ధూళిపాళ మహదేవమణి

ధూళిపాళ మహదేవమణి కవి, అవధాని, పరిశోధకుడు, పురాణ ప్రవచనకారుడు.[1]

ధూళిపాళ మహదేవమణి

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1952, ఏప్రిల్ 4వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, పామఱ్ఱు మండలం, మసకపల్లి గ్రామంలో లక్ష్మీనరసమ్మ, ధూళిపాళ సూర్యప్రకాశరావు దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమికవిద్య స్వగ్రామమైన మసకపల్లిలో గడిచింది. తరువాత హైస్కూలు విద్యను కోలంకలో పూర్తి చేసి 1967లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. అటు పిమ్మట రాజమండ్రిలోని గౌతమీ విద్యాపీఠంలో చదివి 1972లో తెలుగునందు భాషాప్రవీణ, ఆ తరువాత సంస్కృతంలో సాహిత్య విద్యాప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. 1979లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ., 1989లో అదే విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో ఎం.ఎ., పట్టాలను పొందాడు. 1993లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి "అప్రసిద్ధ లక్షణ గ్రంథములు - ఒక పరిశీలన" అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి. పట్టా పొందాడు. పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, శ్రీరామచంద్రుల కోటేశ్వరశర్మ మొదలైన వారు ఇతని గురువులు. ఇతడు రాజమండ్రిలోని ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో రీడర్‌గా పనిచేశాడు. ఇతడు బులుసు అపర్ణ, తంగిరాల ఉదయచంద్రిక, పుల్లాభొట్ల శాంతిస్వరూప,కొంపెల్ల కామేశ్వరి, చెఱుకూరి వెంకట సూర్యనారాయణశర్మ, తాతా సందీప్ శర్మ మొదలైనవారికి అవధాన విద్యను నేర్పించాడు.

అవధానాలు మార్చు

ఇతడు రాజమండ్రి, అనపర్తి, మంచిలి, ఏలూరు, టెక్కలి, హైదరాబాదు మున్నగుచోట్ల అష్టావధానాలు, నవావధానం చేశాడు. ఇతని అవధానాలలో సమస్య, నిషిద్ధాక్షరి, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి, ఆశువు, వారగణనము, అప్రస్తుత ప్రసంగము అనే అంశాలు ఉంటాయి. ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని మచ్చుకు ఇలా ఉన్నాయి.

  • సమస్య: పేకాట్లాడిరి జాగరంబు సలుపన్ విఘ్నేశ్వరుడున్ స్కందుడున్

పూరణ:

 'నాకే తొల్లిట' 'కాదు నాకిట' 'గుహా! నన్నిట ధిక్కారముల్?'
'లోకజ్యేష్ఠుడ వీవె కాని పితలన్ శ్లోకింపనే గూడనో'
'నీకే పంతమిదేల?' 'నీకు నటులే' 'నీవేల? నేనంచు', మా
పే కాట్లాడిరి జాగరంబు సలుపన్ విఘ్నేశ్వరుడున్ స్కందుడున్

  • దత్తపది గర్భిత సమస్య: మడి - దడి - గడ - నడ పదాలను ఉపయోగిస్తూ "ముద్దిడుమంచు వెంటపడు ముద్దుల కుఱ్ఱడదేమి చిత్రమో?"

పూరణ:

 సద్దుమడింగె నూరు గుణచంద్రుడు కృష్ణుడు నిద్రపోడు, తా
నిద్దని సందడిన్ సలుపు నిమ్ముగ నిమ్మను పాలు మీగడల్
ప్రొద్దుట యిత్తునన్న వినబూనడ, కొంగున వ్రేలి, వెన్నపెన్
ముద్దిడు(ముద్ద+ఇడు)మంచు వెంటపడు ముద్దుల కుఱ్ఱడదేమి చిత్రమో

  • దత్తపది: రంభ - రాశి - రోజా - మీనా అనే పదాలతో శివుడు పార్వతిని బ్రతిమాలుతున్న శృంగార సన్నివేశం.

పూరణ:

రా!శీతాంశు ముఖీ! హిమాద్రి తనయా! రంభా సమా నోరురో
నాశాథ్యంబు సహించి ప్రేమఁగనుమీ! నాపై రుషన్ మీదు మీ
సౌశీల్యున్నను నీక్ష్యతోడఁగనరో!జామణీ! దేవతల్
నాశంపా! శివ! కౌగిటన్ దనపవే నాన్ శూలివేడెన్ సతిన్

పూరణ:

తలపై ఇంకుడు గుంట కట్టుకొని భద్రంబొందె నా శూలి, తా
సలిలంబున్ పదమందు చేర్చుకొనె విశ్వాకారుడా విష్ణువున్
జలముల్నింపి కమండులాన విధియున్ సర్వంబు సృష్టించు, తా
నల నీటిన్ నరులార! వ్యర్థపరుపన్ న్యాయంబె? మీ ఇంటిలో

రచనలు మార్చు

🌻 సువర్ణధారా స్తోత్రం - మణిశింజినీ వ్యాఖ్య 🥀 శ్రీధరీయం - రసజ్ఞ వ్యాఖ్యా సహితం 🥀ఛందో దర్పణం జ్యోత్స్నాపథ వ్యాఖ్య 🌷 శ్రీవిభూతులు లక్ష్మీస్థానాల విశేషం 🌹ఆంధ్ర వ్యాకరణాల పరిశోధన 🌷సుమనోవినోదిని 🌹స్నాన విజ్ఞానం 🌷శ్రీలలితా వైభవం 🌹శ్రీసుబ్రహ్మణ్యచరిత్ర 🌷శ్రీమద్బాలాత్రిపురసుందరి(సమగ్రచరిత్ర) 🌺 శ్రీవేదమాత గాయత్రి 🥀కాళీఅశ్వధాటి-మణిశింజినీవ్యాఖ్య 🌷గణపతి అవతారవిలాసాలు(ముద్రణలో)

బిరుదములు మార్చు

  • ప్రవచన రాజహంస
  • అవధాన ప్రాచార్య
  • అభినవ మల్లినాథ
  • అభినవ వాల్మీకి
  • పద్యకళాతపస్వి

మూలాలు మార్చు

  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 628–632.