ముదికొండన్ వెంకట్రామ అయ్యర్
ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ (తమిళం: முடிகொண்டான் வெங்கடராம ஐயர்)(15 అక్టోబరు 1897 – 13 సెప్టెంబరు 1975) ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు.[1]
ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ | |
---|---|
జననం | 15 అక్టోబర్ 1897 ముదికొండన్, తిరువారూర్ జిల్లా, తమిళనాడు |
మరణం | 1975 సెప్టెంబరు 13 చెన్నై, తమిళనాడు | (వయసు 77)
వృత్తి | కర్ణాటక శాస్తీయ సంగీత గాయకుడు |
పిల్లలు | కామాక్షి, మధురం |
తల్లిదండ్రులు | చక్రపాణి అయ్యర్, కామాక్షి |
నేపథ్యం
మార్చుఇతడు తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లా, నన్నిలమ్ తాలూకాకు చెందిన ముదికొండన్[2] అనే కుగ్రామంలో చక్రపాణి అయ్యర్, కామాక్షి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఋగ్వేద పండితుడు. ఇతని మాతామహుడు శివచియం స్వామినాథ అయ్యర్ పదాలు, జావళీలు పాడుతూ 'తళుక్కు 'స్వామినాథ అయ్యర్‌గా పేరుపొందాడు.[1] ఇతని మామ బొమ్మలాట్టం మణి అయ్యర్ కూడా సంగీత విద్వాంసుడు.[3]
విద్యాభ్యాసం
మార్చుపాఠశాల విద్యానంతరం వెంకట్రామ అయ్యర్ తండ్రి అతనికి ఇంగ్లీషు చదివించాలని మద్రాసు కళాశాలకు పంపాడు. అయితే తండ్రి మరణంతో వెంకట్రామ అయ్యర్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చి కోనేటిరాజపురం వైద్యనాథ అయ్యర్ వద్ద కర్ణాటక సంగీతంలో లాంఛనంగా శిక్షణ తీసుకున్నాడు. తరువాత ఇతడు అమ్మఛత్రం కందస్వామి పిళ్లై వద్ద తాళము, లయ పరిజ్ఞానాన్ని సంపాదించాడు. సిమిళి సుందరం అయ్యర్, స్వామినాథ అయ్యర్, సుందరం అయ్యర్ వద్ద మరిన్ని మెలకువళు నేర్చుకున్నాడు. ఇతడు తమిళభాషతో పాటు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషలు ధారాళంగా మాట్లాడేవాడు. ఇతనికి జ్యోతిష్యం, ఆయుర్వేదం, మూలికా వైద్యంతో ప్రవేశం ఉంది.[3]
సంగీత ప్రస్థానం
మార్చుఇతడు తన మొదటి కచేరీని 17వ యేట కడలూరులో చేశాడు. 1919లో మైలాపూర్ సంగీత సభలో మద్రాసులో తన మొదటి ప్రదర్శన ఇచ్చాడు. ఇతడు రాగం, తానం, పల్లవి పలికించడంలో నేర్పు కలిగినవాడు. ఇతనికి సంగీత జ్ఞానమంతా కంఠతా ఉండేది. ఎవరు ఏమి సందేహాలు అడిగినా వెంటనే ఎటువంటి గ్రంథాలను చూడకుండా సమాధానాలు చెప్పగలిగేవాడు. సంగీతానికి సంబంధించిన ఏ వివాదానికైనా సందిగ్ధం లేకుండా తీర్పు చెప్పేవాడు.[3] ఇతడు తన స్వగ్రామంలోనే నివసిస్తూ శిష్యులకు సంగీతం నేర్పించాడు. 1915 నుండి ఇతడు మద్రాసు సంగీత అకాడమీ వార్షిక సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ఇతనికి సంగీత లక్ష్య, లక్షణాలపై నైపుణ్యం ఉంది. నిరవల్, రాగం, తానం, పల్లవులను దోషరహితంగా ఎలా ఉచ్చరించాలో చెప్పగలిగేవాడు. మద్రాసు సంగీత అకాడమీ అధ్యక్షుడు వి.రాఘవన్ కోరికపై ఇతడు 1948లో తన మకాం మద్రాసుకు మార్చాడు. అప్పటి నుండి అకాడమీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఇతడు సంగీత ఉపాధ్యాయుల కళాశాలకు వైస్‌ప్రిన్సిపాల్‌గా నియమించబడ్డాడు. 1956లో ఆ కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యాడు.[1]ఇతడు సంగీతానికి సంబంధించి ఎన్నో వ్యాసాలు ప్రచురించాడు.[4] 1972లో ఇతడు ఉపాధ్యాయుల కాలేజీ నుండి పదవీ విరమణ చేశాడు. కానీ అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొనసాగాడు.[1] ఇతని శిష్యులలో పి.ఎస్.నారాయణస్వామి, ఆర్.వేదవల్లి, బి. కృష్ణమూర్తి మొదలైన వారున్నారు.
అవార్డులు
మార్చు- 1948-49లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి[5]
- 1961లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే సంగీత నాటక అకాడమీ అవార్డు[6]
- ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, మద్రాసు వారిచే సంగీత కళాశిఖామణి పురస్కారం.[7]
మరణం
మార్చుఇతడు తన 78వ యేట 1975 సెప్టెంబరు 13వ తేదీన చెన్నైలో మరణించాడు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Venkatakrishnan, Sriram (14 October 2010). "The Master from Mudikondan". The Hindu. Retrieved 13 July 2020.
- ↑ Mudikondan locality
- ↑ 3.0 3.1 3.2 Interview by R. Vedavalli to Podhigai TV
- ↑ Index of Articles in Souvenir[permanent dead link]
- ↑ Recipients of Sangita Kalanidhi Archived 2016-03-04 at the Wayback Machine
- ↑ SNA Awardees list Archived 2015-05-30 at the Wayback Machine
- ↑ "AWARDEES OF SANGEETHA KALASIKHAMANI". Archived from the original on 2018-09-26. Retrieved 2021-02-11.