సర్పయాగం : మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం. పాండవుల అనంతరం పరీక్షిత్తు, పరీక్షిత్తు అనంతరం జనమేజయుడు చక్రవర్తులయ్యారు. అయితే మహాభారతం కథ ఆరంభంలో ఆది పర్వములోనే సర్పయాగం ఉదంతం వస్తుంది. నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్పాడు. ఉదంకోపాఖ్యానంతో ఈ వృత్తాంతం ప్రాంభమౌతుంది.

మధ్యప్రదేశ్ మందసార్ జిల్లాలోని తక్షకేశ్వరాలయం లోని తక్షక విగ్రహం

కశ్యపుడు, అతని మూడవ భార్య కద్రువ కు వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు జన్మించారు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.[1]

పైలుడు అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. అతను ఒకమారు గురుపత్ని కోరికపై మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని తక్షకుడు అపహరించాడు. అందువలన అతను తక్షకుని పట్లా, నాగజాతిపట్లా కుపితుడయ్యాడు. జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేశాడు. జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగానికి ఆజ్ఞ ఇచ్చాడు. (ఇక్కడ భారతంలో గరుత్మంతుని వృత్తాంతం కూడా చెప్పబడింది.)


సర్పయాగం తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్ఛారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో తగులబడిపోసాగాయి. కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. "సహేంద్ర తక్షక స్వాహా" అని హోతలు విధివిహితంగా మంత్రోచ్ఛారణ చేయగానే తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోనారంభించాడు.


వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జరత్కారుడు. వారికి ఆస్తీకుడనే బిడ్డ నాగజాతి రక్షణార్ధం కారణజన్ముడై జనించాడు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సమయానికి ఆస్తీకుడు అక్కడికి వెళ్ళి, జనమేజయుని మెప్పించి, దక్షిణగా యాగాన్ని నిలుపు చేయమని కోరాడు. సత్యదీక్షాపరుడైన జనమేజయుడు యాగాన్ని ఆపించేశాడు.


మహాభారతంలో ఈ యాగసందర్భంగా చెప్పబడిన సుపర్ణుని (గరుత్మంతుని) కథ విన్నవారికి శ్రీ సంపదలు కలుగుతాయని, పాపము నశిస్తుందని, సర్ప-రాక్షస బాధలు తొలగుతాయని ప్రతీతి. అలాగే ఆస్తీకుని కథ విని, ఆస్తీకుని స్మరిస్తే వారికి నాగజాతివలన ఎటువంటి ప్రమాదమూ కలుగదని, విషజ్వరాదికాలు సోకవని వాసుకి ఆస్తీకునికి వరమిచ్చాడు.

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఫ్యామిలీ (15 July 2016). "నేడు వరల్డ్ స్నేక్ డే". Sakshi. Archived from the original on 28 May 2017. Retrieved 30 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=తక్షకుడు&oldid=4011825" నుండి వెలికితీశారు