డూడుల్
డూడుల్ (ఆంగ్లం: Doodle) అనగా అన్యథా ఇతర ముఖ్య కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా, వేరే వాటి/దాని గురించి ఆలోచిస్తూ, లక్ష్యం లేకుండా, కాలక్షేపం కోసం, సరదాగా వేసిన ఒక బొమ్మ. [1] [2] [3] [4] డూడుల్ కేవలం బొమ్మలకే పరిమితం కాదు. ఫ్యాన్సీగా రాయబడే అక్షరాలు, సంతకాలు, కార్టూనులు, రేఖాగణిత అంశాలు లేక మరే పిచ్చిగీతలైన కావచ్చు. [5] [6] డూడుల్స్ కోసం ప్రత్యేకంగా పెద్ద సరంజామా అవసరం లేదు. కేవలం కలం-కాగితం లతో ఎక్కడైనా, ఎప్పుడైనా డూడుల్స్ మొదలుపెట్టవచ్చు. సరైన కాగితం లేకపోతే ప్రత్యామ్నాయాలు గ పేపరు న్యాప్కిన్, టిష్యూ పేపరు, నోటు పుస్తకం లో మార్జిన్ కు అటువైపు లేక వేరే ఏ చిత్తు కాగితమైనా ఉపయోగించవచ్చు.
చరిత్రసవరించు
30,000 సంవత్సరాలు గా మానవులు ఇసుక పైన, గుహలలో, మంచు పైన డూడుల్స్ వేస్తూనే ఉన్నారు. [7] లియొనార్డో డా విన్సీ వాడిన నోటుపుస్తకాలలో సైతం డూడుల్స్ ఉన్నవని తేలింది. [8] మార్క్ ట్వేయిన్ నుండి హిల్లరీ క్లింటన్ వరకు చాలా మంది ప్రముఖులు డూడుల్స్ కు అతీతులు కారు! [9]
డూడుల్ 4 గూగుల్సవరించు
డూడుల్ 4 గూగుల్ లేదా స్టైల్జిడ్ డూడుల్4గూగుల్ అనేది గూగుల్ హోం పేజీలో చూపబడే లోగో సృష్టించడానికి పిల్లలతో గూగుల్ సంస్థ నిర్వహిస్తున్న ఒక వార్షిక పోటీ.
గూగుల్ 2014లో భారతదేశంలోని 50 నగరాల్లో చిన్నారులకు నిర్వహించిన 'డూడుల్ ఫర్ గూగుల్' చిత్రలేఖనం పోటీల్లో వైదేహీరెడ్డి విజేతగా నిలిచింది. డూడుల్ కోసం గూగుల్ భారతదేశంలో "భారతదేశంలో నేను పర్యటించాలనుకుంటున్న ప్రదేశం" అనే అంశంపై జరిపిన చిత్రలేఖన పోటీల్లో పది లక్షల మంది చిన్నారులు పాల్గొన్నారు. డూడుల్ చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న వైదేహి 'సహజం, సాంస్కృతిక స్వర్గం-అసోం' అనే అంశం మీద వేసిన చిత్రలేఖనం "డూడుల్ ఫర్ గూగుల్"గా ఎంపికైంది. వైదేహీ వేసిన ఈ చిత్రలేఖనం బాలల దినోత్సవం అయిన 14-11-2014న గూగుల్ హోంపేజీలో గూగుల్ భారతదేశపు డూడుల్ గా ప్రదర్శితమైంది. గూగుల్ సంస్థ బాలల దినోత్సవం అయిన ఇదే రోజున వైదేహీకి అవార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను కూడా బహుమతిగా అందజేసింది, అలాలే మూడు రోజుల అసోం పర్యటనకు ఏర్పాట్లు చేసింది, ఇదే రోజున వైదేహీ పుట్టినరోజు కావడం విశేషం. [10]
20వ శతాబ్దంసవరించు
గూగుల్ సెర్చ్ ఇంజీన్ పలు కార్యక్రమాలను, సెలవులను, వార్షికోత్సవాలను, ప్రముఖుల జీవితాలను జ్ఙప్తికి తెస్తూ తమ హోం పేజీ లో ఉన్న గూగుల్ లోగో ను డూడుల్స్ రూపంలో మారుస్తూ ఉంటుంది. 2000 నుండి ఈ ప్రక్రియ అమలు లో ఉంది. [11] ఇదే కోవలో ఆగస్టు 12, 2019 న విక్రం సారాభాయ్ 100వ జన్మదినం; మార్చి 10, 2021న భారతీయ శాస్త్రవేత్త ఉడుపి రామచంద్రరావు యొక్క 89వ జన్మదినాలకు గూగుల్ తమ డూడుల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. [12]
