ద్రోణ పర్వము తృతీయాశ్వాసము
తృతీయాశ్వాసం
మార్చుసైంధవుని చంపడానికి శ్రీకృష్ణుడు మార్గం చూపాడు అని విన్న ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడ్డాడు. సంజయా ! సైంధవుని పాండవులు నిర్జించారా ! లేక ద్రోణుడు సైంధవుని రక్షించాడా నాకు వివరంగా చెప్పు. సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! మరునాడు ధర్మరాజు వంధిమాగధుల స్తోత్రపాఠాలతో నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని పూజాధికములు ముగించి దానధర్మములు చేసి ఆ స్థాన మండపముకు వచ్చాడు. అప్పుడు అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుని ధర్మరాజు సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం చూపించాడు. భీముడు, నకులసహదేవులు, సాత్యకి, ద్రౌపదేయులు, ఘటోత్కచుడు, ద్రుపదుడు, విరాటుడు, కేకయరాజులు మొదలైన వారు వారి ఆసనములు అలంకరించారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో " కృష్ణా ! ఇప్పటి వరకు మాకు అన్ని విధాల నీ సహాయ సహకారాలు అందించావు. ఇప్పుడు ఈ ఆపదనుండి మమ్ము నీవే కాపాడాలి " అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా ! ఈ రోజు అర్జునుడు రణరంగమున వీరవిహారం చేసి సైంధవుని వధించుట తధ్యం " అని పలికాడు. ఇంతలో అక్కడకు వచ్చిన అర్జునుడు ముందు రోజు రాత్రి తాను కన్న కలను గురించి సభాసదులకు వివరించాడు. అది విన్న సభికులు విశ్మయమందారు. తరువాత అందరూ యుద్ధసన్నాహాలు చేసారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, సాత్యకి అందరూ కలిసి అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు రధము ఎక్కి సారధిగా కూర్చున్నాడు. అర్జునుడు రధము ఎక్కి సాత్యకిని చూసి " సాత్యకీ ! మనకు మంచి శకునములు కనపడుతున్నాయి. ఈ రోజు నేను సైంధవుని వధించి నా శపథం నెరవేర్చుకుంటాను. సైంధవవధ ఎంత ముఖ్యమో ధర్మరాజు రక్షణా అంత ముఖ్యమే. ద్రోణాచార్యుని ప్రతిజ్ఞ గురించి మనం ఆలోచించాలి. కనుక నీవు ధర్మరాజు రక్షణ బాధ్యత వహించాలి " అన్నాడు. అర్జునుడి మాట మేర సాత్యకి ధర్మరాజు రక్షణకు వెళ్ళాడు. అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కుమారుని మరణం కలిగించిన శోకము కోపమూ కలగలసి మృత్యుదేవతగా వచ్చిన అర్జునుడిని కౌరవులు ఎలా ఎదుర్కొన్నారు. సైంధవుని ఇంట్లో ఆర్తనాదాలు వినపడుతున్నాయి. సంజయా ! నేను, భీష్ముడు, ద్రోణుడు చెప్పిన మాటలు వినక కర్ణుడు, శకుని, దుశ్శాసనుని మాటలు విన్నాడు. సంధి చెడగొట్టాడు తన వాళ్ళందరిని చంపుకుంటున్నాడు. శివుని ఓడించిన అర్జునుడితో వైరం పెట్టుకుంటున్నాడు. శ్రీకృష్ణుని చెలికానితో వైరం వద్దని చెప్పిన రాజ్యం మీద లోభంతో నా మాట వినలేదు. నేను చెయ్యగలిగినది ఏమి ? " అని వగచాడు. సంజయుడు " మహారాజా ! గతజల సేతుబంధన మేలనయ్యా ! మాయా జూదం నాడే నీవు అడ్డుకోవలసింది. సంధి ప్రయత్నంతో వచ్చిన శ్రీకృష్ణుడి మాటను ఆదరించి ఉండ వలసినది. నీ తమ్ముడు పాండురాజు రాజ్యపాలన చేసి విస్తరించిన రాజ్యంలో భాగాన్ని అతడి కుమారులకు ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఎందుకు ? నీవు చేసిన పనికి నీ కుమారుని నిందించుట తగునా ! లోకులు నిన్ను లుబ్ధుడు, అధర్మపరుడు అనక ఏమి చేస్తారు. నీ దుర్నీతికి తగిన ఫలితం అనుభవిస్తున్నావు . ఇందుకు కౌరవులేమి చేస్తారు. గాండీవ ఘోష, పాంచజన్య తీవ్ర ధ్వని, కపిధ్వజ రెపరెపలు సహించుటకు దేవతలకు కూడా శక్యము కాదు. ఇక నీ కుమారులు ఎంత!
యుద్ధారంభం
మార్చుద్రోణుడు రణరంగమున ప్రవేశించి శంఖం పూరించి సైంధవునితో ఇలా అన్నాడు. నీవు, భూరిశ్రవసుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు అందరూ కలసి ఉండండి. మన బలములో పదునాలుగు వేల ఏనుగులు, అరవై వేల రథములు, ఒక లక్ష గుర్రములు, పది లక్షల పదాతి దళము మీ వెంట ఉంటుంది. నేను పన్ను యుద్ధ వ్యూహముకు మీరంతా మూడు యోజనముల దూరములో ఉండండి. అప్పుడు పాండవులు మీ వంక చూడ లేరు. ఆ తరువాత ద్రోణుడు పన్నెండు యోజనముల పొడవు అయిదు యోజనముల వెడల్పు కలిగిన శకట వ్యూహమును రచించాడు. ఆ శకట వ్యూహముకు పడమటగా ఉన్న అర్ధభాగం లోపల పద్మవ్యూహం పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యభాగం నుండి శకటవ్యూహం మొదలు వరకు ఒక సూచీవ్యూహము నిర్మించాడు. ఆ సూచీవ్యూహ ముఖభాగమున కృతవర్మ, అతడి వెనుక కాంభోజరాజు, వారి వెనుక ఒక లక్షమంది యోధులు. సుయోధనుడు వారందరికి మూల స్థానమున సైంధవుని నిలిపాడు. దుర్మర్షణుడు అనే వాడు ఈ వ్యూహములో నేను నిలుచుట ఏమిటి అని నేను ఒక్కడినే అర్జునుడిని చంపగలను అని వ్యూహముకు దూరంగా తన సేనలతో నిలిచాడు. ద్రోణుడు పన్నిన వ్యూహముకు పదిహేను వందల ధనస్సుల దూరంలో దుశ్శాసనుడు, వికర్ణుడు సైంధవుని రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. ద్రోణా చార్యుడు శకట వ్యూహముకు ముందు భాగంలో ఉన్నాడు. ఈ వ్యూహము చూసి సుయోధనుడు సంతోషించాడు.
