విజయశాంతి
విజయశాంతి ( జననం: 1966జూన్ 24 ) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు.[5] ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "విశ్వ నట భారతి" "ద లేడీ సూపర్ స్టార్", "లేడీ అమితాబ్"గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది.[6][7][8][9] ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.[10] ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది.[10] 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవితో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి.[11] ఆమె అగ్నిపర్వతం (సినిమా), ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు (సినిమా), గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది.[6][7] 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.[12][13]
విజయశాంతి | |||
| |||
లోక్‌సభ సభ్యురాలు
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | ఎ. నరేంద్ర | ||
---|---|---|---|
తరువాత | కొత్త ప్రభాకర్ రెడ్డి | ||
నియోజకవర్గం | మెదక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1][2] మద్రాస్, తమిళనాడు, భారతదేశం[3] | 1966 జూన్ 24||
రాజకీయ పార్టీ |
| ||
ఇతర రాజకీయ పార్టీలు | *తల్లి తెలంగాణ పార్టీ (2005-2009 )
| ||
జీవిత భాగస్వామి | మోటూరి వెంకట శ్రీనివాస్ ప్రసాద్ (1988) | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ , భారతదేశం[4] | ||
వృత్తి | నటి, రాజకీయ నాయకురాలు, నిర్మాత |
జీవిత విశేషాలు
మార్చుఈమె జూన్ 24, 1966న వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగింది. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ; చిత్ర దర్శకురాలు విజయనిర్మల.
విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించింది. వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకోదగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన నేటి భారతం. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరిందని సినీ పరిశ్రమలో వినికిడి.
విజయశాంతి సినీ ప్రస్థానం
మార్చు1979 నుండి 1983
మార్చుజయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం,పండంటి జీవితం, వంశగౌరవం, కృష్ణావతారం,శ్రీరంగనీతులు, రాకాసి లోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కథానాయిక వేషాలే వరించాయామెని. ఈ కాలంలో రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.
1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. అలా, తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయికలను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది. అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతిని కూడా గెలుచుకుంది.
1984 నుండి 1985
మార్చుఆ తరువాత రెండేళ్లపాటు రెండుపడవల ప్రయాణంలా సాగిందామె సినీ పయనం. ఒక వైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుండి పది వరకూ అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయిందని సినీ పరిశ్రమలో పేరుంది. ఆమె తరువాతి స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి వారుండేవారు.
1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ, అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడి పాడే కథానాయికగా నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. పైన పేర్కొన్న పది చిత్రాల్లో ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమయిన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తీభవించిన కథానాయిక పాత్రలకు సావిత్రి, జయసుధ, హుందాతనం ఉట్టిపడే పాత్రలకు షావుకారు జానకి, పురుషులను ధిక్కరించే అహంకారపూరిత మహిళామణుల పాత్రలకు భానుమతి, వాణిశ్రీ, మొండితనం నిండిన పాత్రలకు జమున, అందచందాలతో అలరించే పాత్రలకు కృష్ణ కుమారి, బి. సరోజా దేవి, శ్రీదేవి .. ఇలా ఒక్కో రకం కథానాయిక పాత్రకు ఒక్కో నటీమణి పేరొందింది ఆ ఏడాది ఆమె మొత్తం పదమూడు తెలుగు చిత్రాల్లో నటించగా వాటిలో పదకొండు విజయవంతమయ్యాయి. అంతటితో ఆమె తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే దృష్టి కేంద్రీకరించింది.
