బులుసు అపర్ణ
అవధాన విద్యాప్రదర్శన చేస్తున్న అతి కొద్దిమంది మహిళలలో బులుసు అపర్ణ ఒకరు.[1] ఈమె పుల్లాభట్ల నాగశాంతిస్వరూపతో కలిసి జంటగా కొన్ని అవధానాలు, ఆకెళ్ళ నాగవెంకట ఉదయచంద్రికతో కలిసి కొన్ని అవధానాలు, ఒంటరిగా కొన్ని అవధానాలు చేసింది.
జీవిత విశేషాలు సవరించు
ఈమె 1987, ఆగస్టు 5వ తేదీకి సరియైన ప్రభవ నామ సంవత్సర, శ్రావణ శుద్ధ ఏకాదశినాడు బులుసు అచ్యుతరామమోహన్, నాగపద్మ మీనాక్షి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలో జన్మించింది. ఈమె ప్రాథమిక విద్య వేలివెన్ను గ్రామంలో గడచింది. రాజమండ్రిలోని ఆంధ్ర యువతీసంస్కృత కళాశాలలో బి.ఎ.డిగ్రీని పూర్తి చేసి తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఎం.ఎ. (సంస్కృతం), శిక్షాశాస్త్రి చదివింది. తరువాత ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరదేవస్థానం ఓరియంటల్ హైస్కూలులో సంస్కృతపండితురాలిగా ఉద్యోగం చేస్తున్నది.
అవధానాలు సవరించు
ఈమెకు అవధాన గురువు ధూళిపాళ మహదేవమణి. ఈమె రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కావలి, కర్నూలు, బందరు, పిఠాపురం, హైదరాబాదు, బెంగుళూరు, ఖమ్మం, అశ్వాపురం మొదలైన చోట్ల 102కు పైగా అష్టావధానాలను చేసింది.[2] ఒక అర్థశతావధానం, మూడు శతావధానాలు కూడా చేసింది. వీటిలో 30కి పైగా స్వీయ అవధానాలు ఉన్నాయి.
మచ్చుకు ఈమె పూరించిన ఒక పద్యం:
- దత్తపది: సచిన్ - ద్రవిడ్ - గంగూలి - గంభీర్ అనే పేర్లతో భారతార్థంలో ఒక పద్యం.
పూరణ:
ఆస చిన్నది ఐదూళ్ళు అడుగ భీతి
ముద్ర విడనాడి కౌరవ మోహ మతులు
అనిని జొచ్చి వేగం గూలిరధము లౌచు
క్రౌర్య గంభీరు లవ్వారి కర్మమదియే
రచనలు సవరించు
- గురు ప్రస్తుతి శతకం (పుల్లాభట్ల నాగశాంతి స్వరూపతో కలిసి)
- ద్వారకాగిరి నాయక శతకం
పురస్కారాలు, బిరుదులు సవరించు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2014లో దూరదర్శన్ వారిచే మహిళా సాధికారత పురస్కారం
- శతావధాన శారద బిరుద ప్రదానం
- అవధాన రాజహంసిని బిరుదము
మూలాలు సవరించు
- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 905–906.
- ↑ యినుగంటి రఘు, శ్రీకాకుళం, వెలిచేటి జ్యోతిప్రసాద్, విజయనగరం (2 March 2016). "అతివనైనా అవధాని అయ్యాను". ఆంధ్రజ్యోతి. Archived from the original on 14 సెప్టెంబరు 2016. Retrieved 14 September 2016.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)