అర్జునుడి యుద్ధరంగ ప్రవేశం
మార్చుపాండవ సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నాడు. కపిధ్వజము రెపరెపలాడగా అర్జునుడు యుద్ధరంగ ప్రవేశం చేసాడు. ఇరు పక్షాలలో యుద్ధభేరీలు మ్రోగాయి. ముందుగా దుర్మర్షణుడు విజృంభించాడు. అది చూసి అర్జునుడు " కృష్ణా! మన రధము దుర్మషణుడి వైపు పోనిమ్ము. ముందు వాడిని చంపి ఈ రోజు యుద్ధంలో వాడిని మొదటి కబళంగా భక్షిస్తాను " అన్నాడు. కృష్ణుడు రథమును దుర్మర్షణుడి వైపు పోనివ్వగానే దుర్మర్షణుడి గజసైన్యం అర్జునుడు ఒంటరివాడని తలచి చుట్టుముట్టి శరములు గుప్పించారు. మరుక్షణంలో రణభూమి ఏనుగు కళేబరాలతో సైనికుల తలలతో నిండి పోయింది. కౌరవులు కూడా అర్జునుడి మీద తమ శరములు గుప్పించారు. అర్జునుడు వాటిని మధ్యలోనే త్రుంచి వేస్తూనే దుర్మర్షణుడి గజబలమును, అశ్విక బలమును, రథికులను ముక్కలు ముక్కలు చేసాడు. దుర్మర్షణుడి ధనస్సులు, రథములు, కేతనములు విరిగాయి. అర్జునుడి ధాటికి ఆగలేక దుర్మర్షణుడు పారి పోయాడు. అతడి వెంట అతడి సేనలు పారి పోయాయి.
దుశ్శాసనుడితో యుద్ధం
మార్చుఇంతలో దుశ్శాసనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడిని చూడగానే అర్జునుడు ఆగ్రహోదగ్రుడై గాండీవం సంధించి ధారాపాతగా అమ్ములు గుప్పించాడు. నిలబడిన ఏనుగులు నిలబడినట్లే ఉండగా వాటి మీద ఉన్న సైనికుల తలలు మాత్రం తాటి పండ్ల మాదిరి ఎగిరి పడుతున్నాయి. సైనికుల కాళ్ళు చేతులు తెగి నేల మీద దొర్లుతున్నాయి. తన సైన్యంతో పారిపోతున్న దుశ్శాసనుడిని చూసి అర్జునుడు " దుశ్శాసనా ! ఆగు ఎక్కడికి పారిపోతావు పారిపోతే చావు తప్పదు. అనాడు కురు సభలోమాటాడిన దానికి ఫలితం అనుభవించవా ! " అంటూ దుశ్శాసనుడిపై బాణములు వేసాడు. దుశ్శాసనుడు తిరిగి చూడకుండా ద్రోణుడి వద్దకు పోయాడు.
ద్రోణాచార్యుని ఎదుర్కొనుట
మార్చుకృష్ణుడు చెప్పగా అర్జునుడు ద్రోణాచార్యునికి చేతులెత్తి నమస్కరించి " భూసురోత్తమా ! నాకు అన్న ధర్మరాజు బావ కృష్ణుడు ఎలాగో మీరు అలాగే. మీరు నా శ్రేయోభిలాషులు. మీరు మీ కుమారుడు అశ్వత్థామను ఆదరించినట్లే నన్ను ఆదరించారు. నేను వ్యూహంలో ప్రవేశించి సైంధవుని చంపడానికి దయచేసి దారి ఇచ్చి నా ప్రతిజ్ఞ నెరవేర్చండి " అని ప్రార్థించాడు. ద్రోణుడు " అర్జునా! నేను ఇక్కడ ఉండగా నీవు సైంధవుని ఎలా చంపగలవు " అని అర్జునుడిపై శరములు గుప్పించాడు. ముందు గురువుగారు బాణములు వెయ్యగానే అర్జునుడు విజృంభించి ద్రోణుని తొమ్మిది బాణములతో కొట్టాడు. ద్రోణుడు వాటిని మధ్యలోనే త్రుంచి కృష్ణార్జునులపై బాణవర్షం కురిపించి వింటి త్రాటిని త్రుంచి అర్జునుడి రథాన్ని బాణములతో కప్పాడు. అర్జునుడు తన వింటి నారిని బిగించి ద్రోణుని వదిలి అతడి సైన్యాలను ఎదుర్కొన్నాడు. అర్జునుడి గాండీవం నుండి వెలువడుతున్న బాణములు కురుసైన్యాలను తుత్తునియలు చేతున్నాయి. ద్రోణుడు ఆ బాణములను ఎదుర్కొని సైన్యములను రక్షిస్తూ అర్జునుడి రథమును బాణములతో కప్పాడు. అర్జునుడు ద్రోణుని దాటి ఒక్క అడుగు ముందుకు వేయ లేక పోయాడు. కృష్ణుడు అర్జునుడితో " అర్జునా! ద్రోణుని మీద కోపం ఎందుకు అతడిని వదిలి శకట వ్యూహములో ప్రవేశించు " అన్నాడు. అర్జునుడు " అలాగే కృష్ణా ! మన రధమును చక్ర వ్యూహంలోనికి పోనిమ్ము " అన్నాడు. తనను తప్పించుకు వెళుతున్న అర్జునుడితో " అదేమిటయ్యా ! అర్జునా! యుద్ధం చేస్తున్న వాడిని వదిలి పక్కకు వెళుతున్నావు. శత్రువును చంపవా! అన్నాడు " అని అన్నాడు. అర్జునుడు " ఆచార్యా ! మీరి నా గురువుగారు శత్రువు కాదు. అయినా! మిమ్మలిని జయించడం ఈశ్వరుడికే సాధ్యం కాదు నేనెంత " అన్నాడు. అర్జునుడితో అతడి చక్రరక్షకులు యుధామన్యుడు, ఉత్తమౌజుడు వ్యూహంలోకి ప్రవేశించారు.
