పడమటి సంధ్యారాగం

పడమటి సంధ్యారాగం జంధ్యాల పూర్తిగా అమెరికా నేపథ్యంలో తీసిన సినిమా.[1] విజయశాంతి, గుమ్మలూరి శాస్త్రి, థామస్ జేన్, శివమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1987లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రాన్ని గుమ్మలూరి శాస్త్రి, మీర్ అబ్దుల్లా కలిసి ప్రవాసాంధ్ర చిత్ర పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రంలో నటులంతా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే. చిత్రీకరణ సుమారు తొంభై శాతం అమెరికాలోనే జరిగింది. అమెరికన్ కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించాడు.

పడమటి సంధ్యారాగం
Padamati Sandhya Ragam.jpg
దర్శకత్వంజంధ్యాల
కథా రచయితజంధ్యాల
నిర్మాతగుమ్మలూరి శాస్త్రి, జి. సుబ్బారావు (సమర్పణ)
తారాగణంవిజయశాంతి ,
టామ్,
గుమ్మలూరి శాస్త్రి,
శివమణి
ఛాయాగ్రహణంపి. దివాకర్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1987 ఏప్రిల్ 11 (1987-04-11)
సినిమా నిడివి
142 ని
భాషతెలుగు

సంక్షిప్త కథసవరించు

తండ్రి ఆదినారాయణ అంత్యక్రియలు నిర్వర్తించడానికి సంధ్య అమెరికన్ అయిన తన భర్త క్రిస్ తో కలిసి భారతదేశానికి రావడంతో సినిమా ప్రారంభమౌతుంది. వాళ్ళను విమానాశ్రయం నుంచి తీసుకువెళ్ళడానికి వారి కూతురు అనిత వస్తుంది. కానీ వాళ్ళంటే అసహ్యించుకుంటూ ఉంటుంది. ఆమె తాత (విజయశాంతి తండ్రి) పెంపకంలో పెరగడం వలన, విదేశీయుడిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నందుకు వాళ్ళ మీద కోపంగా ఉంటుంది. కూతురు అనితతో సహా అందరూ వారిస్తున్నా కొడుకుల్లేని ఆదినారాయణకు అల్లుడు క్రిస్ తలకొరివి పెడతాడు. తండ్రిని కోపంగా మాట్లాడిన అనితకు తాము అమెరికాకు ఎలా వెళ్ళిందీ, ఎలా పరిచయమయ్యి ప్రేమలో పడిందీ, పెళ్ళి చేసుకున్నదీ సంధ్య తన కూతురితో చెప్పడమే సినిమాలో ప్రధాన భాగం.

మొదట్లో సంధ్య కుటుంబం అమెరికాలో ఉన్న వాళ్ళ బాబాయి రాము ప్రోద్భలంతో అక్కడికి వెళుతుంది. కానీ విజయశాంతి తండ్రి మాత్రం పాతకాలం అలవాట్లున్న, సంప్రదాయాలను కచ్చితంగా పాటించే మనిషి. అమెరికాకు వచ్చినా తన పద్ధతులు మార్చుకోకుండా అందరినీ విసిగిస్తుంటాడు. సంధ్య ఎదురింట్లో ఉండే క్రిస్, రొనాల్డ్ అనే ఇరువురు యువకులు ఆమెను ఆరాధిస్తూ మరో తెలుగు కుటుంబానికి చెందిన గణపతి సాయంతో కొద్ది కొద్దిగా తెలుగు నేర్చుకుని విడివిడిగా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఆదినారాయణకు మాత్రం తన కూతురు వాళ్ళతో స్నేహంగా మెలగడం సుతరామూ ఇష్టం ఉండదు. సంధ్య మాత్రం క్రిస్ ప్రేమను అంగీకరిస్తుంది.