1986 నుండి 1990
మార్చు1985వ సంవత్సరం సాంఘిక సందేశం ఇమిడివున్న చిత్రాలలో నాయికగా విజయశాంతిని ఒకే ఒక్క ఛాయిస్ గా నిలబెడితే, 1986వ సంవత్సరం కమర్షియల్ చిత్రాల కథానాయికగా కూడా ఆమెను దర్శకుల మొదటి ఛాయిస్ గా నిలిపింది. ఆ సంవత్సరం ఇటు రేపటి పౌరులు, అరుణ కిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణ సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ, అటు ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, సక్కనోడు', బ్రహ్మాస్త్రం వంటి మసాలా చిత్రాల నాయికగానూ నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అప్పటినుండి వరుసగా ఐదేళ్లపాటు ఒకదాని వెనుక ఒకటిగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ ఆమె విజయపధంలో దూసుకుపోయింది. వాటిలో కథానాయికగా ఆమె గొప్ప పాత్రలు పోషించినవి పడమటి సంధ్యారాగం, స్వయంకృషి, భారత నారి, జానకి రాముడు, కొడుకు దిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి, నాగాస్త్రం, ఈశ్వర్ (హిందీ). పడమటి సంధ్యారాగం, జానకి రాముడు చిత్రాలలో అచ్చ తెలుగు ఆహార్యమైన లంగా ఓణీలతో ఆమె పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఇప్పటికీ ముద్ద బంతి పూవు లాంటి తెలుగు పడుచు పిల్ల సౌందర్యానికి వండితెర పర్యాయ పదాలుగా నిలచిపోయాయి. పైన చెప్పినవే కాక ఆ ఐదేళ్లలో ఇంద్రుడు - చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు, గూండా రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లో మరీ గొప్పవి కాకపోయినా గుర్తుంచుకోదగ్గ కథానాయిక పాత్రలు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, ఇన్స్ పెక్టర్ ప్రతాప్, మంచి దొంగ, యుద్ధభూమి లాంటి చిత్రాల్లో అంగాంగ ప్రదర్శనలకే పరిమితమైన కథానాయిక పాత్రలు పోషించి అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది.
1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పి.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉత్తమనటి అవార్డులను సంపాదించిపెట్టింది. ఈ చిత్రంలో సంఘంలోని చీడపురుగులను ఏరి పార వేసే ఐ.పి.ఎస్. అధికారిణి వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం, రిస్క్ కు వెరవకుండా వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదనామాల్ని సంపాదించిపెట్టాయి. ఒక్క సారిగా తెలుగు తెరనేలుతున్న నలుగురు కథానాయకుల స్థాయికి ఆమె ఇమేజ్ కూడా చేరుకుంది. మొదటి సారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయికను సూపర్ స్టార్ బిరుదంతో సంబోధించసాగాయి. కర్తవ్యం చిత్రం తమిళంలోకి వైజయంతి ఐ.పి.ఎస్.గా అనువాదమై అక్కడకూడా ఘనవిజయం సాధించి తమిళ చిత్ర రంగంలో కూడా ఆమెకి సూపర్ స్టార్ స్థాయిని కట్టబెట్టింది. విశేషమేమంటే, అప్పటికి ఐదారేళ్లుగా ఆమె ఒక్క తమిళ చిత్రంలోనూ నటించకపోయినా, కర్తవ్యంతో మొదలయిన ఆమె డబ్బింగ్ చిత్రాల హవా మరో ఐదారేళ్ల పాటు కేవలం అనువాద చిత్రాల ద్వారానే విజయశాంతి తమిళ రంగంలో కూడా నంబర్ వన్ నాయికగా ఉంది.
ఈ ఐదేళ్ల కాలంలో భారత నారి, కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో రెండు నంది అవార్డులనూ గెలుచుకోవటమే కాకుండా, కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం ఏటా దేశంలో అన్ని భాషా చిత్రాల్లోనూ అత్యుత్తమ నటన ప్రదర్శించిన నటీమణికి బహూకరించే ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకుని తనకు తిరుగే లేదని చాటింది. సాధారణంగా ఉత్తమ అవార్డులు గెలుచుకునే చిత్రాలు ప్రేక్షకులకు ఎవరికీ అర్ధం కాని ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే అయి ఉంటాయనే అపప్రధను చెరిపేస్తూ తెలుగు, తమిళ బాక్సాఫీసులను కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఈ ఘనత సాధించం విశేషం. అదే ఏడాది అగ్నిపధ్ వంటి విజయవంతమైన ఫక్తు వ్యాపారాత్మక హిందీ చిత్రంలో నటనకుగాను అమితాబ్ బచ్చన్ తన మొదటి భరత్ అవార్డును సాధించడం, ఆ ఏడాదినుండే విజయశాంతిని సినీ పత్రికలు లేడీ అమితాబ్ పేరుతో సంబోధించారు.