అర్జునుడితో కౌరవ వీరులు పోరుట
మార్చుముందుగా కృతవర్మ, కాంభోజరాజు, శ్రుతాయువు అర్జునుడిని చూసారు. కృతవర్మ కృష్ణార్జునుల మీద ఇరవై అయిదు బాణములు వేసాడు. అర్జునుడు కృతవర్మ ధనస్సును విరిచి కృతవర్మ మీద ఇరవై అయిదు బాణాలు వేసాడు. కృతవర్మ మరొక విల్లు తీసుకుని అర్జునుడి గుండెలకు గురిపెట్టి పది బాణములు వేసాడు. కృష్ణుడు అర్జునుడితో " అర్జునా ! కృతవర్మ మీద జాలి చూపకు అతడిని చంపు " అన్నాడు. వెంటనే అర్జునుడు కృతవర్మను మూర్చిల్లజేసి ముందుకు పోతున్నాడు. ఇంతలో కృతవర్మ లేచి అర్జునుడి చక్రరక్షకులను అడ్డుకున్నాడు. వారు కృతవర్మ విల్లును విరిచారు. కృతవర్మ మరొక విల్లు తీసుకుని ఉత్తమౌజుడు, యుధామన్యుల విల్లు త్రుంచాడు. వారు కృతవర్మ వేయు బాణములను అడ్డుకున్నారు. కృతవర్మ అర్జునుడిని వెంబడించ లేక పోయారు. ముందుకు పోతున్న అర్జునుడిని శ్రుతాయువు అడ్డుకుని అర్జునుడి పతాకము త్రుంచి కృష్ణార్ఝునులపై తొంభై బాణములు వేసాడు. అర్జునుడు కోపించి శ్రుతాయువు విల్లు త్రుంచి గుండెలకు గురిపెట్టి ఏడు బాణములు వేసాడు. శ్రుతాయువు మరొక విల్లు తీసుకుని అర్జుడి గుండెలకు గురిపెట్టి తొమ్మిది బాణములు వేసాడు. అర్జునుడు శ్రుతాయువు సారథిని చంపి, రథాశ్వములను చంపి, శరీరం అంతా తూట్లు పడేలా కొట్టాడు. శ్రుతాయువు వరుణుడి కుమారుడు. ఆ గద అతడికి వరణుడు ఇచ్చాడు. ఆ గద ధరించిన వాడు అజేయుడు దానిని ఎవరి మీద ప్రయోగించినా వాడిని తప్పక చంపుతుంది. ఆ గద నిరాయుధుని మీద యుద్ధానికి సిద్ధంగా లేని వాడి మీద ప్రయోగిస్తే అది ప్రయోగించిన వాడినే చంపుతుంది. శ్రుతాయువుకు ఆవేశంలో ఆ విషయం గుర్తుకు రాక దానిని శ్రీకృష్ణుడిపై ప్రయోగించాడు. కేవలం సారథిగా ఉన్న శ్రీకృష్ణుని ఆ గద ఏమి చేయలేక తిరిగి వచ్చి ప్రయోగించిన శ్రుతాయువును వధించింది. అది చూసి అతడి సైన్యం పారిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంభోజరాజు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరిపై ఒకరు శరప్రయోగం చేసుకున్నారు. అర్జునుడు అతడి కేతనమును విరిచి, విల్లును త్రుంచి, సారథిని చంపి, హయములను చంపి పదునైన నారాచములు వేసి అతడి గుండెలు పగులగుట్టాడు. ఆ దెబ్బకు కాంభోజరాజు మరణించాడు. తరువాత శిబి, వసాతి, మొదలగు మహారాజులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణఘాతములతో వారినందరిని యమసదననానికి పంపాడు. తరువాత శ్రుతాయువు, అయుతాతువు అర్జునుడిని ఎదొర్కొన్నారు. అర్జునుడుఇంద్రాస్త్రం ప్రయోగించి వారిని వధించాడు. అది చూసి సుయోధనుడు కళింగులు, దక్షిణాత్యులు, ఆటవికులు కలిసి వారి గజబలముతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు ఆ గజసేనలను చీల్చిచెండాడాడు. తెగిన తొండములు, కాళ్ళు, క్రిందపడిన మావటీలతో ఆ ప్రదేశం బీభత్సమైంది. తరువాత యవనులు, పారదులు, శకులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు వారినందరిని తన బాణపరంపరతో అంతమొందించాడు. అంబష్ట దేశపు రాజు శ్రుతాయువు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు అతడి వింటిని విరిచి, హయములను చంపాడు. శ్రుతాయువు గదతో శ్రీకృష్ణుని కొట్టాడు. అర్జునుడు ఆ గదను విరుగ కొట్టి వేరొక శరముతో శ్రుతాయువు తల నరికాడు.
ద్రోణుడు సుయోధనుడికి కవచధారణ విద్యను ఉపదేశించుట
మార్చుఅర్జునుడి పరాక్రమము చూసిన సుయోధనుడు ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నిన్ను లెక్క చేయక అర్జునుడు ముందుకు వెళ్ళి అందరిని చంపుతున్నాడు. మీరు చూస్తూ ఊరక ఉన్నారు. అర్జునుడి వంక కూడా చూడలేదు. తమరు నా కిచ్చిన వరం ఏమైనట్లు ? సైంధవుడు మిమ్ము నమ్మి ఎటూ పోకుండా రణరంగమున ఉన్నాడు. మీరు అతడిని రక్షించు ప్రయత్నము చేయ లేదు. అతడి చావు చూడాలని ఉందా. మీరు అసలు మనుషులేనా అని నాకు అనుమానంగా ఉంది . నా మనస్సు బాధపడుతుంది కనుక మిమ్మిలా అడుగుతున్నాను. సైంధవునికి రక్షణగా ఉన్న రధికులంతా పారి పోతున్నారు. అతడిని రక్షించండి " అన్నాడు. ద్రోణుడు సుయోధనుడిని చూసి నవ్వి " సుయోధనా! నీ మాటలకు అశ్వత్థామ మాటలకు కోపిస్తానా! శ్రీకృష్ణుని తలపు కంటే అతడి గుర్రాలు వేగంగా పయనిస్తున్నాయి. అంతకంటే వేగంగా అర్జునుడి బాణాలు వెలువడుతున్నాయి. వాటిని ఆపగలిగిన శక్తి నాకు ఉందా! నేను ఈ స్థానం నుండి కదిలానంటే సైన్యం అల్లకల్లోలం ఔతుంది. ఆ పై సైంధవుని రక్షించుట కష్టం. కనుక నేను సేనా ముఖం నుండి కదలక ధర్మరాజును బంధించే ప్రయత్నం చేస్తాను. నేను వృద్ధుడిని కనుక అర్జునుడితో పరుగిడ లేను. నువ్వు అర్జునుడికి సమవయస్కుడవు కనుక అర్జునుడిని ఎదుర్కో " అన్నాడు. సుయోధనుడు " మిమ్ము కృతవర్మను ఎదుర్కొని దాటి వెళ్ళిన అర్జునుడిని ఎదుర్కొనుట నాకు సాధ్యమా! మీరు చెప్పారు కనుక వెళ్ళి పోరాడతాను " అన్నాడు. ఆ మాటకు సంతోషించి ద్రోణుడు " సుయోధనా ! నీకు కవచధారణ విద్యను నేర్పుతాను. దీనితో నువ్వు రక్షింపబడతావు. అర్జునుడు వేసిన శరములు నీ శరీరాన్ని తాకవు " అని ఒక బంగారు కవచం పై కవచధారణను ఆవహింప చేసి అది సుయోధనుడికి తొడ్డొక్కోవడానికి ఇచ్చాడు. ద్రోణుడు " సుయోధనా! మొదట ఈ కవచ ధారణ విద్యను దేవతల సంరక్షణార్ధం బ్రహ్మదేవుడు ఇంద్రునికి ఇచ్చాడు. దేవేంద్రుడు దానిని అంగీరసునికి ఇచ్చాడు. అంగీరసుడు బృహస్పతికి, బృహస్పతి అగ్నివేశుడికి, అగ్నివేశుడు నాకు ఇచ్చాడు. నేను అది ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఇది ధరించి విజయుడివి కమ్ము " అని దీవించాడు. సుయోధనుడు కవచ ధారణ చేసి అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు.