ఆదినారాయణ సంధ్యకు రవి అనే డాక్టర్ సంబంధాన్ని తీసుకువస్తాడు. రవి అభ్యుదయ భావాలు కలిగిన వాడు. ఆమె మనసు తెలుసుకుని క్రిస్ నే పెళ్ళి చేసుకోమని చెబుతాడు. తర్వాత సంధ్య, క్రిస్ ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటారు. క్రిస్ తాము లేచిపోయి పెళ్ళి చేసుకుందామని చెప్పగా సంధ్య అయిష్టంగానే అందుకు అంగీకరిస్తుంది. ఆదినారాయణ వారి విషయం తెలుసుకుని రొనాల్డ్ సాయంతో వారిద్దరినీ వెంబడించాలని చూస్తాడు. కానీ వారిద్దరూ మోటార్ సైకిల్ మీద పారిపోతారు. తర్వాత ఒక కారవాన్ ని దొంగిలించి కొంతదూరం వెళ్ళాక అది ఆగిపోతుంది. వారి చేతిలో డబ్బులేమీ ఉండవు. ఆ వాహనంలో ఉన్న పాలు లాంటి ఆహారంతో పూట గడుపుతారు. పోలీసుల నుంచి తప్పించుకున్న వారికి కొంతమంది భారతీయులు తమ ఇంటిలో ఉండనిస్తారు. ఆదినారాయణ ఎట్టకేలకు వారి వివాహానికి అంగీకరిస్తాడు. కానీ వారిద్దరూ తమ పెళ్ళి ఏ సాంప్రదాయం ప్రకారం జరగాలని వాదులాడుకుంటారు. రొనాల్డ్ వెళ్ళి సంధ్య బాబాయి రాముకు చెప్పగా ఆయన గుడిలో ఒకటి చర్చిలో ఒకటి కార్యక్రమం జరిపించమని చెప్పి సమస్యను పరిష్కరిస్తాడు. అలా ఇద్దరికీ పెళ్ళి జరుగుతుంది.

సంధ్య తన కూతురు అనితతో మనుషులందరూ ఒక్కటేనని నచ్చజెపుతుంది. క్రిస్ కు భారతీయ సాంప్రదాయల పట్ల ఉన్న అభిమానం గురించి చెబుతుంది. తర్వాత సంధ్యను తమతో పాటు అమెరికా రమ్మంటారు. ముందుగా తటపటాయించినా చివరికి తన తల్లిదండ్రులతో వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణంసవరించు

 • ఆదినారాయణగా గుమ్మలూరి శాస్త్రి
 • సంధ్యగా విజయశాంతి
 • క్రిస్ గా థామస్ జేన్ అలియాస్ టామ్
 • రొనాల్డ్ గా శివమణి
 • రామారావుగా మీర్ అబ్దుల్లా
 • శేషగిరిరావు
 • గణపతిగా విజయ్
 • సుధగా ఆశాజ్యోతి
 • అనితగా సుధేష్ణ రెడ్డి
 • జాన్ జిక
 • గాత్‌మన్
 • ఎలిజబెత్
 • బిందు
 • జ్యోతి
 • మాస్టర్ బెంజ్‌మన్
 • బేబి రోహిణి
 • రవి చిట్టూరి
 • అజయ్ కొఠారి
 • భూషణరావ్
 • రామశాస్త్రి
 • సీతశాస్త్రి
 • మృణాళిని
 • సుత్తివేలు (అతిథి పాత్ర)

నిర్మాణంసవరించు

గుమ్మలూరి శాస్త్రి అమెరికాలో ఇంజనీరుగా పనిచేసే వాడు. నాటకాలు వేయడం ఆయన ప్రవృత్తి. అప్పుడే అక్కడికి విద్యార్థిగా వెళ్ళిన మీర్ అబ్దుల్లా శాస్త్రితో కలిసి నాటకాల్లో పాల్గొనేవాడు. 1984 లో అమెరికా తెలుగు సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శాస్త్రి అప్పుడే ఘన విజయం సాధించిన శంకరాభరణం చిత్ర బృందాన్ని అమెరికాకు రమ్మని ఆహ్వానించాడు. అందులో భాగంగా శాస్త్రి, మీర్ అబ్దుల్లా ఆ చిత్ర రచయిత జంధ్యాల, గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంను కలిశారు. వీరి మాటల్లో ఈ చిత్ర కథకు, బీజం పడింది. ఈ కథకు పలు పేర్లు పరిశీలించిన మీదట బాలు ప్రతిపాదించిన పడమటి సంధ్యారాగం ఎంపికైంది. అందుకు కృతజ్ఞతగా జంధ్యాల బాలుకు 116 డాలర్లు బహుమానంగా అందించాడు.[2]