2021 లో భారతదేశపు 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 21 న గూగుల్ హోం పేజీలో ఒక డూడుల్ ను తమ లోగోకు అన్వయిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. మువ్వన్నెల జెండా లోని రంగులను వాడబడిన, భారతదేశాపు నిర్మాణ శైలి, ఇక్కడి సంస్కృతి/సాంప్రదాయాలు, ఇక్కడి వస్త్రధారణ, ఇక్కడి (విభిన్న కుల మతాలకు చెందిన) ప్రజలను ను ప్రతిబింబిస్తూ చిత్రీకరించబడిన లోగో తో గూగుల్ భారత్ కు శుభాకాంక్షలు తెలిపింది. [13]
కళాత్మక కోణంలో పరిశీలన, డూడ్లర్ యొక్క వ్యక్తిత్వం, గుణగణాలను అంచనా వేయటానికి డూడుల్ ముఖద్వారం కావటంతో 20వ శతాబ్దం లో డూడుల్స్ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. [8]
స్వభావంసవరించు
- డూడుల్స్ పగటి కలల వంటివి. ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నా డూడ్లర్ చేతులు స్వయంచాలితంగా డూడుల్ చేస్తాయి. [14]
- డూడుల్స్ చేతివ్రాతకు భిన్నమైనవి. ఇతరులకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో వ్రాసేటాప్పుడు మనకు తెలియకుండనే మనం జాగ్రత్త వహిస్తాం. కానీ డూడుల్స్ ఎవరికీ అర్థం కావలసిన అవసరం లేదు. కాబట్టి మనకి ఏది నచ్చితే అది డూడుల్ చేసుకోవచ్చు.
కారణాలుసవరించు
- జాగరూకంగా ఉన్నామని తెలుసుకోవటానికి/తెలపటానికి, ఒత్తిడి నుండి తప్పించుకోవటానికి, కష్టతరమైన భావోద్రేకాలను అర్థం చేసుకోవటానికి డూడుల్స్ దోహదపడటం వలన
- ప్రతికూల భావోద్రేకాలను, భావనలను విడుదల చేసే సురక్షితమైన దారి డూడుల్స్ కావటం వలన
- డూడుల్స్ లో మానసిక భావాలకు చికిత్స చేసే శక్తి ఉండటం వలన
- డూడుల్స్ సంతోషాన్ని ఇస్తాయి కాబట్టి
- ఆలోచనలకు, సృజనాత్మకతకు మెదడు డూడుల్స్ కు మధ్యవర్తిగా ఉండటం వలన
- భిన్నంగా ఆలోచించగలిగే శక్తికి మార్గం డూడుల్స్ కావటం వలన
- సమస్యాపూరణానికి డూడుల్స్ కూడా ఒక మార్గం కావటం వలన
డూడుల్స్ లో రకాలుసవరించు
వర్డ్ డూడుల్స్సవరించు
పదాలను కాస్త మార్చి వంకరటింకరగా, ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఇమిడిపోయేట్లు (ఉదా: SUN అనే పదం, సూర్యుడి ఆకారం లో ఇమిడిపోయేట్లు) రాయటం, ఈ ఆకారాలకు రంగులను అద్ది ఆకర్షణీయంగా కనబడేలా చేయటం) దిక్కులను సూచించే పదాలను తదనుగుణంగా మార్చటం (Up అనే పదం పైకి, Down అనే పదం క్రిందకి చూపేటట్లు రాయటం). [15]
లైన్ డూడుల్స్సవరించు
పదాలను, ఆలోచనలను, గీతల ద్వారా తెలపటం. [16] ఉదా:నిద్ర, గురకలను సూచిస్తు గీతలనే ZZZZZZZZZZ వలె రాయటం. అయోమయం, గందరగోళం, చిక్కుముడి వంటి వాటిని చిక్కుపడిన దారం వలె గీతలని వేయడం.