కురుపాండవ యుద్ధము
మార్చుకురు పాండవ సేనలు ఒకరికి ఒకరు తీసిపోకుండా ఘోరయుద్ధం చేస్తున్నారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొని కౌరవ సేనలను పీనుగుల కుప్పలుగా చేసాడు. ఎవ్వరికీ అతడి ముందు నిలవాడానికి ధైర్యం చాల లేదు. అది చూసి ద్రోణుడు పాంచాల కేకయ సేనలను ఎదుర్కొన్నాడు. అది చూసి ధర్మరాజు తన తమ్ములను తీసుకుని ధృష్టద్యుమ్నునికి సాయంగా వచ్చాడు. అది చూసి వికర్ణుడు వివిశంతిని, చిత్రసేనుడు భీముని, బాహ్లికుడు ఉపపాండవులను, దుశ్శాసనుడు సాత్యకిని, శకుని నకుల సహదేవులని, సోమదత్తుడు శిఖండిని, అలంబసుడు ఘటోత్కచుని ఎదుర్కొన్నారు. శల్యుడు సైంధవుని పక్కనే ఉండి అతడిని రక్షిస్తూ అప్పుడప్పుడూ ధర్మరాజుపై బాణము వేస్తున్నాడు. దుశ్శాసనుడు సాత్యకిని మూర్ఛపోయేలా కొట్టాడు. కాని తేరుకున్న సాత్యకి దుశ్శాసనుడిని తరిమి తరిమి కొట్టారు. నకుల సహదేవుల పరాక్రమానికి తట్టుకోలేక శకుని ద్రోణుని వెనుక దాక్కున్నాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని భీముని ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ద్రోణుడు తను పన్నిన శకటవ్యూహం చెదరకుండా కాపాడుతున్నాడు. రణరంగం విరిగిన రథములు, విల్లులు, కేతనములు, చిందరవందరాగా పడిన దుస్తులు కాళ్ళు చేతులు, ఏనుగుల కళేబరాలు, గుర్రముల శవాలు పదాతి దళాల పీనుగులతో భీకరంగా ఉంది. ద్రోణుని రథమును ధృష్టద్యుమ్నుడు ఢీకొట్టి డాలు కత్తి తీసుకుని ద్రోణుని మీద కలియబడ్డాడు. ద్రోణుడు ఈ హటాత్పరినామానికి జంకక ధృష్టద్యుమ్నుని కత్తిని ముక్కలు చేసి డాలును విరిచి రథాశ్వములను, సారథిని చంపి దృష్టద్యుమ్నుని మీద క్రూర నారాచమును వేసాడు. సాత్యకి ఆ నారాచమును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు సాత్యకి రథం ఎక్కి పక్కకు తప్పుకున్నాడు. చేతికి చిక్కిన ధృష్టద్యుమ్నుని తప్పించినందుకు ద్రోణునికి సాత్యకి మీద కోపం వచ్చి సాత్యకిని కోపంగా ఎదుర్కొన్నాడు. సాత్యకి జంకక తన రథమును ద్రోణుని ముందు నిలిపాడు. వారిరువురు ఘోరయుద్ధం సాగించారు. రథములు విరుగుతున్నాయి, కేతనములు తెగి పడుతున్నాయి. సైనికుల శరీరములు మట్టిలో దొర్లుతున్నాయి. అప్పుడు సాత్యకి ద్రోణుని విల్లు విరిచాడు, ద్రోణుడు మరొక విల్లు తీసుకుని సంధేచే లోపల దానిని విరిచాడు. ఆ విధంగా ద్రోణుడు ఎన్ని విల్లులు తీసుకున్నా వాటిని విరిచాడు సాత్యకి. పట్టువదలని ద్రోణుడు ఆఖరికి ఒక విల్లు తీసుకుని బాణములు సంధించి అత్యంత వేగంగా సాత్యకిపై శరములు ప్రయోగించాడు. సాత్యకి వాటినిన్నంటిని త్తుతునియలు చేసాడు. ద్రోణుడు సాత్యకిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. భీకర జ్వాలలను చిమ్ముతూ సాత్యకి వైపు వచ్చిన ఆగ్నేయాస్త్రాన్ని వారుణాస్త్రం ప్రయోగించి సాత్యకి నిర్వీర్యం చేసాడు. సాత్యకికి బాసటగా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నిలిచారు. ద్రోణునికి బాసటగా దుశ్శాసనాదులు నిలిచి యుద్ధం చేస్తున్నారు.
అర్జునుడి సమరం
మార్చుఅర్జునుడు తాను వెళ్ళే మార్గంలో ఎదురైన యోధులను హతమారుస్తూ సైంధవుని కొరకు ముందుకు దూసుకు వెళుతున్నాడు. ఇంతలో విందాను విందులు తమ సైన్యంతో అర్జునుడిని చుట్టుముట్టి కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించాడు. అర్జునుడు వారి ధనస్సులును విరిచి, పతాకములు పడగొట్టి, వారి రథాశ్వములను చంపి ముందుగా విందుని తల తెగ నరికాడు. అన్న గారి మరణానికి ఆగ్రహించి అనువిందుడు గదను తీసుకుని రథం దిగి అర్జునుని రథం సమీపించి తన గదను శ్రీకృష్ణుని మీద విసిరాడు. అర్జునుడు ఆ గదను విరిచి మరొక బాణంతో అనువిందుని శిరస్సు ఖండించాడు. విందానువిందులు మరణించగానే వారి సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అర్జునుడు వారినందరిని తన శరాఘాతంతో తరిమి తరిమి కొట్టాడు.
