తిరుమకూడలు చౌడయ్య

తిరుమకూడలు చౌడయ్య (కన్నడ: ಸಂಗೀತ ರತ್ನ ತಿರುಮಕೂಡಲು ಚೌಡಯ್ಯ) (1895 – 19 జనవరి 1967) ఒక కర్ణాటక శాస్త్రీయ వయోలిన్ విద్వాంసుడు.

తిరుమకూడలు చౌడయ్య
వ్యక్తిగత సమాచారం
జననం1895
మూలంతిరుమకూడలు నరసీపుర, మైసూరు రాజ్యం, బ్రిటీషు ఇండియా
మరణం19 జనవరి 1967 (aged 71–72)
సంగీత శైలికర్ణాటక సంగీతము
వృత్తివయోలిన్ విద్వాంసుడు

ఆరంభ జీవితం

మార్చు

ఇతడు మైసూరు సమీపంలో కావేరీ నదీ తీరాన ఉన్న తిరుమకూడలు నర్సీపుర అనే గ్రామంలో అగస్త్యగౌడ, సుందరమ్మ దంపతులకు 1895లో జన్మించాడు. ఇతడు మైసూరు రాజాస్థానంలోని సంగీత విద్వాంసుడు బిడారం కృష్ణప్ప వద్ద 1910 నుండి 1918 వరకూ గురుకుల పద్ధతిలో శిష్యరికం చేసి సంగీతాన్ని నేర్చుకున్నాడు.

ఇతడు మొదట్లో నాలుగు తీగల వయోలిన్‌ను ఉపయోగించేవాడు. 1927 నాటికి ఇతడు మంచి సహవాద్యకారుడిగా పేరు గడించాడు. ఆ రోజుల్లో ధ్వనివర్ధక పరికరాలు లేనందువల్ల కచేరీలో చివర కూర్చున్న వారికి ఇతని వయోలిన్ సరిగ్గా వినబడేది కాదు. ఇతడు శబ్దాన్ని పెంచడానికి వయోలిన్‌కు తారా షడ్జమ - మంద్ర షడ్జమ, మధ్య పంచమ - మంద్ర పంచమ, మధ్య షడ్జమ - మంద్ర షడ్జమ స్థాయిలలో పలికించేందుకు మరో మూడు తీగలను జతచేశాడు. ఈ ఏడు తీగెల వయోలిన్‌ను ప్రయత్నించి ఇతడు అన్ని కచేరీలలో తన వయోలిన్ ధ్వనిని పెంచి చివరి శ్రోతకు కూడా వినబడే విధంగా తన ప్రయోగాన్ని ఫలప్రదం చేశాడు. ఇతని గురువు ఈ ప్రయోగాన్ని మొదట వ్యతిరేకించినా తరువాత ప్రసన్నుడయ్యాడు.

వృత్తి

మార్చు

ఇతడు తన గురువు ప్రోద్బలంతో, అకుంఠిత దీక్షతో గొప్ప వయోలిన్ కళాకారుడిగా తయారయ్యాడు. గాత్ర విద్వాంసులందరూ సహ వాద్యకారునిగా ఇతని పేరునే సిఫారసు చేసేవారు. ఒక గురువుగా ఇతడు తన శిష్యులకు నిలకడగా ఒక నిర్దిష్ట సమయంలో పాఠాలు చెప్పేవాడు కాదు. ఎక్కువ మంది శిష్యులు 8-10 సంవత్సరాలు ఇతని వద్ద శిక్షణ తీసుకున్నారు. ఇతని శిష్యులలో ఆర్.కె.వెంకటరామ శాస్త్రి (వయోలిన్), వి.రామరత్నం (గాత్రం), కండదేవి ఎస్.అళగిరిస్వామి (వయోలిన్), పాల్గాట్ మణి అయ్యర్(వయోలిన్), చెన్నై వి.సేతురామయ్య (వయోలిన్), రామానుజం, మదురై వేణుగోపాల్, చిన్నప్ప, హెచ్.ఆర్.సీతారామశాస్త్రి మొదలైన వారున్నారు. ఒక గురువుగా ఇతడు తన శిష్యులపట్ల ప్రేమవాత్సల్యాలను చూపించేవాడు. తన సమకాలీనులైన కర్ణాటక విద్వాంసులందరికీ పరిచయం చేసి వారి నుండి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని తన శిష్యులకు కల్పించేవాడు. తన కచేరీ అయిన తర్వాత శిష్యులతో ఆ కచేరీలోని ముఖ్య ఘట్టాలను, లోటుపాట్లను చర్చించేవాడు. తమిళనాడు ప్రజలు ఇతనికి బ్రహ్మరథం పట్టారు. చాలా నగరాలలోని హోటల్ యజమానులు ఇతనికి, ఇతని శిష్యులకు ఉచిత వసతి సౌకర్యం ఇవ్వజూపేవారు. ఉన్నతాధికారులు, నాయకులు ఘనస్వాగతం పలికేవారు. తమ ఇంట్లో బస చేయడానికి ఆహ్వానించేవారు. ఇతను తమ ఊరికి వస్తున్నాడనే వార్త విని ప్రజలు తబ్బిబ్బయ్యేవారు. అంతగా ఇతడు కర్ణాటక సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు.