ఈ ఐదేళ్లలో మరో విశేషం ఏమిటంటే, భారత నారి చిత్రంతో విజయశాంతి తన నూరవ చిత్రాన్ని పూర్తి చేసుకుంది.
1991 నుండి 1995
మార్చుకర్తవ్యం తెచ్చి పెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల 1991 నుండి విజయశాంతి నటించే చిత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆమెను ఆట పాటలకు మాత్రమే పరిమితమైన కథానాయిక పాత్రలో చూడటానికి ప్రేక్షకులు అయిష్టత చూపించసాగారు. ఆమె ఉందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందన్న నమ్మకంతో సినిమాకు వచ్చే ప్రేక్షక గణం పెరిగిపోయింది. ఆ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఆ ఒరవడిలో వచ్చినవే మొండి మొగుడు - పెంకి పెళ్లాం, ఆశయం, మగరాయుడు, పోలీస్ లాకప్, లేడీ బాస్, స్ట్ర్రీట్ ఫైటర్, అత్తా కోడళ్లు తదితర చిత్రాలు. శతదినోత్సవాల సంగతి అవతల పెడితే ఇవన్నీ ఎంతో కొంత లాభాలార్జించినవే. ఇవే కాక 1991 - 1995 మధ్య కాలంలో ఆమె ఇతర స్టార్ హీరోల సరసన ప్రాధాన్యత గల పాత్రల్లో నటించగా విజయం సాధించిన చిత్రాలు సూర్య ఐ.పి.ఎస్., లారీ డ్రైవర్, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్ పెక్టర్, మెకానిక్ అల్లుడు, చినరాయుడు. మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలందుకున్నా బాక్సాఫీసు వద్ద చతికిలబడిన జైత్ర యాత్ర కూడా ఈ కాలంలో వచ్చిందే.
ఈ కాలంలోనే కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా పునర్నిర్మాణం చేసి తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను తేజస్వినిగా తిరిగి తనే పోషించింది. ఎన్. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1994లో విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని చేజిక్కుంచుకుంది.
1992 లో ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్కు పోటీగా అహంకారపూరితమైన కథానాయిక పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలచే ప్రశంసలు అందుకుంది. (ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి నాయకుడిగా ఘరానా మొగుడుగా తెరకెక్కింది). ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ ను చెంపదెబ్బ కొట్టవలసి వస్తుంది. తమిళనాట రజనికాంత్ కున్న వీరాభిమానుల సంగతి అందరికీ ఎరుకే. సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్లు. 'మరే ఇతర నటి ఆ పనిచేసినా నా అభిమానులు తెరలు చించేసి ఉండేవారు. విజయశాంతి కాబట్టి వాళ్లు ఊరుకున్నారు' అని ఆ సినిమా శతదినోత్సవ సభలో రజనీకాంత్ పేర్కొన్నారు.
1993 లో విజయశాంతి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఏడాది నవంబరులో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్ర రంగంలోని అనేక మంది ఇతర స్టార్ నటులతో పాటు అదృష్టవశాత్తూ తప్పించికుని బయటపడింది.