కృషార్జునులు రధాశ్వముల సేద దీర్చుట
మార్చుఅప్పటికి అర్జునుడు అలసి పోయాడు రథాశ్వాలు కూడా అలసి పోయాయి. సైంధవుడు కను చూపు మేరలో కనుపించ లేదు. ఈ పరిస్థితి గమనించిన కౌరవ సేనలు సింహనాదాలు చేస్తూ పాండవ సేనలను తరుముతున్నారు. అర్జునుడు " కృష్ణా ! నేను వీరిని నిలువరిస్తాను నువ్వు రధాన్ని ఆపి రధాశ్వాలకు విశ్రాంతి నిమ్ము " అన్నాడు. ఇదే తగిన సమయమని కౌరవ యోధులు అర్జునుడిని చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వారి మీద ప్రయోగించాడు. సముద్ర తరంగం వలె తన మీద పడుతున్న సైన్యాలను చెలియలి కట్ట వలె అడ్డుకుని అర్జునుడు భల్ల బాణములతో రథములను విరిచి, అర్ధ చంద్ర బాణాలతో ఏనుగులను చంపుతున్నాడు. క్రూర నారాచములతో హయములను నేల పడదోస్తున్నాడు. రణరంగం అంతా మాంస ఖండములతోను, తెగిన తలలతోను, ఏనుగుల అశ్వముల కళేబరములతో నిండి పోయింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో " అర్జునా! మన గుర్రములు సేద తీరాయి కాని వాటికి దాహం వేస్తున్నట్లుంది. అవి నీరు త్రాగితేగాని తెప్పరిల్లవు ఎలా " అన్నాడు. అర్జునుడు " దానిదేముంది కృష్ణా ! ఇక్కడే ఇప్పుడే నీరు తెప్పిస్తాను " అని తన బాణములతో భూమిని చీల్చి ఒక కొలను ఏర్పరచి దానిని నీటితో నింపాడు. అది చూసిన కౌరవ సేనలు ఆశ్చర్య పోయాయి. శ్రీకృష్ణుడు సంతోషించి అర్జునుడిని ప్రశంసించి అశ్వాలతో నీరు త్రావించి రథముకు కట్టి రథము సిద్ధము చేసాడు. అర్జునుడు రథం ఎక్కాడు. శ్రీకృష్ణుడు నొగల మీద కూర్చున్నాడు. అంతలో దూరం నుండి వస్తున్న సుయోధనుడిని చూసి కృష్ణుడు రథమును సుయోధనుడి వైపు పోనిచ్చాడు. అది చూసిన కౌరవయోధులు " ఇప్పటి వరకు కౌరవ సేనలను పీనుగు పెంటలు చేసాడు. ఇప్పుడు సుయోధనుడిని ఎదుర్కొంటున్నాడు ఏమౌతుందో ఏమో " అని తమలో తాము అనుకున్నారు. ఇంతలో పొద్దు వ్రాలడం గమనించి పాంచజన్య, దేవదత్తములు పూరించారు. ఆ ధ్వనికి కౌరవ రాజులు గుండెలు పగిలి సైంధవుడి సంగతి దేవుడెరుగు మన ప్రాణాలు రక్షించుకోవాలి అనుకుని సైంధవుని రక్షణ వలయం నుండి తొలగి పోయారు. అర్జునుడు " కృష్ణా! అడుగో సైంధవుడు. వాడికి చుట్టూ కృపాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, కర్ణుడు కర్ణుని కుమారులు రక్షణగా నిలిచి ఉన్నారు. వాడి చావు నా చేతిలో మూడింది. వీరంతా సైంధవుని రక్షించగలరా . వీరే కాదు దేవతలు దండెత్తి వచ్చినా ఈ రోజు పొద్దు వాలే లోపు వీడిని చంపి తీరుతాను " అన్నాడు. అమిత ఔర్యంతో సైంధవుని వైపు వస్తున్న అర్జునుడిని చూసి కౌరవ యోధులు సైంధవునిపై ఆశలు వదులుకున్నారు. అర్జునుడు సింహనాదం చేసాడు. కృష్ణుడు సైంధవుని వైపు రథం పోనిచ్చాడు. ఇంతలో ద్రోణుడు ఇచ్చిన కవచధారణ చేసిన సుయోధనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు.
అర్జునుడు సుయోధనుడిని ఎదుర్కొనుట
మార్చుసుయోధనుడు అర్జునుడిని ఎదుర్కోవడం చూసిన కౌరవ సేన ఉత్సాహంగా అర్జునుడిని చుట్టుముట్టారు. తమ ఎదుట నిలబడిన సుయోధనుడిని చూసి శ్రీకృష్ణుడు " ఈ సుయోధనుడు మన మీద నిరంతర కోపంతో ఉన్నాడు. ఇప్పుడు మనకు సుయోధనుడికి మధ్య జరిగే జూదంలోసైంధవుడు పందెంగా ఉన్నాడు. ఈ సుయోధనుడిని జయించి అతడికి మన మీద ఉన్న కోపాన్ని నిర్మూలించు . మీ కష్టాలన్నిటికీ ఇతడే కారకుడు. మాయా జూదంలో ధర్మజుని ఓడించి అతడిని అవమానాల పాలు చేసిన పాపాత్ముడు. నిండు పేరోలగంలో ద్రౌపది కొప్పు పట్టి ఈడ్పించి వలువలు పట్టి లాగించిన దుర్మార్గుడితడే. ఇతడికి నీ పరాక్రమము రుచి చూపు. నీకు శుభం కలుగుతుంది. వీడు మన ఎదుటకు వచ్చుట మన అదృష్టం. ఇది దేవుడిచ్చిన వరం దీనిని సద్వినియోగం చేసుకో. వీడి తల వెంటనే నరుకు. వీడు చస్తేగాని పీడ వదలదు. అర్జునా! నీ ఎదుటకు వీడు రావడం నీ గాండీవానికి ఎరగావడం నీ పూర్వ జన్మ సుకృతం. సందేహించక ఇతడిని వధించిన కౌరవ సేన చెరిది పోతుంది ఆపై సైంధవుడు బయటకు వస్తాడు. అప్పుడు అతడిని తరిమి తరిమి వధించుట సులభం " అని చెప్పాడు. అర్జునుడు " కృష్ణా! సుయోధనుడు మాకు చేసిన అవమానములు కష్టములు ఎటుల మరువగలను . సత్వరమే ఇతడిని చంపి నా పగ తీర్చుకుంటాను. కృష్ణా! రధము సుయోధనుడి వైపు తిప్పు " అన్నాడు. సుయోధనుడు కవచ ధారణతో లభించిన అమితమైన గర్వంతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణార్జునులు శంఖములను పూరించారు. కృష్ణార్జునుల ఆవేశాన్ని కనులార చూసిన కౌరవ సేనలు అర్జునుడి చేతిలో సుయోధనుడి మరణం నిశ్చయం అనుకున్నారు. సుయోధనుడు అర్జునుడిని చూసి అర్జునా! నీ దగ్గర దివ్యాస్త్రములు ఉన్నాయని విర్ర వీగుతున్నావు కదా ! ఆ పేరు ఈ రోజుతో చెల్లి పోయింది. నీ బలము కృష్ణుని నేర్పరి తనం చూడాలని వచ్చాను. నీవు నిజంగా పాండురాజు కుమారుడవైతే నీ శౌర్య ప్రతాపాలు చూపి అస్త్ర కౌశలం చూపించు " అని క్రూర