ఈ చిత్ర రచన సింహభాగం జంధ్యాలదే. కథారచనలో ఆదివిష్ణు ఆయనకు సహకారం అందించాడు.

నటీనటుల ఎంపికసవరించు

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో విజయశాంతి, అమెరికన్ నటుడు థామస్ జేన్[3][4] నటించగా మరో కీలకమైన పాత్ర పోషించిన ఈ సినిమా నిర్మాత గుమ్మలూరి శాస్త్రితో సహా మిగతా నటులంతా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే. ఒక అమెరికన్ కథానాయకుడితో తెరకెక్కిన తొలి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే. థామస్ జేన్ కి, డ్రమ్మర్ శివమణికి నటులుగా ఇదే తొలిచిత్రం.[5] కథానాయిక తండ్రిగా నటించిన గుమ్మలూరి శాస్త్రికి సుత్తి వీరభద్రరావు గాత్రం అందించాడు. ఈ సినిమాలో తిండిపోతు గణపతి పాత్రలో హాస్యం పండించిన నటుడు నిర్మలమ్మ మనవడు విజయ్ మదాల.[6]

చిత్రీకరణసవరించు

చిత్రమంతా దాదాపుగా తొంభై శాతం అమెరికాలో జరిగింది. సినిమా చిత్రీకరణకు సహకరించిన అమెరికా జంట కొడుకుపై ఓ పాటను చిత్రీకరించాలనుకున్నారు జంధ్యాల. ఆ తెల్లవాళ్ళ పిల్లాడికి బాలకృష్ణుడి వేషం వేసి ఓ పాటను చిత్రీకరిద్దామనుకున్నారు. అయితే చిత్రీకరణ ప్రారంభమయ్యాకా ఆ పిల్లాడు ఏమాత్రం సహకరించలేదు. కొంటెతనం, చిన్నతనంతో చేతికి ఫ్లూటు ఇస్తే సరిగ్గా చిత్రీకరించే సమయానికి విరిచి పారేయడం, నవ్వుతూ మొహం పెట్టమంటే కెమెరా వైపుకు తిరిగి వెక్కిరించడం, కెమెరా చిత్రీకరించే ఫీల్డ్‌లోంచి పారిపోవడం, నడవమంటే దొర్లడం లాంటివి చేశాడు. చివరకు వందల అడుగుల రీల్ ఎక్స్‌పోజ్ అయింది. చివరకు చేద్దామనుకున్న పాట చేయలేకపోయినా జంధ్యాల వదల్లేదు. ఇలా చిత్రీకరణ అయినదంతా తెలివిగా, సృజనాత్మకంగా ఎడిట్ చేసి, దానికి బాలకృష్ణుని వర్ణించే అన్నమాచార్య కీర్తన ముద్దుగారే యశోద జతచేశారు. సినిమాలో సరిగ్గా హీరోయిన్ తెల్లజాతికి చెందిన టామ్, నల్లజాతికి చెందిన శివమణిల్లో తన మనసుకు టామ్ నచ్చాడని భావించే సందర్భంలో ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఈ పాట ద్వారా సూచించేలా చేర్చారు. ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశాన్ని చూసినవారు కావాలని తెల్లపిల్లాడితో బాలకృష్ణుని అల్లరి సన్నివేశాలు చిత్రించారనుకుంటారు తప్ప ఇదంతా ఊహించలేరు.[7]