1996 నుండి 2000
మార్చుఈ ఐదేళ్ల కాలంలో విజయశాంతి ప్రభ క్రమంగా క్షీణించనారంభించింది. 1993 లో వచ్చిన పోలీస్ లాకప్ తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. సరైన కథ లేకుండా నటించటానికి ఆమె ఇష్టపడక పోవటం దీనికి కారణం. 1980లో తెలుగు చిత్ర సీమలో ప్రవేశించాక ఆమె నటించిన తెలుగు సినిమా ఒక్కటి విడుదల కాని మొదటి ఏడాది అది. ఆ ఏడాది ఆమె యంగ్ టర్క్స్ అనే మలయాళ చిత్రంలో మాత్రమే నటించింది. ఆ చిత్రం ఢిల్లీ డైరీగా తెలుగులోకి అనువదించబడింది కానీ పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు.
ఏడాది పాటు ఆమె తెలుగు సినిమాలు విడుదల కాలేదన్న అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7 న విడుదలయింది ఒసేయ్ రాములమ్మా. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజునుండి అన్ని అంచనాలనూ మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిందీ చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమయిన హిట్లర్, అన్నమయ్య, తొలిప్రేమ, ప్రేమించుకుందాం.. రా వంటి ఇతర చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు సాధించి ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ బాక్సాఫీసుల వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. నాలుగో సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును ఆమెకి సంపాదించిపెట్టటమే కాకుండా, అడిమై పెణ్ పేరుతో తమిళంలోనికి అనువాదమై అక్కడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఈ సినిమా. ఆర్. నారాయణ మూర్తి స్ఫూర్తితో నిర్మాతలెందరో పోటీలు పడి ఎర్ర సినిమాలు నిర్మిస్తున్న తరుణంలో అదే ఒరవడిలో వచ్చిన ఒసేయ్ రాములమ్మా అంతకు ముందు, ఆ తరువాత వచ్చిన ఎర్ర సినిమాలన్నింటికీ తలమానికంగా నిలిచింది. (ఈ చిత్రంలోని పాటల కోసం 'వందేమాతరం' శ్రీనివాస్ కట్టిన ప్రజాబాణీలు 'నభూతో' అనిపించుకున్నాయి) ఆ చిత్రంలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందంటే, అప్పటి నుండి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మ గా పిలుచుకోనారంభించారు. ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే, 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్. కె. అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించింది.
1997 లోనే ఆమె గూండా గర్దీ అనే హిందీ చిత్రంలో నటించగా అది కూడా విజయవంతమయింది. ఈ సినిమా శోభన ప్రధాన పాత్రలో నటించిన అస్త్రం (1991) అనే తెలుగు సినిమాకు హిందీ రీమేక్. అదే ఏడాది నవంబరు 7న దాసరి నారాయణ రావు దర్శకత్వంలోనే, ఒసేయ్ రాములమ్మాకి పనిచేసిన తారా గణం, సాంకేతిక బృందం తోనే నిర్మించబడిన రౌడీ దర్బార్ విడుదలైంది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది కానీ బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ లాభాలు అర్జించింది.
ఒసేయ్ రాములమ్మా తరువాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించటం మానేశాయి. 1998లో వచ్చిన శ్రీవారంటే మావారే ఆమెని అప్పటికి సుమారు దశాబ్ద కాలంగా ప్రేక్షకులు అలవాటు పడ్డ రఫ్ అండ్ టఫ్ పాత్రలో కాకుండా అమాయకత్వం కొంత, జాణతనం మరికొంత కలగలిసిన తెలంగాణ పడుచు నాగమణి పాత్రలో విభిన్నంగా చూపించి కొంత వరకూ విజయం సాధించింది. ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండటం వలనా, విడుదలానంతరం సరైన ప్రచారం కొరవడటం వలనా ఈ చిత్రం బాగున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ పెద్ద విజయం సాధించలేదు. ఉన్నంతలో 1999లో వచ్చిన భారత రత్న ఫరవాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడారు. ఛోటి ఛోటి దొంగతనం మాని వేయరా అంటూ ఉదిత్ నారాయణ్తో కలిసి ఆమె ఆలపించిన ఆ పాట అభిమానులను అలరించింది.