నారాచములను అర్జునుడిపై వేశాడు. నాలుగు బాణాలతో అర్జునుడి రధాశ్వములను కొట్టి పది బాణాలతో కృష్ణుడిని కొట్టాడు. అర్జునుడు కోపించి సుయోధనుడి పై పదునాలుగు బాణములు ప్రయోగించగా అవి సుయోధనుని శరీరం తాకి కింద పడ్డాయి. అర్జునుడు తిరిగి ఇరవై ఏడు బాణములు సుయోధనుడి మీద వేసాడు. అవి కూడా సుయోధనుడి శరీరం తాకగానే పడిపోయాయి. ఇది చూసిన కృష్ణుడు " అర్జునా! ఏమిటీ ఆశ్చర్యం నీ చేతులలో బలం తగ్గిందా? నీ శరముల శక్తి చచ్చిపోయిందా ? ఏమైంది నిజం చెప్పు నీ ఒక్కొక్క బాణం పిడుగుపాటు వలె శత్రువులను తనుమాడ కలిగినవే. నేడు ఇలా నిర్వీర్యం కావడం చూసిన నా మనసు కలత చెందుతుంది " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నా చేతిలో బలం తగ్గ లేదు శరముల వేడి తగ్గ లేదు. ద్రోణుడు సుయోధనుడికి కవచధారణ శక్తి ఇచ్చాడు. కవచధారణ విద్య ద్రోణుడికి మాత్రమే తలుసు. అతడు దానిని నాకు మాత్రమే నేర్పాడు. ఇప్పుడు సుయోధనునికి ఇచ్చాడు. ఆ కవచమును భేదించుట ఎవరికీ శక్యము కాదు. సుయోధనుడు కవచం తొడుకున్నాడు కాని దానిని గురించి తెలియదు. చూస్తుండు నా గాండీవంతో కవచధారణ చేసినప్పటికీ సుయోధనుడిని ముప్పతిప్పలు పెట్టగలను . కృష్ణా అంగీరసుడు నిఖిల కవచ భేధ్యము అనే అస్త్రాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. దేవేంద్రుడు దానిని నాకు ఇచ్చాడు. అది ఎటువంటి కవచాన్నైనా భేదిస్తుంది. నేను సుయోధనుడి కవచాన్ని ఈ మహాస్త్రంతో చీలుస్తాను " అన్నాడు. అని వెంటనే అర్జునుడు సుయోధనుడిపై ప్రయోగించడానికి అస్త్రాన్ని సంధించి మంత్రాన్ని జపించాడు . అది గమనించిన అశ్వత్థామ రానున్న ప్రమాదాన్ని గ్రహించి ప్రయోగించక మునుపే బాణాన్ని వేసి దానిని ముక్కలు చేసాడు. అర్జునుడు కృష్ణుని వంక చూసి " కృష్ణా ! అశ్వత్థామ మహాస్త్రాన్ని నిర్వీర్యం చేసాడు. దానిని తిరిగి ప్రయోగించడం నాకే కీడు. కనుక నేనిక నా అస్త్రాలను నమ్ముకుంటాను " అని అంటూ ఉండగానే సుయోధనుడు ఒక్కొక్కరిపై తొమ్మిదేశి బాణాల లెక్కన కృష్ణార్జునులపై వేసాడు. అర్జునుడు ఆగ్రహించి ఇక ఉపేక్షించి లాభం లేదనుకుని సుయోధనుని సారథిని, రథాశ్వములను చంపి కేతనమును విరిచి సుయోధనుడి అరచేతిలో బాణాలు నాటాడు. గాయపడ్డ సుయోధనుడు ఖిన్నుడై ఈ కవచం బాగా లేదని దానిని విడిచి మరొక కవచం తొడుకున్నాడు. ఇది చూసిన కౌరవ యోధులు అర్జునుడిని చుట్టుముట్టారు.
అర్జునుడు కౌరవ వీరులను ఎదుర్కొనుట
మార్చుఅర్జునుడు కౌరవ సేనలను తనుమాడ సాగాడు. రథములు విరుగుతున్నాయి. అశ్వముములు నేల కూలుతున్నాయి. ఏనుగుల కుంభస్థలములు పగులుతున్నాయి. సైనికుల తలలు బంతుల్లా తెగి పడుతున్నాయి. రణరంగం అంతా బీభత్సంగా తయారైంది. కౌరవ సైన్యం భయంతో పారి పోయింది. సింధురాజుకు రక్షణగా ఉన్న యోధులు సింహనాదం చేసారు వారి ఉత్సాహం చూసి అర్జునుడు రథమును సుయోధనుడి వైపు పోనిచ్చాడు. సుయోధనుడికి రక్షణగా ఉన్న ఎనిమిది మంది యోధులు అర్జునుడిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నారు. అర్జునుడు దేవదత్తమును పూరిస్తూ వారిని దాటి సైంధవుని వైపు పోతున్నాడు. అది గమనించి మిగిలిన వారు అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. అశ్వత్థామ రెచ్చి పోయి డెబ్బై మూడు బాణాలతో కృష్ణుని మూడు బాణాలతో అర్జునుడిని కొట్టాడు. అర్జునుడి కేతనమును విరిచాడు. అర్జునుడు కోపించి నూట ఆరు బాణములు అశ్వత్థామ మీద ప్రయోగించి పది బాణములతో కర్ణుడిని కొట్టాడు. వృషసేనుడిపై మూడు బాణములు ప్రయోగించి ఒకే ఒక బాణంతో శల్యుని విల్లు విరిచాడు. శల్యుడు వేరొక విల్లు తీసుకుని అర్జునుడి మీద ఏడు బాణములు ప్రయోగించాడు. కర్ణుడు మూడు బాణములు భూరిశ్రవసుడు వృషసేనుడు తలా అయిదు బాణములు కృపాచార్యుడు పది బాణములు అశ్వత్థామ అరవై బాణములు అర్జునుడి మీద ప్రయోగించాడు. అనేక దివ్యాస్త్రాలు అర్జునుడి మీద ప్రయోగించారు. సైంధవుడు వారి చాటున నిలబడి డెబ్బై మూడు బాణములు అర్జునుడిపై వేసాడు. అది చూసిన అర్జునుడికి ఏడుపు నవ్వు ఏక కాలంలో కలిగాయి. అర్జునుడు కర్ణుడి మీద పన్నెండు బాణములు అతడి కుమారుని మీద మూడు బాణములు వేసాడు. ఒకే ఒక బాణంతో శల్యుని విల్లు తుంచి తొమ్మిది బాణములతో శల్యుని కొట్టాడు. మూడు బాణములతో భూరిశ్రవసుని ఎనిమిది బాణములతో అశ్వత్థామను ఇరవై రెండు బాణములతో కృపాచార్యుని కొట్టాడు. మరొక ఇరవై రెండు బాణాలతో అశ్వత్థామ శరీరం అంతా గుచ్చాడు. సైంధవుడు కనిపించినప్పుడల్లా అతడి మీద బాణప్రయోగం చేస్తున్నాడు. సైంధవుడు అర్జునుడికి కనుపించ కుండా వారి వెనుక దాక్కుంటున్నాడు. కౌరవ సైన్యం ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుని ఒకటిగా చేరి అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారిని తన బాణములకు ఎరగా వేసాడు.
