద్దతును కూడగట్టుకొని, పార్టీకి విస్తృతమైన మార్గదర్శకాలు, మూలసూత్రాలను నిర్దేశించే అధికారము ఉన్నది కానీ ప్రభుత్వము యొక్క దైనందిన వ్యవహారాలలో కలుగజేసుకొనే అధికారాన్ని పార్టీకి ఇవ్వలేమని కృపలానీకి సమాధానమిచ్చాడు. ఇదే పూర్వప్రమాణం ఆ తర్వాత దశాబ్దాలలో ప్రభుత్వము, పాలక పార్టీ యొక్క సంబంధానికి కేంద్ర హేతువు అయ్యింది.

నెహ్రూ, 1950లో కాంగ్రేసు అధ్యక్ష ఎన్నికలలో కృపలానీకి మద్దతిచ్చాడు. పార్టీపై పట్టుకోసం నెహ్రూ నేతృత్వములోని వామపక్షానికి, పటేల్ నేతృత్వములోని కుడిపక్షానికి జరుగుతున్న పోరాటంలో ఈ ఎన్నికలు కీలకమని భావించారు. కృపలానీకి వ్యతిరేకముగా పటేల్ అభ్యర్థిగా, హిందూ జాతీయవాది పురుషోత్తమ దాస్ టాండన్ పోటీచేశాడు. సోమనాథ్ దేవాలయం యొక్క వివాదాస్పద పునర్నిర్మాణము, జనసంఘ్ స్థాపన, నెహ్రూ-లియాఖత్ ఒప్పందములతో ఉద్రేకపూరితమైన జాతీయ వాతావరణంలో ఆర్థిక ప్రణాళికలలో విభేదాల వల్ల టాండన్ చిన్న ఆధిక్యతతో కృపలానీపై గెలిచాడు.

ఓటమితో గాయపడ్డ కృపలానీ, గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్యాన్ని నీళ్ళకొదిలేస్తున్నారన్న విభ్రమతో కాంగ్రేసు పార్టీని విడిచి, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ యొక్క సంస్థాపకుల్లో ఒకడైనాడు. ఈ పార్టీ ఆ తరువాత సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ప్రజా సోషలిస్టు పార్టీగా అవతరించింది.

సోషలిస్టు పార్టీలో

మార్చు

కృపలానీ తన రాజకీయ శేషజీవితమంతా ప్రతిపక్షములోనే గడిపాడు. 1938 నుండి ఈయన భార్య అయిన సుచేతా కృపలానీ, కాంగ్రేసు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గములో అనేక మార్లు మంత్రిపదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందింది. ఈమె దేశములోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తర ప్రదేశ్ లో ప్రమాణస్వీకారం చేసింది. కృపలానీ దంపతులు పార్లమెంటులో తరచూ ఒకర్నొకరు ఢీకొనేవారు.

అయితే కృపలానీ దంపతులిద్దరూ హిందూ వివాహ చట్టములోని చాలా భాగాలు, ప్రత్యేకంగా "వివాహ హక్కుల పునరుద్ధరణ"[1] అనే వివాదాస్పద క్లాజు యొక్క అనావశ్యకతపై మాత్రం ఏకగ్రీవంగా అంగీకరించారు. చట్టములోని ఈ క్లాజు వలన విడాకులు పొందడానికి విఫలప్రయత్నం చేసిన భాగస్వామి తన వైవాహిక సంబంధాలను, హక్కులను తిరిగి విడాకుల దావా వేయక ముందున్న యధాస్థితికి చేర్చమని కోర్టును కోరవచ్చు. ఇది దారుణమని తలచిన కృపలానీ అత్యంత చిరస్మరణీయమైన ప్రసంగం చేస్తూ "ఈ ఏర్పాటు శారీరకంగా అవాంఛనీయమైనది, నైతికంగా అవసరం లేనిది, ఊహకే వెగటుగా ఉంది" అంటూ తన వ్యతిరేకతను వ్యక్తపరిచాడు.[2]

కృపలానీ పత్రికారంగముపై పార్లమెంటు యొక్క ప్రత్యేకార్హత విషయంలో ఆందోళన చెందాడు. నెహ్రూ హయాములో "ఒక పార్లమెంటు సభ్యుని పరువు ప్రతిష్టలకు భంగము కలిగించినందుకు" గాను లోక్ సభ బ్లిట్జ్ వారపత్రిక ప్రధాన సంపాదకుడైన రూసీ కరాంజియాను పిలిపించి మందలించింది. కరాంజియా నెహ్రూకు సన్నిహితుడైనప్పటికీ, కృపలానీ ఈ విషయంలో కరాంజియాను సమర్ధించాడు.

కృపలానీ 1963 ఆగస్టులో భారత-చైనా యుద్ధం ముగియగానే నెహ్రూ ప్రభుత్వముపై లోక్ సభలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.

చరమాంకము

మార్చు

సమాజిక, పర్యావరణ విషయాలపై పనిచేస్తూ కృపలానీ జీవితాంతము నెహ్రూ యొక్క పాలనా, విధానాల విమర్శకునిగా మిగిలిపోయాడు.

క్రియాశీలక ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతూనే, కృపలానీ క్రమేణ రాజకీయ నాయకుడిగా కంటే కమ్యూనిస్టుల ఆధ్యాత్మిక గురువుగా పరిణితి చెందాడు. ముఖ్యంగా వినోబా భావేతో పాటు కృపలానీని అంతరించిపోతున్న గాంధేయవాదుల వర్గానికి నాయకునిగా భావిస్తారు. 1970లలో వినోభా భావేతో పాటు ఈయన అనేక పరిరక్షణ, సంరక్షణా కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు.

1972-73లో, కృపలానీ రానురాను నిరంకుశంగా తయారవుతున్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ యొక్క పాలనపై నిరసన ధ్వజమెత్తాడు. కృపలానీ, జయప్రకాశ్ నారాయణ్‌లు ఇందిరా గాంధీ పాలన నియంతృత్వంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని భావించారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించుకుందన్న అభియోగము న్యాయస్థానములో నిర్ధారణ కావడంతో, ప్రజలు ఆమె పాలన విధానాలపై విస్మయం చెందారు, ఆమె రాజకీయ ప్రతిపక్షాలు మరింత బలిష్టమయ్యాయి. నారాయణ్, లోహియాలతో పాటు కృపలానీ దేశమంతటా పర్యటించి అహింసాయుత ప్రదర్శనలు, పౌర నిరసనలు నిర్వహించాలని ప్రజలను కోరారు. 1975లో అత్యయిక పరిస్థితిని విధించినప్పుడు పెద్ద ఎత్తున నిరసన రేపడానికి కారకుడైనందుకు, జూన్ 26, 1975 రాత్రి అరెస్టు చేయబడిన మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుల్లో 80యేళ్ళు పైబడిన కృపలానీ ఒకడు. ఎమర్జెన్సీ అంతం కావడం, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొంది స్వాతంత్ర్యము తర్వాత మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రేసేతర ప్రభుత్వం నెలకొల్పటం చూడటానికి కృపలానీ జీవించే ఉన్నాడు.

కృపలానీ 94 యేళ్ళ వయసులో 1982, మార్చి 19న మరణించాడు.

1982లో విడుదలైన రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన గాంధీ చిత్రంలో కృపలానీ పాత్రను భారతీయ నటుడు అనంగ్ దేశాయి పోషించాడు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-11-05. Retrieved 2007-12-21.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-07. Retrieved 2007-12-21.

వెలుపలి లంకెలు

మార్చు