నగ్నముని, అసలు పేరు మానేపల్లి హృషీకేశవరావు. గుంటూరు జిల్లా తెనాలిలో 1940, మే 15 న జన్మించాడు. తండ్రి మానేపల్లి సంగమేశ్వర కవి, తల్లి లక్ష్మీకాంతమ్మ బందరు, హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు.1958 నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపొర్టర్ గా పనిచేసాడు. కొంతకాలం 'దిగంబర ' కవితాఉద్యమంలో ఉన్నాడు. విరసం వ్వవస్థాపక సభ్యుల్లో ఒకడు.

మానేపల్లి హృషీకేశవరావు
Manepalli HrishiKesava Rao
నగ్నముని
జననంమానేపల్లి హృషీకేశవరావు
మే 15, 1940
గుంటూరు జిల్లా తెనాలి
ఇతర పేర్లునగ్నముని
వృత్తిఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపొర్టర్
ప్రసిద్ధిప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు
తండ్రిమానేపల్లి సంగమేశ్వర కవి,
తల్లిలక్ష్మీకాంతమ్మ,

బాల్యం, విద్యాభ్యాసం సవరించు

నగ్నముని బాల్యమంతా ఆయన అమ్మ‌మ్మగారి ఊరు బందరులోని చిలకపూడిలో గడిచింది. ఎస్‌.ఎస్‌.ఎల్సీ వరకు అక్కడే చదివి తర్వాత.హైదరాబాద్‌లో కూడా కొన్నేళ్ళు చదివారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్భవించింది. రెండు తెలుగు ప్రాంతాల ప్రజల్లో పండగ వాతావరణం కనిపించింది. అపుడే హైదరాబాద్‌ను చూద్దామని వ‌చ్చారు. మరోవైపు ఢిల్లీలోని సోవియట్‌ భూమి పత్రికలో పనిచేయడానికి అవకాశం లభించింది. సోవియట్‌ భూమి కమ్యూనిస్టు పత్రిక. వారి తండ్రి సంగమేశ్వరకవి గాంధేయవాది. ఇంటికి దూరంగా ఉండటం ఇష్టంలేక ఆ పత్రికలో చేరలేదు. మరోవైపు రెండు రాష్ట్రాలు కలవడం, అప్పటికే వారి నాన్న కజిన్స్‌ నైజాం రాష్ట్రంలోని రైల్వే విభాగంలో ఉద్యోగులుగా పని చేసేవారు. వాళ్లు జనగామ, వరంగల్‌ ప్రాంతంలో రైల్వేశాఖ ఉద్యోగులుగా చేసేవారు. ఆంధ్రరాష్ట్రం నుంచి వస్తే హైదరాబాద్‌ కరెన్సీకి మార్పిడి చేసుకొనేవాళ్లం. ఆంధ్రప్రదేశ్‌ నవంబర్‌ 1,1956 ఏర్పాటైతే, నగ్నముని నవంబర్‌ 2న హైదరాబాద్‌కు వ‌చ్చారు. ఆయన చిన్నాన, పెద్దనాన్న వాళ్ల ఇంటికి వెళ్లాను. హైదరాబాద్‌లో నూతన రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు వీధుల్లో ఘనంగా కనిపించాయి. బందరులో ఉన్న ఓ పెద్దాయన అసెంబ్లీకి వెళ్లి చూడమన్నారు. అక్కడ తనకు తెలిసిన ఓ అధికారిని కలవమన్నారు. . అపుడు నగ్నమునికి పద్దెనిమిదేళ్లు. ఒకరకంగా నగరానికి ఉద్యోగం కోసం వచ్చినట్లయింది. అసెంబ్లీలో ఉన్న ఓ ఉన్నతాధికారిని కలవగా ఆయన మాట్లాడుతూ… ఇక్కడ ఉద్యోగం చేస్తావా? అనడిగారు. 1957లో తత్కాలికంగా ఉద్యోగంలో చేరారు. ఓ ఏడాది తర్వాత 1958లో సర్వీసు కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో పాసయ్యారు. శాసన సభలో నియామకం పొందారు. అసెంబ్లీలో వివిధ హోదాల్లో నలభై ఏళ్లుగా పని చేశారు. అసెంబ్లీ రిపోర్టర్‌ ఉద్యోగంలో చేరి, అసెంబ్లీ చీఫ్‌ రిపోర్టర్‌ నుంచి అసెంబ్లీ జాయింట్‌ సెక్రటరీ వరకు పనిచేశారు. ఉద్యోగంలో భాగంగా అసెంబ్లీ మధ్యలో కూర్చుని ఎమ్మెల్యేలు, మంత్రుల ఉపన్యాసాలు విని నివేదించడం ఆయన విధినిర్వహణలో భాగంగా ఉండేది. దీంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు పర్యటించారు. అక్కడి పరిపాలన వ్యవహారాలతోపాటు, ప్రజల ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం కూడా కలిగింది.