కౌరవ పాండవ సమరం
మార్చుధర్మరాజు ద్రోణుడు ఉన్న రణరంగమున పరిస్థితి భయంకరంగా ఉంది. యుద్ధం ఘోరంగా సాగుతుంది. బృహత్క్షతృడిని క్షేమధూర్తి, ధృష్టకేతుడిని వీర ధ్వనుడు, నకులుడిని కర్ణుడు, సహదేవుడిని దుర్ముఖుడు, సాత్యకిని వ్యాఘ్రదత్తుడు ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు మాత్రం అటు శకట వ్యూహం నుండి పద్మవ్యూహం వరకు అటూ ఇటూ తిరుగుతునే మధ్యలో ఉపపాండవులతో యుద్ధం చేస్తున్నాడు. అలంబసుడు భీముని ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ద్రోణాచార్యుని శరీరంపై తొంభై బాణములు గుచ్చాడు. ద్రోణుడు ధర్మరాజు గుండెలకు గురిపెట్టి ఇరవై అయిదు బాణాలు వేసాడు. ద్రోణుడు తన బాణములతో ధర్మరాజు రథమును ముంచెత్తాడు. ధర్మరాజు ద్రోణుడు వేసిన బాణములు నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు కోపించి ధర్మరాజు విల్లును త్రుంచాడు. అది చూసిన వారంతా ఈ రోజు ద్రోణుని చేతిలో ధర్మరాజు బంధీ అయ్యాడు అనుకున్నారు. ధర్మరాజు వేరొక విల్లు అందుకుని ద్రోణుడు వేసిన బాణాలన్నింటిని త్రుంచి వెంటనే ద్రోణుని మీద శక్తి ఆయుధాన్ని వేసాడు. ధర్మరాజు ప్రయోగించిన శక్తి ఆచార్యుని దహిస్తుంది అని అందరూ అనుకున్నారు. ద్రోణుడు బ్రహ్మాస్త్రంతో శక్తి ఆయుధాన్ని అడ్డుకుని నిర్వీర్యం చేసి శక్తి ఆయుధాన్ని ధర్మరాజు మీద వేసాడు. శక్తి అయ్యుధము ధర్మరాజు వైపు దూసుకు వస్తుంది. ధర్మరాజు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేసాడు. ద్రోణుని శరీరం మీద అయిదు బాణాలు వేసి ద్రోణుని విల్లు తుంచాడు. ద్రోణుడు ధర్మజుని మీదకు గదాయుధాన్ని విసిరాడు. ధర్మజుడు కూడా గదాయుధాన్ని విసిరాడు. రెండు గదలు ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. ద్రోణుడు ధర్మజుని రథం విరుగకొట్టాడు. ధర్మజుడు విరిగిన రథం దిగి నిస్సహాయుడై చేతులు జోడించాడు. ద్రోణుడికి దయారసం పెల్లుబుకింది ధర్మజుని చంపడానికి మనస్కరించక ఆ కోపం చల్లారడానికి పాండవ సైన్యాలను కసితీర చంపాడు. ఇది చూసి అందరూ ధర్మజుని ద్రోణుడు బంధీ చేస్తాడు అనుకునేంతలో ధర్మరాజు పరుగున వెళ్ళి సహదేవుడి రథం ఎక్కాడు. సహదేవుడు ధర్మరాజును తీసుకుని దూరంగా వెళ్ళాడు. క్షేమధూర్తి అనే వాడు బృహత్క్షత్రుని వింటిని తృంచాడు. అతడు వేరొక వింటిని తీసుకుని క్షేమధూర్తి రథాశ్వాలను చంపి అతడి రథాశ్వములను చంపి, కేతనమును త్రుంచి, మరొక బాణముతో క్షేమధూర్తి తలను నరికాడు. ఇంతలో త్రిగర్త దేశాధిపతి వీరధ్వనుడు ధృష్టకేతు ధనస్సు విరిచి మరొక బాణంతో తల నరికాడు. సహదేవుడు తిరిగి వచ్చి సుయోధనుడి తమ్ముడు దుర్ముఖుని ఎదుర్కొని అతడి రథాశ్వములను సారథిని చంపి అతడి శరీరం మీద అయిదు బాణములు గుచ్చాడు. దుర్ముఖుడు పక్కన ఉన్న త్రిగర్త రాకుమారుడు నిరమిత్రుడి రథము ఎక్కి పారిపోయాడు. అది చూసి పాండవసైన్యం హర్షధ్వానాలు చేసింది. సహదేవుడు అప్పుడు కూడా వారిని వదలక నిరమిత్రుడిని తరిమి తరిమి చంపాడు. నకులుడితో తలపడిన వికర్ణుడు ఎక్కువ సేపు నిలువ లేక పారిపోయాడు. సాత్యకితో తలపడిన వ్యాఘ్రదత్తుడు సాత్యకిని శరవర్షంలో ముంచాడు. కోపించిన సాత్యకి వ్యాఘ్రదత్తుని సారథిని రథాశ్వములను చంపి వ్యాఘ్రదత్తుని తల నరికాడు. శల్యుడు ద్రౌపదీ సుతులను ఎదుర్కొని ఒక్కొక్కరిని అయిదేసి బాణాలతో నొప్పించాడు. ఉపపాండవు లందరూ శల్యుని ఒక్క మారుగా చుట్టుమట్టారు. అర్జునుడి కుమారుడు శల్యుని రథాశ్వములను చంపాడు, భీముని కుమారుడు శల్యుని ధనస్సును, ధర్మరాజు కుమారుడు శల్యుని కేతనమును విరిచారు. నకులుడి కుమారుడు శల్యుని రథసారథిని చంపారు. భీముడు అలంబసుడితో యుద్ధం చేస్తున్నాడు. అలంబసుడి ధాటికి భీముడు మూర్చిల్లి అంతలోనే తేరుకుని అలంబసుడి శరీరం మొత్తం బాణములతో కొట్టాడు. అలంబసుడు తన శరీరాన్ని పెంచగానే ఆ బాణములన్నీ అతడిని ఏమి చేయలేక పోయాయి. అలంబసుడు భీమసేనుడితో " భీమసేనా ! నా తండ్రి బకాసురుని చంపినపుడు నేను లేను ఇప్పుడు నాపై నీ ప్రతాపం చూపు " అన్నాడు. అది విని భీముడు కోపించి అతడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి అలంబసుని తరిమి తరిమి కొట్టాడు. ద్రోణుడు సాత్యకి మొదలైన పాండవ వీరులను ఎదుర్కొని తన బాణ ప్రయోగంతో వారిని ముందుకు పోకుండా ఆపుతున్నాడు.