డూడుల్ డాబుల్ (Doodle Dabble)సవరించు
స్వయానా డూడ్లర్ విశదీకరించేంతవరకు అర్థం గోచరించని డూడుల్స్ నే డూడుల్ డాబుల్ అంటాఅరు. ఒక డూడుల్ వేసి, అది ఏమిటో అవతలి వారిని అడిగి, సమాధానం రాని పక్షంలో ఆ డూడుల్ కు ఏదో ఒక అర్థాన్ని ఆపాదిస్తే అదే డూడుల్ డాబుల్. ఉదా: ఒక చతురస్రం లో అడ్డంగా గీత గీసి, అది బట్టలు ఆరవేసే తాడు అని, అదే చతురస్రాన్ని పూర్తిగా నలుపు రంగుతో నింపి, దానిని కటిక చీకటిలో ఉన్న నల్ల కుక్క అని తెలపటం.[17]
చాక్ బోర్డ్ గ్రాఫిటీ (Chalkboard Graffiti)సవరించు
బ్లాక్ బోర్డు పై రంగుల చాక్ పీసు లతో చిన్నపిల్లల పద్యాలను, కథలను, పాటలను, సామెతలను ఆకర్షణీయంగా రాయడమే చాక్ బోర్డ్ గ్రాఫిటీ. [18]
పరిశోధనసవరించు
డూడుల్ శ్రద్ధ, ఏకాగ్రత లతో బాటు జ్ఙాపకశక్తిని కూడా పెంచుతుందని, హృదయాంతరాలలో నిగూఢమై ఉన్న విషయాలను తెలుసుకొనేలా చేస్తుందని పరిశోధనలలో తేలినట్టు సినెట్.కాం తెలిపింది. [19] అంతేగాక డూడుల్ కార్టిజాల్ స్థాయిని తగ్గిస్తుందని కూడా తేలింది. అమెరికా లోని డ్రెక్సెల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల ప్రకారం డూడ్లింగ్ మెదడు లోకి రక్తప్రసరణ పెంపొందిస్తుందని, దీని వలన డూడ్లర్ లో సానుకూల భావోద్రేకాలు పెరుగుతాయని, అందుకే డూడ్లింగ్, డూడ్లర్ లో సంతోషాన్ని కలుగచేస్తుందని తేల్చింది. [20]. యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందిన ప్లైమౌత్ యూనివర్సిటీ వారు నిర్వహించిన పరిశోధనలలో డూడ్లింగ్ చక్కని ప్రణాళికలను రూపొందించటానికి మల్టీటాస్కింగ్ (ఒకే వ్యక్తి పలు వేర్వేరు పనులను ఒకే సమయంలో చేయటానికి) ఉపయోగపడుతుందని తేలింది. న్యూయార్క్ కు చెందిన సిటీ యూనివర్సిటీలో తత్వశాస్త్ర విభాగం, గొప్ప పెయింటర్లు సైతం డూడుళ్ళ ప్రయోజనాలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని తెలిపింది. [5] డూడుల్స్ పై జరగవలసిన స్థాయిలో అధ్యయనం జరగలేదని అభిప్రాయపడింది. రోజువారి కార్యకలాపాలలో నిర్లక్ష్యానికి గురి అయ్యే వాటిలో డూడుల్స్ వేయటం కూడా ఒకటి అని తెలిపింది. డూడుల్స్ యొక్క లాభాలను పూర్తిగా అర్థం చేసుకోవటానికి పై శిక్షణ ఏర్పాటు చేయటం వలన ఉపయోగం ఉంటుంది అని తెలిపింది. [9]
మనస్తత్వ శాస్త్రంలోసవరించు
డూడుల్స్ ను బట్ట మనస్తత్వాన్ని అంచనా వేయటం పై పలు పుస్తకాలు ముద్రించబడ్డాయి.[21] పదునుగా ఉండే, కోణాలు కలిగి ఉండే డూడుల్స్ దూకుడు ను సూచిస్తాయని, గుండ్రంగా ఉండే డూడుల్స్ పుష్పాలు, ఉంగరాలు అనంత ప్రేమను సూచిస్తాయని, మనుషుల ముఖాల డూడుల్స్ కలివిడితనం యొక్క లేమిని సూచిస్తాయని ఈ పుస్తకాలలో తెలుపబడింది. సాధారణంగా డూడుల్స్ చేతిలో ఉన్న ఏదో ఒక రంగు పెన్/పెన్సిల్ తో వేయబడతాయని, కానీ అదే పని గా ప్రత్యేక రంగులను వాడబడిన డూడుల్స్ నుండి కూడా కొన్ని అర్థాలను తీయవచ్చని ఈ పుస్తకాలలో తెలుపబడింది. ఎరుపు రంగు కోపాన్ని, గులాబీ రంగు స్త్రీ తత్వాన్ని, నీలం ఆధ్యాత్మికతను, పసుపు పచ్చ ధనకాంక్షను, గోధుమ వర్ణం ఒదిగి ఉండే తత్వాన్ని, ఆకుపచ్చ ఇతరులకు భిన్నంగా ఉండటం, నలుపు ఆందోళనను, ఊదా రంగు తీరని కోరికలను సూచిస్తుంది. [22] పేషంటు యొక్క ఉపచేతన మది (subconscious mind)లో ఉన్న భావాలను తెలుసుకొనటానికి (మానసిక) రోగి యొక్క డూడుల్స్ ఉపయోగపడతాయి. [19] చిన్నపిల్లల మానసిక స్థితిగతులను అంచనా వేయటానికి కూడా డూడుల్స్ ఉపయోగపడతాయి అని పరిశోధనలలో తేలింది. [19]
పుస్తకాలుసవరించు
అమెరికాకు చెందిన డూడ్లర్ సన్నీ బ్రౌన్ డూడుల్స్ పై "The Doodle Revolution" అనే పుస్తకాన్ని రాసింది. [23] ఈ పుస్తకంలో:
- ఏ డూడుల్ అన్యమనస్కంగా వేసింది కాదు!
- ఐన్ స్టీన్, జాన్ ఎఫ్ కెనడి, ఎడిసన్, మేరీ క్యూరీ, హెన్రీ ఫోర్డ్ వంటి మహామహులు కూడా డూడుల్స్ వేసేవారు.
- తల్లిదండ్రులు, ఉపధ్యాయులు, పై అధికారులు కొట్టిపడేసే డూడుల్స్ ను ఆషామాషీగా తీసుకొనరాదు.
- డూడుల్స్ ఆలోచనల నుండి రూపం పోసుకొనే దృశ్యాలు. డూడుల్స్ మన అంతరంగాలలో దాగి ఉన్న దృశ అక్షరాస్యతకు తార్కాణం. వాటిలో నిగూఢమైన శక్తి దాగి ఉంది. డూడుల్స్ ఒక విప్లవం.
-అని తెలిపింది. ఏ వస్తువునైనా, భావననైనా, ఊహకందని వ్యవస్థనైనా ఎలా డూడుల్ చేయాలి, సాధారణ ఆలోచనా విధానాలకు ఎలా దూరంగా ఉండాలి, నిస్సారంగా ఉండే టెక్స్టును డూడుల్స్ గా మార్చి ఆహూతులను ఎలా కట్టిపడేయాలి అనే అంశాలను చర్చించింది.
డూడ్లింగ్ సాఫ్టువేర్లు/మొబైల్ యాప్ లుసవరించు
డూడ్లింగ్ ప్రాముఖ్యతను గుర్తించిన స్యాంసంగ్, యాండ్రాయిడ్, యాపిల్ వంటి సంస్థలు డూడ్లింగ్ కు ప్రత్యేక సాఫ్టువేర్లు, మొబైల్ యాప్ లను రూపొందించినవి. [24] [25]
లాభాలుసవరించు
- డూడుల్స్ తో సంక్షిప్త సందేశాలు తెలుపవచ్చు. అక్షరాలను ఆకర్షణీయంగా మలచవచ్చు. రంగులతో, చిహ్నాలతో సందేశాలు రూపొందించవచ్చు. గ్రాఫిటీ, పోస్టరులు రూపొందించవచ్చు. [26]
- డూడుల్స్ ను "ఇన్ఫో డూడుల్స్" గా మార్చటం తో సమస్యా పూరణం చేయవచ్చని సన్నీ బ్రౌన్ అభిప్రాయపడింది. [9]
- డూడుల్స్ వినూత్న, విభిన్న ఆలోచనలకు తెరతీస్తాయి. [7]
- క్లిష్టమైన అంశాలను సైతం డూడుల్స్ తో పిన్న/పెద్ద అందరికీ అర్థం అయ్యేలా విశదీకరించవచ్చు. (యూట్యూబ్ లో ఎపిఫైడ్ అనే ఛానెల్ కేవలం డూడుల్స్ తోనే భారత్ తో బాటు ఇతర దేశాల, హైందవం తో బాటు ఇతర మతాలకు సంబంధించిన పలు చారిత్రక, సాంస్కృతిక, పౌరాణిక, అధ్యాత్మిక, తార్కిక , కల్పిత, శాస్త్రీయ/సాంకేతిక అంశాలను డూడుల్స్ రూపంలో విశదీకరించింది. [27])
- స్కెచింగ్ అభ్యసించటానికి డూడుల్ మొదటి మెట్టు.[28]. స్కెచింగ్ లో తలపండిన వారు డూడుల్స్ ప్రయత్నించమని సలహా ఇస్తారు.
