నారుమంచి సుబ్బారావు

నారుమంచి సుబ్బారావు సంగీత ప్రియుడు, గానసభ స్థాపకుడు, కార్యనిర్వహణాదక్షుడు[1]. ఇతడు తెనాలి సుబ్బారావుగా సంగీతాభిమానులకు సుపరిచితుడు.

నారుమంచి సుబ్బారావు

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు గుంటూరు జిల్లా, చుండూరులో 1902లో జన్మించాడు. వీరి పూర్వీకులు తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామానికి చెందినవారు. ఇతని తాత జానకిరామయ్య చిన్నతనంలోనే కాలినడకన తిరువయ్యూరుకు వెళ్ళి త్యాగరాజును సంగీతబిక్ష పెట్టమని అర్థించాడు. అప్పటికే 70 యేళ్లు నిండిన త్యాగయ్య అతడికి తన శిష్యుడిగా విద్యారంభం చేసి తన ప్రియ శిష్యుడైన వీణ కుప్పయ్యర్ చేతిలో పెట్టాడు. కుప్పయ్యర్ వద్ద 14 సంవత్సరాలు జానకిరామయ్య శిష్యరికం చేశాడు. ఆ విధంగా జానకిరామయ్య త్యాగరాజుకు శిష్యుడు, ప్రశిష్యుడూ. ఇక సుబ్బారావు తండ్రి సీతారామయ్య తన తండ్రి జానకిరామయ్య వద్ద, ముత్యాలపేట త్యాగయ్యర్ వద్ద సంగీతవిద్యను అభ్యసించిన విద్వాంసుడు. ఆ విధంగా సుబ్బారావు సంగీతనేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం తెనాలిలోను ఉన్నత విద్య మద్రాసు క్రిస్టియన్ కాలేజి, మద్రాసు లా కాలేజీలలో జరిగింది. 1925లో ఇతడు తెనాలిలో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాడు.

శ్రీ సీతారామగానసభ

మార్చు

ఇతడు తన 45వ యేట తన తండ్రి సీతారామయ్య జ్ఞాపకచిహ్నంగా "శ్రీ సీతారామ గానసభ"ను తెనాలిలో 1947, ఆగష్టు 29వ తేదీన స్థాపించాడు. ఈ సభ ప్రారంభ కార్యక్రమంగా ఓగిరాల వీరరాఘవశర్మ కచేరీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అప్పటి నుండి వేలాది కార్యక్రమాలను నిర్వహించి తెనాలిలో కర్ణాటక సంగీతానికి పట్టుకొమ్మగా నిలిచింది. ఈ గానసభలో గానం చేసినవారిలో మహరాజపురం సంతానం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, అరియకుడి రామానుజ అయ్యంగార్, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, హరి నాగభూషణం, పిరాట్ల శంకరశాస్త్రి, పురాణం కనకయ్య శాస్త్రి, సుసర్ల గంగాధరశాస్త్రి, తాడిగడప శేషయ్య, పారుపల్లి రామక్రిష్ణయ్య, చిలకలపూడి వెంకటేశ్వరశర్మ, పర్వతనేని వీరయ్య చౌదరి, పాలఘాట్ మణి అయ్యర్, ఫ్లూట్ మహాలింగం మొదలైనవారెందరో ఉన్నారు. ఎందరో సంగీత విద్వాంసులు ఈ గానసభలో గానం చేయడం ఒక వరంగా భావిస్తారు. సుబ్బారావు ఈ గానసభ నిర్వాహకునిగా తన కార్యదక్షతను ప్రదర్శించాడు. ఈ సంస్థకు కచేరీ ద్వారా కొంత ఆదాయాన్ని, దాతలద్వారా కొంత విరాళాన్ని సేకరించి శాశ్వతనిధిని ఏర్పాటు చేశాడు. 1953 నుండి మూర్తి త్రయమైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులవే కాకుండా భద్రాచల రామదాసు, సదాశివ బ్రహ్మేంద్రస్వామి, పురందరదాసు, నారాయణతీర్థులు, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి మొదలైన వారి జన్మతిథినాడు ఆయా విద్వాంసుల జయంతులను నిర్వహించడం ప్రారంభించాడు. ఈ విద్వాంసుల జయంతులను తెనాలిలోని ఈ గానసభలోనే కాక విజయవాడ, గుంటూరు, మద్రాసు వంటి చోట్ల కూడా ఇతడు ఘనంగా నిర్వహించి సంగీతప్రియుల ప్రశంసలను పొందాడు.

రచనలు

మార్చు

ఇతడు కర్ణాటక సంగీతంపై ఉన్న అభిమానంతో విశేషంగా పరిశ్రమించి ఈ క్రింది గ్రంథాలను రచించాడు.

  • తమిళదేశమందలి తెలుగు జాతి సంగీత చరిత్ర
  • సదాశివ బ్రహ్మేంద్రసరస్వతి స్వామివారి జీవిత చరిత్రము
  • శ్రీ భద్రాచల రామదాసు జీవిత సంగ్రహము
  • మునిపల్లె సుబ్రహ్మణ్యకవి జీవిత చరిత్రము
  • సంగీత మహర్షులు (వాగ్గేయకారులు)
  • తెలుగు సంగీత విద్వాంసులు
  • కృతికదంబము

పురస్కారాలు

మార్చు
  • 1979 ఏప్రిల్ 5వ తేదీ మద్రాసులోని శ్రీరామనామ యజ్ఞమండలి వారు ఇతడికి "సంగీత విద్యారత్న" అనే బిరుదును ఇచ్చి సత్కరించింది.

మూలాలు

మార్చు
  1. కాకుమాను, తారానాథ్ (29 July 1979). "సంగీత విద్యారత్న తెనాలి సుబ్బారావుగారు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 118. Retrieved 28 December 2017.[permanent dead link]