ఉద్యోగ జీవితం సవరించు

1958లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటి సెంబ్లీలో వెర్బాటిమ్ రిపోర్టర్‌గా నియమింపబడి తరువాత చీఫ్ రిపోర్టర్‌గా, అసిస్టెంట్ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా పదవులు నిర్వహించి 1998 మే నెలలో పదవీ విరమణ గావించారు. 1958 నుండి 1998 వరకు 40 సం.రాల కాలం అవిచ్చిన్నంగా అసెంబ్లీలో వివిధ ఉన్నత పదవులను నిర్వహించిన ఏకైక శాసనసభ ఉద్యోగి హృషీకేశవరావుగారు మాత్రమే.

రచయితగా అడుగులు సవరించు

వారి తొలి కవితాఖండిక సౌందర్యపు స్వగతం 1957 నవంబరు తెలుగు స్వతంత్ర మాసపత్రికలో ప్రకటింపబడింది. తరువాత వారు నానాడు రచించి ప్రకటించిన కవితా ఖండికలు - 1962లో “ఉదయించని ఉదయాలు" అను ఖండకావ్యంగా ప్రకటించారు.దీర్ఘకవితలు జమ్మిచెట్టు, అద్వైతరాజ్యం మొదలైనవి వివిధ పత్రికలలో ప్రకటింపబడ్డాయి. ప్రజాస్వామ్యకవిత అను శీర్షికను కవిత్వోద్యమం ప్రారంభించి కొన్ని కవితలు ప్రచురించారు.

దిగంబర కవులలో ఒకరు సవరించు

1965లో నగ్నముని మరొక ఐదుగురు కవులతో - చెఱబండరాజు, మహాస్వప్న, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, భైరవయ్య అను ఆరుగురు కవులు సాహితీ చరిత్రలో దిగంబరకవులుగా ఖ్యాతిగాంచారు. ఈ దిగంబరకవుల కవిత్వం ఐదు సంవత్సరాలు సాగింది... మూడు సంపుటాలు వెలువరించారు. 1970లో ఏర్పడిన విప్లవరచయితల సంఘంలో నగ్నమునిగారు వ్యవస్థాపక సభ్యులు. 1972లో నగ్నమునిగారు “తూర్పుగాలి" కవితా సంపుటి ప్రకటించారు.

పలు కళా రంగాలలో ప్రవేశం సవరించు

నగ్నముని నటులు, నాటకకర్త, ప్రయోక్తగా కూడా పనిచేసారు. 1959 సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు రేడియో ప్రసారం చేసిన పలు నాటికలలో, నాటకాలలో వివిధ పాత్రలు పోషించారు. 1960 దశకం ప్రారంభంలో వారు శాసనసభ కార్యాలయం తరపున ఆంధ్రప్రదేశ్ సచివాలయం అంతశాఖ నాటికల పోటీలో పాల్గొని 'చతురంగం" నాటికలో ఉత్తమనటుడుగా ఎన్నుకోబడ్డారు. వారు ఉన్నవ లక్ష్మీ నారాయణగారి 'మాలపల్లి" నవలను 1974లో నాటకీకరించారు. అది వందకు పైగా ప్రదర్శనలివ్వబడింది. ఆకాశవాణి వారి కోరిక మేరకు నగ్నమునిగారు మాలపల్లిని ప్రసారయోగ్యంగా 1975లో తిరిగి వ్రాశారు. అది ప్రసారమయ్యింది. "ఇక్కడ కలలు అమ్మబడును" అను నాటకం వారు వ్రాయగా దానిని థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించారు.