విడుదల, ఫలితంసవరించు

అమెరికన్ దినపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ 1989 లో ప్రచురించిన కథనంలో ఈ సినిమాపై భారతదేశంలో మంచి సమీక్షలు వచ్చాయని పేర్కొంది.[8] 1980వ దశకంలో ఆదేశంలో భారతీయ అమెరికన్ల జీవన విధానంపై వచ్చిన అనేక సినిమాల్లో ఇది ఒక మంచి చిత్రంగా స్థానం సంపాదించింది.[9][10]

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించగా, శ్రీనివాస మూర్తి సహకారం అందించాడు. బాలు, ఎస్. జానకి, ఎస్. పి. శైలజ పాటలు పాడారు. సదాశివ బ్రహ్మేంద్రయోగి రాసిన పిబరే రామరసం, అన్నమయ్య రాసిన ముద్దుగారే యశోద పాటలు యదాతథంగా వాడుకొనగా, వేటూరి ఒక పాట రాశాడు. ఆంగ్లంలో సాగే ఒక పాటను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రాశాడు.[11]

 • ఈ తూరుపు ఆ పశ్చిమం (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)
 • పిబరే రామరసం (రచన: సదాశివ బ్రహ్మేంద్రయోగి)
 • ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు (రచన: అన్నమయ్య)
 • లైఫ్ ఈజ్ షాబీ (రచన: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)

అవార్డులుసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

 1. "'America Abbayi, Andhra Ammayi': How NRI men find love in Telugu cinema". The News Minute (in ఇంగ్లీష్). 2020-09-29. Retrieved 2022-01-05.
 2. Sri (16 August 2005). "PSR – Retrospect". Maro Sandhya Ragam. telugucinema.com. Archived from the original on 15 December 2007.
 3. Suresh, Lavanya (2021-07-15). "పడమటి సంధ్యారాగం హీరో ఇప్పుడు హాలివుడ్ లో పెద్ద స్టార్ అని మీకు తెలుసా". Telugudesk. Retrieved 2022-01-05.
 4. Admin (2019-08-07). "పడమటి సంధ్యారాగం సినిమాలో విజయశాంతితో జోడి కట్టిన హీరో ఇప్పుడు ఎక్కడ,ఏమి చేస్తున్నాడో తెలుసా?". Chai Pakodi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-05.
 5. Editor, Prabhu- (2020-04-11). "Vijayashanti's Padamati Sandhya Ragam Completes 33 Years". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-05. {{cite web}}: |last= has generic name (help)
 6. K, Mamatha (2 Jan 2021). "నిర్మలమ్మ మనవడు కూడా మనకు బాగా తెలిసిన నటుడే..?". TeluguStop.com. Retrieved 2022-01-05.
 7. పప్పు, శ్రీనివాస్. "పడమటి సంధ్యారాగం సినిమా - ముద్దుగారే యశోద". జంధ్యా వందనం. Archived from the original on 15 March 2015. Retrieved 21 April 2015.
 8. Khan, Aziza (21 September 1989). "Novice filmmakers send scenes of D.C. to India". The Washington Post. ISSN 0190-8286. Archived from the original on 2 March 2019. Retrieved 2 December 2020.
 9. Rani, D. Sudha (2018). "Image of America in Telugu Cinema: A Study of the Cultural Implications" (PDF). Rupkatha Journal on Interdisciplinary Studies in Humanities. 10 (1). doi:10.21659/rupkatha.v10n1.12. ISSN 0975-2935. Archived (PDF) from the original on 5 September 2020. Retrieved 7 December 2020.
 10. Nathan, Archana (8 June 2017). "If the H-1B battle goes bad, Telugu movies like Baahubali may never make it in the US". Quartz India. Archived from the original on 26 October 2020. Retrieved 7 December 2020.
 11. "'ప‌డ‌మ‌టి సంధ్యారాగం' కోసం బాలు రాసిన ఇంగ్లీష్ పాట‌". andhrajyothy. Retrieved 2022-01-05.
 12. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. 13 March 2010. p. 28. Retrieved 9 January 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 13. "35th Annual Filmfare Awards | Regional Films". Filmfare. 1988. Archived from the original on 5 February 2017. Retrieved 2 March 2019.