అలంబసుడి యుద్ధం
మార్చుఇంతలో ద్రోణుడిని ఘటోత్కచుడు ఎదుర్కొన్నారు. అది చూసి అలంబసుడు ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. తనకు అడ్డంగా ఉన్న సాత్యకిని పక్కకు నెట్టి ఘటోత్కచుడు అలంబసుడి మీద శరవర్షం కురిపించాడు. అలంబసుడు ఘటోత్కచునిపై పెద్ద చక్రం వేసాడు. ఘటోత్కచుడు దానిని నుగ్గు నుగ్గు చేసాడు. తన చక్రాయుధము నిరుపయోగం కావడంతో అలంబసుడు ఘటోత్కచునిపై అనేక మాయలు ప్రయోగించాడు. ఘటోత్కచుడు వాటిని తన అర్ధచంద్ర బాణములతో ఎదుర్కొన్నాడు. ఒకరికి ఒకరు తీసిపోకుండా భీకరంగా ద్వంద యుద్ధం, మాయా యుద్ధం సాగిస్తున్నారు. ఉపపాండవులు అలంబసుడిని తమబాణములతో కప్పారు. అలంబసుడు ఆబాణములకు జంకక భీముని ఇరవై అయిదు బాణములతోను, ధర్మరాజును మూడు బాణములతోను ఉపపాడవులను, సహదేవుడిని, ఘటోత్కచుడిని ఇరవై అయిదు బాణములతో కొట్టి సింహనాదం చేసాడు. ఘటోత్కచుడు అలంబసుడి రథాశ్వములు చంపి, సారథిని చంపి, రథమును విరిచాడు. తన రథము విరిగి పోగా అలంబసుడు నేల మీదకు దూకి తన మాయాజాలముతో పాండవ సేనపై మాయాశరములను వేసాడు. ఘటోత్కచుడు కూడా రథము దిగి అలంబసుడితో మాయా యుద్ధముకు తలపడి అలంబసునిపై మాయాసరములు గుప్పించాడు. అలంబసుడు ఖడ్గం తీసుకుని ఆకాశానికి ఎగిరాడు. ఘటోత్కచుడు కూడా ఖడ్గపాణి అయి ఆకాశానికి ఎగిసాడు. ఇద్దరూ మేఘాలపై ఒకరిని ఒకరు చుట్టుకుంటూ చిత్ర విచిత్రంగా యుద్ధం చేస్తున్నారు. తరువాత ఇద్దరూ భూమి మీద పడి ఒకరిపై ఒకరు కత్తులు విసురుకున్నారు. ఒకదానికి ఒకటి కొట్టుకొని అవి పడి పోగానే ఇద్దరు ద్వంద యుద్ధానికి తలపడ్డారు. ఒకరిని ఒకరు తోయుచూ, పొడుచుకుంటూ, కొట్టుతూ అనేక విధముల పోరు సాగించారు. చివరకు అలంబసుడు అలిసి పోగానే ఘటోత్కచుడు తగిన సమయం వచ్చిందని అలంబసుని కిందకు తోసి మీద కూర్చుని చేతులతో, కాళ్ళతో తన్ని పొడిచి, కుమ్మి యుద్ధం చేసాడు. చివరకు అలంబసుడు ఘటోత్కచుడి చేతిలో ప్రాణాలు విడిచాడు. ధర్మరాజు ఘటోత్కచుడిని కౌగలించుకుని అభినందించాడు.
ధర్మరాజు సాత్యకిని అర్జునుడికి సాయంగా పంపుట
మార్చుసాత్యకి కౌరవ సేనలను దొరికిన వాడిని దొరికినట్లు చంపుతూ తరుముతున్నాడు. అది చూసిన ద్రోణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి ద్రోణునిపై ఇరవై అయిదు బాణములతో కొట్టాడు. ద్రోణుడు సాత్యకిని మూడు బాణములతో కొట్టాడు. సాత్యకి ద్రోణుడిని ఏభై నారాచములతో కొట్టాడు. ద్రోణుడు వాటిని తొమ్మిది బాణములతో ఎదుర్కొన్నాడు. వాటిని సాత్యకి ఎదుర్కొంటున్న సమయంలో ద్రోణుడు సాత్యకిపై నూరు బాణములు వేసాడు. సాత్యకి నిస్సహాయంగా నిలబడ్డాడు. అది చూసి నీ కుమారులు సింహనాదం చేసారు. ధర్మరాజు అది చూసి " యోధులారా ! రండిసాత్యకి ఆపదలో ఉన్నాడు రక్షించండి " అని అరిచాడు. ఆ మాటలు విన్న భీముడు ఒక్క పరుగున సాత్యకి వద్దకు వచ్చాడు. మిగిలిన పాండవ వీరులు సాత్యకిని దాటిపోయి ద్రోణుని ఎదుర్కొన్నారు. వారిని చూసి ద్రోణుడు చిరు నవ్వు నవ్వి వారిపై వాడి అయిన శరములు వేసి పాంచాలురు ఇరవై మందిని కేకయ రాజులను నూరు మందిని తలలు నరికి యమసదనానికి పంపాడు. పాండవసైన్యం ద్రోణుని దాటి ఒక్క అడుగు ముందుకు వేయ లేదు. ఇంతలో పాంఛజన్య ఘోష వినపడింది. అది విన్న ధర్మరాజు సాత్యకిని చూసి " సాత్యకీ ! అర్జునుడి దేవదత్తము వినిపించకనే పాంఛజన్య ఘోష వినవస్తుంది. అశ్వత్థామ, కర్ణ, శల్య, కృప, శల్య, భూరిశ్రవసులు అర్జునుడిని చుట్టుముట్టినట్లున్నారు. అర్జునుడు ఆపదలో ఉన్నట్లున్నాడు. ఈ సమయంలో నాకు నీవు తప్ప ఎవ్వరూ లేరు. నీవు వెళ్ళి అర్జునుడిని కాపాడు " అన్నాడు. సాత్యకి ధర్మజునితో " నీవు చెప్పినది సత్యము. కాని అర్జునుడు నన్ను నీ రక్షణకై నియోగించి " సాత్యకీ ! నేడు శకునము బాగుంది. నేను సైంధవుని వధించడానికి వెళుతున్నాను. నీవు నా బదులుగా ధర్మజుని రక్షిస్తూ ఉండు. సైంధవ వధ ఎంత ముఖ్యమో ధర్మజుని రక్షణా అంత ముఖ్యము. నా పక్కన కృష్ణుడు ఉన్నట్లు నీవు ధర్మజుని పక్కన ఉండు " అన్నాడు. ద్రోణుడు మిమ్ము బంధించాలని చూస్తున్నాడు. ద్రోణుడు తమను బంధిస్తే అర్జునుడు సైంధవుని వధించినా ఏమి ప్రయోజనం. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నంత వరకు అర్జునుడికి భయం ఏమి లేదు. కనుక నేను మిమ్ము విడిచి వెళ్ళలేను " అన్నాడు సాత్యకి. ధర్మరాజు " సాత్యకీ నీవు చెప్పినది యధార్ధమైనా నీవు ఇప్పుడు అర్జునుడికి సాయంగా వెళ్ళడం యుక్తమైనదిగా నాకు అనిపిస్తుంది. అర్జునుడు క్షేమముగా ఉంటేనే మనకందరికి రక్షణ. కనుక నీవు నా మాట కాదనక అర్జునుడికి సాయంగా వెళ్ళు. నాకు ఇక్కడ ద్రోణుని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, ద్రుపదుడు, ఉపపాండవులు, కేకయరాజులు, శిఖండి ఇంకా యోధాను యోధులనేకులు ఉన్నారు. నాకేమి భయం లేదు " అన్నాడు. ధర్మజుని మాటకు బదులు చెప్పలేక సాత్యకి భీముని ధర్మజునికి రక్షణగా ఉంచి ధర్మజుని అనుమతి పొంది సైంధవుని చంపి విజయుడినై తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి అర్జునుడికి సాయంగా వెళ్ళాడు.