నగ్నమునిగారు కథారచయిత కొన్ని కథలు 1959 నుండి ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. ఆనాడు రచించిన కథలు 16 ఎంపికచేసి 1973లో "నగ్నముని కథలు" అన్న శీర్షికతో ప్రకటించారు. వారు ప్రయోగాత్మకంగా ప్రయోజనాత్మకంగా రచించిన కథలు ఎమర్జెన్సీ కాలంలో ప్రచురించడం మొదలు పెట్టారు.అది 1979లో “విలోమ కథలు" అన్న పేరుతో ప్రకటింపబడ్డాయి. అవి మరల 2002 జూన్లో రెండవసారి ముద్రింపబడ్డాయి.

నగ్నముని “మరోచరిత్ర”, “ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు", "త్రిశూలం”, “ఉదయం" మొదలైన సినిమాలకు కథా సహకారం అందజేశారు. వారు ఉదయం దినపత్రికలో "అక్షరాయుధం" శీర్షికను వారం వారం లఘువ్యాసాలు వ్రాశారు.

అదేవిధంగా వారు ఆంధ్రప్రభ దినపత్రికలో కూడా చేదుమాట" అన్న శీర్షికను లఘువ్యాసాలు వ్రాసారు. 1990లో వారు 'రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం" పేర ఒక వేదికను ఏర్పాటుచేసి అందులో వివిధ రంగాలకు చెందిన వారితో ఉపన్యాసాలిప్పించారు.

కొయ్యగుర్రం సవరించు

ఇది ఆధునిక మహాకావ్యంగా పేరుతెచ్చుకున్నది, దీర్ఘకవితకు ఒరవడి పెట్టినదీ నగ్నమునిగారి కొయ్యగుర్రం" కావ్యం. ఇది మొదట 1977 నవంబరులో ఆకాశవాణిలో ప్రసారం కావింపబడింది. 1978 జనవరిలో ఇది ప్రజా తంత్ర వారపత్రికలో ప్రకటింపబడింది. అటుపిమ్మట 1980లో ఇది గ్రంథరూపం దాల్చింది. ఇప్పటివరకు కొయ్యగుఱ్ఱం రష్యన్, ఇంగీషు, హిందీ, పంజాబి, కన్నడ, తమిళ భాషలలోనికి అనువదింపబడింది. కన్నడ అనువాదానికి పురస్కారం లభించింది.

రచనలు సవరించు

  • ఉదయించని ఉదయాలు (1962)
  • తూర్పుగాలి (1972)
  • కొయ్యగుర్రం (1977)
  • జమ్మిచెట్టు (1987)
  • నగ్నమునికథలు (1971)
  • విలోమకథలు (1979)
  • ఉన్నవలక్ష్మీనారాయణ 'మాలపల్లి ' నవలను 1974లో నాటకీకరించాడు.
  • మరోచరిత్ర, ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు, ఉదయం సినిమాలకు కథ స్క్రీన్‌ప్లే సమకూర్చాడు.

పురస్కారాలు సవరించు

  • ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు -1973 లో
  • మద్రాసు తెలుగు అకాడెమీ వారి పురస్కారం - 1989
  • కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.[1] - 1991
  • తెలుగు విశ్వవిద్యాలయం సత్కారం - 1991
  • 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.[2]

తెలుగు కవిత్వ సీమలోకి దిగంబర కవిత్వం ఒక ప్రభంజనంలా వచ్చి ఒక ఊపు ఊపింది ఆ రోజుల్లో. ఆ దిగంబర కవులకి ప్రయోక్త అనదగిన వ్వక్తి నగ్నముని .దిగంబర కవిత్యోద్యమంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించినకవి నగ్నముని. నిఖలేశ్వర్‌, నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య అనే ఆరుగురు కవులు దిగంబర కవితా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సామాజిక రుగ్మతలపై శంఖం పూరించిన దిగంబర కవిత్యోద్యమం ఉధృతంగా సాగి కవితారంగాన్ని చైతన్యపరచింది.

మూలాలు సవరించు

  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  2. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=నగ్నముని&oldid=3893967" నుండి వెలికితీశారు