2000 నుండి 2006
మార్చుకథానాయికగా విజయశాంతి సినీ ప్రస్థానంలో చివరి సంవత్సరాలుగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు. 2000వ సంవత్సరం నుండి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా కనీసం ఒక చిత్రమయినా విడుదలయినప్పటికీ వాటిలో ఏవీ విజయం సాధించలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం ఆమె చిత్రాల ఎంపికలో శ్రద్ధ వహించకపోవటమే. శివాని, శాంభవి ఐ.పి.యస్., వైజయంతి, నాయుడమ్మ, ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా, కథ, కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావటంతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయరంగంలో కూడా కాలు పెట్టి ఉండటంతో సినిమారంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. సినిమాలలో ఉండగలిగే ప్రతిభ, మరింత కాలం కొనసాగటానికి సరిపడినంత వయసు ఉన్నప్పటికీ రాజకీయరంగంపై ఆసక్తితో ఆమె సినిమాలపైనుండి దృష్టి మళ్లించినట్లు అనిపిస్తుంది. కారణాలేవయినప్పటికీ తెలుగు వెండితెరకు ఒక అద్భుత నటి దూరమయింది. రాజకీయరంగంలో ఆమె అనుకున్నంతగా రాణించలేకపోయింది.
విజయశాంతి నటించిన చిత్రాలు
మార్చువిజయశాంతికి సంబంధించిన ఇతర విషయాలు
మార్చు- ఆమె 1987లో శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అతను స్వయానా నందమూరి బాలకృష్ణ అక్క అయినా దగ్గుబాటి పురందరేశ్వరి మేనల్లుడు.
- చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్ తో 7 చిత్రాలలో నటించింది.
- టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు ఆణిముత్యాల్లోనూ ఆమె కథానాయిక. అవి వందేమాతరం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపటి పౌరులు, దేవాలయం.
- విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాలలో నటించింది. ఇంకా, కె. రాఘవేంద్ర రావు దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, దాసరి నారాయణ రావు దర్శకత్వాన 6 చిత్రాల్లోనూ, కె. విశ్వనాధ్ దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ, బాపు దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ నటించింది.
- సూర్యా మూవీస్ పతాకం పై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు నిర్మించింది. ఇవికాక శాసనం, పెద్దరికం చిత్రాలకు సహ నిర్మాత.
- సూరజ్ మూవీస్ పతాకం పై అడవి చుక్క చిత్రాన్ని నిర్మించింది.
- వర్తమాన నిర్మాత ఎ. ఎం. రత్నం చాలా కాలం పాటు విజయశాంతికి రూపశిల్పిగా పనిచేశాడు. ఆమె స్థాపించిన సూర్యా మూవీస్ నిర్మాణ సంస్థకు తొలినాళ్లలో భాగస్వామిగా ఉండి తరువాత స్వంతం చేసుకున్నాడు.
- విజయశాంతి మొదటి చిత్రం కల్లుక్కుళ్ ఈరం (1979). తెలుగులో మొదటి చిత్రం కిలాడీ కృష్ణుడు (1980). నూరవ చిత్రం భారత నారి (1989). ఇప్పటికి చివరిగా విడుదలైన తెలుగు చిత్రం నాయుడమ్మ (2006). చివరిగా విడుదలైన చిత్రం జమానత్ (హిందీ, 2007).
- తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేదు. ఆమె నటించిన కథానాయిక ప్రాధాన్యతగల చిత్రాలు: నేటి భారతం, రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, దేవాలయం, సమాజంలో స్త్రీ, అరుణ కిరణం, భారత నారి, భారత రత్న, పోలీస్ లాకప్, లేడీ బాస్, కర్తవ్యం, ఆశయం, స్ట్రీట్ ఫైటర్, మొండి మొగుడు - పెంకి పెళ్లాం, శ్రీవారంటే మావారే, శ్రీ శ్రీమతి సత్యభామ, మగరాయుడు, యంగ్ టర్క్స్, ఒసేయ్ రాములమ్మా, రౌడీ దర్బార్, గూండా గర్దీ, కల్లుకొండూరు పెణ్ణు, సి. ఐ. డి., అడవి చుక్క, వైజయంతి, ఇందిరమ్మ, నాయుడమ్మ, శాంభవి ఐ. పి. యస్., తేజస్విని, అత్తాకోడళ్లు, రైఫిల్స్, సాహస బాలుడు - విచిత్ర కోతి, తడయం.