సాధించిన విజయాలు

మార్చు

చౌడయ్య ఏడు తంత్రుల వాయులీనాన్ని అభివృద్ధి చేసి పక్కవాద్యకారుణ్ణి గాత్ర విద్వాంసునికి సరిజోడీగా నిలబెట్టాడు. ఇతడు పిటీలు (ఫిడేలు) చౌడయ్యగా, మైసూరు టి.చౌడయ్యగా పిలువబడేవాడు.

ఇతడు తన గురువు బిడారం కృష్ణప్ప చిరకాల కోరిక ఐన "అయ్యనార్ సంగీత కళాశాల"ను మైసూరులో స్థాపించాడు. ఈ కళాశాలకు తాను ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. తన శిష్యుడు రామరత్నంను వైస్ ప్రిన్సిపాల్‌గా నియమించాడు. ఈ కళాశాలలో వందలాది మంది గాత్రం, వాయులీనం, వీణ, వేణువులలో శిక్షణ తీసుకున్నారు. ఈ కళాశాల చాలామంది అంధవిద్యార్థులకు ప్రభుత్వ వేతనంతో సంగీతం నేర్పించింది.ఎన్.నంజుండస్వామి(గాత్రం), బి.ఆర్.శ్యామాచార్(వేణువు), సి.ఎం.మధురనాథ్(వేణువు), టి.ఆర్.శ్రీనివాసన్ (గాత్రం), బి.శ్రీనివాస అయ్యంగార్ (గాత్రము & వీణ), రంగస్వామి అయ్యంగార్ (వయోలిన్), కె.జె.వెంకటాచార్ (గాత్రం & వయోలిన్), జి.ఆర్.జయ, ఇందిర, లలిత, పద్మ మొదలైన వారు ఈ కళాశాలలో శిక్షణ పొందిన విద్వాంసులలో కొందరు.

ఇతడు 50కి పైగా సంస్కృత, కన్నడ భాషలలో వర్ణనలను, కీర్తనలను, తిల్లానాలను స్వరపరిచాడు. వీటిని మైసూరు వి.రామరత్నం సంపాదకత్వంలో మైసూరు విశ్వవిద్యాలయం "చౌడయ్య కృతులు" పేరుతో పుస్తకంగా ముద్రించింది. తొలినాళ్ళలో ముసురి సుబ్రహ్మణ్య అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, మహారాజపుర విశ్వనాథ అయ్యర్ వంటి విద్వాంసులు సినిమాలలో భాగం వహించేవారు. వారి ప్రేరణతో చౌడయ్య కూడా వాణి అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో నటించడమే కాక సంగీతం కూడా సమకూర్చాడు.

1957లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడిని సంగీత కళానిధి పురస్కారంతో సత్కరించింది. అదే యేడు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక సంగీతం వయోలిన్ వాద్యం విభాగంలో అవార్డును ఇచ్చింది.1958లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ "సంగీత కళాశిఖామణి" బిరుదును ఇచ్చింది. మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయార్ ఇతనికి 1941లో "సంగీత రత్న" బిరుదును ఇచ్చి గౌరవించాడు. మైసూరు సంగీత పరిషత్తు ఇతడిని "గానకళాసింధు" బిరుదును ఒసగింది.

తన గురువు బిడారం కృష్ణప్ప సంస్మరణార్థం ఇతడు మైసూరులో "బిడారం కృష్ణప్ప ప్రసన్న సీతారామ మందిర" ను నిర్మించాడు.

చౌడయ్య తన 72వ యేట 1967, జనవరి 19న మరణించాడు.

విశేషాలు

మార్చు
 
బెంగళూరు లోని చౌడయ్య మెమోరియల్ హాల్
  • 1980లో బెంగళూరులో ఇతని సంస్మరణార్థం కర్ణాటక ప్రభుత్వం వయోలిన్ ఆకృతిలో "చౌడయ్య మెమోరియల్ హాల్"ను నిర్మించింది.
  • కర్ణాటక ప్రభుత్వం సంగీత విద్వాంసులను గౌరవించడానికి సంగీతరత్న మైసూర్ టి.చౌడయ్య మెమోరియల్ అవార్డ్" ను నెలకొల్పింది.
  • బెంగళూరులో ఒక వీధికి ఇతని పేరుతో "టి.చౌడయ్య రోడ్డు" అని పేరుపెట్టారు.
  • కన్నడ చలనచిత్ర నటుడు అంబరీష్ ఇతని మనుమడు.
  • 1952-1958ల మధ్యకాలంలో ఇతడు కర్ణాటక విధానపరిషత్తు సభ్యుడిగా ఉన్నాడు.

బయటి లింకులు

మార్చు