వివాదాలుసవరించు
డూడ్లింగ్ అన్యమనస్కంగా గీయబడే ఒక పిచ్చిగీత అనే నిర్వచనం పై డూడ్లర్ సన్నీ బ్రౌన్ మండిపడింది. [9]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ మెర్రియం-వెబ్స్టర్ డిక్షనరీ లో డూడుల్ కు నిర్వచనం
- ↑ ఫ్రీ డిక్షనరీ లో డూడుల్ కు నిర్వచనం
- ↑ కేంబ్రిడ్జి డిక్షనరీలో డూడుల్ కు నిర్వచనం
- ↑ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో డూడుల్ కు నిర్వచనం
- ↑ 5.0 5.1 "5 Big Benefits Of Being A Doodler". 5 Big Benefits Of Being A Doodler. huffpost.com. 17 June 2015. Retrieved 25 June 2021.
- ↑ డూడుల్స్ గా రేఖాగణిత అంశాలు
- ↑ 7.0 7.1 "సి ఎన్ ఎన్ ఎడిషన్ లో డూడ్లర్ సన్నీ బ్రౌన్". What we learn from Doodles. edition.cnn.com. 2 September 2011. Retrieved 24 June 2021.
- ↑ 8.0 8.1 "బ్రిటానికా లో డూడుల్". Britannica:Doodle. Britannica.com. 20 July 1998. Retrieved 24 June 2021.
- ↑ 9.0 9.1 9.2 9.3 "సి బి ఎస్ న్యూస్ - ద హైయర్ పర్పస్ ఆఫ్ డూడ్లింగ్". CBS News: The higher purpose of doodling. cbsnews.com. 19 January 2014. Retrieved 25 June 2021.
- ↑ [ "డూడుల్ ఫర్ గూగుల్" విజేత తెలుగమ్మాయి - ఈనాడు దినపత్రిక]
- ↑ గూగుల్ డూడుల్ ల గురించి The Hindu దినపత్రికలో.
- ↑ ఉడుపి రామచంద్రరావు పుట్టినరోజున గూగుల్ తమ డూడుల్ ద్వారా శుభాకాంక్క్షలు - The Hindu
- ↑ 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన గూగుల్
- ↑ Why do we doodle?
- ↑ Yerian & Yerian 1975, p. 6.
- ↑ Yerian & Yerian 1975, p. 8.
- ↑ Yerian & Yerian 1975, p. 10.
- ↑ Yerian & Yerian 1975, p. 12.
- ↑ 19.0 19.1 19.2 "డూడుల్స్ శ్రద్ధ/ఏకాగ్రతలను పెంచుతాయి". Doodling can keep you from zoning out in meetings. cnet.com. 2 November 2019. Retrieved 24 June 2021.
- ↑ డూడ్లింగ్ సంతోషాన్ని పెంపొందిస్తుంది - బిజినెస్ స్టాండార్డ్
- ↑ Patricia Marne 1987, p. 6, Reveal the secrets in doodles. Learn to analyse your doodles by Patricia Marne.
- ↑ Patricia Marne 1987, p. 14-15.
- ↑ గూగుల్ బుక్స్ లో The Doodle Revolution పుస్తకం
- ↑ ఆండ్రాయిడ్ వ్యవస్థలో ఉన్నత డ్రాయింగ్ యాప్ లు
- ↑ ఐ ఫోన్లకు/ఐ ప్యాడ్లకు రూపొందించబడిన డూడ్లింగ్ యాప్ లు
- ↑ Yerian & Yerian 1975, p. 7.
- ↑ పలు అంశాలను కేవలం డూడుల్ లతోనే విశదీకరించే యూట్యూబ్ ఛానెల్ - ఎపిఫైడ్
- ↑ Crawshaw 1983, p. 20.
- Yerian, Cameron; Yerian, Margaret (1975). Doodling, drawing & creating. Children's press.
- Crawshaw, Alwyn (1983). Learn to Paint Sketch. Collins.