- విజయశాంతి నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పూర్తి అయినవి, కొన్ని పూర్తి కానివి, మరి కొన్ని ముహూర్తం తరువాత ముందుకు జరగనివి. అవి: అడవి రాణి, రాయల సీమ రక్తం, జిందాబాద్, జైహింద్, హోం మినిస్టర్.
రాజకీయ జీవితం
మార్చువిజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతిని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.[14][15] ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[16] విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 2020 డిసెంబరు 07న భారతీయ జనతా పార్టీలో చేరి[17], 2023 నవంబరు 15న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపింది.[18] ఆమె నవంబరు 17న హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[19] ఆమెను నవంబరు 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా నియమించారు.[20]
మూలాలు
మార్చు- ↑ "Vijayashanti Personal Interview | Chatta Sabhallo Vanitha | Vanitha TV". YouTube. 2013-09-03. Retrieved 2016-07-12.
- ↑ "Detailed Profile: Smt. M. Vijaya Shanthi". Archived from the original on 2018-10-10. Retrieved 2018-12-23.
- ↑ Eenadu. "..అందుకే పిల్లలు వద్దనుకున్నాం! - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2020-01-05. Retrieved 2020-01-05.
- ↑ "High Drama near Vijayashanthi's House". The Hindu. 5 July 2010.
- ↑ "The Hindu : Vijayashanthi for Bellary?". Thehindu.com.
- ↑ 6.0 6.1 "The Hindu : Metro Plus Visakhapatnam / Personality : Glam girl to Nayudamma". Thehindu.com.
- ↑ 7.0 7.1 "The Hindu : Hail rainmakers!". Thehindu.com.
- ↑ "Action queen takes on all comers". Thehindu.com. 5 April 2009.
- ↑ "'Lady Amitabh' Vijayashanti will be seen in a film again which is to be directed by B Gopal. Vijayashanti, MP from Medak broke away from the TRS recently to sail with the Congress". Timesofindia.indiatimes.com. Retrieved 14 October 2018.
- ↑ 10.0 10.1 "38th National Film Awards – 1991". Directorate of Film Festivals. Archived from the original (PDF) on 5 నవంబరు 2013. Retrieved 13 జనవరి 2013.
- ↑ "US edition: Inscrutable Americans - soon at a theatre near you". Rediff.com.
- ↑ "Andhra Pradesh: Post-NTR, host of film artistes join politics". India Today. Retrieved 14 October 2018.
- ↑ "Vijayashanthi meets fluorosis victims". The Hindu. 13 January 2007.
- ↑ The Indian Express (1 August 2013). "TRS to suspend Medak MP Vijayashanti for anti-party activities". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
- ↑ "TRS suspends MP Vijayashanti". Business Standard India. 1 August 2013. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
- ↑ India Today, PTI New (27 February 2014). "TRS MP Vijayashanthi joins Congress". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
- ↑ Zee News Telugu (7 December 2020). "Vijayashanti Joins In BJP: తిరిగి బీజేపీ గూటికి చేరిన నటి విజయశాంతి". Zee News Telugu. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
- ↑ Eenadu (15 November 2023). "భాజపాకు విజయశాంతి రాజీనామా". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
- ↑ Sakshi (17 November 2023). "కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ HMTV (18 November 2023). "కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి కీలక పదవి..!". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
బయటి లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో విజయశాంతి పేజీ
- సీబీ.కాంలో విజయశాంతి గురించి Archived 2006-12-05 at the Wayback Machine